వూహాన్‌లో కోవిడ్-19 విజృంభణకు ఏడాది: కరోనావైరస్‌పై చైనా విజయం సాధించిందా? లేక నిజాలను దాచిపెడుతోందా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జాన్ సుడ్‌వర్త్
- హోదా, బీబీసీ ప్రతినిధి, వూహాన్
చైనా నగరం వూహాన్‌లో కరోనావైరస్ మహమ్మారి చెలరేగి ఏడాది పూర్తైంది. ఇక్కడ కోవిడ్-19ను విపత్తులా కాకుండా విపత్తుపై విజయంలా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. అంతేకాదు వేరేచోట నుంచే ఇక్కడకు వైరస్ వచ్చిందని చెబుతున్నారు.
కొత్త కరోనావైరస్‌లపై పరిశోధన చేస్తున్న వూహాన్‌లోని ఓ ల్యాబొరేటరీ నుంచి ఈ వైరస్ పుట్టిందని మొదట్లో వార్తలు వచ్చాయి. గబ్బిలాల్లోని కరోనావైరస్‌పై పరిశోధన చేపడుతున్న అధ్యయనకర్తల బృందానికి నేతృత్వం వహిస్తున్న వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) పరిశోధకురాలు షీ ఝెన్‌గ్లీ ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యారు.
డబ్ల్యూఐవీ ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు ఈ వైరస్ బయటకు వచ్చిందన్న వాదనను ఆమె ఏడాది కాలంగా ఖండిస్తూ వస్తున్నారు.
వూహాన్‌లో కరోనావైరస్ వ్యాప్తి ఎలా మొదలై ఉండొచ్చనే వాదనపై ఆమె ఇటీవల తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సైన్స్ మ్యాగజైన్ తాజా ఎడిషన్‌కు ఆమె ఒక ఆర్టికల్ రాశారు. వుహాన్‌లో వైరస్ విజృంభణ మొదలుకాకముందే, డిసెంబరు 2019కు ముందే, చైనాకు వెలుపల ఈ వైరస్ జాడలు కనిపించాయని చెబుతున్న అధ్యయనాలను ఆమె దీనిలో ఉటంకించారు.
‘‘దిగుమతి చేసుకున్న ఫుడ్ ప్యాకేజీలు, సరిగా వండని ఆహార పదార్థాలు సార్స్‌సీఓవీ-2 వైరస్ విజృంభణకు కారణం కావొచ్చు’’అని కథనంలో ఆమె రాసుకొచ్చారు.

ప్రపంచ ప్రముఖ కరోనావైరస్ పరిశోధకుల్లో ఒకరైన నిపుణులు కోవిడ్-19 ఉనికిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొంచెం అసాధారణంగానే అనిపిస్తుంది.
వూహాన్ ఆరోగ్య వ్యవస్థను దాదాపుగా అస్తవ్యస్తంచేసిన, ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన కోవిడ్-19 వైరస్.. దిగుమతి చేసుకున్న ఆహారం నుంచి ఇక్కడకు వచ్చిందా? మిగతా చోట్ల ఎలాంటి విధ్వంసకర ఆనవాళ్లు బయటపడకుండా వుహాన్‌లోనే ఇలా జరగడం సాధ్యమేనా?
అయితే, ఇక్కడ వైరస్‌కు కళ్లెం వేసిన తర్వాత, దాదాపు అందరూ ఇదే విషయాన్ని ముక్తం కంఠంతో చెబుతున్నారు.
‘‘వేరే దేశాల నుంచే ఇక్కడకు వైరస్ వచ్చింది. చైనా దీనికి బాధిత దేశం మాత్రమే’’అని వూహాన్ నగరంలో ఓ రెస్టారెంట్‌ను నడుపుతున్న ఒక మహిళ చెప్పారు.
‘‘మరి ఎక్కడి నుంచి ఈ వైరస్ వచ్చింది’’అని నేను ప్రశ్నించినప్పుడు పక్కనే ఉన్న ఓ చేపలు అమ్ముకునే మహిళ స్పందించారు. ‘‘అది అమెరికా నుంచే ఇక్కడకు వచ్చింది’’అని సమాధానం ఇచ్చారు.

అప్పటికే ఆలస్యమైంది..
గతేడాది జనవరి 23న వూహాన్‌లో ప్రయాణాలపై ఇక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.
ఇక్కడ వసంత కాల వేడుకల నడుమ లాక్‌డౌన్ విధించారు. అయితే అప్పటికే చాలా ఆలస్యమైంది. దాదాపు 50 లక్షల మంది వేడుకల కోసం వూహాన్‌ను వదిలి వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు.
వైద్యులు చేసిన హెచ్చరికలను ఎవరూ పట్టించుకోలేదు. చైనా సోషల్ మీడియాలో మొదట్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అయితే రాజకీయ స్థిరత్వం దెబ్బతినకుండా చూడటమే లక్ష్యంగా అధికారులు వీటిని బయటకు కనిపించకుండా చేశారని వార్తలు వచ్చాయి.
ఏడాది గడిచిన తర్వాత, నేడు వూహాన్‌లో అలాంటి ఆగ్రహావేశాలు దాదాపుగా ఎక్కడా కనిపించట్లేదు. చెప్పాలంటే రద్దీగా కనిపించే ట్రాఫిక్ జామ్‌లు, బిజీ మార్కెట్లు, కళకళలాడుతున్న రెస్టారెంట్లు అంతా ఇక్కడ సాధారణం అయిపోయినట్లు కనిపిస్తోంది.
వైరస్‌పై విజయాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ కొత్తగా భారీ ‘‘ఎగ్జిబిషన్ హాల్’’లో వేడుకలు కూడా ఏర్పాటుచేశారు. పీపీఈ కిట్లు వేసుకున్న వైద్య సిబ్బంది, హాస్పిటల్ బెడ్ల నమూనాలు దీనిలో కనిపిస్తున్నాయి. ఎటువైపు చూసినా ఇక్కడ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఫోటోలే దర్శనమిస్తున్నాయి.
‘‘కరోనావైరస్‌పై చైనా యుద్ధమే చేసింది. తిరుగులేని నిర్ణయాలు తీసుకున్న జిన్‌పింగ్.. చైనా పరిష్కారాలను ప్రపంచ దేశాలకూ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు’’అని జిన్‌పింగ్ ఫోటోల కింద రాసివుంది.
భారీగా పరీక్షలు నిర్వహించడం, ప్రత్యేక యాప్‌లతో రోగులను ట్రేస్ చేయడం, అందరూ మాస్క్‌లు వేసుకునేలా చూడటం.. ఇలా చాలా అంశాల్లో చైనా విజయాన్ని సందేహించాల్సిన పనిలేదు.
అయితే, అత్యంత కఠినంగా విధించిన లాక్‌డౌన్‌లతో మానవ హక్కులపై ప్రభావం పడింది. ప్రజాస్వామ్య దేశాలు ఇలాంటి విధానాలు అనుసరించడం కొంచెం కష్టమే.
‘‘ఈ యుద్ధంలో వ్యూహాత్మక విజయం సాధించడానికి చైనాలోని గట్టి కమ్యూనిస్టు పార్టీ అధినాయకత్వం, దేశంలోని సోషలిస్టు వ్యవస్థే కారణం’’అని ఎగ్జిబిషన్ హాల్‌లో ఒక బ్యానర్ కింద రాసుకొచ్చారు.

అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో..
ప్రపంచ దేశాలకు సహకరిస్తామని చైనా ఎప్పుడో స్పష్టంచేసింది. అయితే ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు అక్కడ ఎన్నో ఉన్నాయి. అసలు వైరస్ వ్యాప్తి ఎలా మొదలైంది? అనే ప్రశ్నకూడా దానిలో ఒకటి.
గబ్బిలాలు లాంటి జంతువుల నుంచి ఇలాంటి వైరస్‌లు మనుషులకు సంక్రమించే అవకాశముందని గత మహమ్మారుల విజృంభణను విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్నారు.
అయితే, దీనికి సంబంధించి చైనా ఎలాంటి పరిశోధనలను వెల్లడించలేదు. ముఖ్యంగా వైరస్ ఉనికిని కనిపెట్టడమే లక్ష్యంగా మానవుల నుంచి సేకరించిన నమూనాల గురించి ఎలాంటి సమాచారమూ బయటపెట్టలేదు.
ముఖ్యంగా వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ప్రమాదవశాత్తు ఈ వైరస్ బయటకు వచ్చిందని చెబుతున్న పరిశోధకులను కూడా దర్యాప్తుల్లో చేర్చాలని వాదనలు ఉన్నాయి. అయితే ఈ విషయంలోనూ ఎలాంటి సమాచారమూ బయటకు రాలేదు.
‘‘ఇలాంటి దర్యాప్తు చైనాలో మొదలయ్యే అవకాశాలు చాలా తక్కువ’’అని హార్వర్డ్‌లోని బ్రాడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంఐటీకి చెందిన మాలిక్యులర్ బయోలజిస్ట్ ఎలీనా చాన్ వ్యాఖ్యానించారు.
‘‘అసలు వైరస్ ఎలా వచ్చిందో తెలుసుకోకుండా.. అంతా సాధారణమైపోయినట్లు గడపడం చాలా ప్రమాదకరం’’అని ఆమె వ్యాఖ్యానించారు.

ఆధారాలు లేకుండా ఎందుకు ఇలా?
దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలే వూహాన్‌లో వైరస్ విజృంభణకు కారణమనే వాదనను, ఎలాంటి ఆధారాలు లేకుండానే, చైనా మీడియా కూడా ప్రోత్సహిస్తోంది.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వాదనలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చన్యింగ్‌ను ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేను ప్రశ్నించాను.
‘‘చైనాపై మీకున్న పక్షపాత ధోరణికి ఈ ప్రశ్న అద్దం పడుతోంది’’అని ఆమె సమాధానం ఇచ్చారు. ‘‘2019 శీతాకాలానికి ముందే ఆస్ట్రేలియా, ఇటలీ సహా చాలా దేశాల్లో కరోనావైరస్ జాడలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి’’అని ఆమె అన్నారు.
‘‘ఇవన్నీ పరిశోధనల్లో తేలిన అంశాలే కదా?’’అని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే, ఇలాంటి పరిశోధనలకు చాలావరకు ఆధారాలు లేవని, కొన్నిసార్లు ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఇలాంటి పరిశోధనలు చేపడతారని చాన్ అన్నారు.
‘‘2019 చివర్లో వూహాన్‌లో వైరస్ జాడలు బయటపడటానికి ముందే, వేరేచోట ఈ వైరస్ చెలరేగిందని ఎలాంటి స్పష్టమైన ఆధారాలు ఆ పరిశోధనలు చూపించలేకపోయాయి’’అని ఆమె వివరించారు.
‘‘ఈ కేసులు తొలుత బయటపడినవి వూహాన్‌లోనే. చైనాకు వెలుపల కనిపించిన కేసులు కూడా వూహాన్ నుంచి వెళ్లినవారి వల్లే వచ్చి ఉండొచ్చు’’అని ఆమె అన్నారు.

మరోవైపు ల్యాబ్ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చిందనే వాదనతో విభేదిస్తున్న వారు కూడా విదేశాల నుంచి ఈ వైరస్ చైనాకు వచ్చిందనే వాదనను వ్యతిరేకిస్తున్నారు.
‘‘ఆహార పదార్థాల వల్లే ఈ వైరస్ వూహాన్‌లోకి వచ్చిందనే సమాచారం విశ్వసనీయంగా లేదు’’అని అమెరికాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఇమ్యునాలజీ, మైక్రోబయోలజీ ప్రొఫెసర్ క్రిస్టియన్ ఆండెర్సన్ చెప్పారు.
‘‘2019 చివర్లో చైనాలోని ఏదో ఒక ప్రాంతం నుంచే ఈ వైరస్ పుట్టిందని ప్రస్తుతమున్న పరిశోధనల సమాచారం చెబుతోంది’’అని ఆయన అన్నారు.
ల్యాబ్ నుంచి వైరస్ పుట్టలేదని రుజువు చేసేందుకు ఎవరు దర్యాప్తు చేపట్టానికి వచ్చినా తాము స్వాగతిస్తున్నట్లు బీబీసీ ఈ-మెయిల్‌కు ప్రత్యుత్తరంలో షీ ఝెన్‌గ్లీ చెప్పారు.
అయితే, విదేశాల నుంచే ఈ వైరస్ వచ్చిందనే చైనా ప్రభుత్వ వాదనకు మీ సమాధానం దగ్గరగా ఉన్నట్లు ఉంది.. దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నించగా.. ‘‘మీ ప్రశ్న సరిగా లేదు’’అని ఆమె సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
నెలలపాటు జాప్యం చేసిన తర్వాత కరోనావైరస్ ఉనికిపై వూహాన్‌లో దర్యాప్తు చేపట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధకులను చైనా అనుమతించింది.
చైనా తాము చెప్పాలనుకునే విషయాన్ని అందరితోనూ చెప్పేందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే చేసుకుందని పరిశోధకులు చెబుతున్నారు.
‘‘వారు అన్నింటికీ ఏర్పాట్లు చేసుకునే ఉంటారు’’అని జార్జిటౌన్ మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ డేనియేల్ లూసీ అన్నారు.
‘‘మీరు షీ ఝెన్‌గ్లీ రాసిన ఆర్టికల్స్‌ను డబ్ల్యూహెచ్‌వో బృందం చెబుతున్న మాటలను పక్కపక్కన పెట్టిచూస్తే అన్ని అంశాలూ అర్థమవుతాయి. వైరస్ చైనాకు వెలుపలే పుట్టిందని వ్యూహాత్మకంగా వారు సంకేతాలు ఇస్తున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
వూహాన్‌లో మొదలైన ఈ సంక్షోభం నేడు ప్రపంచ సంక్షోభంగా మారింది. నేటికి చిక్కు వీడని ప్రశ్నలు ఎన్నో ఉండిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
వైరస్ ఒక వేళ గబ్బిలాల నుంచే వచ్చి ఉండుంటే.. అది ఎలా వచ్చిందో కనుక్కోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్‌లో ఇలాంటి ముప్పులను మనం తగ్గించుకోవడానికి ఇది చాలా అవకాశాలు ఇస్తుంది.
ఒక వేళ ఈ వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయితే, భద్రతా పరమైన ప్రోటోకాల్స్‌ను తక్షణమే సమీక్షించాల్సిన అవసరముంది.
అయితే, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికీ బయటకు రాకపోవచ్చని శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
‘‘నేడు సైన్స్ రూపంలోనూ రాజకీయాలు జరుగుతున్నాయి’’అని చాన్ వ్యాఖ్యానించారు.
‘‘డబ్ల్యూహెచ్‌వో పరిశోధకులు తమకు లభించిన ఆధారాలను పరిశోధించి ముందుకు వెళ్తారని భావిస్తున్నాను. అప్పుడే ప్రజలకు ఏం జరుగుతుందో అర్థమవుతుంది’’అని ఆమె అన్నారు.
చైనాకు వెలుపల భిన్న ప్రాంతాల్లో ఈ వైరస్ మొదట చెలరేగిందని వూహాన్ ఎగ్జిబిషన్ హాల్‌లో ఓ బోర్డు కనిపిస్తోంది. దీన్ని చూస్తుంటే.. అసత్య ప్రచారాలను నిజాలుగా చూపిస్తూ, వైరస్‌కు కళ్లెం వేసినట్లే... నిజాలకూ కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- జాక్ మా: కనిపించకుండా పోయిన చైనా బిలియనీర్ 3 నెలల తరువాత ప్రత్యక్షం
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- జో బైడెన్ నుంచి తెలుగువారు ఏం కోరుకుంటున్నారు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









