ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్‌ చక్రవర్తి అసలు ఎవరు?

ప్రవీణ్ చక్రవర్తి

ఫొటో సోర్స్, lawinforce/twitter

    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఆలయాలు, విగ్రహాల చుట్టూ రాజకీయ, మతపరమైన వివాదాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ప్రవీణ్‌ చక్రవర్తి అనే ఓ ఎన్జీవో నిర్వాహకుడు తాను అనేక వనదేవతల విగ్రహాలను, రాతి విగ్రహాలను ధ్వంసం చేశానంటూ వ్యాఖ్యానించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. కాకినాడలో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ప్రవీణ్ వ్యాఖ్యలు సామాజిక విద్వేషాలు పెంచే రీతిలో ఉన్నాయంటూ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆయన ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అకౌంట్లను సీజ్ చేశారు. ఆయన నడుపుతున్న సంస్థల నుంచి పలు ఆధారాలు కూడా సేకరించినట్టు సీఐడీ వెల్లడించింది. ప్రస్తుతం వైరల్ అయిన ప్రవీణ్‌ చక్రవర్తి వీడియో ఇప్పటిది కాదని ఆయన అనుచరులు చెబుతున్నారు. పాత వీడియో తీసుకొచ్చి, ప్రస్తుతం ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలకు ఆయనే కారణమని చెబుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

బీబీసీ పరిశీలనలో కూడా ప్రవీణ్‌ చక్రవర్తి పేరుతో 2019 నుంచే ట్విట్టర్, యూ ట్యూబ్‌లలో ఈ వీడియో కనిపిస్తున్నట్లు గుర్తించాం.

బెంగళూరు గాసిప్స్ అనే ఓ యూట్యూబ్ ఛానెల్లో డిసెంబర్ 11, 2019లో ఈ వీడియో పోస్ట్ అయినట్టు ఉంది. అప్పట్లోనే తన వ్యాఖ్యలకు ప్రవీణ్ క్షమాపణలు చెప్పిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఎప్పుడు రికార్డు చేశారన్న విషయంలో స్పష్టత లేదు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

విద్యాసంస్థలు నడుపుతున్నారు

కాకినాడ కేంద్రంగా ప్రవీణ్‌ చక్రవర్తి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఒడిశా నుంచి ఆయన కుటుంబంలో ముందు తరమే కాకినాడకు వలస వచ్చింది.

ప్రవీణ్ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేశారు.

ఆ తర్వాత కాకినాడ రూరల్, సామర్లకోట మండలాల్లో ప్రవీణ్‌ చక్రవర్తి వివిధ సంస్థలు ప్రారంభించారు.

మదర్ థెరీసా పేరుతో విద్యాసంస్థలు, కేటీసీ చిల్డ్రన్ హోం, సిలోన్ బ్లైండ్ సెంటర్(ఎస్‌బీ‌సీ) పేరుతో అంధుల కోసం ఓ కేంద్రం నడుపుతున్నారు. వాకలపూడి ప్రాంతంలో శార్వాణి స్కూల్ కూడా ఆయన పరిధిలోనే ఉందని ప్రచారం.

ఇక సామర్లకోట రూరల్ మండలం ఉండూరులో పీవీఆర్ఎం పేరుతో విద్యాసంస్థ నడుపుతున్నారు. ఎల్‌కే‌జీ నుంచి ఇంటర్ వరకూ ఆయన విద్యాసంస్థల్లో బోధన జరుగుతోంది. ఆయా సంస్థలను నడుపుతున్న ఎన్జీవోకి ప్రవీణ్‌ చక్రవర్తి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సంస్థలకు విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నట్టు చెప్పేవారని స్థానికులు అంటున్నారు.

ఉండూరుకి చెందిన ఎం రాజేశ్ ఈ విషయమై బీబీసీతో మాట్లాడారు.

"మా పిల్లలు ఆయన స్కూల్లోనే చదివేవారు. పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రమే ఆయన వచ్చేవారు. తమకు అనేక దేశాల నుంచి పలు సంస్థల అండదండలు ఉన్నాయని చెప్పేవారు. దేవుని సేవలో ఉన్నానని, ఆయనే తమకు అండదండలు అందిస్తారని అనేవారు. పిల్లల దగ్గర ఫీజులు మాత్రం పెద్దగా తీసుకునేవారు కాదు. పైగా అనేక సందర్భాల్లో పిల్లలకు బట్టలు, ఇతర వస్తువులు కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారి చేతుల మీదుగా ఇచ్చేవారు. కొందరు మంత్రులు, వివిధ పార్టీల నేతలు కూడా వచ్చేవారు. ఆయన చుట్టూ బాడీగార్డులు ఉండేవారు. ఖరీదైన కార్లలో తిరిగేవారు" అని రాజేశ్ చెప్పారు.

ప్రవీణ్ చక్రవర్తి

ఇదివరకే కేసులు

ప్రవీణ్ చక్రవర్తి చుట్టూ ఇదివరకు కూడా అనేక వివాదాలు ఉన్నాయి. ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయని పోలీసుల రికార్డుల ద్వారా తెలుస్తోంది.

తన దగ్గర పనిచేస్తున్న యువతిని మోసం చేసిన కేసులో కాకినాడ రూరల్ సర్కిల్ సర్పవరంలో ఆయన మీద కేసు నమోదయ్యింది. గతంలో ఆయన మీద నమోదయిన కేసుల్లో హైకోర్టులో అప్పీల్ చేయగా, స్టే కూడా వచ్చింది.

ఆయన సంస్థల నిర్వహణ తీరు మీద కూడా కొన్ని ఫిర్యాదులు గతం నుంచి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే అవి పెద్దగా ప్రచారంలోకి రాలేదు.

వాటర్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ అనే అమెరికాకు చెందిన సంస్థ నుంచి ఆయనకు నిధులు వస్తుంటే, వాటిని దుర్వినియోగం చేశారంటూ గతంలో సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయి.

ప్రవీణ్ చక్రవర్తి

వీడియోతో వివాదం

తాను పలు విగ్రహాలు ధ్వంసం చేశానని స్వయంగా ప్రవీణ్ చక్రవర్తి చెప్పిన వీడియోతో ఆయన మళ్లీ వివాదాల్లోకి వచ్చారు. దానిపై 2019లోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పలువురు ఫిర్యాదులు చేశారు.

మత సామరస్యాన్ని దెబ్బతీసేలా, విద్వేషపూరితంగా ఉన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.

లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ తాము ప్రవీణ్ చక్రవర్తిపై ఫిర్యాదు చేసినట్టు అప్పట్లోనే వెల్లడించింది. ఆయన నిబంధనలకు విరుద్ధంగా మతమార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ మేరకు డిసెంబర్ 5, 2019న తాము ఆయనపై , ఆయన నిర్వహిస్తున్న సంస్థలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని ట్విట్టర్లో పేర్కొంది.

తాజాగా మరోసారి అదే వీడియో తెరమీదకు వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోపై గుంటూరుకి చెందిన సింగం వెంకటలక్ష్మీ నారాయణ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు.

ప్రవీణ్ చక్రవర్తి

ఏపీ సీఐడీ రంగంలో దిగి ప్రవీణ్‌ చక్రవర్తిని అరెస్ట్ చేసింది. జనవరి 13న అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించడంతో అదే రోజు అర్ధరాత్రి ఆయన్ను జైలుకు తరలించారు.

ఈ కేసు విచారణ కోసం ప్రవీణ్‌ను కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును అభ్యర్థించడంతో జనవరి 20 నుంచి మూడు రోజుల పాటు అనుమతి దక్కింది.

ప్రస్తుతం ప్రవీణ్‌ను గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారిస్తున్నారు. జనవరి 23తో అతడి కస్టడీ ముగుస్తుంది.

అదే సమయంలో కాకినాడ రూరల్ మండలంతో పాటుగా నగరంలో ఉన్న ఆయనకు సంబంధించిన వివిధ సంస్థల్లో సోదాలు నిర్వహించారు. కీలక ఆధారాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సీఐడీ ఎస్పీ రాధిక మీడియాకు వెల్లడించారు.మంగళగిరి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 1/2021 సెక్షన్‌ 153/ఎ, 153 బి(1)(సి), 505(1)(సి), 505(2), 295(ఎ), 124(ఎ), 115 రెడ్‌ విత్‌ 66 తీవ్రమెన సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

‘నిరాధార ప్రచారాలు వద్దు’

ప్రవీణ్‌ చక్రవర్తి కేసులో లోతైన దర్యాప్తు జరుగుతున్నదని, ఈ కేసుకు సంబంధించి మీడియా ఊహాజనిత కథనాలు ఇవ్వవద్దని ఏపీ సీఐడీ ఎస్పీ జీఆర్‌ రాధిక కోరారు.

"ప్రవీణ్‌ చక్రవర్తి వీడియోను చూసిన గుంటూరుకు చెందిన సింగం వెంకట శ్రీలక్ష్మీనారాయణ ఈ ఏడాది జనవరి 12న సీఐడీకి ఫిర్యాదు చేశారు. 'ట్రీ గాడ్స్, రాక్ గాడ్స్ ఫేక్‌’ అని, తాను ఎన్నో విగ్రహాలను అవమానించానని, అనేక గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానని చెబుతూ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వీడియో సీడీని ఫిర్యాదుకు జత చేశారు. దీనిపై కేసు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేశాం. విచారణ సాగుతోంది’’ అని ఆమె వివరించారు.

‘‘ఈ వ్యవహారానికి సంబంధించి ప్రజలను రెచ్చగొట్టేలా, మతాలను కించపరిచేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి వాటిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు. ప్రవీణ్‌ విషయంలో సీఐడీకి లభించిన ఆధారాలను బట్టి ముందుకు వెళ్తాం" అని ఎస్పీ రాధిక బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)