యుక్రెయిన్: కిరాయి సైనికులు అంటే ఎవరు, వారేం చేస్తారు?

ఫొటో సోర్స్, COURTESY ANTITERROR ACADEMY OF THE CZECH REPUBLIC
- రచయిత, బెర్నార్డ్ డేబస్‌మాన్ జూనియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''రహస్యంగా యుక్రెయిన్‌లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండి, రెండు మూడు భాషలు తెలిసిన మాజీ సైనికులు కావలెను. దేశంలో సంఘర్షణతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సహాయపడే పనికి రోజుకు 2,000 డాలర్లు (సుమారు 1,50,000) ప్లస్ బోనస్ ఇవ్వబడును''
చూడటానికి ఇదేదో హాలీవుడ్ యాక్షన్ సినిమాలో కనిపించే జాబ్ యాడ్ లాగా ఉంది. కానీ, ఇది నిజంగానే ఉద్యోగ ప్రకటన. 'సైలెంట్ ప్రొఫెషనల్స్' అనే జాబ్ వెబ్‌సైట్‌లో ఇది కనిపించింది. ఈ వెబ్‌సైట్ మాజీ సైనికులు, సెక్యూరిటీ పరిశ్రమలో పని చేసే వారి కోసం పని చేస్తుంది.
యుక్రెయిన్‌లో పరిణామాలు తీవ్రమవుతున్న కొద్దీ ఇలాంటి వారికి డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, యూరోపియన్ దేశాల నుంచి వాహనాలతో సహా వచ్చి ఇక్కడి యుద్ధ బాధితులను తరలించే పనులు చేయగల ప్రైవేటు కాంట్రాక్టర్ల (సీఎంపీ-కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్)కు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు అంటున్నారు.
''యుక్రెయిన్‌లో ఇలాంటి కాంట్రాక్టర్లకు చాలా డిమాండ్ ఉంది'' అని కెనెడియన్-అమెరికన్ రచయిత, ప్రైవేట్ మిలిటరీ కంపెనీల నిపుణుడు రాబర్ట్ యంగ్ పెల్టన్ అన్నారు.
అయితే, ఇలాంటి పనులు చేసే మాజీ సైనికులు యుద్ధం చేయడానికి, చంపడానికి శిక్షణ పొందిన వారని, ఇలాంటి వారిని యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో వినియోగించుకునే క్రమంలో సమస్యలు కూడా ఎదురవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యుక్రెయిన్ సైన్యంలో పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన అనేకమంది సీఎంపీ (అద్దె సైనికులు) పని చేస్తున్నారు. అయితే, 'సైలెంట్ ప్రొఫెషనల్స్' వెబ్‌సైట్ ద్వారా బాధితులను తరలించడానికి సిద్ధపడి వస్తున్న ఈ సైనికులు తమకు కూడా సైన్యంలో పని చేసే వారి స్థాయి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, సైట్లో కనిపిస్తున్న ఈ జాబ్ ఆఫర్లు ఎవరు ఇస్తున్నారో తెలియదు. అయితే, ఇలాంటి వారి కోసం ఈ కంపెనీలకు 30,000 నుంచి 60 లక్షల డాలర్లు ( సుమారు రూ. 22 లక్షల నుంచి రూ.45 కోట్ల వరకు) చెల్లిస్తున్నాయని పెల్టన్ వెల్లడించారు. ఎక్కువ కుటుంబాలలను, గ్రూపులను, అలాగే వారి ఆస్తులను కూడా తరలించే ఉద్దేశంతో కొంతమంది ఎక్కువ మొత్తాలను చెల్లించడానికి ముందుకొస్తున్నారని ఆయన వెల్లడించారు.
అయితే, ఈ తరలింపు ప్రక్రియలో అనేక అవాంతరాలు, సమస్యలు ఉన్నాయని, యుక్రెయిన్‌లో పని చేస్తున్న అమెరికా ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ అడ్వైజరీ సంస్థ కంపెనీ 'మొజాయిక్' సీఈవో టోనీ షీనా అన్నారు.
"ఎక్కువమంది వ్యక్తులు ఉన్నప్పుడు ప్రమాదం పెరుగుతుంది. పిల్లలున్న కుటుంబాల తరలింపు ఇంకా కష్టం. వాళ్ల భద్రత అనేది వాళ్లని ఎలా తరలించే విధానంపై అన్నదానిపై ఆధారపడి ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వివాదాస్పద పరిశ్రమ
ప్రైవేట్ మిలిటరీ, సెక్యూరిటీ కంపెనీలు దశాబ్దాలుగా ఉన్నాయి. అయితే ఇటీవల ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాల తర్వాత, ఈ సంస్థలు పాశ్చాత్య ప్రభుత్వాలు, వారి వ్యాపార ప్రయోజనాల కోసం పని చేస్తూ పేరు తెచ్చుకున్నాయి.
ఇరాక్ యుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలో 'బ్లాక్‌వాటర్స్' లాంటి ఏజెన్సీల నుంచి పదివేల మంది ప్రైవేట్ కాంట్రాక్టర్లు పని చేశారు. కాన్వాయ్ రక్షణ, సాయుధ మిషన్‌లో ఉన్న సైనిక దళాలకు ఆహార సరఫరా, నివాసం ఏర్పాటు వంటివి వీరి విధుల్లో కొన్ని.
2007లో 'బ్లాక్‌వాటర్స్' కంపెనీకి చెందిన సిబ్బంది బాగ్దాద్‌లో 14మందిని కాల్చి చంపడంతోపాటు, అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారి గురించి చర్చ మొదలైంది.
తూర్పు యూరప్‌లో సంపన్న వ్యక్తులు, సంస్థల రక్షణ కోసం ప్రైవేట్ కంపెనీలు చాలాకాలంగా పని చేస్తున్నాయి.
యుగొస్లేవియా నుంచి విడిపోయిన బోస్నియా, క్రొయెషియా దళాలకు సహాయం చేయడానికి, శిక్షణ ఇవ్వడానికి ఈ ప్రైవేటు సైనిక దళాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అవన్నీ అప్పట్లో అమెరికా సహకారంతో పనులు కొనసాగించాయి.
ఈ పరిశ్రమతో ఉన్న సమస్య ఏంటంటే, డబ్బు ఎక్కడికి వెళుతుందో, కాంట్రాక్టర్లు ఎవరో గుర్తించడం కష్టం. కానీ, ఈ పరిశ్రమ మాత్రం బాగా వృద్ధి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు.
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ న్యూస్ నివేదిక ప్రకారం 2020లో గ్లోబల్ ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ మిలిటరీ ఇండస్ట్రీ విలువ సుమారు $224 బిలియన్లు (సుమారు రూ.10 లక్షల కోట్లు). 2030 నాటికి దీని విలువ $457 (రూ.20 లక్షల కోట్లకు పైగా) బిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.

కాంట్రాక్టర్లా, కిరాయి సైనికులా?
విదేశీ మిలిటరీ కాంట్రాక్టర్లు తాము యుక్రెయిన్‌లో యుద్ధం చేయడం లేదని చెబుతున్నారు. యుక్రెయిన్, దాని పొరుగు దేశాలకు చెందిన ఎన్జీవోలు మానవతా సహాయం కోసం తమను సంప్రదిస్తున్నాయని కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
వివాద ప్రాంతాలలో క్లిష్ట పరిస్థితుల్లో పని చేయడానికి ప్రత్యేక నైపుణ్యాలు, అనుభవం ఉన్న వ్యక్తులు అవసరం.
''నాకు వ్యక్తిగతంగా తెలిసిన చాలామంది యువకులలో డాక్టర్లు, ఫిజిషియన్ అసిస్టెంట్లు, పారామెడిక్స్, నర్సులు, స్పెషల్ ఆపరేషన్స్ మాజీ ఆఫీసర్లు ఉన్నారు. వీరంతా యుద్ధ ప్రాంతాలలో పని చేయడంలో అనుభవజ్ఞులు" అని అమెరికా స్పెషల్ ఫోర్సెస్ మాజీ అధికారి మైకేల్ హాక్ అన్నారు.
ఆయన కూడా యుద్ధ ప్రాంతాల్లో కాంట్రాక్టర్‌గా పనిచేశారు.
పాశ్చాత్య కాంట్రాక్టర్లు తమ సొంత దేశాల చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటారని ఇరాక్‌లో ఇలాంటి విధుల్లో పాల్గొన్న అమెరికా మాజీ ఆర్మీ అధికారి కల్నల్ క్రిస్టోఫర్ మేయర్ అన్నారు.
వీరంతా ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనకుండా ప్రజలను, స్థలాలను, ఆస్తులను రక్షించవలసి ఉంటుంది. అయితే, తమను కిరాయి సైనికులు అనడాన్ని ఖండిస్తున్నారు.
''అది అమెరికా అయినా, మరే దేశమైనా మేం చేసే పని ఒక్కటే. కాకపోతే యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో పని చేయడంలో ప్రమాదాలు ఎక్కువ. మేం చాలా కష్టపడాల్సి ఉంటుంది'' అని మేయర్ అన్నారు.
అయితే ఆచరణలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.
"ప్రైవేట్ కాంట్రాక్టర్ నైపుణ్యం ఉందంటే, కిరాయి సైనికుడికి ఉండాల్సిన నైపుణ్యం ఉన్నట్లే. రెండింటి మధ్య స్పష్టమైన విభజన రేఖ లేదు'' అని అమెరికాకు చెందిన మాజీ పారాట్రూపర్ సీన్ మెక్‌ఫేట్ అన్నారు.
"ఇదంతా మార్కెట్ పరిస్థితులు, వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. చాలామంది వీరి చట్టబద్ధత, కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తులు ఎవరు అని ప్రశ్నిస్తుంటారు. కానీ అది ఏమంత ముఖ్యం కాదు. ఒక పని చేయగలిగారంటే రెండో పని కూడా చేయగలరు" అని మెక్‌ఫెట్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రమాదాలు కూడా ఎక్కువే
ఈ అద్దె సైనికుల పరిశ్రమ పెరుగుదలలో మంచి చెడులు రెండూ ఉన్నాయని మెక్‌ఫెట్ అన్నారు.
''తమ లాభం కోసం ఇలాంటి కిరాయి సైనికులు యుద్దం కొనసాగాలని కోరుకుంటారు. మధ్యయుగాల సమయంలో ధనికులు ప్రైవేటు సైన్యాలను మేనేజ్ చేసేవారు'' అన్నారు మెక్‌ఫెట్.
1990లలో అంగోలా, సియెర్రా లియోన్ ప్రభుత్వాల తరపున పోరాడిన దక్షిణాఫ్రికాకు చెందిన ఎగ్జిక్యూటివ్ అవుట్‌కమ్స్ లాంటి సంస్థలు ఇందుకు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
లండన్‌కు చెందిన శాండ్‌లైన్ ఇంటర్నేషనల్ అనే ప్రైవేటు సైనిక ఏజెన్సీ పాపువా న్యూగినియా, లైబీరియా, సియెర్రా లియోన్‌లలో జరిగిన ఘర్షణలలో పాల్గొంది. అలాగే ప్రస్తుతం రష్యాకు చెందిన అనేక సీఎంపీలు యుక్రెయిన్‌లో ఉన్నట్లు చెబుతారు.
అయితే, పాశ్చాత్య దేశాలకు చెందిన అద్దె సైనికులు యుద్ధంలో పాల్గొనే అవకాశం అసలే లేదని ఎగ్జిక్యూటివ్ అవుట్‌కమ్స్, శాండ్‌లైన్ అనే ప్రైవేట్ ఆర్మీ సంస్థల వ్యవస్థాపకుడు, బ్రిటిష్ ప్రత్యేక దళాల మాజీ అధికారి సైమన్ మాన్ అన్నారు. ఇది చట్టపరమైన సమస్యలకు దారి తీస్తుందని ఆయన బీబీసీతో అన్నారు.
''యుక్రెయిన్‌లో వారికి డబ్బు ఇచ్చేదెవరు, ఆజ్ఞలు జారీ చేసేది ఎవరు? ఆ యుద్ధంలో వారు అసలు ఎలా ఫిట్ అవుతారు'' సైమన్ మాన్ ప్రశ్నించారు.
2004లో ఈక్వటోరియల్ గినియాలో తిరుగుబాటుకు నాయకత్వం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొని అనేక సంవత్సరాలు జైలులో గడిపారు మాన్. అయితే, ప్రజల తరలింపు కోసం ఇలాంటి సీఎంపీ మిషన్లు ఒక్కొక్కరి దగ్గర సుమారు $13,000 ( సుమారు రూ.10 లక్షలు) వసూలు చేయడం గురించి తనకు తెలుసని మాన్ చెప్పారు. సీఎంపీ అధికారులతోపాటు, గ్రౌండ్ లెవెల్లో ఎక్కుమందితో పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నడుస్తుంటాయి'' అని ఆయన చెప్పారు.
యుక్రెయిన్‌లో ఈ పెయిడ్ రెస్క్యూ మిషన్ వల్ల అటు కాంట్రాక్టర్‌లకు, ఇటు క్లయింట్లకు సమానంగా ప్రమాదం పొంచి ఉందని మాన్ అన్నారు. 'నకిలీ అనుభవజ్ఞుల' వల్ల ఇండస్ట్రీ దెబ్బతింటోందని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- రాధేశ్యామ్ రివ్యూ: రూపాయి కథకు.. 99 రూపాయల హంగులు
- ఉత్తర్ ప్రదేశ్‌లో ఘన విజయంతో యోగి ఆదిత్యనాథ్ బీజేపీలో నంబర్ 2 అయిపోయారా?
- యోగి ఆదిత్యనాథ్: విద్యార్థి నాయకుడి నుంచి 'ముఖ్యమంత్రీ మహారాజ్' వరకు సాగిన ప్రయాణం
- పంజాబ్‌లో 'ఆమ్ ఆద్మీ' క్లీన్ స్వీప్: కేజ్రీవాల్ ఈ అద్భుత విజయం ఎలా సాధించారు? కాంగ్రెస్ ఓటమికి సిద్ధూ ఎలా కారణమయ్యారు?
- షేన్ వార్న్ స్పిన్ బౌలింగ్: ‘నేను వార్న్‌కు కీపింగ్ చేయలేను’ అంటూ గ్లోవ్స్ విసిరికొట్టిన కీపర్.. ఒకే మ్యాచ్‌లో ముగ్గురు కీపర్లు
- ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం తెలుగు సినీ పరిశ్రమ హబ్‌గా మారుతుందా... అవకాశాలేంటి, అవరోధాలేంటి?
- భారత్-పాకిస్తాన్ జట్లు తలపడే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా టపాసులు పేలవు ఎందుకు?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














