సీఎం కాన్వాయ్‌లోని వాహనం ఫుట్‌బోర్డుపై మహిళా మేయర్ నిల్చుని ప్రయాణం.. తమిళనాడులో విమర్శలు

ఫొటో సోర్స్, PRIYARAJAN DMK / FACEBOOK
- రచయిత, నందిని వెల్లిసామి
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కాన్వాయ్‌లోని ఒక వాహనం ఫుట్‌బోర్డుపై చెన్నై మేయర్ ప్రియా రాజన్, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ నిలబడి ప్రయాణిస్తున్నట్లు దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
తాము ఎందుకు అలా నిలబడి ప్రయాణించాల్సి వచ్చిందో మేయర్ ప్రియా రాజన్, కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బీబీసీతో చెప్పారు.
మేయర్‌లు, ఐఏఎస్ అధికారులు ఇలా కారు ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని చాలా మంది సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, TWITTER @ANNAMALAI_K
అసలేం జరిగింది?
చెన్నైలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో డిసెంబరు 10న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యటించారు. తుపాను బాధితులకు ఆయన సహాయ నిధి, వస్తువులను అందించారు.
ఆ తర్వాత ఆయన తీర ప్రాంతమైన కసిమేడులో మత్స్యకారులతో మాట్లాడారు.
తుపానుతో దెబ్బతిన్న బోట్ల యజమానులతోనూ ఆయన మాట్లాడారు. ఆయన వెంట మంత్రులు బీ శేఖర్ బాబు, కేఎన్ నెహ్రూ ఉన్నారు.
అయితే, కసిమేడులో ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్‌లోని ఓ ఎస్‌యూవీ ఫుట్‌బోర్డుపై చెన్నై మేయర్ ప్రియా రాజన్, చెన్నై కార్పోరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ నిలబడి ప్రయాణిస్తూ కనిపించారు.
వెంటనే ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రెండు వైపులా..
మేయర్, మున్సిపల్ కమిషనర్ లాంటి ఉన్నత పదవుల్లో కొనసాగేవారు ఇలా ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం ద్వారా ప్రజలకు తప్పుడు సందేశం పంపినట్లు అవుతుందని కొందరు ఆన్‌లైన్ వేదికగా విమర్శిస్తున్నారు. మరికొందరు అయితే, బస్సుల ఫుట్‌బోర్డుపై విద్యార్థులు నిలబడి ప్రయాణించడంతో దీన్ని పోల్చారు.
మరికొందరు ఈ ఘటనపై డీఎంకేను విమర్శించారు. డీఎంకేలోని కొందరు మహిళా నాయకుల పేర్లు చెబుతూ.. వారితో కూడా ఇలా ప్రయాణించేలా చేస్తారా?, అసలు మేయర్‌కు ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు.
నెటిజన్లు మాత్రమే కాదు, అన్నాడీఎంకే, బీజేపీ లాంటి విపక్షాలు కూడా ఈ విషయంలో డీఎంకేను తప్పుపడుతున్నాయి.
ఈ అంశంపై ట్విటర్ వేదికగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు.
‘‘ఆత్మగౌరవ ఉద్యమం, సామాజిక న్యాయ ఉద్యమం, సాధారణ ప్రజల పార్టీ... ఇలాంటి మాటలను ఎప్పుడో డీఎంకే సమాధి చేసింది. ఈ ఘటనతో మరోసారి పార్టీ నిజస్వరూపం బయటపడింది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
విమర్శల నడుమ చెన్నై మేయర్ ప్రియకు మద్దతుగా కొందరు డీఎంకే నాయకులు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆమె కారు ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
‘‘మేం ప్రజలకు సాయం చేసేందుకు అలా ప్రయాణించాం. ఓట్ల కోసం కాదు’’అని డీఎంకే ఎమ్మెల్యే ఎబెనెజెర్ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్న ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు.
‘‘తుపాను తాకిడికి చెన్నై నగరం, ఇక్కడి ప్రజలు ఎదురు నిలిచారు. ప్రభావిత ప్రాంతాలను చూసేందుకు, బాధితులను పరామర్శించేందుకు ఆమె అలా ప్రయాణించాల్సి వచ్చింది’’అని డీఎంకే టెక్నికల్ విభాగం డిప్యూటీ సెక్రటరీ ఇషాయ్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఎందుకు ఆమె అలా ప్రయాణించాల్సి వచ్చింది?
ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఎందుకు అలా నిలబడి ప్రయాణించాల్సి వచ్చిందో చెన్నై మేయర్ ప్రియ బీబీసీ తమిళ్‌తో మాట్లాడారు.
‘‘ఖాజీమత్‌లోని రెండు చోట్ల ముఖ్యమంత్రి పర్యటనకు మేం ఏర్పాట్లు చేశాం. ఒకచోట పర్యటన పూర్తయిన వెంటనే, ఆయన మరొక ప్రాంతానికి బయలుదేరారు. ఆ రెండు ప్రాంతాల మధ్య దూరం కాస్త ఎక్కువే. నడిచి వెళ్లడం కాస్త కష్టమే. అదే సమయంలో కాన్వాయ్ వచ్చింది. వెంటనే మేం ఎక్కేశాం’’అని ఆమె చెప్పారు.
అసలు దీనిపై ఇంత వివాదం రాజుకుంటుందని తాము ఊహించలేదని ప్రియ వివరించారు.
‘‘అలా ప్రయాణించాలని నాకు ఎవరూ చెప్పలేదు. అక్కడ పరిస్థితి అలా వచ్చింది’’అని ఆమె అన్నారు.
‘‘గౌరవం ఇవ్వాలి’’
చెన్నై మేయర్‌గా ప్రియా రాజన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇలాంటి వివాదాలు కొన్ని రాజుకున్నాయి.
గత ఆగస్టులో రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి కేఎన్ నెహ్రూ ఒక విలేకరుల సమావేశంలో ఆమెతో దురుసుగా మాట్లాడారని వివాదం రాజుకొంది.
‘‘ఆయన ఏకవచనంతో సంబోధించిన మాట వాస్తవమే. అయితే, ఆయన నన్ను ఒక కుమార్తెగా భావిస్తారు. అందుకే అలా పిలిచారు’’అని ఆమె అప్పట్లో వివరణ ఇచ్చారు.
గత అక్టోబరులోనూ దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబుకు గొడుగు పట్టుకుని నడుస్తున్నట్లుగా ప్రియ కనిపిస్తున్న ఫోటో వైరల్ అయ్యింది.
దీంతో ఆమె స్వతంత్రంగా పనిచేయలేరనే కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అయితే, తనని చిన్నచూపు చూస్తున్నారన్న వార్తలను ఆమె ఖండించారు.
‘‘నన్ను పార్టీలో అందరూ గౌరవిస్తారు. ముఖ్యమంత్రి కూడా నాకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు’’అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘విధి నిర్వహణ ముఖ్యం’’
మరోవైపు తాజా వివాదంపై మున్సిపల్ కమిషనర్ గగన్‌దీప్ కూడా బీబీసీతో మాట్లాడారు.
‘‘కసిమేడు పోర్టులో పార్కింగ్ స్పేస్ చాలా తక్కువగా ఉంది. మా వాహనం చాలా వెనుక ఉండిపోయింది. త్వరగా అక్కడకు చేరుకునేందుకు మేమే అలా వెళ్లేం. ఇక్కడ విధి నిర్వహణ ముఖ్యం. అయినా మేం ప్రయాణించిన కారు ముఖ్యమంత్రిది కాదు. ఆయన వాహనం వెనుక వస్తోంది’’అని ఆయన వివరించారు.
‘‘ఆ కారు చాలా నెమ్మదిగా వెళ్లింది. వరదలు, తుపానులు వచ్చినప్పుడు ఒక మున్సిపల్ కమిషనర్‌గా మీ బాధ్యత మరింత పెరుగుతుంది. ఇక్కడ ఈగో సమస్యే ఉండకూడదు’’అని ఆయన అన్నారు.
‘‘పని ఎక్కువగా ఉండటం వల్ల ఆ ముందురోజు సరిగా నిద్రకూడా పట్టలేదు. అంత ఎక్కువ పని ఉంటుంది. మేం ఎలాగైనా సమయానికి అక్కడకు చేరుకోవాలని భావించాం. కానీ, కొందరు వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు పబ్లిసిటీ ఎక్కువగా ఇష్టముండదు’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గాన్ మహిళల రహస్య కథలు: ‘కొన్ని కలలు కనడానికి కూడా మాకు అనుమతి ఉండదు’
- మసాయి ఒలింపిక్స్: సింహాలను వేటాడే వీరులు ఆడే ఆటలు
- పని కోసం ఖతార్ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి
- గుజరాత్ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకే ఓటు వేశారా, ఈ వాదనల్లో నిజమెంత?
- ఇషాన్ కిషన్: ‘అతనొక భయం తెలియని ఆటగాడు’... విరాట్ కోహ్లీ ఈ మాట ఎందుకన్నాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















