ATM - ఎనీ టైమ్‌ మీల్‌: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన... లాక్‌డౌన్ తర్వాతా కొనసాగుతున్న ఔదార్యం

వలస కూలీలు, పేదలను ఏటీఎం ఆదుకుంది
    • రచయిత, బళ్ల సతీశ్‌
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్‌

అవి లాక్‌డౌన్‌ కొనసాగుతున్న రోజులు. హైదరాబాద్‌ ఎల్‌.బి.నగర్‌ ప్రాంతంలోని ఒక అపార్టుమెంటులో ఉండే రాము చాలా రోజులు ఇంట్లోంచి కాలు బయటపెట్టలేదు. ఒకరోజు చికెన్ కోసం మొదటిసారి బయటకు వెళ్లారు.

చికెన్‌ షాపు దగ్గర ఓ మహిళను గమనించారు. ఆమె ఏకంగా 2,000 రూపాయల మాంసం కొంటోంది. లాక్‌డౌన్‌లో ఫంక్షన్లు లేవు కదా? మరి అంత చికెన్ ఎందుకు? ఉండబట్టలేక ఆమెనే అడిగేశారు రాము. ఆ మహిళ ఇచ్చిన సమాధానం విని ఆయన ఆశ్చర్యపోయారు.

ఆ మహిళ ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. ఆమె నెల జీతం రూ. 6,000. అందులో రెండు వేలు పెట్టి చికెన్‌ కొనుక్కొచ్చారు. ఆమె ఉంటున్న కాలనీలోని వలస కార్మికులకు ఆమె భోజనం సిద్ధం చేస్తున్నారు.

‘‘మీ జీతమే ఆరు వేలు, అందులో రూ. 2,000 ఈ కూలీలకు ఖర్చు చేస్తే నీకేం మిగులుతుంది?’’ ఉండబట్టలేక అడిగేశారు రాము. దానికి ఆమె ఇచ్చిన సమాధానం వేల మందికి అన్నం దొరకేలా చేసింది.

రైస్ ఏటీఎం

‘‘నాకు భాష వచ్చు సర్. ఇక్కడే ఉంటాను. కష్టమైతే ఎవరో ఒకర్ని ఉద్దర (అప్పు) అడిగి ఇల్లు నెట్టుకొస్తాను. పాపం వాళ్లకు భాష రాదు. డబ్బు లేదు. నాలుగు మెతుకులు పెట్టేవారు లేరు. తిండిలేక రెండు రోజుల నుంచి విలవిల్లాడుతున్నారు. అందుకే వాళ్లకు భోజనం పెడదామనుకున్నా’’ అంటూ తన అపార్టుమెంటు దగ్గరలో నివసిస్తున్న ఉత్తరాది వలస కార్మికుల దైన్యాన్ని వివరించారామె.

ఆరు వేల జీతం ఉన్న మహిళే అంత సాయం చేస్తున్నప్పుడు, లక్షకు పైగా జీతం తీసుకునే నేనెంత చేయాలి? అనుకున్నారు రాము.

“నిజానికి లాక్‌డౌన్‌కంటే ముందే సరుకులు కొని పెట్టుకోవడంవల్ల మొదట్లో నేనసలు కాలు బయట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. ఆ మహిళతో మాట్లాడిన తర్వాత పరిస్థితిని గమనించా. వలస కార్మికులతో మాట్లాడా. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అప్పుడు అర్ధమైంది’’ అని చెప్పుకొచ్చారు రాము.

వలస కూలీలు, పేదలను ఏటీఎం ఆదుకుంది

ఆలోచనను మార్చిన మాటలు

వలస కార్మికులకు ఏదో ఒకటి చేయాలనే ఆయన అంతర్మధనం ఎనీ టైమ్‌ మీల్‌-ఏటీఎం ఏర్పాటుకు దారి తీసింది.

“మా అపార్టుమెంటులో కింద కిరాణా దుకాణం వ్యక్తితో మాట్లాడి, మొత్తం 148 మంది వలస కార్మికులకు జూన్ వరకూ వాళ్లకు ఏది కావాలంటే అది ఇవ్వాలని చెప్పాను. వాళ్లు స్వస్థలాలకు వెళ్ళే వరకూ తిండికి కావాల్సిన అవసరాలన్నీ చూసుకున్నా’’ అంటూ రైస్ ఏటీఎం ప్రారంభమైన విధానాన్ని వివరించారు రాము.

ఆ 14 8మంది వలస కార్మికులూ, రెండు నెలల పాటు కిరాణా షాపుల్లో కొన్న సరుకుల బిల్లును రామూయే కట్టారు. ఇంతటితో ఆగకుండా మిగతా వారి కోసం తానే స్వయంగా ఆహారం వండి సరఫరా చేయడం ప్రారంభించారు.

వలస కార్మికులు వెళ్లిపోయినా ఆయన మొదలుపెట్టిన రైస్ ఏటీఎం కొనసాగుతోంది. తన అపార్టుమెంటు బయట ఒక చెట్టు కింద బియ్యం మూటలు పెట్టి ఉంచారు రాము.

వలస కూలీలు, పేదలను ఏటీఎం ఆదుకుంది

వలస కార్మికులు వెళ్లిపోయినా ఎందుకు కొనసాగిస్తున్నారు?

వలస కార్మికులు వెళ్లిపోవడంతో ఈ రైస్ ఏటీఎంను ఆపేద్దాం అనుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులు తెరవక పోవడంతో ఆ ప్రాంతానికి చెందినవారు, అలాగే చిన్నచిన్న వృత్తులు చేసుకునే స్థానికులు అంటే డ్రైవర్లు, ఇస్త్రీ, కటింగ్ షాపుల వారు, ఇళ్లల్లో పని చేసేవారు, ఇంకా పనులు ప్రారంభించని రంగాల వారు సాయం కోసం రాము దగ్గరకు రావడం ప్రారంభించారు. దీంతో రైస్‌ ఏటీఎంను మరో రెండు నెలలు కొనసాగించారాయన.

ఆగష్టు నాటికి ప్రైవేటు టీచర్లు రావడం మొదలుపెట్టారు. ‘‘ప్రైవేటు టీచర్ల కష్టం చెప్పడానికి మాటలు కూడా రావు. అద్భుతంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ చెప్పే టీచర్లు అడ్డా మీద పని కోసం నుంచోవడం, రోడ్డు పక్కన బండ్లు పెట్టుకుని టిఫిన్లు అమ్మడం నేను చూశాను’’ అన్నారు రాము.

“ఓ కార్పొరేట్ స్కూల్ టీచర్ 15 రోజులకు సరిపడా బియ్యం కావాలంటూ గచ్చిబౌలి నుంచి ఎల్బీనగర్ వచ్చారు’’ అని గుర్తు చేసుకున్నారు రాము.

లాక్‌డౌన్‌లో బాగా దెబ్బతిన్న మధ్యతరగతి ప్రజలు టీచర్లే. ఈ సాయం గురించి ఆ నోటా ఈ నోటా విని ఎల్‌.బి.నగర్‌ రైస్‌ ఏటీఎంకు కొందరు టీచర్లు వచ్చారని చెప్పారు. “వారికి 4 నెలలుగా జీతాలు లేవు. ట్యూషన్లు లేవు. పది మంది పని చేసేచోట ఆన్‌లైన్‌ క్లాసుల్లో ఒక్కరితోనే సరిపోతోంది. భాషా పండితుల పరిస్థితి మరీ ఘోరం. ఆటోలో వెళ్తే 50 రూపాయలు అవుతాయని బియ్యం మూటను నెత్తిమీద పెట్టుకుని వెళ్లిన మధ్య తరగతి ప్రజలను చూశాను’’ అన్నారు రాము.

మధ్య తరగతికి వారికి సరుకులు పంచే విషయంలో విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని రైస్ ఏటీఎం నిర్వాహకులు చెప్పారు. మంచి దుస్తులు వేసుకున్నవారు కూడా బియ్యం కోసం రావడంతో కొన్న బియ్యం కాకుండా, ఇతరులు ఇచ్చిన రేషన్ బియ్యాన్ని మాత్రమే పంచగలమని మా వలంటీర్లు వారికి చెప్పారు. అవతలివారు దానికి సరేనన్నారు. ‘‘అర్హత లేని వారికి సాయం అందించకూడదన్న ఉద్దేశంతో ఇలా స్క్రూటినీ చేశాం. తర్వాత వారికి పూర్తి సాయం అందించాం’’ అన్నారు నిర్వాహకులు.

ఒక్కోసారి ప్రైవేటు టీచర్లు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు క్యూలో నిల్చున్నప్పుడు పేదలు వ్యతిరేకత వ్యక్తం చేసేవారట. “ఇవి మీకోసం కాదు. మాలాంటి పేదల కోసం’’ అంటూ వారితో గొడవకు దిగేవారట. “మధ్యతరగతి వర్గాలవారూ, టీచర్లు ఒక్కోసారి అవమానాలకు గురయ్యేవారు. అదొక ఇష్యూ అయిపోయింది. దీంతో వారికి మళ్లీ సెపరేట్ లైన్ పెట్టాల్సి వచ్చింది” అన్నారు రాము.

హైదరాబాద్‌లో ఇటీవల భారీ వరదల సందర్భంగా కూడా ఈ రైస్‌ ఏటీఎం ఎల్‌.బి.నగర్‌ ప్రాంతవాసులకు సహాయం చేసింది. పాలు, బియ్యం, వండిన అన్నం సరఫరా చేశారు వలంటీర్లు.

వలస కూలీలు, పేదలను ఏటీఎం ఆదుకుంది
ఫొటో క్యాప్షన్, వలస కూలీలు, పేదలను ఏటీఎం ఆదుకుంది

లైన్లు, ప్రచారం ఎందుకు?

‘‘లైన్లు పెట్టడం మాకు కూడా ఇష్టం లేదు. ఎవర్నీ వెయిట్ చేయించకూడదు అనుకున్నాం. కానీ ఒక్కోసారి అంచనాకు మించి జనం వచ్చేవారు. దీంతో క్యూ పద్ధతి పెట్టాల్సి వచ్చింది. సాయం తీసుకునే వారి ముఖాలు కనిపించకుండా ఫొటోలు తీసుకున్నాం’’ అన్నారు రాము.

“ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెట్టడానికి కారణం సహృదయత ఉన్నవారు స్పందిస్తారన్న ఆలోచనే. అది నిజమైంది కూడా. ఏ సమయంలో వచ్చినా బాధితులకు సాయం అందిందంటే దానికి ప్రచారమే కారణం. కోవిడ్‌ రోగులకు ఇంటికి వెళ్లి కూడా సాయం అందించాం’’ అన్నారు రాము.

లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడిన అనేకమంది బాధలను దగ్గరగా చూసే అవకాశం కలిగిందంటారు రాము. “ఒక టీ అమ్ముకునే ముసలమ్మ తిండిలేక, రెండు రోజులపాటు ఎవరినీ సాయమడగకుండా కేవలం డికాక్షన్‌ తాగి బతికింది. ఆమెను పలకరిస్తే ఇంకెంతకాలం బేటా.. లాక్‌డౌన్‌ అయిపోతుంది. ఎలాగోలా బతుకుతాలే అన్నది. ఆమె ఆత్మవిశ్వాసం చూసి ఆశ్చర్యమేసింది’’ అన్నారు రాము.

ఏడు నెలల గర్భంలో స్వరాష్ట్రాలకు నడిచి వెళుతున్న మహిళలు, అన్నం పెడతానంటే చెప్పులు కావాలని అడిగినవాళ్లను చూసి ఎంతో బాధ కలిగిందంటారాయన.

పేదల కోసం సంపాదననంతా ఖర్చు చేసినా కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేయలేదు
ఫొటో క్యాప్షన్, పేదల కోసం సంపాదననంతా ఖర్చు చేసినా కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేయలేదు

రేషన్‌ ఉండగా ఇంతమంది బియ్యం కోసం ఎందుకు వస్తున్నారు?

నిజానికి రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా రేషన్‌ కార్డులు ఉన్నాయి. వారికి బియ్యం చౌక ధరకే అందుతోంది. కానీ రైస్ ఏటీఎం దగ్గర మామూలు రోజుల్లో కూడా 50 మందికి తక్కువ కాకుండా వచ్చేవారు.

అయితే వీరిలో ఎక్కువమంది రేషన్‌ కార్డులు పొందలేని వారు, అప్లై చేసినా రాని వారు, ఇతర రాష్ట్రాల వారూ, వేలి ముద్రల చెరిగిపోవడంతో రేషన్ బియ్యం అందని వారు, రేషన్‌ సరుకులు తీసుకోవడానికి వేరే సరుకులు కొనాల్సినవారు ఈ రైస్‌ ఏటీఎంల వద్దకు వచ్చేవారు.

ఇక్కడ సాయం పొందినవారిలో కొందరు, పరిస్థితులు బాగుపడ్డాక ఇతరకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కొందరు మొదట్లో అవసరానికి మించి బియ్యం తీసుకున్నా, తర్వాత అవసరమైన మేరకే తీసుకెళ్లి అందరికీ సాయం అందడంలో సహకరించారు. “ఓ 10 శాతం మంది ఈ పథకాన్ని దుర్వినియోగం చేసినవాళ్లున్నారు. అలాగని వారి కోసం 90 శాతం మందిని ఇబ్బంది పెట్టలేం కదా’’ అన్నారు రాము.

రైస్ ఏటీఎం

సాయంతోపాటు బాధ్యత

సాయం కోసం వచ్చిన వాళ్ల సమస్యలు తెలుసుకుని, వారికి ఎంత అవసరమో అంతే ఇచ్చేవారు వలంటీర్లు. వారానికి సరిపడా సరుకు ఇచ్చి, ఈలోగా ఏదో ఒక పని చూసుకునేలా ప్రోత్సహించే వాళ్లమని రైస్‌ ఏటీఎం నిర్వాహకులు చెప్పారు.

ఇంటి అద్దె కట్టలేక ఖాళీ చేస్తున్నామని చెప్పినవారికి ధన సహాయం కూడా చేశామని రైస్‌ ఏటీఎం నిర్వహాకులు చెప్పారు. ‘‘అద్దె ఎంత సమస్య అయిందంటే, ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసేవారు. ముఖ్యంగా తిరిగి ఊళ్లకు వెళ్లలేని వారు అద్దె విషయంలో సాయం చేయమనే వారు. నేను ఓనర్లతో మాట్లాడి సగమో, పూర్తిగానో అద్దె ఇచ్చాను ’’ అన్నారు రాము.

“ఒక ఇద్దరు వ్యక్తులు ఇంటికి అద్దెకట్ట లేక బైట నుంచి తాళం పెట్టి లోపల రహస్యంగా ఉంటూ తమ అవసరాల కోసం తెల్లవారుజామున ఎవరికీ కనిపింకుండా బయటకు వచ్చేవారు. నాకొక రోజు ఫోన్ వచ్చింది. మేం తెల్లవారుజామున వస్తే సరుకులు ఇస్తారా అని అడిగారు. ఉదయం 4.30కి పది కి.మీ. నడచి వచ్చి సరుకులు తీసుకుని వెళ్లారు. పూట గడవడం కోసం తాము రోజుకు ఒకపూటే భోజనం చేస్తూ కొన్ని నెలలు బతికామని వారు చెప్పారు’’ అన్నారు రాము.

రైస్ ఏటీఎం

ఈవెంట్లకు సపోర్ట్ అందించే ఓ టెక్‌ కంపెనీలో రాము హెచ్‌.ఆర్‌. మేనేజర్‌గా చేస్తున్నారు. కోవిడ్‌ కారణంగా ఈవెంట్లు కూడా రద్దు కావడంతో తనకు కాస్త టైమ్‌ దొరికిందని రాము చెప్పుకొచ్చారు.

ఈ పని కోసం తను, తన కుటుంబం దాచుకున్న డబ్బునంతా ఖర్చు పెట్టామని చెప్పారు రాము. నేను ఈ సాయం చేయగలుగుతున్నానంటే ఆ క్రెడిట్ అంతా తన భార్యా పిల్లలదేనని అన్నారాయన.

‘‘నేను దీని కోసం నా లగ్జరీని వదులుకుని, కనీస సౌకర్యాలకు పరిమితం అయ్యాను. నా కుటుంబ సభ్యులు నేను ఖర్చు పెడుతున్నానన్న బాధకన్నా, నాకు కోవిడ్‌ సోకుతుందేమోనని ఎక్కువగా భయపడ్డారు” అన్నారు రాము.

‘‘ఏదీ ఆశించకుండా ఎవరైనా ఇంత సాయం చేస్తారా? ఇదంతా గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేయడానికి వేసిన ఎత్తు అని కొందరు విమర్శించారు. కచ్చితంగా నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని అనుకున్నారు చాలా మంది. కానీ ఎన్నికల తర్వాత వారికి క్లారిటీ వచ్చింది’’ అన్నారు రాము.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌లోని అందరి ఇల్లు ఇది.. ఆకలి వేస్తే వచ్చి వండుకొని తినొచ్చు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)