‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’

ఎల్‌టీటీఈ మాజీ ఫైటర్

ఫొటో సోర్స్, N. NAGULESH

    • రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
    • హోదా, బీబీసీ తమిళ్

ఎల్‌టీటీఈ మాజీ ఫైటర్‌ ఒకరు సుమారు నాలుగేళ్ల పాటు అడవిలో ఒంటరిగా నివసించారు.

శ్రీలంకలోని జాఫ్నాలో గత నాలుగేళ్లుగా ఆయన బట్టికలోవా జిల్లాలోని పత్తిపాలై ప్రాంతంలో గల తాందమలై అటవీ ప్రాంతంలో ఒంటరిగా ఉన్నారు.

కుటుంబ విడిచిపెట్టడంతో, మానసిక సమస్యలతో ఆయన అడవిలోనే నివసించినట్లు క్రుసేడర్స్ డెమోక్రసీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎన్. నగులేశ్ బీబీసీ తమిళ్‌కి తెలిపారు.

‘‘ఆ అటవీ మార్గం గుండా వెళ్లే ప్రజలు ఆయన్ను బాలా అనే పేరుతో పిలుస్తారు.

తాందమలై ప్రాంతంలోని రెడ్‌పనా గ్రామానికి దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతంలో ఆయన ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఎంతో కాలంగా నివసిస్తున్నారు.

చాలా వరకు పండ్లు తింటూనే ఆయన నాలుగేళ్లుగా అడవిలో నివసిస్తున్నట్లు తెలిసింది.

ఆ అటవీ ప్రాంతం గుండా వెళ్లే వారు ఎవరో ఒకరు ఆయనకు ఆహార పదార్థాలు, సామాగ్రి ఇస్తూ ఉండేవారు.

వారిచ్చిన ఆహార వస్తువులను షెడ్‌కు తీసుకెళ్లి, వాటిని కడగని గిన్నెల్లోనే వండుకుని తినేవారు.

అత్యంత అశుభ్రకరమైన వాతావరణంలో ఆయన నివసించారు. గిన్నెల్లో వంట వండకున్న తర్వాత, వాటిని అలానే కడగకుండా పెడతారు. మళ్లీ వాటిల్లోనే వండుకుని తింటారు. చేపలు తెచ్చుకుని, వాటిని బియ్యంలో కలిపేసి వండుతారు’’ అని నగులేశ్ వివరించారు.

ఎల్‌టీటీఈ మాజీ ఫైటర్

ఫొటో సోర్స్, N. NAGULESH

నిద్రాహారాలు సరిగ్గా లేకుండా, స్నానం లేకుండా నాలుగేళ్లుగా అడవిలోనే నివసిస్తోన్న బాలా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

కొంత కాలం బాలా కొందరు వ్యక్తులతో కలిసి ఉండేవారు. కానీ ఆ తర్వాత ప్రజలకు కనపడకుండా అడవిలోకి పారిపోయారు.

అటవీ ఏనుగుల నుంచి ప్రమాదం ఉందని తెలిసినా కూడా బాలా అదే ప్రాంతంలో నివసించేవారని నగులేశ్ చెప్పారు.

‘‘క్రుసేడర్స్ డెమోక్రసీ పార్టీ చెందిన సభ్యులు బాలా పరిస్థితిని నాకు వివరించారు. ఆ తర్వాత ఆయన ఉండే ప్రాంతంలోకి వెళ్లాం. కానీ ఆయనతో మాట్లాడటం చాలా కష్టంగా మారింది. మూడు రోజుల తర్వాత మాట్లాడాం.

నన్ను చూసిన బాలా తొలుత పారిపోయి మాకు కనిపించకుండా దాక్కున్నాడు.

మేం బాలా కోసం మూడు రోజులు అక్కడే ఉన్నాం. తొలి రోజు అక్కడికి వెళ్లినప్పుడు, ఆయన పారిపోయారు. రాత్రి వరకు అక్కడే ఉన్నాం.

బాలా రా... అటూ మేం పిలిచాం. ముల్లైతీవులో ఆయన మాతో ఉన్నట్లు చెప్పాం. ఆయన మాకు తెలిసిన వ్యక్తిలా మాట్లాడాం. ఆ తర్వాత ఆయన అర్థం చేసుకున్నారు.

మెల్లగా మా దగ్గరకు వస్తూ... తన వద్దకు ఎవరూ రావొద్దని మమ్మల్ని హెచ్చరించారు.

ఆ తర్వాత మెల్లగా ఆయన దగ్గరికి వెళ్లి మాటలు కలిపాం.

గుబురు గుబురుగా పెరిగిన జుట్టును కత్తిరిద్దామని బాలాకు చెప్పాం. కానీ, తన జుట్టు కత్తిరించవద్దని బాలా కోరారు.

మీరు మాజీ పోరాటయోధుడని మీకు తెలుసా? అసలేమైంది, మీ సమస్యేమిటో చెబితే పరిష్కరిస్తాం... అని బాలాకు భరోసా ఇచ్చాం’ అని నగులేశ్ వివరించారు.

ఎల్‌టీటీఈ మాజీ ఫైటర్

ఫొటో సోర్స్, N. NAGULESH

మూడు రోజుల పాటు ఆయనతో ఉన్న తర్వాత, బాలాను ఎట్టకేలకు వారితో వచ్చేలా ఒప్పించారు.

ఆ తర్వాత వైద్యాధికారులకు తెలిపి, అంబులెన్స్ అక్కడికి పంపించి, బాలాను ఆస్పత్రికి తరలించారు

తమ పార్టీ కార్యకర్తలలో ఒకరు అక్కడే ఉండి అన్ని చూసుకుంటున్నారని నగులేశ్ తెలిపారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని డాక్టర్లు తెలిపారు.

బాలా గురించి కొందరు సోషల్ మీడియా యూజర్లు తప్పుడుగా వార్తా కథనాలను రాశారని నగులేశ్ అన్నారు.

బాలాపై తప్పుడు వీడియోలను పోస్టు చేశారు. అంతర్జాతీయ కమ్యూనిటీ నుంచి డబ్బులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కొందరు సోషల్ మీడియా యూజర్లు చేసిన ఈ పని వల్ల మాజీ పోరాటయోధులను, తమిళ్ పోరాటాలను కించపరిచినట్లయిందని ఆయన అన్నారు.

బాలా జీవితం మెరుగుపడి, ఆయన ముందుకు వెళ్లేలా ప్రజలు సాయం చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)