పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు

ఫ్రాన్సిస్కో వెరా

ఫొటో సోర్స్, FRANCISCO VERA

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్సిస్కో వెరా

కోవిడ్-19 మహమ్మారి సమయంలో పిల్లలకు ఉత్తమమైన విద్యావకాశాలు కల్పించాలని పిలుపునిచ్చినందుకు గాను కొలంబియాకు చెందిన పదకొండేళ్ల ఫ్రాన్సిస్కో వెరా సోషల్ మీడియాలో ప్రాణహాని బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.

పదకొండేళ్ల ఫ్రాన్సిస్కో తాను పర్యావరణం, బాలల హక్కుల కోసం నిర్వహించిన ఉద్యమాలతో కొలంబియాలో పేరు తెచ్చుకున్నారు.

ఈ బాలుడు చేసిన ఉద్యమాలను ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది.

ఈ బాలుడు ఆన్‌లైన్‌ లో విద్యనభ్యసిస్తున్న చిన్నారుల కోసం ఇంటర్నెట్ సౌకర్యాలను పెంచాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఒక వీడియో పోస్టు చేశారు.

ఈ వీడియో పోస్టు చేసిన వెంటనే జనవరి 15న ఒక అపరిచిత ట్విటర్ అకౌంట్ నుంచి ఈ బాలుడి ప్రాణానికి హాని తలపెడతామంటూ బెదిరింపు వచ్చింది.

దక్షిణ అమెరికాలో అందరికీ ఆదర్శంగా ఉండే పనులు చేసినందుకు గాను ఈ బాలుడిని అభినందిస్తూ ఐక్యరాజ్యసమితి ఒక లేఖను కూడా స్వయంగా అందచేసింది.

కానీ, పర్యావరణ ఉద్యమకారులను హతమార్చడం ఈ దేశంలో అసాధారణమైన విషయమేమి కాదు.

ఐరాస నుంచి అభినందన పత్రం

ఫొటో సోర్స్, DIANA LOSADA

ఈ బాలుడు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విమర్శలను తాను స్వీకరిస్తానని, కానీ ఇలాంటి హింసాత్మక బెదిరింపులు మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

కొలొంబియాలో మానవ హక్కుల ఉద్యమకారులు, పర్యావరణ పరిరక్షణ నాయకులపై దాడులు పెరుగుతున్నాయి.

ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో సంస్కారవంతంగా ప్రవర్తించవలసిన అవసరం గురించి చాలా మంది పిలుపునిచ్చారు.

కొలంబియాలో ఇలాంటి బెదిరింపులు చాలా సాధారణమేనని.. బెదిరింపులకు పాల్పడేవారు ఎలాంటి శిక్షా లేకుండానే తప్పించుకుంటూ ఉంటారని, సామాజిక కార్యకర్తలపై జరుగుతున్న దాడులను డాక్యుమెంట్ చేస్తున్న సంస్థ సోమోస్ ఢిఫెంసోర్స్ కి చెందిన లూర్డెస్ కాస్ట్రో చెప్పారు.

"కానీ ఒక 11 ఏళ్ల బాలుడిని బెదిరించడం మాత్రం మనుషుల్లో పెరిగిన అసహన స్థాయిలతో పాటు వాక్‌స్వాతంత్ర్యం లేకపోవడాన్ని తెలియజేస్తోంద’’ని అన్నారు.

ఐక్యరాజ్య సమితి ఫ్రాన్సిస్కోకి ఇచ్చిన లేఖపై యూఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ మిషెల్ బేచ్లెట్ సంతకం చేశారు.

ఆ లేఖలో ఫ్రాన్సిస్కో ఉద్యమ స్ఫూర్తికి ధన్యవాదాలు తెలిపారు. ఈ భూమిని కాపాడేందుకు ఈ ప్రపంచానికి స్పూర్తితో నిండిన మరింత మంది యువత అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు.

"ప్రపంచంలో పిల్లలందరికీ మెరుగైన ఇంటర్నెట్ అందాల్సిన అవసరం ఉందని అంగీకరిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి లేఖలో రాశారు.

ఈ లేఖను ఐరాస ప్రతినిధి స్వయంగా ఫ్రాన్సిస్కోని కలిసి అందజేశారు.

ఈ గుర్తింపు రావడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ ఏడాది కూడా తన సహచరులతో కలిసి మరిన్ని పర్యావరణ ప్రాజెక్టులు చేయాలని ఆశిస్తున్నానని ఫ్రాన్సిస్కో చెప్పారు.

కొలంబియాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ప్రచారం కూడా చేపట్టనున్నట్లు చెప్పారు.

"విమర్శలు జీవితంలో ఒక భాగం. అవి నిర్మాణాత్మకంగా, మర్యాదపూర్వకంగా ఉన్నంతవరకు వాటిని నేను స్వాగతిస్తాను. కానీ, నిందలు, బెదిరింపులకు మాత్రం చోటు లేదు" అని ఫ్రాన్సిస్కో బీబీసీతో అన్నారు.

ఫ్రాన్సిస్కో వెరా

ఫొటో సోర్స్, ANA MARIA MANZANARES

ఫ్రాన్సిస్కో ఆరేళ్ల వయసు నుంచి ఉద్యమకారునిగా పని చేయడం మొదలుపెట్టారు. బుల్ ఫైటింగ్ కి వ్యతిరేకంగా అతని కుటుంబంతో కలిసి నిరసనల్లో పాల్గొనడంతో అతని ఉద్యమ జీవితం మొదలలైంది.

ప్రకృతి పై తనకున్నప్రేమ సహజ వనరులున్న ప్రాంతాలలో మైనింగ్ చేయడం లాంటి వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి దారి తీసిందని ఫ్రాన్సిస్కో వివరించారు.

"నేను కొండల్లో బాతులు, కోళ్లు, మేకలు, పక్షులతో కలిసి పెరిగాను. అదే నేను జంతు హక్కుల పరిరక్షణ కోసం పని చేసేందుకు స్ఫూర్తినిచ్చింది" అని అన్నారు. ఆ తర్వాత పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారునిగా మారేందుకు దారి తీసిందని అన్నారు.

ఫ్రాన్సిస్కో వెరా

ఫొటో సోర్స్, ANA MARIA MANZANARES

ఫ్రాన్సిస్కో 2019లో అతని సొంతూరు విల్లెటలో గార్డియన్స్ ఆఫ్ లైఫ్ అనే పర్యావరణ గ్రూపును ప్రారంభించారు.

ఇది కొలంబియా రాజధాని బొగొటాకి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దీనిని మరో ఆరుగురు స్కూలులోని స్నేహితులతో కలిసి మొదలుపెట్టారు. వీరంతా కలిసి స్కూలు నుంచి మొదలుపెట్టి నగరం నడిబొడ్డు వరకు నడుచుకుంటూ వెళ్లి దారిలో దొరికిన చెత్తనంతా ఏరుకుంటూ, పర్యావరణ మార్పుల గురించి నినాదాలు చేసుకుంటూ వెళ్లి ఈ గ్రూపును ప్రారంభించారు.

ఇప్పుడు ఈ గ్రూపులో కొలంబియాలోని 11 ప్రావిన్సుల నుంచి మాత్రమే కాకుండా మెక్సికో, అర్జెంటీనాల నుంచి కూడా కలిపి 200 మందికి పైగా సభ్యులున్నారు. ఫ్రాన్సిస్కో ప్రముఖ బాల పర్యావరణ ఉద్యమకర్త గ్రెటాకు చెందిన ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూమెంట్ సంస్థలో కూడా సభ్యునిగా ఉన్నారు.

ప్రపంచంలోని అతి పెద్ద అంశాలైన పర్యావరణ మార్పులు, ఆర్థిక విధానాల గురించి పిల్లలకు కూడా మాట్లాడే అధికారం ఉండాలని ఫ్రాన్సిస్కో చెప్పారు.

"మేము భవిష్యత్తు మాత్రమే కాదు. ఇప్పటికే పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం మాపై పడుతోంది" అని అన్నారు.

ట్విటర్‌లో తమ కొడుకుని చంపుతామంటూ వచ్చిన బెదిరింపు ఒక క్రూరమైన హాస్యంగా మాత్రమే మిగిలిపోవాలని ఆశిస్తున్నానని ఫ్రాన్సిస్కో తల్లి ఆన మరియా మాంజనేర్స్ చెప్పారు.

తమకు మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ అధికారులు మాట్లాడారని.. ఈ సందేశం పంపిన వారి గురించి విచారణ చేస్తున్నట్లు తెలిపారని ఆమె చెప్పారు.

"ఇది చాలా కష్టమైన పరిస్థితి" అని మాంజనేర్స్ అన్నారు. "కానీ మా అబ్బాయి బెదిరింపులను పక్కన పెట్టి తనకు నచ్చిన విషయాల పై దృష్టి పెడతాడనే నమ్మకం ఉంది" అని అన్నారు.

ఫ్రాన్సిస్కోని బెదిరించిన దుండగులను పట్టుకుంటామని కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డుక్ హామీ ఇచ్చారు. దీని పై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

గత సంవత్సరం కొలంబియాలో 53 మంది మానవ హక్కుల కార్యకర్తలను చంపేశారని ఐక్య రాజ్య సమితి లెక్కలు చెబుతున్నాయి

2019లో కొలంబియాలో 64 మంది పర్యావరణ ఉద్యమకారులను హత్య చేసినట్లు గ్లోబల్ విట్‌నెస్ అనే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తెలిపింది.

కొలంబియా పర్యావరణ పరిరక్షకులకు ప్రమాదకరమైన దేశంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)