మలేసియా: వేదికపై పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.. కార్లలోంచే ఆశీర్వదించిన 10 వేల మంది అతిథులు

మలేసియాలో 10,000 మంది అతిథులతో వివాహం చేసుకున్న జంట

ఫొటో సోర్స్, FACEBOOK/OFFICIALKUNAN

ఫొటో క్యాప్షన్, మలేసియాలో 10,000 మంది అతిథులతో వివాహం చేసుకున్న జంట

అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్న చాలా మంది జంటల కలలు కోవిడ్ మహమ్మారి వల్ల చెదిరిపోయాయి.

కానీ, మలేసియాలో ఒక జంట మాత్రం వారి వివాహ మహోత్సవానికి 10,000 మంది హాజరయినట్లు ప్రకటించారు. వీరంతా కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే వివాహానికి హాజరయ్యారు.

ఇలా చేయడం సాధ్యం కాదనే ఆలోచన మీకు రావచ్చు. కానీ, ఈ కొత్త జంట వినూత్నంగా వారి వివాహ వేడుకను డ్రైవ్ త్రూ వేడుకగా జరుపుకోవడంతో ఇంత మంది హాజరవ్వడం సాధ్యమయింది.

మలేసియా రాజధాని కౌలాలంపూర్ కి దక్షిణంగా ఉన్న పుత్రజయలో ఉన్న ఒక ప్రభుత్వ భవనం వెలుపల ఆదివారం ఉదయం కొత్త జంట ఆసీనులయ్యారు.

పార్టీకి హాజరయిన అతిధులు డ్రైవ్ వే మీద కార్లను నడుపుకుంటూ వారి కారు కిటికీలు మాత్రం పూర్తిగా తెరిచి కొత్త జంటకు కారులోంచే అభివాదం చేశారు.

ఇది సాధారణంగా జరిగే వివాహ వేడుకను తలపించదు. కానీ, కొత్త పెళ్లి కొడుకు టెంగ్కు ముహమ్మద్ హఫీజ్, పెళ్లి కూతురు ఓషియేన్ అలేగియా సాధారణ జంట కాదు.

వరుడు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ క్యాబినెట్ మంత్రి టెంగ్కు అద్నాన్ కొడుకు. ఈయన పుట్టినరోజు కూడా పెళ్లి రోజే కావడం విశేషం.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

"ఇక్కడ పొద్దున్న నుంచీ 10,000 కు పైగా కార్లు వచ్చాయని చెప్పారు" అని పెళ్లి కొడుకు తండ్రి గర్వంగా ఫేస్ బుక్ లో పెళ్లి వేడుక చిత్రాలను షేర్ చేస్తూ పోస్టు రాశారు.

"నాకు, నా కుటుంబానికి చాలా గౌరవం దక్కినట్లుగా అనిపించింది. మీరంతా కోవిడ్ నిబంధనలను అర్ధం చేసుకుని, వాటిని పాటిస్తూ కారు బయటకు అడుగు పెట్టకుండా ఈ వివాహానికి హాజరయినందుకు ధన్యవాదాలు" అని ఆయన పోస్టులో రాశారు.

మలేసియాలో 10,000 మంది అతిథులతో డ్రైవ్ త్రూ వివాహ వేడుక

ఫొటో సోర్స్, FACEBOOK/KUNAN

ఫొటో క్యాప్షన్, మలేసియాలో 10,000 మంది అతిథులతో డ్రైవ్ త్రూ వివాహ వేడుక

డ్రైవ్ త్రూ మీద వాహనాలన్నీ వెళ్ళడానికి సుమారు 3 గంటల సేపు పట్టింది. వేడుక చూసేందుకు వచ్చిన అతిధులందరికీ దూరం నుంచే కొత్త జంట అభివాదం చేశారు.

కానీ, వివాహానికి హాజరయిన అతిధులందరికీ అభివాదం మాత్రమే కాదు, విందు భోజనం కూడా లభించింది.

కారు కిటికీల నుంచే అతిథులంతా ప్యాక్ చేసిన విందును కూడా అందుకున్నట్లు మలేసియా మీడియా ప్రచురించింది.

ఈ వేడుక జరగడానికి సరిగ్గా ఒక రోజు ముందే వరుడు తండ్రికి 3.69 కోట్ల రూపాయిలు (5,00,000 డాలరర్లు) అవినీతి కేసులో శిక్ష పడింది. ఈ నేరానికి ఆయనకు 12 నెలల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించారు.

మలేసియాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు ప్రబలుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 92,000 కరోనా కేసులు నమోదు కాగా వైరస్ బారిన పడి 430 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)