మీరు తాగే నీటిలో రకాలు ఎన్ని? ఆర్వో, వాటర్ ఫిల్టర్ల నీళ్లను తాగితే ఏమవుతుంది?

నీరు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీని టాటా గ్రూపుకు చెందిన టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌లిమిటెడ్‌ కొనుగోలు చేస్తుందనే వార్తలు కొద్ది రోజులు క్రితం వచ్చాయి. దీంతో మన రోజూ తాగే కుళాయి నీటి కంటే మినరల్ వాటర్ మంచిదా అనే అంశం మళ్లీ మరోసారి తెర మీదకొచ్చింది.

అసలు సహజ వనరుల నుంచి పొందే తాగు నీటితో పాటు మరెన్ని రకాల నీళ్లున్నాయి? వాటిని ఎలా తయారు చేస్తారు? అవి మన ఆరోగ్యానికి మంచివేనా? అనే చర్చలు జరుగుతున్నాయి.

రెండు హైడ్రోజన్ అణువులు, ఒక ఆక్సీజన్ అణువు కలిస్తే ఒక నీటి అణువు ఏర్పడుతుంది. ఇలాంటి లక్షల నీటి అణువులు కలిస్తే నీటి బిందువు ఏర్పడుతుంది. భూగోళంపై నీరు 71 శాతం ఉంటుంది. అందులో 96.5 శాతం సముద్రాల నీరే. భూగ్రహంపై ఉన్న నీటిలో ఒక్కశాతం మాత్రమే మానవ అవసరాలకు ఉపయోగపడే మంచి నీరు.

నీరు లేకుండా ఈ భూగోళంపై మనిషి జీవితం అసాధ్యం. ఎందుకంటే శరీరంలోని జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే నీరు చాలా అవసరం. మానవ శరీరం కూడా 70 శాతం వరకు నీటితోనే నిండి ఉంటుంది. ఇదంతా మనం సామాన్యశాస్త్ర పుస్తకాల్లో చదువుకున్నదే.

తాగునీటికి ఏ లక్షణాలుండాలి? ఆ నీటిలో ఏముండాలి? మనం డబ్బులిచ్చి కొనుక్కుని తాగే మినరల్ వాటర్ ప్రత్యేకత ఏంటి? అసలు ఏ నీరు సురక్షితం? ఇటువంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.

నీరు

నీరు ఎన్ని రకాలుగా లభ్యమవుతోంది?

  • ప్రకృతిలో సహజంగా లభించే ఏ నీటికైతే పీహెచ్ విలువ 6.5- 7.5 మధ్యలో ఉంటుందో దానిని సాధారణ నీరు లేదా నార్మల్ వాటర్ అంటారు. సాధారణంగా ఈ నీటికి రంగు, రుచి ఉండవు. దీనిని తాగేందుకు ఉపయోగించవచ్చు.
  • రివర్స్ అస్మోసిస్ పద్దతిలో నీటిలోని మలినాలకు శుభ్రపరిచే ఆర్వో వాటర్ చాలా కాలంగా అందుబాటులో ఉంది.
  • ఈ నీటికి కొన్ని మూలకాలు, ఖనిజాలు కలపడం లేదా తగ్గించడం చేస్తే ఆ నీటిని ఫ్యూరిఫైడ్ వాటర్, ప్యాకేజ్డ్ వాటర్, డిస్టిల్డ్ వాటర్, మినరల్ వాటర్‌గా పిలుస్తారు.
  • తాజాగా బ్లాక్ వాటర్ పేరుతో పీహెచ్ 8 దాటి 9 వరకు ఉండే నీరు కూడా ప్రస్తుతం మార్కెట్లలో అందుబాటులో ఉందని బీబీసీతో కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ వొద్దిరాజు నమ్రత చెప్పారు.
నీరు

“కొండకోనలు, నదులు, చెరువులు, బావులు, బోర్లు నుంచి సాధారణ నీరు లభ్యమవుతుంది. దీనిని క్లోరినేషన్ లేదా ఓజోనైజేషన్ చేసి రక్షిత నీరుగా మార్చి కుళాయిలు, ట్యాంకర్లు ద్వారా ప్రజలకు ప్రభుత్వాలు అందిస్తాయి. దీనిని నాణ్యమైన తాగునీరుగా చెప్పవచ్చు.

ఈ నీటిని రివర్స్ ఆస్మోసిస్ (ఆర్ఓ) ప్రక్రియ యంత్రాలను ఉపయోగించి మళ్లీ ఇళ్లల్లో ఫిల్టర్ చేస్తారు. ఇలా చేయడం వలన ఆ నీటిలో మలినాలు తొలిగి మరింత నాణ్యమైన నీరు లభిస్తుంది. దీనినే ఆర్ఓ వాటర్ లేదా ప్యూరిఫైడ్ వాటర్ అంటారు.

ఈ నీటిని ప్లాస్టిక్ లేదా గాజు బాటిళ్లు, ప్లాస్టిక్ ప్యాకెట్లలో నిల్వ చేసి ఉపయోగిస్తే వాటినే ప్యాకేజ్డ్ వాటర్ అని అంటాం. అలాగే నీటిని మరిగించడం ద్వారా ఏ విధమైన లవణాలు, ఖనిజాలు, కర్బన పదార్థాలు లేకుండా చేసి, ఆవిరి రూపంలో ఉండే ఆ నీటిని పట్టి నిల్వ చేస్తే దానిని డిస్టిల్డ్ వాటర్ అంటారు.

ఈ నీటిలో ఎటువంటి మూలకాలు ఉండవు. దీనిని తాగడం వలన దాహం తీరుతుందే తప్పా శరీరానికి ఏ విధమైన ఖనిజ లవణాలు (మినరల్స్) అందవు. ఇది ఇతర మూలకాలతో చర్య పొందదు కాబట్టి...దీనిని ప్రయోగశాలల్లో, పరిశ్రమల్లోని యంత్రాల్లో వాడతారు” అని ప్రొఫెసర్ నమ్రత వివరించారు.

నీరు

మినరల్ వాటర్ అంటే?

నీటిలో మినరల్స్ లేకపోతే మనిషి శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. మినరల్ వాటర్ పేరుతో మనం బాటిళ్లతో అమ్మే నీటిని తాగతుంటాం. అసలు భూమి లోపల నుంచి లేదా భూమి ఉపరితలంపై నుంచి లభ్యమయ్యే నీటినే మినరల్ వాటర్ అంటారు.

ఇందులో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇందులో మనిషి శరీరానికి కావలసిన దానికంటే తక్కువగానో, ఎక్కువగానో మినరల్స్ ఉంటాయి. ఈ నీటిని తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అందుకే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న మినరల్ వాటర్ తాగితే శరీరంలో జీర్ణక్రియలకు అసవరమైన మినరల్స్ సమతూకంలో ఉంటాయి.

కొన్ని కంపెనీలు ప్లాస్టిక్ లేదా గ్లాస్ బ్యాటిల్స్‌లో మినరల్ వాటర్‌ని అమ్మకాలకు పెడుతున్నాయి. మనలో చాలా మంది ప్రయాణాల్లో తరచూ ఈ నీటిని తాగుతుంటాం. అయితే ఆయా బాటిల్స్‌పై ఉన్న మినరల్స్ లిస్టు...బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)తో సరిపోయిందా? లేదా? అనేది చూసుకోవాలి. అయితే ఆ నీటి టీడీఎస్ మాత్రం 500 mg/L దాటకూడదు” అని ప్రొఫెసర్ నమ్రత చెప్పారు.

నీరు

టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) అంటే?

నాణ్యమైన నీటి విషయంలో వినిపించే మరో పదం టీడీఎస్. నాణ్యమైన తాగునీటిలో ఆర్గానిక్ సాల్ట్స్, కాల్షియం, పోటాషియం, మెగ్నీషియం, సోడియం, బైకార్బనైట్స్, క్లోరైడ్స్, సల్ఫైట్స్ అలాగే కొద్ది మొత్తంలో కర్బన పదార్థాలు కరిగి ఉంటాయి.

వీటితో పాటు, కాడ్మియం, లెడ్, నికెల్ వంటి లోహాలు కూడా చాలా తక్కువ మోతాదులో కరిగి ఉంటాయి. ఇలా నీటిలో కరిగి ఉన్న ఈ పదార్థాల మొత్తాన్నే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. ఇది ఒక లీటరు నీటిలో 500mg/L మించకూడదు. అలాగే 100mg/L తగ్గకూడదని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ణయించింది.

మనం తాగే నీటిలో టీడీఎస్ 100 కంటే తక్కువ ఉంటే అవసరమైన మినరల్స్ లేనట్లే. అలాగే 500 కంటే ఎక్కువ టీడీఎస్ ఉంటే ఆ నీరును హార్డ్ వాటర్ (కఠిన జలం) అంటారు. ఈ రెండూ తాగడానికి పని చేయవు.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటిని తాగాలంటే దాని టీడీఎస్ 100 నుంచి 500 మధ్య ఉండాలి. మనం తాగే నీటిలో టీడీఎస్ ఎంతుందో తెలుసుకునేందుకు మార్కెట్లో టీడీఎస్ మీటర్లు దొరుకుతాయి.

నీరు

నీటి నాణ్యతను ఎలా కొలుస్తారు?

నీరు ఎంత నాణ్యమైనదో, తాగేందుకు ఉపయోగపడుతుందో లేదో బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొన్ని పరీక్షల ద్వారా నిర్దారిస్తుంది. వీటిని ఇండియన్ స్టాండర్డ్స్ డ్రింకింగ్ వాటర్ స్పెసిఫికేషన్స్-10500 అంటారు.

భారతదేశంలో తాగు నీటి నాణ్యత కోసం చేసే ఈ పరీక్షల్లో నీటిలో పలానా పదార్థం/మూలకం/ఖనిజం ఇంతవరకు ఉండవచ్చునని చెప్పేవే కానీ ఇంత ఉండాలి అని కచ్చితంగా చెప్పేవి కావు అని బీబీసీతో బుద్దా రవి ప్రసాద్ చెప్పారు. నీటి నాణ్యత పరీక్షలు నిర్వహణలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో గత 25 ఏళ్లుగా సీనియర్ వాటర్ ఎనలిస్టుగా ఆయన పని చేస్తున్నారు.

 “నీటి నాణ్యతను నిర్ధారించే పరీక్షలు 60 వరకు ఉన్నాయి. ఇందులో రసాయన పరీక్షలతో పాటు మైక్రో బయాలజీ పరీక్షలు ఉన్నాయి. పీహెచ్, టీడీఎస్, టోటల్ అల్కాలినిటి, హార్డ్‌నెస్, మెటల్స్ వంటివి రసాయన పరీక్షల ద్వారా నిర్ణయిస్తే... నీటిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్, పెస్టిసైడ్ అవశేషాల కోసం టోటల్ కోలిఫాం, ఈ కోలిఫాం వంటి మైక్రో బయోలజీ పరీక్షలు చేస్తారు.

పరీక్షల్లో ప్రధానమైనవి చూసుకుంటే, పీహెచ్ 6.5 నుంచి 7.5 ఉండవచ్చు. అలాగే బై కార్బోనైట్స్ 200mg/L, కాల్షియం 75mg/L, మెగ్నీషియం 30mg/L, నైట్రేట్ 45mg/L, టోటల్ ఆర్సెనిక్ 0.01mg/L, కాపర్ 0.05mg/L, క్లోరైడ్స్ 250mg/L, సల్పేట్ 200mg/L, ఫ్లోరైడ్ 1mg/L , ఐరన్ 0.3mg/L, మెర్క్యూరీ 0.01mg/L, జింక్ 5mg/L వరకు ఉండాలి” అని రవి ప్రసాద్ చెప్పారు.

నీరు

నీటి నాణ్యతలో తేడా వస్తే ఏమవుతుంది?

నీటి నాణ్యత కోసం చేసే వివిధ పరీక్షల ద్వారా ఆ నీటిని తాగేందుకు ఉపయోగించవచ్చా లేదా అనేది నిర్ణయిస్తారు. నీటి నాణ్యత లేకపోతే ఏమవుతుందనే విషయాలను ఏయూ ఎన్విరాన్మెంటల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఈయూబీ రెడ్డి బీబీసీతో చెప్పారు.

‘‘బీఐఎస్ ప్రకారం ఫ్లోరైడ్ 1 కంటే ఎక్కువ ఉంటే డెంటల్ ఫ్లోరోసిస్ (Dental fluorosis), అలాగే సోడియం ఎక్కువగా ఉంటే బీపీ వస్తాయి. పంట పొలాల ఎరువుల ద్వారా నైట్రేట్ (Nitrate) తాగునీటితో కలిసి శరీరంలోకి వెళ్తే నైట్రైట్ (Nitrite) గా మారుతుంది.

అది రక్తంలో ఆక్సిజన్ సరఫరాను తగ్గించి శ్వాస ఇబ్బందులు, కళ్లు తిరగడం, కనుపాపలు నీలం రంగులోకి మారడానికి కారణమవుతుంది. దీనినే ‘బ్లూ బేబీ సిండ్రోమ్’ అంటారు. ఆర్సెనిక్ ఎక్కువ ఉంటే చర్మంపై తెల్లని మచ్చలు వస్తాయి. కాల్షియం తక్కువైతే ఎముకల సమస్యలు, టీడీఎస్ తక్కువ ఉన్న నీటిని తాగితే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

నీటి రుచి బాగోలేదనిపించినా, రంగు మారినా, నలకలు కనిపించినా నీటిలో ఏదో తేడా ఉందని, తాగడానికి పనికి రాదని అర్థం చేసుకోవాలి. వెంటనే ప్రభుత్వ లేదా ప్రభుత్వం గుర్తించిన వాటర్ టెస్టింగ్ ల్యాబరేటరీలలో పరీక్షలు చేయించుకోవాలి’’ అని ఆయన వివరించారు.

నీరు

ఏ నీటినైనా మరిగిస్తే మంచినీరుగా మారుతుందా?

ఫ్యూరిఫైడ్ వాటర్, డిస్టిల్డ్ వాటర్, మినరల్ వాటర్ ఇలా అనేక రకాలైన నీరు అందుబాటులో ఉంది. ఏ నీరు తెలియనప్పుడు దానిని తాగాల్సి వస్తే తీసుకోవాలసిన ప్రాథమిక జాగ్రత్తలను రిటైర్డ్ ప్రొఫెసర్ యూఈబీ రెడ్డి వివరించారు.

“భూమి నుంచి ఎత్తులో ఉన్నప్పుడు డిస్టిల్డ్ వాటర్‌లా ఉండే వర్షపు నీరు, భూమిని సమీపిస్తూనే కాలుష్యాన్ని నింపుకుంటుంది. గాలిలో ఉండే కార్బన్ డయాక్సెడ్, సల్పర్ డయాక్సైడ్, వంటి వాటితో కలిసి కలుషితం అవుతుంది. ఇటువంటి కాలుష్యాన్ని ఎస్పీఎం (Suspended Particulate Matter) అంటారు. నీటి కాలుష్యం వలన 250 రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రివర్స్ ఆస్మోసిస్ ద్వారా నీటిని శుద్ధి చేస్తే అందులో పోషకాలు పోతాయి. అలాగే పదే పదే నీటిని ఫిల్టర్ చేయడం కూడా మంచింది కాదు.

ప్రిడ్జ్‌లో పెట్టిన నీటిలో కూడా త్వరగా బ్యాక్టరీయా వచ్చి చేరుతుంది. నీటిపై ఎలాంటి అవగాహన లేనప్పుడు తాగాల్సి వస్తే నీటిని మరిగించి తాగడం మంచి పద్ధతి.

అలాగే వస్త్రాన్ని మడతలుగా పెట్టి వడగట్టడం, అల్ట్రా వయోలెట్ లైట్ల ఫిల్టర్లు వాడటం ద్వారా కూడా సులభంగా నీటిని శుద్ధి చేయవచ్చు” అని యూఈబీ రెడ్డి చెప్పారు.

బ్లాక్ వాటర్

ఫొటో సోర్స్, EVOCUS

యాక్టివిటీ ఎక్కువ ఉన్నవాళ్లకే బ్లాక్ వాటర్

ఇప్పటి వరకు చెప్పుకున్న వివిధ రకాలైన నీళ్లతో పాటు ఈ మధ్య కాలంలో బ్లాక్ వాటర్ లేదా ఆల్కలీన్ వాటర్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ వాటర్‌ను క్రికెట్, సినీ సెలెబ్రిటీలు ఎక్కువగా వాడుతున్నారు. నాణ్యమైన వాటరంటే పీహెచ్ 7కు కొద్దిగా అటు, ఇటుగా ఉంటుంది. కానీ బ్లాక్ వాటర్ పీహెచ్ 8 నుంచి 9 వరకు ఉండవచ్చు అని విశాఖకు చెందిన డైటీషియన్ సునీత చెప్పారు.

“మనం ఏం తిన్నా శరీరంలో యాసిడ్ తయారవుతూ ఉంటుంది. దానిని బ్యాలన్స్ చేయడానికి అల్కలీన్ లక్షణాలు ఎక్కువగా ఉన్న బ్లాక్ వాటర్‌ని తీసుకోవడం వలన సమతుల్యత ఏర్పడి ఆ మనిషి యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉంది.

అయితే శరీరాన్ని శ్రమకు గురి చేయని వారు బ్లాక్ వాటర్ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరం యాక్టివ్‌గా లేకపోతే బ్లాక్ వాటర్ తాగడం వలన క్షార లక్షణాలు శరీరంలో ఏర్పతాయి. ఈ బ్లాక్ వాటర్‌లో కూడా కొన్ని ఖనిజ లవణాల్ని కలుపుతారు. బ్లాక్ వాటర్ అతిగా తాగడం కూడా మంచిది కాదు” అని సునీత తెలిపారు.

నీరు

‘ప్రతీ ఇంటికి తాగు నీరు’

శరీరానికి అవసరమైన జీవశక్తిని అందించే నీటి వనరుల లభ్యత దేశంలో తక్కువగా ఉంటుంది. అలాగే లభించిన నీటిలో సురక్షితమైన నీరు మరింత తక్కువగా ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి రక్షిత తాగునీటిని అందించేందుకు కొన్ని పథకాలు/మిషన్లను తీసుకొచ్చింది.

జల జీవన్ మిషన్‌ను 2019 ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ మిషన్ ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి 2024 నాటికి కుళాయి నీటి సదుపాయం కల్పిస్తామని ప్రధాని చెప్పారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి పరిశుభ్రమైన తాగు నీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 భాగస్వామ్యంతో అమలు చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ (అర్బన్) 2.0 ’ పేరుతో దేశంలోని అన్ని నగరాలకు తాగు నీరు అందించాలనే లక్ష్యంతో అక్టోబర్ 1వ తేదీ 2021న మరో మిషన్ ప్రారంభించింది. 2021-22 నుంచి 2025-26 (ఐదేళ్లు) కాలంలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నీటి లభ్యత తగ్గుతున్న తరుణంలో నీటి వనరుల సంరక్షణ, రీసైక్లింగ్ ద్వారా దేశంలోని పౌరులందరికి మంచి నీటిని అందిస్తామని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఏపీ, తెలంగాణా రాష్ట్రంలో తాగు నీటిని అందించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్‌తో పాటు మిషన్ భగీరథ పేరుతో తెలంగాణ, వాటర్ గ్రిడ్ పేరుతో ఏపీలో రక్షిత నీటి పథకాలను అమలు చేస్తున్నారు.

మరో వైపు 2030 నాటికి మన దేశంలో నీటి కొరత 50 శాతం వరకు ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది.

వీడియో క్యాప్షన్, మేధ గోఖలే... 17 ఏళ్లుగా ఆమె వంట చేయడంలో మెళకువల్ని పురుషులకు నేర్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)