ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 30 కోట్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్ వాలెన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) 20వ శతాబ్దంలో ప్రపంచ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న అద్భుత ఆవిష్కరణ.
ఏఐ చాలా రంగాలను ప్రభావితం చేస్తోంది. ఇది తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోనని ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాదాపు 30 కోట్ల మేర ఫుల్-టైమ్ ఉద్యోగాలకు సమానమైనది భర్తీ చేయగలదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ రిపోర్టు తెలిపింది.
ఈ రిపోర్టు ప్రకారం ఇది అమెరికా, యూరప్‌లలో నాలుగింట ఒక వంతు పని భర్తీ చేయగలదు. అయితే కొత్త ఉద్యోగాలు, ప్రోడక్టివిటి పెరుగుదలను కూడా సూచిస్తుంది.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మొత్తం వార్షిక విలువను 7 శాతం పెంచవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఏఐలో పెట్టుబడులకు బ్రిటన్ ప్రభుత్వం ప్రోత్సాహం
బ్రిటన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) విభాగంలో పెట్టుబడిని ప్రోత్సహించడానికి అక్కడి ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ఇది "అంతిమంగా ఆర్థిక వ్యవస్థలో ప్రోడక్టివిటీని పెంచుతుంది" అని యూకే పేర్కొంది.
దాని ప్రభావం గురించి ప్రజలకు భరోసా ఇవ్వడానికి బ్రిటన్ ప్రయత్నించింది.
ఏఐ బ్రిటన్‌లో తమ పని విధానం పూర్తిచేయడంతో పాటు, తమ ఉద్యోగాలను మెరుగుపరుస్తుందని టెక్నాలజీ సెక్రటరీ మిచెల్ డోనెలన్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం మారుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ రిపోర్టు చెబుతోంది.
ఏఐ ప్రభావంతో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 46 శాతం, న్యాయవృత్తులలో 44 శాతం పనులు ఆటోమేటిక్‌గా పూర్తవుతాయి. అయితే నిర్మాణ రంగంలో దాని పని 6 శాతం, నిర్వహణలో 4 శాతం మాత్రమేనని స్పష్టంచేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ జనరేటర్‌లు తమ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తాయని కొంత మంది కళాకారులు ఆందోళన చెందుతున్నట్లు బీబీసీ న్యూస్ గతంలో రిపోర్టు చేసింది.
వేతనాల్లో కోత పడనుందా?
"జెనరేటివ్ ఏఐ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ అవుతాయో తెలుసుకోవడానికి మార్గం లేదనుకుంటున్నా" అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని ఆక్స్‌ఫర్డ్ మార్టిన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఆఫ్ వర్క్ డైరెక్టర్ కార్ల్ బెనెడిక్ట్ ఫ్రే బీబీసీ న్యూస్‌తో అన్నారు.
ఆయన మాట్లాడుతూ "చాట్ జీపీటీ చేసేది ఏంటి.. యావరేజ్ రైటింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తులతో వ్యాసాలు, కథనాలను రూపొందించడమే.
ఒకవేళ ఆ పని కోసం డిమాండ్ అధికంగా ఉంటే తప్ప జర్నలిస్టులకు ఇది ఇబ్బంది కలిగించేదే. వారు మరింత పోటీని ఎదుర్కొంటారు. ఇది వేతనాలను కూడా తగ్గిస్తుంది.
జీపీఎస్ టెక్నాలజీ, ఉబర్‌లను పరిశీలించండి. అకస్మాత్తుగా లండన్‌లోని అన్ని వీధుల గురించి తెలుసుకోవడం తేలికైపోయింది. డ్రైవర్లకు వేతనాల్లో దాదాపు 10 శాతం కోత పడిందని మా పరిశోధనలో తేలింది.
ఇక్కడ తక్కువ వేతనాలు, తక్కువ డ్రైవర్లని కాదు. రాబోయే రోజుల్లో జెనరేటివ్ ఏఐ విస్తృతమైన సృజనాత్మక పనులపై ఇలాంటి ప్రభావాలను చూపే అవకాశం ఉంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సాంకేతిక మార్పులతో ఉద్యోగుల ఆందోళన
ఒక పరిశోధన ప్రకారం ఇపుడు 60 శాతం మంది కార్మికులు 1940వ కాలంలో లేని వృత్తుల్లో కొనసాగుతున్నారు.
అయితే 1980 తర్వాత వచ్చిన సాంకేతిక మార్పులు ఉద్యోగాలను సృష్టించిన దానికంటే వేగంగా వర్కర్లను మార్చిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
జెనరేటివ్ ఏఐ ప్రభావం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పురోగతి మాదిరే ఉంటే అది సమీప కాలంలో ఉపాధిని తగ్గించవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ రిపోర్టు చెబుతోంది.
అయితే ఏఐ దీర్ఘకాలిక ప్రభావం చాలా అనిశ్చితంగా ఉందని రిజల్యూషన్ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోర్స్టన్ బెల్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు.
ఆయన మాట్లాడుతూ "అన్ని సంస్థల అంచనాలను అంత ఎక్కువగా నమ్మాల్సిన అవసరం లేదు. సాంకేతికత ఎలా అభివృద్ధి చెందుతుందో? సంస్థలు ఎలా పని చేస్తాయో మనకు తెలియదు" అని అంటున్నారు.
"మనం పని చేసే విధానానికి ఏఐ అంతరాయం కలిగించదని చెప్పలేం. అయితే చౌకగా నడిచే సేవలు, అధిక ఉత్పాదకతతో కూడిన పని కాకుండా జీవన-ప్రమాణాల పెంపుదలపై మనం దృష్టి పెట్టాలి. మనం వెనకబడే ప్రమాదం ఉంది. ఇతర సంస్థలు, ఆర్థిక వ్యవస్థలు సాంకేతిక మార్పులకు బాగా అనుగుణంగా ఉంటాయి" అని బెల్ వివరించారు.
ఇవి కూడా చదవండి
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
- ప్రియాంక గాంధీ దూకుడు కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురాగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














