కొత్తిమీర సూపర్ ఫుడ్డా? కొత్తిమీరను భారతదేశ జాతీయ మూలికగా ప్రకటించాలని ఈ షెఫ్ ఎందుకు కోరుతున్నారు

RANVEER BRAR

ఫొటో సోర్స్, RANVEER BRAR

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోట్లాది మంది భారతీయుల్లానే కొత్తిమీర లేకుండా నాకు వంటపూర్తి కాదు.

కూరగాయలు, పప్పులతో చేసే వంటకాల్లోనే కాదు టమోటా, పచ్చిమిరప, వెల్లుల్లి కలిపి చేసే చట్నీలోనూ కొత్తిమీర ఉపయోగిస్తుంటాను.

ఇప్పుడు ఇండియాలో పేరున్న షెఫ్ రణవీర్ బ్రార్ ఈ కొత్తిమీరను 'భారతదేశ జాతీయ మూలిక'గా గుర్తించాలని పిటిషన్ ప్రారంభించారు.

కొత్తిమీరను దేశవ్యాప్తంగా వంటకాలలో వినియోగిస్తారు. ఉత్తర భారతదేశంలో ధనియా, దక్షిణాదిలో కొత్తిమీర, కోత్మీర్ అని పిలుస్తుంటారు.

''కొత్తిమీర లేకుండా భారత్‌లో దాదాపు ఏ వంటకమూ పూర్తికాదు. ఇంత విస్తృత వినియోగం ఉన్న వేరే మూలిక ఏదీ లేదు'' అంటారు రణవీర్.

బోస్టన్‌లో రెండు రెస్టారెంట్లు నిర్వహిస్తున్న రణవీర్‌కు భారత్‌లో ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఈయనకు 17 లక్షల మంది చొప్పున ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఏకంగా 33 లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఫేస్‌బుక్‌లో 33 లక్షల మంది ఫాలోవర్లతో భారతదేశంలో ఒక ప్రముఖుడు.

రణవీర్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 50 లక్షల పైనే.

ఇంట్లో తాను చేసే వంటల్లోనూ ఎక్కువగా కొత్తిమీర వాడే రణవీర్ బ్రార్.... కొత్తిమీర ఉపయోగించి చేసే వంటల రుచే వేరన్నారు. కళాయిలో ముందే వేయించుకుని వంట ప్రారంభించినా లేదంటే వంటంతా పూర్తయిన తరువాత దానికి కొత్తిమీర యాడ్ చేసినా కూడా రుచి వస్తుందని చెప్పారు.

‘‘కొత్తిమీరలోని ప్రతి భాగమూ ఉపయోగకరమైనదే. ఆకులను కూరలు, పప్పులలో గార్నిషింగ్‌కు వినియోగిస్తారు. రొట్టెలు, మాంసాహార వంటకాలలోనూ కలుపుతారు. వేర్లు, కాండం సూప్‌లో వేస్తారు. గింజలను మసాలా దినుసుగా వినియోగిస్తారు'' అని చెప్పారు రణవీర్.

ధనియాకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వాలంటూ కొద్దిరోజుల కిందట ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కొత్తిమీరను నేషనల్ హెర్బ్‌గా గుర్తించాలని పిటిషన్ వేద్దామని ఆ పోస్ట్‌లో ఆయన ప్రతిపాదించారు.

RanveerBrar

ఫొటో సోర్స్, RanveerBrar

రణవీర్ పెట్టిన ఈ పోస్ట్‌పై ఆసక్తికరమైన చర్చ నడిచింది. రణవీర్ ప్రారంభించే పిటిషన్‌కు మద్దతివ్వడం ఎలా అంటూ నెటిజన్లు అడగడం ప్రారంభించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీని అడ్రస్ చేస్తూ ప్రారంభించిన ఈ పిటిషన్‌పై ఇప్పటికే 5,500 మంది సంతకాలు చేశారు.

రాణికి కిరీటం లేకపోతే ఎలా ఉంటుందో వంటల్లో కొత్తిమీర లేకపోయినా అలానే ఉంటుందని అని ఈ పిటిషన్‌పై సంతకం చేసిన ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.

ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం.. కొత్తిమీర క్రీస్తుపూర్వం 5000 ఏళ్ల కిందటి నుంచే ఉంది. జీర్ణ, శ్వాస, మూత్రకోశ సంబంధిత సమస్యల నివారణకు గ్రీకులు, రోమన్లు కొత్తిమీరను వాడినట్లుగా చరిత్రలో ఉంది.

చైనా, భారత్, యూరప్‌లో వేల ఏళ్ల కిందట నుంచే కొత్తిమీర సాగు ఉంది.

యూరప్, మధ్యధరా, ఉత్తర ఆఫ్రికా, ఉత్తర-దక్షిణ అమెరికాలు, చైనా, బంగ్లాదేశ్‌లలో కొత్తిమీర సాగు, వాడకం విస్తారంగా ఉంది.

భారతదేశంలోని అన్ని కాలాల్లో, అన్ని ప్రాంతాల్లో కొత్తిమీర పండిస్తారని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని వెజిటబుల్ సైన్స్ డివిజన్ హెడ్ డాక్టర్ భోపాల్ సింగ్ తోమర్ తెలిపారు.

కొత్తిమీర

ఫొటో సోర్స్, Getty Images

'నలభై ఏళ్ల కిందటి వరకు భారత్‌లో కొత్తిమీర నగరాలలో మాత్రమే దొరికేది. శీతాకాలంలో మాత్రమే దొరికేది. కానీ, ఇప్పుడు ఏడాది పొడవునా, అన్ని చోట్లా దొరుకుతోంది'' అన్నారు తోమర్.

చాలామంది ఇప్పుడు దీన్ని తమ పెరట్లోనో, మిద్దెలపైనో పెంచుకుంటున్నారు కూడా.

రుచికోసమే కోకుండా ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాల రీత్యా కూడా కొత్తిమీర వాడకం పెరుగుతోంది.

రణవీర్ తన పిటిషన్‌లో కొత్తిమీరను 'సూపర్ ఫుడ్'గా అభివర్ణించారు. కొలెస్ట్రాల్ తగ్గించడంలో, డయాబెటిస్‌ను అదుపులో ఉంచడంలో కొత్తిమీర ఉపయోగపడుతుందనీ పేర్కొన్నారు.

8 కోట్ల మంది డయాబెటిస్ రోగులున్న భారతదేశంలో ఏటా 1.7 కోట్ల మంది హృదయ సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)