యుక్రెయిన్ నో ఫ్లై జోన్‌కు పశ్చిమ దేశాలు ఎందుకు అంగీకరించడం లేదు

యుక్రెయిన్ అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ

యుక్రెయిన్‌ గగనతలాన్ని 'నో ఫ్లై జోన్‌'గా ప్రకటించాలని గత కొన్ని రోజులుగా నాటోను, పశ్చిమ దేశాలను కోరుతున్నారు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ.

తాజాగా ఆదివారం కూడా మరోసారి ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. యుక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

యుక్రెయిన్‌కు చెందిన ఒక మహిళ కూడా ఇటీవల ఇదే విషయంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ప్రశ్నించారు.

'ఆకాశం నుంచి బాంబులు, క్షిపణులు దూసుకొస్తుంటే యుక్రెయిన్ మహిళలు, పిల్లలు చాలా భయపడుతున్నారు. యుక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించండి' అని దారియా అనే మహిళ బ్రిటన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్నప్పటికీ, పౌరుల ప్రాణాలు పోతున్నప్పటికీ, యుక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించే సంకేతాలు మాత్రం పశ్చిమ దేశాల నుంచి రావడం లేదు. దీనికి కారణం ఏమిటి?

యుక్రెయిన్

ఫొటో సోర్స్, EPA

నో ఫ్లై జోన్‌ అంటే ఏమిటి?

నో ఫ్లై జోన్‌ అంటే ఒక నిర్ధిష్ట ప్రాంతంలోని గగనతలంపై కొన్ని రకాల విమానాలు ఎగరకుండ నిషేధం విధించడమని అర్థం.

సాధారణంగా అత్యంత సున్నిత ప్రాంతాలను కాపాడేందుకు నో ఫ్లై జోన్ ప్రకటిస్తూ ఉంటారు.

సైనిక పరిభాషలో చెప్పాలంటే నిషేధం విధించిన గగనతలంలోకి విమానాలు ప్రవేశించకుండా అడ్డుకోవడం.

ఆ ప్రాంతంపై విమానాలతో దాడులు లేదా నిఘా పెట్టకుండా చూసేందుకు ఈ చర్య తీసుకుంటారు.

నో ఫ్లై జోన్ ప్రకటించిన తర్వాత ఆ గగనతలంలోకి విమానాలు ప్రవేశించకుండా సైన్యం నిరంతరం చర్యలు తీసుకుంటుంది.

నిషేధిత గగనతలంలోకి ప్రవేశించే విమానాలను సైన్యం కూల్చేయవచ్చు.

యుక్రెయిన్‌పై నో ఫ్లై జోన్ విధించడం అంటే ఒకరకంగా రష్యాతో నాటో దళాలు నేరుగా తలపడటమే. అంటే యుక్రెయిన్ గగనతలంపై రష్యా విమానాలను నాటో దళాలు గుర్తించినప్పుడు, అవసరమైతే వాటిని కూల్చేయాల్సి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ అణ్వాయుధాలు కొనడానికి ప్రయత్నించిందా

యుక్రెయిన్‌ గగనతలంపై నో ఫ్లై జోన్ ఎందుకు ప్రకటించడం లేదు?

రష్యా విమానాలు లేదా ఎక్విప్‌మెంట్‌తో నాటో బలగాలు నేరుగా తలపడితే ముప్పు మరింత వేగంగా పెరుగుతుంది.

'అది నో ఫ్లై జోన్‌ అని చెబితే సరిపోదు. ఆ జోన్‌లోకి ఏ విమానం రాకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది' అని అమెరికా ఎయిర్ ఫోర్స్ మాజీ జనరల్ ఫిలిప్ బ్రీడ్‌లవ్ ఫారిన్ పాలసీ మ్యాగజీన్‌తో చెప్పారు.

యుక్రెయిన్‌లో నో ఫ్లై జోన్‌కు ఆయన మద్దతు తెలిపారు. కానీ ఇది పశ్చిమ దేశాలు తీసుకోవాల్సిన సీరియస్ నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.

'ఇది (నో ఫ్లై జోన్ ప్రకటించడం) యుద్ధంతో సమానం. నో ఫ్లై జోన్ ప్రకటించాలనుకుంటే.. మన నో ఫ్లై జోన్‌లోకి కాల్పులు జరిపే, మన నో ఫ్లై జోన్‌పై ప్రభావం చూపే ప్రత్యర్థి శక్తి సామర్థ్యాలను దెబ్బకొట్టాలి' అని ఫిలిప్ బ్రీడ్‌లవ్ చెప్పారు.

పాక్షిక లేదా పూర్తిస్థాయి నో ఫ్లై జోన్‌ విధించడానికి బ్రిటన్ ఎంపీ టొబియాస్ మద్దతు తెలిపారు. ప్రజలు చనిపోతున్నందున నాటో జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు.

కానీ ఇందులో జోక్యం చేసుకోవడానికి నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టొల్టెన్‌బర్గ్ నిరాకరించారు.

'యుక్రెయిన్‌లోకి వెళ్లే ఉద్దేశం మాకు లేదు. అది నేల మీదైనా లేదా గగనతలంలోనైనా' అని ఎన్‌బీసీతో చెప్పారు.

యుక్రెయిన్‌పై నో ఫ్లై జోన్‌ పాటించడానికి సాయం చేయబోమని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలన్స్ స్పష్టం చేశారు. ఎందుకంటే రష్యా జెట్ విమానాలతో పోరాటం చేయడమంటే యుద్ధాన్ని యూరప్ అంతటికి వ్యాప్తి చేయడమేనని బెన్ అభిప్రాయపడ్డారు.

'యూరప్‌లో యుద్ధానికి నేను కారణం కావాలని అనుకోవడం లేదు. కానీ యుక్రెయిన్‌కు మేము అండంగా ఉంటాం. యుక్రెయిన్ వీధుల్లో పోరాటం చేసేందుకు వారికి సాయం చేస్తాం' అని బీబీసీ రేడియో 4తో మాట్లాడుతూ చెప్పారు.

అమెరికా కూడా ఇవే కారణాలు చెబుతూ నో ప్లై జోన్‌ను తిరస్కరించింది.

రష్యాతో ఉద్రిక్తతలు పెరిగితే అది అణు యుద్ధానికి దారి తీయవచ్చనే భయాలు ఉన్నాయి.

రష్యా న్యూక్లియర్ ఫోర్స్ అలర్ట్‌గా ఉండాలని పుతిన్ ప్రకటించిన తర్వాత ఈ భయాలు మరింత ఎక్కువయ్యాయి.

నిజానికి అణ్వాయుధాలను వాడే ఉద్దేశం పుతిన్‌కు లేదని, ఒక సంకేతం పంపించడం కోసమే ఆయన అలా చెప్పారని విశ్లేషణలు కూడా వచ్చాయి.

యుక్రెయిన్‌ విషయంలో పశ్చిమ దేశాలు రష్యాతో నేరుగా తలపడితే అది ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు. అందుకే యుక్రెయిన్ గగనతలంపై నో ఫ్లై జోన్ ప్రకటించే అవకాశాలు చాలా తక్కువవే చెప్పుకోవాలి.

వీడియో క్యాప్షన్, భారత్‌కన్నా పాకిస్తాన్ దగ్గరే ఎక్కువ అణు బాంబులున్నాయా?

ఇది వరకు నో ఫ్లై జోన్‌కు ప్రకటించారా

1991లో మొదటి గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా, దాని మిత్ర దేశాలు ఇరాక్‌లో రెండు నో ఫ్లై జోన్‌లను ప్రకటించాయి. కొన్ని మతపరమైన గ్రూపులపై దాడులు చేయకుండా నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నాయి. ఐక్యరాజ్యసమితి మద్దతు లేకుండానే ఈ చర్య చేపట్టారు.

1992లో బాల్కాన్స్ సంక్షోభం సమయంలో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానం ఆమోదించింది. బోస్నియా గగనతలంలోకి అనధికార సైనిక విమానాలు ప్రవేశించడాన్ని నిషేధించింది.

2011లో లిబియాలో సైనిక జోక్యంలో భాగంగా నో ఫ్లై జోన్‌కు యూఎన్ భద్రతా మండలి ఆమోదం తెలిపింది.

బోస్నియా, లిబియాల నో ఫ్లై జోన్‌లోకి అనధికార సైనిక విమానాలు రాకుండా నాటో బలగాలు కాపలా కాస్తుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)