'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు.. థర్మోబారిక్ బాంబు అంటే ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ మీద దండెత్తిన రష్యా.. ఆ దేశంపై దాడికి థర్మోబారిక్ ఆయుధాలను ఉపయోగించాలని ప్రణాళిక రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిని వాక్యూమ్ బాంబులని కూడా పిలుస్తారు.
ఈ వ్యాక్యూమ్ బాంబులు.. ఇదే సైజులోని సంప్రదాయ బాంబులకన్నా ఎక్కువగా పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఈ బాంబుల పేలుడు పరిధిలో చిక్కుకున్నవారిపై భీకర ప్రభావం చూపుతాయి.
అందువల్ల రష్యా ఈ వ్యాక్యూమ్ బాంబులను ఉపయోగించాలని యోచిస్తోందనే వార్తలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
వాక్యూమ్ బాంబు ఎలా పనిచేస్తుంది?
వాక్యూమ్ బాంబును ఏరోసోల్ బాంబు, ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్‌ప్లోజివ్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఒక ఇంధన కంటైనర్, రెండు వేర్వేరు ఎక్స్‌ప్లోజివ్ చార్జ్‌లు ఉంటాయి.
ఈ బాంబును రాకెట్ తరహాలో ప్రయోగించవచ్చు. లేదంటే విమానం నుంచి బాంబు లాగా జారవిడవవచ్చు. ఇది తన లక్ష్యాన్ని తాకినపుడు మొదటి ఎక్స్‌ప్లోజివ్ చార్జ్.. ఇంధన కంటైనర్‌ను తెరిచి, అందులోని ఇంధన మిశ్రమాన్ని ఒక మేఘం తరహాలో వెదజిమ్ముతుంది.
లక్ష్యంగా చేసుకున్న భవనంలో తెరిచి ఉన్న ఖాళీల నుంచి ఈ మేఘం లోపలికి చొచ్చుకుపోగలదు. అలా చొచ్చుకుపోయిన మేఘాన్ని.. బాంబులోని రెండో చార్జ్ పేల్చివేస్తుంది. దీంతో భారీ అగ్నిగోళం, పెను విస్ఫోటనం సంభవించటంతో పాటు.. ఒక శూన్యం ఏర్పడి పరిసరాల్లోని ఆక్సిజన్ అంతటినీ పీల్చివేస్తుంది. అత్యంత దృఢంగా నిర్మించిన భవనాలను, పరికరాలను సైతం ఈ బాంబు ధ్వంసం చేస్తుంది. ఈ పేలుడులో మనుషులు చనిపోవటం, గాయపడటం జరుగుతుంది.
ఈ బాంబులను అనేక అవసరాలకు ఉపయోగిస్తారు. సైనికులు చేతితో విసిరే గ్రెనేడ్లు, చేతుల్లో నుంచి ప్రయోగించే రాకెట్ లాంచర్లు సహా వివిధ సైజుల్లో ఈ బాంబులు ఉంటాయి.

కొండ గుహలు, సొరంగాల్లో ఉన్న ప్రత్యర్థులను హతమార్చటానికి.. గగనతల దాడుల్లో ప్రయోగించే భారీ వాక్యూమ్ బాంబులను కూడా డిజైన్ చేశారు. అన్నివైపులా మూసివున్న లక్ష్యాలపై ఈ బాంబుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది.
రష్యా 2007లో తన అతిపెద్ద థెర్మోబారిక్ బాంబును పరీక్షించింది. దానికి 'అన్ని బాంబులకు బాబు' అని పేరుపెట్టుకున్నారు.
ఆ బాంబు.. 44 టన్నుల బరువుండే సంప్రదాయ బాంబుతో సమానమైన పేలుడును సృష్టించింది. దాంతో.. ప్రపంచంలోనే అణ్వస్త్రం కాని అతి పెద్ద బాంబుగా ఆ వాక్యూమ్ బాంబు రికార్డులకెక్కింది.
ఈ బాంబుల విధ్వంసకర ప్రభావం, బంకర్లు, బలమైన భవనాల్లో దాక్కున్న ప్రత్యర్థులను సైతం మట్టికరిపించే సామర్థ్యం రీత్యా.. ఈ వాక్యూమ్ బాంబులను ప్రధానంగా పట్టణ, నగర ప్రాంతాల్లోనే వినియోగిస్తున్నారు.
యుక్రెయిన్ మీద దండెత్తిన రష్యా బలగాలు.. రాజధాని కీయెవ్ సహా ఇతర ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న పరిణామాల్లో.. వాక్యూమ్ బాంబు వినియోగం వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
యుక్రెయిన్‌లో ఈ బాంబులను ఉపయోగిస్తున్నారా?
రష్యా తన దండయాత్రలో ఒక వాక్యూమ్ బాంబును ఉపయోగించిందని అమెరికాలో యుక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కారోవా ఆరోపించారు.
అయితే.. ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు.
యుక్రెయిన్‌లో గత కొన్ని రోజులుగా ధర్మోబారిక్ రాకెట్ లాంచర్లను ప్రయోగిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
వాక్యూమ్ బాంబు వినియోగంపై నిబంధనలేమిటి?
ఈ బాంబుల వినియోగాన్ని నిర్దిష్టంగా నిషేధిస్తూ అంతర్జాతీయ చట్టాలేవీ లేవు. కానీ.. సాధారణ ప్రజలు నివసించే ఇళ్లు, స్కూళ్లు, ఆస్పత్రుల మీద ఈ బాంబులను ఉపయోగిస్తే.. అలా ఉపయోగించిన వారిని.. 1899, 1907 హేగ్ కన్వెన్షన్ల ప్రకారం యుద్ధ నేరాల కింద దోషులుగా నిర్ధారించవచ్చు.
యుక్రెయిన్‌లో యుద్ధ నేరాలు జరిగాయేమోననే విషయాన్ని తమ కోర్టు దర్యాప్తు చేస్తుందని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ చెప్పారు.
ఈ బాంబులను గతంలో ఎక్కడైనా వాడారా?
థర్మోబారిక్ బాంబులను మొట్టమొదటి సారిగా.. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఉపయోగించింది. ఆ తర్వాత.. 1960లలో వియత్నాం మీద యుద్ధంలో అమెరికా ఈ బాంబులను ఉపయోగించింది.
అమెరికా 2001లో అఫ్గానిస్తాన్ మీద యుద్ధంలో.. తోరా బోరా పర్వత గుహల్లో దాక్కున్న అల్-ఖైదా బలగాలను ధ్వంసం చేయటానికి కూడా ఈ వాక్యూమ్ బాంబులను వాడింది.
రష్యా 1999లో చెచెన్యాతో యుద్ధంలో ఈ బాంబులను వాడినపుడు.. హ్యూమన్ రైట్స్ వాచ్ ఆ దేశాన్ని ఖండించింది.
సిరియా అంతర్యుద్ధంలో బషర్ అల్-అసద్ ప్రభుత్వం కూడా రష్యా తయారీ వాక్యూమ్ బాంబులను ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:
- నవీన్ శేఖరప్ప: ‘ఆహారం కోసం బంకర్ నుంచి బయటకు వెళ్లాడు.. డబ్బులు కావాలని ఫోన్ చేశాడు.. ఆ తర్వాత’
- వోడ్కా బ్యాన్: యుక్రెయిన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. అమెరికా, కెనడాల్లో మద్యం దుకాణాల నుంచి రష్యా వోడ్కా తొలగింపు
- పాశ్యాత్య దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా ఇబ్బందులు పడుతుందా? వాటి ప్రభావం ఎంత?
- యుక్రెయిన్‌లో ‘నాజీ పాలన’ అంతం, నిస్సైనికీకరణే లక్ష్యమని పుతిన్ ఎందుకన్నారు
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











