మహా శివరాత్రి: పురుషాంగం ఆకారంలో విగ్రహం.. తిరుపతి సమీపంలో అరుదైన శివాలయం

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
క్రీస్తుకు పూర్వమే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాచీన ఆలయంలో లింగాకారానికి పూజలు చేయడం విశేషంగా చెప్పవచ్చు.
పురుషాంగం ఆకారంలో ఉండే విగ్రహాన్ని శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు కొలుస్తున్నారు.
ప్రస్తుతం భారత ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో పరిమితుల మేరకు అభిషేకాలు, పూజాదికాలు సాగుతున్నాయి.

ఫొటో సోర్స్, RAJESH
తిరుపతికి సమీపంలోని ఏర్పేడు మండలంలో ఉన్న గుడిమల్లం ఆలయ విశిష్టత గురించి ప్రాచీన శాసనాల్లోనూ పలు ఆధారాలు లభిస్తున్నాయి.
గర్భగుడిలో రుద్రుడి రూపం, చేతిలో మేక తలకాయతో ఉన్న లింగాకార విగ్రహం చిత్తూరు జిల్లా గుడిమల్లంలో పూజలందుకుంటోంది. శైవ ఆచారాల ప్రకారం ఇలాంటి మానవరూప శివాలయాలు అరుదుగా కనిపిస్తాయి.
అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని హేమావతి గ్రామంలోనూ ఇలాంటి మానవ లింగాకార విగ్రహం ఉంటుంది.

పురుషాంగాన్ని పోలిన విగ్రహం
గుడిమల్లం ఆలయంలో విగ్రహం పురుషుడి అంగాన్ని పోలి ఉంటుంది. ఏడు అడుగుడుల ఎత్తున ఉండే శిల్పంపై తలపాగ, ధోవతి ధరించిన రూపం రుద్రునిదిగా భావిస్తారు.
లింగాకారం ముందు ఒక చేత్తో మేక తలను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుడి రూపం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.
విగ్రహంపై ఉన్న వస్త్రధారణ రుగ్వేద కాలంనాటిదని కొందరు భావిస్తారు. అయితే సింధూ నాగరికతను తలపించేలా లింగాకారం ఉంటుందని గుడిమల్లం ఆలయ కార్యనిర్వహణాధికారి కె.రామచంద్ర రెడ్డి అన్నారు.
"ప్రాచీన కాలంలో స్త్రీని కొలిచే ఆచారం ఉండేది. అప్పట్లో మాతృస్వామ్య వ్యవస్థకు మూలంగా ఉన్న మహిళలకు ఆ గౌరవం దక్కింది. అప్పట్లో యోని రూపాన్ని ఆరాధించినట్టు చెబుతారు.
ఆ తర్వాత స్త్రీలపై పురుషుడి ఆధిపత్యం మొదలు కావడంతో దానికి సూచికగా లింగాకారాన్ని పూజించడం మొదలయ్యింది. గుడిమల్లం ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. చాలాకాలం నుంచి ఇక్కడ లింగాకారం పూజలు అందుకుంటోంది." అంటూ వివరించారు రామచంద్రా రెడ్డి.

క్రీస్తుపూర్వంనాటి ఆలయం
గుడిమల్లంలోని ఈ ఆలయాన్ని పరశురామేశ్వర ఆలయంగా చెబుతున్నారు. దానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 2 లేదా 3 శతాబ్దాల నాడే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని పురావస్తుశాఖ అంచనా వేస్తోంది.
ఒకప్పుడు ఈ గుడి పల్లపు ప్రాంతంలో ఉండడం వల్ల గుడిపల్లం అనే పేరు వచ్చిందని, క్రమేణా అది గుడిమల్లంగా మారిందని "రాయలసీమ ప్రసిద్ధ ఆలయాలు'' పుస్తకంలో ఈఎల్ఎన్ చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.
సువర్ణముఖీ నదికి సమీపంలో గుడిమల్లం ఆలయం ఉంది. రానురాను నదీ ప్రవాహం తగ్గడంతో గుడి, నదీ మధ్య దూరం పెరిగినట్టు చెబుతున్నారు.
అప్పట్లో వరదల సమయంలో నదీ ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని తాకేదని, ఇప్పటికీ జలాలు ఉధృతంగా ఉన్నప్పుడు లింగాన్ని తాకే ఏర్పాటు చెక్కు చెదరలేదని చెబుతున్నారు.
2004లో ఆలయంలోని విగ్రహాన్ని నదీ జలాలు తాకినట్లు స్థానికులు కొందరు బీబీసీకి తెలిపారు.
గుడిమల్లం ఆలయం ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి కట్టడంగా పురావస్తు శాఖ చెబుతోంది. అయితే మౌర్యుల కాలపు శైలి ఈ విగ్రహంలో కనిపిస్తోందని ప్రముఖ చరిత్రకారుడు, గుడిమల్లం విశిష్టతపై పుస్తకం రచించిన ఈమని శివనాగి రెడ్డి బీబీసీకి తెలిపారు.
"వెనుక లింగాకారం, ముందు యక్షుడి రూపాన్ని పోలిన రుద్రుడు, చేతిలో మేకపిల్ల ఉండడమే కాకుండా, దాని చుట్టూ రాతి కంచె నిర్మాణం కూడా కనిపిస్తుంది. ఇదంతా మౌర్యుల కాలం నాటి కట్టడి రీతిని చెప్పాలి. శాతవాహనుల కాలంనాటి ఇటుక బేస్‌మెంట్ కనిపిస్తుంది. నలుపు, ఎరుపు రంగులలో ఉండే విగ్రహం అత్యంత ప్రాచీనమైనదిగా స్పష్టమవుతోంది'' అని శివనాగిరెడ్డి అన్నారు.

విస్తృత పరిశోధనలు
ఇక్కడి కట్టడాలు, విగ్రహాలపై సుదీర్ఘ పరిశోధనలు జరిగాయి. ఇక్కడ లభించిన ఆధారాల సహాయంతో అనేకమంది ఈ ఆలయ కాల నిర్ణయం, విశిష్టతలను నిర్ధరించే ప్రయత్నం చేశారు.
1911లో గోపీనాథరావు అనే పురాతత్వశాస్త్రవేత్త సంవత్సరంపాటు ఈ ఆలయంపై పరిశోధన చేసినట్టు ఆధారాలున్నాయి.
1908నాటి బ్రిటిష్ గెజిట్లలో ఇక్కడి కట్టడాలకు సంబంధించిన వివరాలను నమోదు చేశారు. చోళుల తర్వాత పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో ఈ ఆలయంలో కార్యకలాపాలు సాగేవని చరిత్రకారుల పుస్తకాల్లో రాశారు.
ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ లభించిందని, మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఒకటి ఉందని 'పరమేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం' 'డెవలప్‌మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్' అనే పుస్తకాల్లో ఇంగువ కార్తికేయ శర్మ పేర్కొన్నారు.
ఆనంద కుమారస్వామి, జితేంద్రనాథ్ బెనర్జీ వంటి అంతర్జాతీయ పురాతత్వవేత్తలు, శాస్త్రవేత్తలు కూడా శిల్ప చరిత్రలోనే అరుదైన ఈ శివలింగాన్ని తమ రచనల్లో ప్రస్తావించారు.
తవ్వకాల్లో లభించిన శాసనాలనుబట్టి ప్రస్తుతం కనిపిస్తున్న గోపురం 12వ శతాబ్దంలో విక్రమచోళుడి కాలంలో పునర్నిర్మితమైందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
సుదీర్ఘ చరిత్ర కలిగిన కట్టడం కావడంతో వారసత్వ సంపదగా పరిరక్షించేందుకు 1954 నుంచి ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి పూజాదికాలపై ఆంక్షలు పెట్టారు.

పరిమితులతో అనుమతి
పురావస్తుశాఖ పరిధిలో ఉన్నందున ఇక్కడ పూజలు చేయడానికి అనుమతి లేకపోవడంతో ఆలయ వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి.
పలు ప్రయత్నాల తర్వాత 2009 నుంచి కొన్ని నిబంధనలతో పూజా కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది భారత పురావస్తు శాఖ. నాటి నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ సాగుతోంది.
"చాలాకాలం గుడిలోకి ఎవరికీ అనుమతి లేదు. ఆ సమయంలో చంద్రగిరి కోటలో ఏర్పాటు చేసిన నమూనా విగ్రహాన్ని అంతా సందర్శించేవారు. మళ్లీ పూజలకు అనుమతించిన తర్వాత కట్టడానికి ఎటువంటి సమస్య రాకుండా పరిమితుల మేరకు అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి." అని ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ నరసింహులు బీబీసీతో అన్నారు.

అభివృద్ధి ప్రయత్నాలు
తిరుపతికి సమీపంలోనే ఉన్నప్పటికీ గుడిమల్లం ప్రాశస్త్యం పెద్దగా ప్రచారానికి నోచుకోలేదనే వాదనలున్నాయి. భారతదేశ వ్యాప్తంగా శైవక్షేత్రాలు ఒకనాడు విస్తృతంగా విలసిల్లిన కాలం ఉంది.
అందులో పలు ఆలయాలు ఇప్పటికీ ప్రాశస్త్యం పొందుతున్నా గుడిమల్లం వంటి ఆలయాలు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా మిగిలిపోతున్నాయి.
తగిన సదుపాయాలు, ప్రచారం లేకపోవడం ప్రధాన కారణాలని గుడిమల్లం కార్యనిర్వహణాధికారి కె. రామచంద్రారెడ్డి అంటున్నారు. ప్రస్తుతం వాటిపై శ్రద్ధ పెట్టి సదుపాయాలు మెరుగుపరిచే ప్రయత్నంలో ఉన్నామన్నారు.
యూపీఏ ప్రభుత్వ హయంలో నాటి కేంద్ర మంత్రి అంబికా సోనీ ఇక్కడికి వచ్చారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కానీ అవి పూర్తిగా ఆచరణలోకి రాలేదని స్థానికులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









