ఎయిర్ ఫ్రైర్‌లో వంట ఓవెన్ కంటే ఆరోగ్యకరమా? ఇది ఎలా పని చేస్తుంది?

ఎయిర్ ఫ్రయిర్

ఫొటో సోర్స్, Getty Images

2021లో యూకేలో ఎయిర్ ఫ్రైర్‌ల కొనుగోలులో 400 శాతం పెరుగుదల కనిపించింది.

ఎయిర్ ఫ్రైర్‌లో వంట చేసేటప్పుడు అతి తక్కువ నూనె వాడతారు లేదా నూనెను పూర్తిగా వాడరు. ఇవి ఎలా పని చేస్తాయి? నూనె వాడకుండా వంట చేయడం వల్ల ఎయిర్ ఫ్రైర్‌లు ఇతర వంట సాధనాల కంటే ఆరోగ్యకరమైనవని చెప్పొచ్చా?

ఒక వైపు దేశంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోతుండగా, ఎయిర్ ఫ్రైర్‌ వాడకం విద్యుత్ వినియోగాన్ని తగ్గించి డబ్బును ఆదా చేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

ఎయిర్ ఫ్రైర్‌ ప్రయోజనాలు, పరిమితుల గురించి తెలుసుకునేందుకు బీబీసీ రేడియో 4కు చెందిన గ్రెగ్ ఫుట్ నిపుణులతో మాట్లాడారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఈ మహిళల సంస్థకు పేరు కూడా లేదు, కానీ వీళ్ల ఉత్పత్తులు అమెరికా వెళ్తున్నాయి

ఎయిర్ ఫ్రైర్‌ కొనే ముందు తెలుసుకోవల్సిన విషయాలేంటి?

ఆహారం చుట్టూ వేడి గాలిని సరఫరా చేయడం ద్వారా ఎయిర్ ఫ్రైర్‌ వంట చేస్తుంది.

ఎయిర్ ఫ్రైర్‌ సుమారుగా బ్రెడ్ తయారీ పరికరం సైజులో ఉంటుంది. ఇది కిచెన్ కౌంటర్ పై పెట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆహారాన్ని వండేందుకు ఈ పరికరం పదార్ధాల చుట్టూ అత్యధిక ఉష్ణోగ్రతలో వేడి గాలిని పంపిస్తుంది.

"ఇది చాలా వేడిగా ఉంటుంది. దీనిని ఎయిర్ ఫ్రైర్‌ మాదిరిగా ఊహించుకోవచ్చు" అని లండన్ ఇంపీరియల్ కాలేజీలో కలినరీ ఎడ్యుకేషన్ నిపుణులు జాకబ్ రాడ్జికోవ్స్కీ చెప్పారు.

"ఇదొక ఫ్యాన్ ఓవెన్ మాదిరిగా ఉంటుంది. కాకపోతే ఇది చిన్నగా ఉండి ఇందులో ఉండే ఫ్యాన్ చాలా శక్తివంతంగా పని చేస్తుంది. దీని పని తీరు కమర్షియల్ వంటశాలల్లో వాడే ప్రొఫెషనల్ ఓవెన్ మాదిరిగా ఉంటుంది " అని చెప్పారు.

ఎయిర్ ఫ్రయిర్

ఫొటో సోర్స్, Getty Images

కన్వెన్షనల్ ఓవెన్ కంటే వేగంగా వంట

"ఈ ఎయిర్ ఫ్రైర్‌‌లో ఉండే ఫ్యాన్ చాలా శక్తివంతమైనది. ఆహారం పెట్టే ప్రదేశం మాత్రం చాలా చిన్నది. ఈ పరికరం చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది" అని చెప్పారు.

"నేను ఎయిర్ ఫ్రైర్‌లో 20 నిమిషాల్లో చికెన్ జాయింట్ వండుకోగలను. ఇదే ఓవెన్‌లో వండాలంటే ఎక్కువ సమయం పడుతుంది" అని అన్నారు.

"పెద్ద కన్వెన్షన్ ఓవెన్‌లో వండాలంటే దానిని ప్రీ హీట్ కూడా చేయాలి. ఇది మరింత ఎక్కువ సమయం తీసుకుంటుంది" అని అన్నారు.

"కానీ, ఇందులో ఆహార పదార్ధాలను పెట్టేందుకు కేటాయించిన కంపార్ట్మెంట్ చాలా చిన్నది కావడంతో తక్కువ మోతాదులో మాత్రమే ఆహారాన్ని వండేందుకు వీలవుతుంది" అని అన్నారు.

"నలుగురు నుంచి ఆరుగురికి వంట చేయాలంటే ఇందులో వండడం వల్ల సమయం ఆదా అవ్వదు. తక్కువ మోతాదుల్లో ఎయిర్ ఫ్రైర్‌లో చాలా సార్లు వండి తీస్తూ ఉండాలి" అని అన్నారు.

కరకరలాడే వేపుళ్ళ కోసం

ప్రకటనల్లో మనం సాధారణంగా చూసే ఎయిర్ ఫ్రైర్‌లు చికెన్ చేస్తున్నట్లు, వేపుడు వంటకాలు చేస్తున్నట్లు కనిపిస్తాయి. కరకర లాడే వంటలు చేసేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి.

"ఈ ఎయిర్ ఫ్రైర్‌లు ఆహారాన్ని బాగా వేపి కరకరలాడేలా చేస్తాయి. వేపుళ్ళు తినేందుకు ఆసక్తి ఉంటే ఈ పరికరాలు మీకు చిటికెలో చేసి పెడతాయి" అని జాకబ్ చెప్పారు.

ఎయిర్ ఫ్రయిర్

ఫొటో సోర్స్, Getty Images

ఇది ఆరోగ్యానికి మంచిదేనా?

"ఎక్కువ నూనెలో వేసి వేపే వంటలతో పోలిస్తే ఎయిర్ ఫ్రైర్‌లో చేసే వంటలు ఆరోగ్యకరం" అని చెప్పవచ్చు.

ఇందులో వండటం కన్వెన్షనల్ ఓవెన్‌లో వండటం కంటే ఆరోగ్యకరం.

"బంగాళా దుంపలు వేపేందుకు చాలా నూనెను పీల్చుకుంటాయి. కానీ, ఎయిర్ ఫ్రైర్‌లో నూనె లేకుండా కూడా చక్కగా వేగుతాయి. ఒక వేళ ఎయిర్ ఫ్రైర్‌లో నూనె ఎక్కువైతే అదంతా ఫిల్టర్ అయి బయటకు వచ్చేస్తుంది. ఇది తినాల్సిన అవసరం లేదు" అని చెప్పారు.

"అయితే, ఎయిర్ ఫ్రైర్‌లో వంట పూర్తిగా ఆరోగ్యకరంగా వంట చేసే విధానం అని చెప్పలేం. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తినాలని అనుకుంటే, ఆవిరి పై వండిన వంట ఉత్తమం" అని అన్నారు.

ఎయిర్ ఫ్రైర్‌లో ప్రస్తుతం కొత్తగా వస్తున్న మోడళ్ళు కనీసం 15 రకాలుగా పని చేస్తాయి. దీంతో ఇది మరింత మెరుగ్గా పని చేస్తుంది" అని బీబీసీ గుడ్ ఫుడ్ మ్యాగజైన్ రచయత ఆన్యా గిల్‌బర్ట్ చెప్పారు.

ఎయిర్ ఫ్రయిర్

ఫొటో సోర్స్, Getty Images

ఓవెన్ కంటే తక్కువ విద్యుత్ వినియోగం

ఎయిర్ ఫ్రైర్‌ వల్ల ఖర్చయ్యే విద్యుత్ గురించి తెలుసుకునేందుకు బీబీసీ స్లైసెడ్ బ్రెడ్ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ సైమన్ హోబన్ చికెన్ లెగ్‌ను ముందు ఓవెన్‌లో, ఆ తర్వాత ఎయిర్ ఫ్రైర్‌లో వండి చూసారు. వీటిలో వంట చేసేటప్పుడు ఇంట్లో మిగిలిన విద్యుత్ పరికరాలన్నిటినీ ఆపేశారు.

వంట పూర్తయిన తర్వాత విద్యుత్ మీటర్‌ను పరిశీలించి చూశారు.

"ఓవెన్‌లో వంట చేసేందుకు 35 నిమిషాలు పట్టగా, 1.05 కిలోవాట్ హవర్స్ ఖర్చయింది.

అదే ఫ్రైర్‌లో వంట చేసేందుకు 20 నిమిషాలు పట్టింది. 0.43 కిలోవాట్ హవర్స్ విద్యుత్ ఖర్చయింది.

ఓవెన్‌లో పెట్టిన ఆహారం పూర్తిగా వేగేందుకు సుమారు గంట సేపు పట్టింది. ఇందు కోసం 1.31 కిలోవాట్ హవర్స్ విద్యుత్ ఖర్చయింది.

ఫ్రైర్‌లో వేపుళ్ళు చేయడం చాలా త్వరగా పూర్తవుతుంది.

ఈ వేపుళ్ళు 35 నిమిషాల్లో సిద్ధం అయిపోయాయి. గంటకు 0.55 కిలోవాట్ హవర్స్ విద్యుత్ ఖర్చు అయింది.

ఓవెన్ లో చేసే వంటకు వినియోగం అయ్యే విద్యుత్‌లో సగమే ఎయిర్ ఫ్రైర్‌లో వంట చేసేందుకు అవుతుందని గ్రెగ్ తేల్చారు.

వీడియో క్యాప్షన్, కోకా కోలా: ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ కాలుష్యాన్ని సృష్టిస్తోన్న కంపెనీ

ఎయిర్ ఫ్రైర్‌ ఓవెన్‌కు ప్రత్యామ్నాయం కాదు

ఎయిర్ ఫ్రైర్‌ ఉంటే వంటింటి నుంచి ఓవెన్‌ను తొలగించవచ్చని జాకబ్ చెప్పడం లేదు. "కోడిని లేదా టర్కీని సమూలంగా ఎయిర్ ఫ్రైర్‌లో వండలేం".

"కానీ, ఎయిర్ ఫ్రైర్‌ చాలా మంచి సాధనం. నా దగ్గర కూడా ఒకటి ఉంది. ఓవెన్ లేని వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)