సింగర్ సునీత పెళ్లి: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా?

ఫొటో సోర్స్, facebook/sunitha
- రచయిత, చింకీ సిన్హా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అదేమీ సాదాసీదాగా జరిగిన వివాహం కాదు. అంగరంగ వైభవంగా, ఆడంబరంగా చేసుకున్న పెళ్లి.
సాధారణంగా భారతదేశంలో రెండో పెళ్లి అంటే ఆర్భాటాలు ఏవీ లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటారు.
మొదటి వివాహానికి ఉన్నంత గౌరవం, గుర్తింపు రెండో వివాహానికి ఉండదు.
తెలుగు సినిమా నేపథ్య గాయని సునీత ఉపద్రష్ట ఈ మధ్యే రెండో వివాహం చేసుకున్నారు.
ఎంతో సరదాగా, ఆడంబరంగా ఆ పెళ్లి జరిగింది. ఆమె తలనిండా పువ్వులు పెట్టుకుని, లేత గోధుమ రంగు చీర, ఎర్రటి జాకెట్‌తో పెళ్లి బట్టల్లో మెరిసిపోతూ కనిపించారు.
42 ఏళ్ల వయసులో సునీత తన స్నేహితుడు రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకోవడం పట్ల ఎందరో హర్షం వ్యక్తం చేశారు. కానీ కొందరు మాత్రం తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు.

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
19 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి
సునీతకు 19 ఏళ్ల వయసులో మొదటి వివాహం కిరణ్ కుమార్ గోపరాజుతో జరిగింది. వారికి ఇద్దరు సంతానం.
ఆమె, తన మొదటి భర్తనుంచీ చాలా కాలం క్రితమే విడాకులు తీసుకున్నారు.
సునీత రెండో వివాహ సమయంలో ఆమె పిల్లలు ఆకాశ్, శ్రేయ తల్లి పక్కనే నిల్చుని ఉండడం అనేక ఫొటోల్లో చూడొచ్చు.

ఫొటో సోర్స్, facebook/sunitha
సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు షేర్ చేసుకోవడం మామూలే కానీ సునీత పెళ్లి ఫొటోలు సమాజ ధిక్కరణకు సూచికగా నిలిచాయి.
భారతదేశంలో మగవారు రెండో వివాహం చేసుకున్నంత సులువుగా ఆడవారు చేసుకోలేరు.
మహిళలు రెండో వివాహం చేసుకున్న ప్రతిసారీ సమాజం చూపించే రెండు నాల్కల ధోరణి గురించి చర్చించాల్సిన అవసరం ఉంది.
పునర్వివాహం చేసుకున్న మహిళల పట్ల మన అవగాహన ఏ స్థాయిలో ఉందో తరచి చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
దశాబ్దాల తరబడి భారతదేశంలో అమ్మాయిల వివాహాలు కన్యత్వం, శీలం ఆధారంగానే జరుగుతున్నాయి.
వితంతు వివాహాలు చట్టబద్ధమైనప్పటికీ, ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికీ వితంతువులను అశుభంగానే పరిగణిస్తున్నారు.
భర్త నుంచి విడిపోయిన ఆడవారికి సమాజంలో తగిన గౌరవం ఉండడం లేదు. ఇప్పుడిప్పుడే ఇలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పులు వస్తున్నాయి.
‘ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తితో అమ్మ పెళ్లి’
'స్టేటస్ సింగిల్: ది ట్రూత్ అబౌట్ బీయింగ్ సింగిల్ వుమన్ ఇన్ ఇండియా' పుస్తక రచయిత శ్రీమోయీ పియూ కుందు తన తల్లి రెండో వివాహం గురించి చెప్పారు.
శ్రీమోయీ ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఆమె తల్లిని వివాహం చేసుకోవడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చారు.
శ్రీమోయీకి రెండేళ్లున్నప్పుడే మానసిక అనారోగ్యం కారణంగా తన తండ్రి మరణించారు. అప్పటికి తన తల్లి వయసు 20లలోనే ఉందని ఆమె చెప్పారు.
శ్రీమోయీకి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు, తన తల్లి కోల్‌కతాలోని తన పుట్టింటికి వెళిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఆమె స్కూల్ టీచర్‌గా ఉద్యోగం చేస్తూ, ట్యూషన్లు చెప్తూ పిల్లను పోషించేవారు.
అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి పేయింగ్ గెస్ట్‌గా వాళ్లింట్లో చేరారు.
"ఆయన మొదటి చూపులోనే మా అమ్మను ఇష్టపడ్దారు. మా అమ్మ ఆయన కంటే పదేళ్లు పెద్ద" అని శ్రీమోయీ చెప్పారు.

ఫొటో సోర్స్, NURPHOTO/GETTY IMAGES
"నాకు అప్పుడు 12 ఏళ్లు. ఆరో తరగతి చదువుతున్నాను. మా అమ్మను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు నాతో చెప్పారు. నేను, ఆయన్ను అంకుల్ అని పిలిచేదాన్ని.
ఆయన అలా అడగ్గానే నాకు చాలా కోపం వచ్చింది. చనిపోయిన మా నాన్నకి ఊహాత్మక లేఖలు రాసేదాన్ని.
వాళ్లిద్దరూ వేరే కాపురం పెట్టుకుని నన్ను పూర్తిగా మర్చిపోతారేమోనని విపరీతంగా భయపడేదాన్ని.
కానీ అలా జరగలేదు. ఆ పెళ్లి తరువాత మా అమ్మ చాలా సంతోషంగా ఉన్నారు. నేను అంకుల్‌కు చాలా దగ్గరయ్యాను" అని శ్రీమోయీ వివరించారు.
తన తల్లి రెండో వివాహం సాదాసీదాగానే జరిగిందని శ్రీమోయీ చెప్పారు.
ఆరోజు తన తల్లి ఎర్ర చీర కట్టుకున్నారని, వాళ్లిద్దరూ కోర్టుకు వెళ్లి సంతకాలు చేసి దండలు మార్చుకున్నారని, తరువాత వాళ్లకు ఇష్టమైన చైనీస్ రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేయడంతో ఆ వేడుక ముగిసిందని ఆమె చెప్పారు.
"మా అమ్మ రెండో వివాహం ఎంతో అందంగా జరిగింది. కానీ, ఆమె వివాహం గురించి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మాట్లాడుకున్నారు. విపరీత వ్యాఖ్యలతో నన్ను ఏడిపించేవారు. మీ అమ్మ కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎలా ఉన్నారు అని అడిగేవారు. అంతవరకూ నాకు తండ్రి లేడని ఏడిపించేవారు. అమ్మ రెండో పెళ్లి చేసుకున్నాక ఆ వివాహం గురించి ఏడిపించడం మొదలుపెట్టారు" అని శ్రీమోయీ చెప్పారు.
"మన సమాజంలో ఒక స్త్రీకి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించడం చాలా కష్టమైన విషయం. మనం తిరోగమన భావాలతో నిండిన పురుషాధిక్య సమాజంలో ఉన్నాం. భిన్నాభిప్రాయాలను గౌరవించే సంప్రదాయం పెద్దగా లేదు" అని ఆమె అభిప్రాయపడ్డారు.
శ్రీమోయీ తల్లికి 60 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్లు ఒక బిడ్డను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు శ్రీమోయీకి ఒక చిన్న చెల్లి ఉంది. తన పేరు గెరూ.

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం చాలా కష్టమైన వ్యవహారమే. ఎన్నో రకాల సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది .
అయితే, గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది.
విడాకులు తీసుకున్నాక, రెండో వివాహాం చేసుకోవాలనుకునే మహిళలకు అండగా నిలబడేందుకు కొన్ని సహాయక బృందాలు ముందుకొస్తున్నాయి.
అలాగే, పలు మాట్రిమోనియల్ వెబ్‌సైట్లు రెండో వివాహానికి అనుకూలమైన సేవలను ప్రారంభించాయి.
కానీ, వీటితోపాటుగా వివాహేతర సంబంధాలకు అనుకూలమైన డేటింగ్ సైట్ల జోరు కూడా పెరిగింది. ఇది కూడా మన సమాజంలోని ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనమే.
వివాహేతర సంబంధాలకోసం ప్రారంభించిన రష్యన్ డేటింగ్ యాప్ గ్లీడెన్‌లో కోవిడ్ సమయంలో 13 లక్షలకు పైగా భారతీయులు చేరారని గణాంకాలు చెబుతున్నాయి.
గత ఏడాది జూన్ నుంచి ఆగస్ట్ మధ్య కాలంతో పోలిస్తే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఇండియా నుంచి సబ్‌స్క్రిప్షన్స్ 246 % పెరిగాయని గ్లీడెన్ తెలిపింది.
వివాహేతర సంబంధాలు జంటలకు థెరపీలా పనిచేస్తాయని గ్లీడెన్ విశ్వసిస్తుంది.
ఇండియన్ హ్యూమన్ డెవలప్‌మెంట్ సర్వే (ఐహెచ్‌డీఎస్) 2016 గణాంకాలను పరిశీలిస్తే భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న మహిళల కేటగిరీలో గణాంకాలు అధిక స్థాయిలో కనిపిస్తాయి.
అంటే మగవారితో పోల్చి చూస్తే రెండో వివాహం చేసుకున్న మహిళలు ఇండియాలో తక్కువ సంఖ్యలోనే ఉన్నారని అంచనా వేయొచ్చు.
2019లో ప్రచురించిన ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గత రెండు దశాబ్దాలలో ఇండియాలో విడాకుల రేటు రెట్టింపైంది.
చదువుకుని, ఆర్థికంగా స్వతంత్రులుగా ఉన్న మహిళలలో విడాకులు తీసుకుంటున్నవారి శాతం పెరిగిందని ఈ నివేదిక చెబుతోంది.
విద్యావంతులైన, సంపన్నులైన కుటుంబాల్లో విడాకుల శాతం పెరగడానికి కారణం వారిలో అహంకారం పెరగడమేనని, ఒక కుటుంబ పరువు ప్రతిష్టలు ఆ కుటుంబ స్త్రీలపైనే ఆధారపడి ఉంటాయని ఆర్ఎస్ఎస్‌కు చెందిన మోహన్ భగవత్ 2020 ఫిబ్రవరిలో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రేమించి పెళ్లి చేసుకున్నవారిలో కూడా కొన్నాళ్ల తరువాత వ్యవహారాలు పొసగక విడాకులకు తీసుకున్నవారు ఉంటారు.
కానీ ప్రపంచం వివాహాలను స్వర్గంలో నిశ్చయమైనవిగా పరిగణిస్తూ, విడిపోవడాన్ని తప్పుగా చూస్తుంది.
కొన్నిసార్లు భార్తాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం వల్ల కాకుండా ప్రేమ సరిపోకపోవడం వల్ల విడిపోయే పరిస్థితులు రావొచ్చు.
ఒక బంధంలో ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. దానికన్నా ఒంటరిగా ఉండడమే మేలనుకోవచ్చు.
కానీ ఒంటరిగా ఉన్న మహిళను సమాజం జడ్జ్ చేస్తుంది. కలిసి ఉండడానికి ఆమె పూర్తి ప్రయత్నాలు చేయలేదని నిరసిస్తుంది.
విడిపోయిన తరువాత, కచ్చితంగా రెండో వివాహంవైపు మొగ్గు చూపాలన్న నియమం ఏమీ లేదు.
మరో వివాహమే వద్దనుకుని, జీవితాంతం ఒంటరిగా గడపాలనుకునే మహిళలూ ఉంటారు. లేదా సహజీవనం వైపు మొగ్గు చూపేవారూ ఉంటారు.

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
అందరి కథా ఒకేలా ఉండదు
70వ దశకంలో సోదరుడిని కలవడానికి న్యూయార్క్ వెళ్లినప్పుడు తను ఆడుతూపాడుతూ ఉండే ఒక యువతినని జ్యోతి ప్రభు చెప్పారు.
ఆ వయసులో అందరికీ ప్రపంచం వింతగానే అనిపిస్తుందన్నారు. అప్పుడే, న్యూయార్క్‌లో ఆమె ఒకరిని ఇష్టపడ్డారు.
"పెళ్లి తర్వాత మాకు అక్కడ ఇద్దరు అందమైన కూతుళ్లు పుట్టారు. వాళ్లను మేం బాగా పెంచాం" అన్నారు జ్యోతి.
కానీ, దాదాపు 30 ఏళ్లు సంతోషంగా గడిచాక, ఆమె భర్త గుండెపోటుతో చనిపోయాడు. అప్పుడు ఆయనకు 50-55 ఏళ్లుంటాయి.
"నేను దాదాపు ఆరేళ్లు వితంతువుగా ఉన్నాను. ఒంటరితనం చాలా కుంగదీసింది. ఒంటరి సాయంత్రాలు నిశ్శబ్దం భరించలేకపోయేదాన్ని.
అప్పుడు పుస్తకాలపై కూడా మనసెళ్లేది కాదు. దాంతో, కొంతమంది తెలిసినవాళ్లు నాతో.. భార్య చనిపోయిన ఓ వ్యక్తిని కలవమన్నారు, నేను కూడా ఒప్పుకున్నా" అన్నారు.
ఆ సమయానికి జ్యోతి తన కాళ్లమీద తాను నిలబడగలిగారు. ఆమెకు డబ్బుకు ఏ లోటూ ఉండేది కాదు. ఆ.. ఒక్క తోడు లేని లోటును మాత్రం ఆమె చాలా మిస్ అవుతున్నారు.
"నాకు డిన్నర్ సమయంలో, షో చూడానికి వెళ్లాలన్నా, ఎక్కడైనా తిరుగుదామన్నా ప్రయాణంలో ఒక తోడు కావాల్సి వచ్చింది.
దాంతో, మేమిద్దరం మా మిగతా జీవితం కలిసి గడపాలని నిర్ణయించుకున్నాం.
మేం చాలా సరదాగా ఉండేవాళ్లం. ఆయన ఇద్దరు కొడుకులు, మా ఇద్దరు అమ్మాయిలు పెద్దవాళ్లైపోయారు.
వాళ్ల జీవితాల్లో వాళ్లు బిజీగా, విడిగా ఉంటున్నారు. అందుకే ఒకరిపై ఒకరు శ్రద్ధ పెట్టడానికి మాకు తగినంత సమయం దొరికింది" అంటారు జ్యోతి.

ఫొటో సోర్స్, EPA
ఆస్తుల గొడవ
ఆర్థిక స్వాతంత్ర్యంతో భారత్‌లో కూడా పరిస్థితులు మారుతున్నాయి. అయితే దాని వేగం చాలా నెమ్మదిగా ఉంది.
భారత్‌లోని వారసత్వ హక్కులు కూడా దీనికి ఒక కారణం. రెండో పెళ్లి అంటే, కుటుంబం ఆస్తులు కూడా బదిలీ అవుతాయి. చాలామంది దానికి ఒప్పుకోరు.
భారత చట్టాల ప్రకారం విడాకులు లేదా విడిపోయిన భార్య ఆర్థిక హక్కులు చాలా పరిమితంగా ఉంటాయి.
ఆమె తన భర్త నుంచి భరణం కావాలని మాత్రం అడగవచ్చు. అయితే, భారత్‌లో ఎక్కువ పెళ్లిళ్లు, విడాకుల కేసులను ఆయా మతాల పర్సనల్ లా ప్రకారం నిర్ణయిస్తారు.
ఇప్పుడు భారత్‌లోని చాలా డేటింగ్ సైట్స్‌లో రెండో పెళ్లి ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
ఆర్థిక పురోగతి, ఇతర కారణాల వల్ల చాలా మంది మహిళలు రెండో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటున్నారు.
కానీ వారి నిర్ణయాలపై తరచూ సమాజం, కుటుంబాల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. తమ 70 శాతం యూజర్లు పురుషులే ఉంటారని మాట్రిమోనియల్ వెబ్‌సైట్లు చెబుతున్నాయి.
కానీ ఈ శుభవార్తలన్నింటి మధ్య 'తన సంతోషం కోసం పెళ్లి అవసరం' అనే వాస్తవం కూడా స్పష్టంగా తెలుస్తోంది.
మన సమాజంలో 'ఆదర్శ దంపతులు' అనే మాట వాడుకలో ఉంది. అలాంటి చోట ఎవరైనా ఒక మహిళకు ఒంటరిగా ఉండడం అనే ప్రత్యామ్నాయం ఎంచుకోవడం అంటే, ఇప్పటికీ కష్టమైన నిర్ణయమే అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- ‘ఇది ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ ప్రదేశం’
- ఆయుష్షు పెరగాలంటే.. పెళ్లి చేసుకోండి
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- 'కట్నం కోసం' ఆమె 'అతడు'గా మారింది.. ఇద్దరమ్మాయిలను పెళ్లాడింది!
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- ఆమె అతడై.. అతడు ఆమెయై.. తర్వాత ఒక్కటై
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
- రాయల్ ఎన్ఫీల్డ్ బాటలో భారత్‌లోకి ‘బుల్లెట్’లా దూసుకొస్తున్న బ్రిటిష్ బైక్‌లు
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- మిల్లీమీటరు పురుగు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








