ఉక్రెయిన్: హైహీల్స్‌తో మహిళా సైనికుల కవాతు, వెల్లువెత్తుతున్న ఆగ్రహం

హైహీల్స్ వేసుకుని కవాతు

ఫొటో సోర్స్, UKRAINE DEFENCE MINISTRY

ఉక్రెయిన్ మిలటరీలో పనిచేసే మహిళా సైనికుల విషయంలో తీసుకున్న ఓ నిర్ణయం వివాదంగా మారింది.

వచ్చే నెలలో నిర్వహించబోయే ఓ పరేడ్‌లో మహిళా సైనికులు సాధారణ బూట్లకు బదులు హైహీల్స్ వేసుకుని మార్చ్ చేయాలన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇలాంటి ఆలోచన సమానత్వాన్ని చాటదని, అది సెక్సిజమ్ అని ఉక్రెయిన్ పార్లమెంటులో విపక్ష సభ్యురాలు ఇర్యానా గెరాస్చెంకో అన్నారు.

సోవియట్ యూనియన్ పతనం తరువాత కొత్తదేశంగా ఏర్పడిన ఉక్రెయిన్ ఆగస్ట్ 24న తన 30వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది.

ఆ సందర్భంగా జరిపే పరేడ్‌లో మహిళా సైనికులు హైహీల్స్ వేసుకుని కవాతు చేసేలా ప్రణాళికలు రూపొందించింది.

ఈ నిర్ణయంపై ఉక్రెయిన్‌లో చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి ఆండ్రియా తరాన్ క్షమాపణలు చెప్పాలని చట్టసభల సభ్యులు కొందరు కోరారు.

కొందరు అధికారులు మధ్యయుగాల నాటి ఆలోచనా ధోరణులతో ఉన్నారని.. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉక్రెయిన్ విశ్లేషకుడు విటాలీ పోట్నికోవ్ ఫేస్‌బుక్ వేదికగా వ్యాఖ్యానించారు.

మిలటరీ దుస్తులలో ఉన్న కొందరు మహిళలు నల్లని హైహీల్స్ వేసుకుని పరేడ్ రిహార్సల్స్ చేస్తున్న చిత్రాలు చూసి తాను తొలుత అదంతా నిజం కాదని అనుకున్నానని గెరాస్చెంకో అన్నారు.

''ఇది సెక్సిజం తప్ప ఇంకేమీ కాదు. మహిళలకు అనుకూలంగా ఉండేలాంటి బాడీ ఆర్మర్స్ తయారు చేయడం కంటే హైహీల్స్ ధరించడాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యాంశంగా ఎందుకు భావించిందో నాకు అర్థం కావడం లేదు'' అన్నారామె.

కవాతు అంటే అది సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించేలా ఉండాలి.. కానీ, ఇది అక్కడున్న సీనియర్ అధికారులను ఆకట్టుకునే కార్యక్రమంలా అనిపిస్తోందని ఆర్మీ మాజీ అధికారిణి మారియా బెర్లింస్కా అన్నారు.

ప్రస్తుతం ఉక్రెయిన్ సాయుధ దళాలలో 31,000 మందికి పైగా మహిళలు పని చేస్తున్నారు, వారిలో 4,000 మందికి పైగా ఆఫీసర్ ర్యాంకులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)