పని కోసం ఖతార్ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి

ఖతార్‌లో ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్న సందర్భంగా మానవ హక్కుల అంశం తెరపైకి వచ్చింది.
ఖతార్‌లో స్టేడియాలు, హోటల్స్ నిర్మాణంలో పాలు పంచుకున్న వలస కార్మికుల పట్ల యాజమాన్యాలు అనుసరించిన వైఖరిపై ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి.
అయితే ఖతార్‌లో పాలక వర్గాల కోసం పనిచేసే విదేశీ పనిమనుషుల(మెయిడ్స్) సంగతేంటి?
సెలవులు కూడా లేకుండా ఎక్కువ పని గంటలు చేయాల్సిన పరిస్థితుల్లో వారి జీవితం ఎలా ఉంటుంది?
అలాంటి పరిస్థితులను అనుభవిస్తున్న ఇద్దరు మెయిడ్స్‌తో బీబీసీ జెండర్, ఐడెంటిటీ కరస్పాండెంట్ మేఘా మోహన్ మాట్లాడారు.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
‘మిగిలిందే నేను తినాలి’
ఖతార్‌లో పనిచేస్తున్న ఫిలిప్పీన్స్ దేశీయురాలు గ్లాడీ (అసలు పేరు కాదు) తో నిన్న రాత్రి మాట్లాడాను. ఆమె పనిచేస్తున్న ఇంటిలో యజమానులు అంతా అప్పటికే నిద్రపోతున్నారు.
ఆన్‌లైన్‌లో గ్లాడీ నాతో మాట్లాడారు..ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు తనకు పని ఉంటుందని చెప్పారు.
ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లలను చూసుకోవడం...రోజంతా ఇదే తన పని అని ఆమె అన్నారు.
ఆ కుటుంబం తినగా మిగిలిందే చివరికి తాను తినాల్సి ఉంటుందని చెప్పారు.
18 నెలల నుంచి పనిచేస్తున్నా కనీసం ఇప్పటి వరకు ఒక్క రోజు సెలవు ఇవ్వలేదని తెలిపారు.
‘‘మేడం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది. రోజూ నన్ను అరుస్తూ ఉంటుంది’’ అని గ్లాడీ చెప్పుకొచ్చారు.
అక్కడ పని చేయడానికి కారణం ఏమిటి?
ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2022కి ఆతిథ్యం ఇచ్చే రేసులో ఖతార్ గెలవడానికి ముందు, విదేశీ కార్మికులు తమ యజమాని అనుమతి లేకుండా ఉద్యోగం మారలేరు, దేశం విడిచి వెళ్లలేరు.
చాలా గల్ఫ్ దేశాల్లో ఇప్పటికీ ఇదే పరిస్థితి ఉంది. అయితే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు వచ్చాక ఖతార్ సంస్కరణలు మొదలుపెట్టింది. అయితే, ఆచరణలో మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు.
ఉదాహరణకు గ్లాడీ పాస్‌పోర్టు ఆమె యజమాని దగ్గర ఉంది. ఒకవేళ వెళ్లడానికి పాస్‌పోర్టు అడిగితే, ఇస్తారనే గ్యారంటీ గ్లాడీకి లేదు.
తనను కనీసం మొబైల్ ఫోన్ వాడనిస్తున్నారని, అసభ్యంగా ప్రవర్తించక పోవడం ఒకింత సంతోషమని ఆమె అన్నారు.
ఖతార్‌లో పనిమనుషుల అందరి పరిస్థితి ఇలానే ఉంటుందని గ్లాడీ చెబుతున్నారు. ఆమె ఉద్యోగం వదిలెయ్యకపోవడానికి మరో కారణం కూడా ఉంది.
తనలాంటి అమ్మాయికి ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తుందని తాను అనుకోవట్లేదన్నారామె.
నెలకు తనకు 1500 ఖతార్ రియాల్స్ (నెలకు దాదాపు రూ.34,000) జీతంగా ఇస్తారని తెలిపారు.
తన కుటుంబాన్ని పోషించడానికి ఈ జీతం ఉపయోగపడుతుందని గ్లాడీ చెబుతున్నారు.

ఖతార్‌లో ఎంతమంది ఇలా పనిచేస్తున్నారు?
ఖతార్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అథారిటీ నుంచి విడుదలైన 2021 గణాంకాల ప్రకారం....ఆ దేశంలో 1,60,000 మంది డొమెస్టిక్ వర్కర్స్( పని మనుషులు) ఉన్నట్లు అంచనా.
2017లో ఖతార్ ‘డొమెస్టిక్ వర్కర్స్ లా’ ను ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం రోజుకు 10 గంటలు మాత్రమే పని చేయవచ్చు.
రోజువారీ విరామాలు, వారానికో రోజు సెలవు, పెయిడ్ హాలిడేస్ ఉంటాయి.
2020లో కనీస వేతనాన్ని కూడా ప్రవేశపెట్టింది. యజమాని అనుమతితో సంబంధం లేకుండా ఉద్యోగాలు మారడానికి, దేశం విడిచి వెళ్లడానికి కార్మికులకు హక్కును ఇచ్చింది.
అయితే, ఈ చట్టాలు ఎల్లప్పుడూ పాటించినట్లు కనబడదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతోంది.
విపరీతమైన పని, విశ్రాంతి లేకపోవడం, దుర్భాషలాడటం, అవమానకరంగా చూడటం కొనసాగుతూనే ఉంటుందని ఆ సంస్థ అంటోంది.
ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే కార్మికులకు మైగ్రాంటే ఇంటర్నేషనల్ అనే సంస్థ సహాయం చేస్తుంటుంది.
చాలా మంది తమ దుర్భర పని పరిస్థితుల గురించి మౌనంగా ఉంటారని, కుటుంబాల కోసం డబ్బు సంపాదించడమే వారికి ముఖ్యమని ఆ సంస్థకు చెందిన జోవన్నా కాన్సెప్సియోన్ చెప్పారు.
అయితే, గల్ఫ్ దేశాల్లో కొందరు స్వేచ్ఛగా తమ సమస్యలను చెప్పుకుంటారని ఆమె అన్నారు. తరచూ తాము హింసకు గురయ్యామని చెబుతుంటారని ఆమె వెల్లడించారు.
యజమాని తన తలను టాయిలెట్ బేసిన్‌లోకి నెట్టాడని, కోపంగా ఉంటే ఆ సమయంలో తనకు తిండి, నీరు కూడా ఇవ్వరని ఓ మహిళ చెప్పింది.

ఈ అమ్మాయి కథ భిన్నం..
ఖతార్‌లో పనిమనిషిగా అల్థియా (అసలు పేరు కాదు) జీవితం చాలా భిన్నంగా ఉంది. రాయల్ అల్ థానీ కుటుంబంలో ఉద్యోగి ఆమె.
ఆమె రాయల్ ప్యాలెస్‌లోని ఒక బేస్‌మెంట్ నుంచి బీబీసీకి వీడియో కాల్ చేశారు.
తనకు ఫిలిఫ్పిన్స్‌లోని తన ఇంట్లో వాళ్లు ఎప్పటికీ కొనిపెట్టలేని ఐఫోన్, దుస్తులు, ఆభరణాలు, బూట్లు ఇచ్చారని తెలిపారు.
గ్లాడీ తరహాలోనే సంపాదన లేకపోవడమే ఆమెను ఇక్కడికి వచ్చేలా చేసింది.
మేం మాట్లాడుతున్నప్పుడు అల్థియాతోపాటు ఉంటున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన మరో పని మనిషి కూడా కాల్‌లో జాయినయ్యారు.
వారికి సొంత బెడ్‌రూమ్, ప్రైవేట్ కిచెన్ ఉన్నాయి.
తిండి పెట్టడం లేదని, తమను రక్షించమని ప్రాధేయపడుతూ టిక్‌టాక్, ఫేస్‌బుక్‌లలో వేదనతో పోస్టులు పెట్టే కొందరు పనిమనుషులతో పోలిస్తే తన పరిస్థితి ఎంతో బాగుందని అల్థియా అన్నారు.
"నేను అలాంటి వీడియోలను ఆన్‌లైన్‌లో తరచూ చూస్తాను, నేను చాలా అదృష్టవంతురాలిని. నాకు, ప్రతిరోజూ ఒక అద్భుతంగా అనిపిస్తుంది" అని చెబుతున్నారు అల్థియా.
అయితే, ఈ సిండ్రెల్లా ప్యాలెస్‌లాంటి ఈ భవనాల ఎత్తైన పైకప్పులు, షాండ్లియర్లు, బంగారంతో పొదిగిన పురాతన వస్తువులు, మదర్-ఆఫ్-పెర్ల్ టేబుల్ టాప్‌లను, అందమైన పూల మొక్కలను నిత్యం అందంగా కనిపించేలా చూడటం పెద్ద బాధ్యతే.
ఆమె పని ఉదయం ఆరున్నర నుంచి మొదలవుతుంది. ఆమె యజమాని కోసం అల్పాహారం సిద్ధం చేసే సమయమది.
తన యజమానులు తినడం పూర్తయ్యాకే అల్థియా తింటుంది. తర్వాత రూములన్నీ శుభ్రం చేసి, మధ్యాహ్నం భోజనానికి ఏర్పాట్లు మొదలు పెడతారు.
"ఇది చాలా తేలికైన పని, ఎందుకంటే మనలాంటి వారు చాలా మంది ఉన్నారు" అని అల్థియా చెప్పారు.
పని మనుషులు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య వారి ఫ్లాట్‌లలో విశ్రాంతి తీసుకుంటారు. ఆపై డిన్నర్ ఏర్పాట్లు ప్రారంభిస్తారు.
యజమాని డిన్నర్ ముగిసిన తర్వాత ఆల్థియా పని పూర్తి అవుతుంది.
పని పూర్తయ్యాక తాను కోరుకుంటే ఆమె కాంపౌండ్ నుంచి బయటకు వెళ్లవచ్చు.
రాజకుటుంబం ఆమె పాస్‌పోర్ట్‌ను తీసుకోలేదు. కానీ అల్థియా వారాంతాలు సహా ప్రతిరోజూ పని చేస్తుంది.
ఖతారీ చట్టం ప్రకారం ఆమెకు సెలవు లభించదు.
ఖతార్ చట్టం ప్రకారం రావాల్సిన సెలవు మరో ఉద్యోగి వదులుకుంటే గానీ రాదు. ఇది తన కుటుంబానికి అందించే కీలకమైన ఆర్థిక సహాయానికి ఆమె చెల్లించే విలువ.
మనీలాకు చెందిన రిక్రూటర్ మేరీ గ్రేస్ మోరెల్స్ ఇక్కడి పని పరిస్థితుల గురించి మాట్లాడారు. ఆమె గల్ఫ్‌లో వీఐపీల కోసం ఫిలిప్పీన్స్ నుంచి వర్కర్లను రిక్రూట్ చేస్తుంటారు.
ప్యాలెస్ లో పనిచేయడం అసూయపడే ఉద్యోగంగా ఆమె అభివర్ణించారు.
‘‘చాలా ప్రోత్సాహకాలు ఉన్నాయి. యజమాని కుటుంబం ఉదారంగా ఉంటుంది" ఆమె చెబుతున్నారు.
రాజభవనంలో పని మనుషులకు ఆహారం బాగా పెడతారని, లావైపోవడం ఖాయమని ఆమె వ్యాఖ్యానించారు
కానీ, రాయల్స్‌కు కొన్ని నిర్దిష్ట అవసరాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు.
"ఖతార్ రాజ కుటుంబం కోసం పని చేయడానికి పంపిన అమ్మాయిలు 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అందంగా ఉండాలి" అని మోరెల్స్ చెప్పారు.
లండన్‌లోని బీబీసీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్న నన్ను స్క్రీన్ మీద చూసి ‘‘మీ కంటే అందంగా ఉండాలి" అని ఆమె నవ్వుతూ చెప్పారు.
తర్వాత ఆమె నాకు వాట్సాప్ మెసేజ్ పంపారు.
మీతో మాట్లాడిన మాటలను తన పిల్లలు విన్నారని, తాను కాస్త అభ్యంతరకరంగా మాట్లాడినందుకు క్షమించాలని కోరారు.
నేనేమీ బాధపడటం లేదని మోరెల్స్ కు చెప్పాను. అయితే, రూపాన్ని బట్టి పని చేసే వ్యక్తులను నియమించుకోవడం అనేక దేశాలలో చట్టవిరుద్ధమని మాత్రం నేను ఆమెతో అనలేదు.
"వారు యంగ్‌గా ఉండాలి. ఎందుకంటే ఖతార్ రాయల్ ప్యాలెస్ బిజీ వాతావరణాన్ని మేనేజ్ చేయడానికి శక్తివంతులైన,ఆరోగ్యవంతులైన వ్యక్తులు అవసరం. అప్లికేషన్ పెట్టేవారు అందంగా ఉండాలి-చాలా అందంగా ఉండాలి" అని ఆమె నొక్కి చెప్పారు.
అల్థియాలాంటి అదృష్టవంతులైన వర్కర్లు ఉండటం అసంభవమేమీకాదని జోవన్నా కాన్సెప్సియోన్ అన్నారు.
అయితే, ఆమె ఇప్పటికీ ఆ పవర్‌ఫుల్ రాయల్ ఫ్యామిలీ కోసం పని చేస్తున్నట్లు తెలుసుకునే అవకాశం లేదని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
యజమానులపై కేసులు
2019 లో రాయల్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు బ్రిటీష్, అమెరికన్ వర్కర్లు రాయల్ ఫ్యామిలీ యజమాని సోదరి షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ పైనా, ఆమె భర్తపైనా దావా వేశారు.
తమతో ఎక్కువ గంటలు పని చేయించుకున్నారని ఫిర్యాదు చేస్తూ న్యూయార్క్ నుంచి నోటీసులు పంపారు. అయితే ఆ రాజ కుటుంబం వారి ఆరోపణలను ఖండించింది.
"హింస, వేధింపుల కేసులను పరిష్కరించడం, వృత్తిపరమైన, ఆరోగ్యపరమైన భద్రతను అందించడం, మంచి వసతులు ఏర్పాటు చేయడం సవాలుతో కూడిన పని" అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (అంతర్జాతీయ కార్మిక సంస్థ) అరబ్ రాష్ట్రాల ప్రాంతీయ డైరెక్టర్ రుబా జరాదత్ చెప్పారు.
కనీస వేతనం, వారంలో ఒక రోజు సెలవు, సిక్‌లీవులు, ఓవర్‌టైమ్ పేమెంట్స్‌కు హామీ ఇచ్చే కొత్త నిబంధనలను అమలు చేయడానికి ఖతార్‌తో కలిసి పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది.
అయినా, ఇది అంత సులభంకాదని ఆ సంస్థ అంటోంది.
రాయల్ ప్యాలెస్‌లో ఎక్కువ గంటలు ఉన్నప్పటికీ, తాను సంతోషంగా ఉన్నానని అల్థియా చెప్పారు.
పడుకునే సమయంలో ఆమె ఫిలిప్పీన్స్‌లో ఉన్న తన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరికి మెసేజ్ పంపుతారు.
తనకు తరచూ హోమ్‌సిక్ అనిపిస్తుందని, ప్యాలెస్ ఎప్పటికీ ఇల్లు కాదుకదా అంటారామె.
అయితే ‘‘ఈ ఉద్యోగం లేకుండా నేను నా కుటుంబాన్ని ఎప్పటికీ పోషించలేను కదా’’ అని కూడా అంటారామె.
ఖతార్ రాజకుటుంబాన్ని, లండన్‌లోని ఖతార్ రాయబార కార్యాలయాన్ని ఈ విషయంపై స్పందించమని బీబీసీ కోరింది. కానీ అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
















