యుక్రెయిన్: నాటో అంటే ఏమిటి? రష్యా దానిని ఎందుకు నమ్మట్లేదు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో కూడిన నాటో కూటమి.. సైనిక సన్నద్ధతను, యుక్రెయిన్‌కు సాయాన్ని పెంచుతోంది.
నాటో ఏమిటి?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ – నాటో.
ఈ కూటమి సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశంపైన అయినా సాయుధ దాడి జరిగినట్లయితే.. ఆ దేశానికి మిగతా దేశాలన్నీ సహాయంగా రావాలన్నది ఈ కూటమి ఒప్పందం.
దీని లక్ష్యం వాస్తవంగా.. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకోవటం.
నాటో ఏర్పాటుకు ప్రతిస్పందనగా సోవియట్ రష్యా 1955లో తూర్పు యూరప్ కమ్యూనిస్టు దేశాలతో వార్సా ఒప్పందం చేసుకోవటం ద్వారా తన సొంత సైనిక కూటమిని ఏర్పాటు చేసింది.
1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలటంతో.. వార్సా ఒప్పందం సభ్య దేశాలు చాలా వరకూ నాటో సభ్య దేశాలయ్యాయి. ఇప్పుడు నాటో సభ్య దేశాల సంఖ్య 30కి పెరిగింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నాటో, యుక్రెయిన్‌తో రష్యా ప్రస్తుత సమస్య ఏమిటి?
ఒకవైపు ప్రస్తుత రష్యా, మరోవైపు యూరోపియన్ యూనియన్ సరిహద్దులుగా ఉన్న యుక్రెయిన్.. గతంలో సోవియట్ రిపబ్లిక్‌గా ఉండేది.
ఇది నాటో సభ్య దేశం కాదు కానీ ‘భాగస్వామ్య దేశం’గా ఉంది. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ దేశానికి నాటో సభ్యత్వం ఇవ్వవచ్చుననే అవగాహన కుదిరింది.
ఇది ఎన్నటికీ జరగదని శక్తిమంతమైన పశ్చిమ దేశాలు హామీలు ఇవ్వాలని రష్యా కోరుతోంది.
కానీ నాటో నుంచి యుక్రెయిన్‌ను నిషేధించటానికి అమెరికా తిరస్కరిస్తోంది. ఒక స్వతంత్ర దేశంగా తన రక్షణ పొత్తుల గురించి తానే నిర్ణయించుకునే స్వేచ్ఛ యుక్రెయిన్‌కు ఉండాలని అంటోంది.
యు క్రెయిన్‌లో రష్యా సంతతి జనాభా పెద్ద సంఖ్యలో ఉంది. రష్యాతో సన్నిహిత సామాజిక, సాంస్కృతిక సంబంధాలూ ఉన్నాయి. వ్యూహాత్మకంగా చూసినపుడు.. యు క్రెయిన్‌ను రష్యా తన ఇంటి వెనుక దొడ్డిగా పరిగణిస్తుంది.
రష్యా ఆందోళనలు ఇంకా ఏమున్నాయి?
రష్యాను చుట్టుముట్టటానికి పశ్చిమ శక్తులు నాటో కూటమిని వాడుకుంటున్నాయని పుతిన్ వాదిస్తున్నారు. తూర్పు యూరప్‌లో నాటో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఆయన కోరుతున్నారు.
నాటో తూర్పు దిశగా విస్తరించబోదంటూ అమెరికా 1990లో స్వయంగా ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని పుతిన్ చాలా కాలంగా వాదిస్తున్నారు.
రష్యా వాదనను నాటో తిరస్కరిస్తోంది. తన సభ్య దేశాల్లో అతి కొద్ది దేశాలకు మాత్రమే రష్యాతో సరిహద్దులు ఉన్నాయని, అసలు తమది స్వీయ రక్షణ కోసం ఏర్పాటైన కూటమి అని వాదిస్తోంది.
యు క్రెయిన్ సరిహద్దు వెంట రష్యా బలగాలను మోహరించటం.. భద్రత విషయంలో రష్యా చేస్తున్న డిమాండ్లను పశ్చిమ ప్రపంచం సీరియస్‌గా పట్టించుకునేలా ఒత్తిడి చేసే ఎత్తుగడగా చాలా మంది భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, ANADOLU VIA GETTY
రష్యా, యుక్రెయిన్‌ల విషయంలో నాటో గతంలో ఏం చేసింది?
యుక్రెయిన్ ప్రజలు 2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న తమ అధ్యక్షుడిని గద్దె దించినపుడు.. యుక్రెయిన్ తూర్పు భాగంలోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా తనలో కలిపేసుకుంది. తూర్పు యుక్రెయిన్‌లో చాలా భాగాన్ని ఆక్రమించుకున్న రష్యా అనుకూల వేర్పాటువాదులకు కూడా మద్దతిచ్చింది.
నాటో జోక్యం చేసుకోలేదు కానీ దీనికి ప్రతిస్పందనగా తొలిసారిగా పలు తూర్పు యూరప్ దేశాల్లో సైనిక బలగాలను మోహరించింది.
ఎస్టోనియా, లాత్వియా, లితువేనియా, పోలండ్‌లలో నాలుగు బెటాలియన్ల బహుళజాతి సైన్యాలను మోహరించిన నాటో.. రొమేనియాలో ఒక బ్రిగేడ్‌ను మోహరించింది.
నాటో సభ్య దేశాల సరిహద్దులను ఉల్లంఘించే రష్యా విమానాలను అడ్డుకోవటానికి.. గగనతలంలో తన పోలీస్ గస్తీని బాల్టిక్ దేశాలకు, తూర్పు యూరప్‌కు విస్తరించింది.
ఈ సైనిక బలగాలను ఆయా దేశాల నుంచి ఉపసంహరించాలని రష్యా డిమాండ్ చేస్తోంది.

యుక్రెయిన్‌కు నాటో ఇచ్చిన హామీలేమిటి?
యుక్రెయిన్ మీద దండెత్తితే రష్యా ‘‘తీవ్ర మూల్యం’’ చెల్లిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.
అమెరికా 8,500 మంది సైన్యాన్ని యుద్ధానికి సన్నద్ధంగా ఉంచింది. రాపిడ్-యాక్షన్ ఫోర్స్‌ను క్రియాశీలం చేయాలని నాటో నిర్ణయించినపుడు మాత్రమే వీరిని రంగంలోకి దింపుతామని పెంటగాన్ చెప్తోంది.
ఈ సైన్యాన్ని యుక్రెయిన్‌లో మోహరించే ప్రణాళికేదీ లేదని కూడా పెంటగాన్ పేర్కొంది.
సైనిక పరమైన ఉద్రిక్తతలు మరింతగా ముదిరితే రష్యా ఆర్థికంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుందని జర్మనీ విదేశాంగ మంత్రి అనాలీనా బేర్బాక్ హెచ్చరించారు.
‘‘మిత్రపక్షాలు అనూహ్యమైన ఆంక్షలు విధించటంతో పాటు.. వేగంగా తిప్పికొట్టేలా ప్రతిస్పందించాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం వ్యాఖ్యానించింది.
యుక్రెయిన్ విషయంలో నాటో ఐక్యంగా ఉందా?
యుక్రెయిన్ విషయంలో యూరోపియన్ నాయకత్వంతో పూర్తి ఏకగ్రీవం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అయితే వేర్వేరు దేశాలు ప్రకటించిన మద్దతులో తేడాలున్నాయి.
జావలిన్ యాంటీ-ట్యాంక్ మిసైళ్లు, స్టింగర్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిసైళ్లు సహా 20 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను యుక్రెయిన్‌కు పంపిస్తున్నట్లు అమెరికా చెప్తోంది. నాటో ఇతర సభ్య దేశాలు తమవద్ద ఉన్న అమెరికా తయారీ ఆయుధాలను యుక్రెయిన్‌కు పంపించేందుకు అనుమతిచ్చింది.
బ్రిటన్ కూడా షార్ట్-రేంజ్ యాంటీ-ట్యాంక్ మిసైళ్లను యుక్రెయిన్‌కు సరఫరా చేస్తోంది. వాటిని ఎలా ఉపయోగించాలో యుక్రెయిన్ సైన్యానికి శిక్షణనివ్వటానికి తమ సైనిక సిబ్బందిని కూడా పంపించింది.
డెన్మార్క్, స్పెయిన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ సహా కొన్ని నాటో సభ్యదేశాలు.. యుద్ధ విమానాలు, యుద్ధనౌకలను తూర్పు యూరప్‌లో రక్షణను బలోపేతం చేయటానికి పంపిస్తున్నాయి.
అయితే.. సంఘర్షణలు జరుగుతన్న ప్రాంతాలకు ప్రాణాంతక ఆయుధాలను పంపించరాదనేది జర్మనీ విధానం. దీనికి అనుగుణంగానే.. ఆయుధాలు పంపించాలన్న యుక్రెయిన్ విజ్ఞప్తిని జర్మనీ తిరస్కరించింది. ఆయుధాలకు బదులుగా.. వైద్య సాయం, 5,000 హెల్మెట్లను జర్మనీ పంపిస్తోంది.
ఇదిలావుంటే.. ఉద్రిక్తతలు తగ్గించటానికి రష్యాతో చర్చలు జరపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పిలుపునిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భయంకరమైన హైవే జర్నీ.. విజయంతంగా డ్రైవింగ్ పూర్తి చేస్తే సర్టిఫికెట్ కూడా ఇస్తారు
- పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే నాలుగు తప్పులు
- యుక్రెయిన్ సంక్షోభం: ‘యుద్ధానికి ముందు, ఇప్పుడు నా ఊరికి పోలికే లేదు’
- పుతిన్ జీవితంలో ఆ ఒక్క సంఘటన నాటోకు విరోధిగా ఎలా మార్చేసిందంటే..
- రష్యా, యుక్రెయిన్: ‘పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది.. ఏదో జరగొచ్చని అనిపిస్తోంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















