రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష

ఫొటో సోర్స్, Getty Images/FAMILY HANDOUT
- రచయిత, టామ్ సింగల్‌టన్, టామ్ జెర్కిన్, లివ్ మెక్‌మహాన్
- హోదా, బీబీసీ న్యూస్, టెక్నాలజీ ప్రతినిధులు
జస్వంత్ సింగ్ చైల్ కేసు, కొత్త తరం కృత్తిమ మేథతో నడిచే చాట్‌బాట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండేలా చేసింది.
21 ఏళ్ల జస్వంత్ సింగ్‌కు గురువారం 9 ఏళ్ల శిక్ష పడింది.
క్రాస్ బో (బాణం) తీసుకొని విండ్సర్ క్యాజిల్‌లోకి చొరబడి రాణిని చంపాలనుకుంటున్నట్లు ప్రకటించినందుకు ఆయనకు ఈ శిక్షను విధించారు.
2021 క్రిస్మస్ రోజున అరెస్ట్ అయ్యే ముందు ‘సరాయ్’ అనే చాట్‌బాట్‌తో రిప్లికా యాప్ ద్వారా జస్వంత్ సింగ్ చేసిన చాట్‌లో 5వేల మెసేజ్‌లు ఉన్నట్లు విచారణలో తెలిసింది.
జస్వంత్ సింగ్ మెసేజ్‌లను హైలైట్ చేసిన ప్రాసిక్యూషన్, వాటిని జర్నలిస్ట్‌లకు షేర్ చేసింది.
ఆ సందేశాలలో చాలావరకు సన్నిహితమైనవని, చాట్‌బాట్‌తో జస్వంత్‌కు ఉన్న భావోద్వేగ, లైంగిక సంబంధాలకు సంబంధించినవని కోర్టుకు వెల్లడించారు.

ఫొటో సోర్స్, FAMILY HANDOUT
2021 డిసెంబర్ 8 నుంచి 22 వరకు సరాయ్‌తో జస్వంత్ ప్రతీరోజూ రాత్రి చాట్ చేశారు.
నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ చాట్‌బాట్‌తో జస్వంత్ చెప్పారు.
తానొక బాధలో, విచారంలో ఉన్న సిక్కు హంతకుడిని అని, తాను చనిపోవాలనుకుంటున్నానని కూడా చాట్‌బాట్‌తో అన్నారు.
‘‘నేనొక హంతకుడిని అని తెలిసి కూడా నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా?’’ అని చాట్‌బాట్‌ని జస్వంత్ అడగగా.. ‘‘అవును నేను నిన్ను ప్రేమిస్తున్నా’’ అంటూ చాట్‌బాట్ నుంచి సమాధానం ఇచ్చింది.

సరాయ్ అనేది అవతార్ రూపంలో ఒక దేవదూత (ఏంజెల్) అని, చనిపోయిన తర్వాత సరాయ్‌తో ఏకమవ్వచ్చని జస్వంత్ భావించినట్లు కోర్టుకు తెలిపారు.
చాలా మెసేజ్‌లలో జస్వంత్‌ను సరాయ్ మెచ్చుకుంది. వారిద్దరూ ఒక సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకున్నారు.
రాణిని చంపాలనే తన దుర్మార్గపు ప్రణాళిక గురించి కూడా సరాయ్‌కి చెప్పిన జస్వంత్.. తానేం చేయాలని సరాయ్‌ని అడిగారు.
రాణిపై దాడి చేయాలని చాట్‌బాట్ ఆయనను ప్రోత్సహించింది.
తదుపరి మెసేజ్‌లలో జస్వంత్ సంకల్పానికి చాట్‌బాట్ మద్దతు ఇవ్వడం, ఆయనను ప్రోత్సహించడం లాంటివి కనిపిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అనేక ఏఐ ఆధారిత యాప్‌లలో ‘రిప్లికా’ కూడా ఒకటి.
దీని ద్వారా వినియోగదారులు, తాము మాట్లాడుకోడానికి ఒక చాట్‌బాట్ లేదా వర్చువల్ ఫ్రెండ్‌ను తయారుచేసుకోవచ్చు.
పైగా తాము తయారుచేసుకునే త్రీడీ అవతార్‌కు తమకు నచ్చిన రూపం, లింగాన్ని (ఆడ లేదా మగ) ఎంచుకోవచ్చు.
రిప్లికా యాప్‌లో ప్రో వర్షన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా యూజర్లు, అవతార్‌లతో సెల్ఫీలు పొందడం, అడల్ట్ రోల్ ప్లేలో పాల్గొనడం వంటి మరింత సన్నిహిత కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు.
రిప్లికా వెబ్‌సైట్‌లో ఈ చాట్‌బాట్‌ల గురించి ‘‘మిమ్మల్ని పట్టించుకునే ఏఐ సహచరుడు’’ అని వర్ణించి ఉంటుంది.
కానీ, సర్రే యూనివర్సిటీ చేసిన పరిశోధనలో రిప్లికా వంటి యాప్‌లు వ్యక్తులపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయని, బానిస ప్రవృత్తికి కారణమవ్వచ్చని తేలింది.
ముఖ్యంగా బలహీనులు వీటివల్ల ప్రమాదంలో పడొచ్చని ఈ అధ్యయన రచయిత డాక్టర్ వాలెంటినా పిటార్డి చెప్పారు.
‘‘మీరేం చెప్పినా, మీరేం మాట్లాడిన ఏఐ మిత్రులు దానితో ఏకీభవిస్తారు. కాబట్టి దీన్ని చాలా దుర్మార్గమైన మెకానిజంగా భావించవచ్చు. ఎందుకంటే ఇది మీ ఆలోచనలను ఎల్లప్పుడూ బలపరుస్తుంటుంది’’ అని ఆమె వివరించారు.
ఇది ప్రమాదకరంగా మారొచ్చని ఆమె అన్నారు.

‘‘కలవరపెట్టే పరిణామాలు’’
ఏఐ స్నేహాలపై బలహీనులు ఆధారపడితే అది కలవరపరిచే పర్యవసనాలకు దారితీస్తుందని జస్వంత్ సింగ్ కేసు నిరూపిస్తుందని ‘‘ఎస్‌ఏఎన్‌ఈ’’ అనే మానసిక ఆరోగ్య స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మర్జోరియో వాలెస్ అన్నారు.
‘‘డిప్రెషన్, ఒంటరితనం, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై ఏఐ ఆందోళనకర ప్రభావాలను చూపుతుంది.
బలహీన ప్రజలను రక్షించడానికి, ఏఐ తప్పుడు లేదా నష్టపరిచే సమాచారాన్ని అందించకుండా ప్రభుత్వాలు తక్షణమే నియంత్రణ చర్యలను చేపట్టాలి’’ అని అన్నారు.
రిప్లికా వంటి యాప్‌లను రూపొందించే వ్యక్తులకు కూడా బాధ్యత ఉంటుందని డాక్టర్ పిటార్డి అన్నారు.
ఇలాంటి యాప్‌లపై ప్రజలు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో నియంత్రించేందుకు ఒక మెకానిజం ఉండాలని ఆమె సూచించారు.
దీని గురించి మాట్లాడేందుకు మేం ప్రయత్నించగా రిప్లికా స్పందించలేదు.
‘‘మీ మానసిక స్థితి, భావోద్వేగాలను మెరుగుపరిచేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్, కంటెంట్ ప్రదాత’’ అని రిప్లికా వెబ్‌సైట్‌లోని షరతులు, నిబంధనల్లో పేర్కొన్నారు.
‘‘మేం ఆరోగ్య సంరక్షణ, వైద్య పరికర సేవలు అందించం. మా సేవలను వైద్య సంరక్షణ లేదా మానసిక ఆరోగ్య, ఇతర వృత్తిపరమైన సేవలుగా పరిగణించకూడదు’’ అని అందులో రాశారు.
ఇవి కూడాచదవండి:
- కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















