సూడాన్ ఖల్వాస్: విద్యార్థులకు జంతువులకు వేసినట్లు సంకెళ్లు వేసే బడి... బీబీసీ రహస్య చిత్రీకరణలో వెలుగు చూసిన గగుర్పొడిచే వాస్తవాలు

ఫొటో సోర్స్, Jess Kelly/BBC
- రచయిత, ఫతే అల్-రహమాన్ అల్-హందానీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేను అహ్మద్‌ను కలిసినప్పుడు, కాళ్లకు సంకెళ్లు ఉన్న అతడు ఒక గదిలో ఒంటరిగా ఉన్నాడు. అతడి శరీరంపై కొట్టిన గుర్తులు కనిపిస్తున్నాయి. తన వయసెంతో అతడికే తెలీదు. దాదాపు పదేళ్లుంటాయేమో.
సూడాన్‌లో ఖల్వాస్ అనే 23 ఇస్లాం విద్యా సంస్థల్లో ఒక దానిలో నేను అతడిని చూశాను. అక్కడ నేను రెండేళ్లకు పైగా నా రహస్య చిత్రీకరణ కొనసాగించాను.
2018 మొదటి నుంచీ అలాంటి పిల్లలను చాలామందిని చూశాను, వారిలో ఐదేళ్ల పిల్లలు కూడా ఉన్నారు. వారిని షేక్స్ లేదా ఆ పాఠశాలలను చూసుకునే మతపెద్దలు తరచూ దారుణంగా కొడుతుంటారు. కాళ్లకు సంకెళ్లు వేసి తిండి, నీళ్లు ఇవ్వకుండా బంధిస్తారు.
మా డాక్యుమెంటరీలో కనిపించని కొందరు పిల్లలు తమపై అత్యాచారాలు కూడా జరిగాయని, రకరకాల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నాకు చెప్పారు.

ఫొటో సోర్స్, Jess Kelly/BBC
దేశవ్యాప్తంగా దాదాపు 30 వేల ఖల్వాస్‌లు ఉన్నాయి. సూడాన్ ప్రభుత్వం వివరాల ప్రకారం వీటికి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు దాతల నుంచి విరాళాలు అందుతున్నాయి.
ఈ పాఠశాలల్లో పిల్లలకు ఖురాన్ కంఠస్థం చేయడం నేర్పుతున్నారు. అక్కడ ఎలాంటి ఫీజులూ వసూలు చేయకపోవడంతో.. చాలా కుటుంబాలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు లేని మారుమూల ప్రాంతాలవారు ప్రత్యామ్నాయ విద్యాసంస్థలకు బదులు వీటినే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ పాఠశాలల్లోనే ఉండే విద్యార్థులు సెలవుల్లో మాత్రమే ఇంటికి వస్తుంటారు.
దేశంలో చాలా మంది ఎన్నో తరాల నుంచీ నడుస్తున్న ఈ పాఠశాలలను సూడాన్ సంస్కృతికి కేంద్రాలుగా భావిస్తున్నారు, జాతీయ గుర్తింపులో వీటిని ఒక భాగంగా చూస్తున్నారు.

అయితే, ఇటీవల ఈ పాఠశాలల్లో విద్యార్థులను కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఖల్వాస్‌లో షేక్స్ అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. కానీ, జాతీయ మీడియా, ప్రభుత్వం, మానవ హక్కుల సంస్థలు వీటిని అసలు పట్టించుకోవడం లేదు.
ఈ ఖల్సాల్లో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో నేను బయటపెట్టాలని అనుకున్నాను. తమ బాధలను చెప్పుకోలేకపోతున్న అక్కడి చిన్నారులకు గొంతుకగా మారాలనుకున్నాను.
బాల్యంలో నాకు కూడా ఇలాంటి కొన్ని అనుభవాలు ఉన్నాయి. నేను కూడా ఖల్వాకు వెళ్లాను. ఉపాధ్యాయుల దగ్గర దెబ్బలు తినకుండా ఉండడం, నాకు ప్రతిరోజూ ఒక పరీక్షలా ఉండేది.
ఈ పరిశోధనతో నా స్నేహితులు, మా బంధువులు నన్ను దూరం పెడతారని నాకు తెలుసు. కానీ ఈ కథను చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దారిలో నాతో మాట్లాడే కొంతమంది మతపరమైన విద్యపై దాడిచేయాలనుకునే పాశ్చాత్య కుట్రలో నేను భాగమైనట్లు ఆరోపణలు కూడా చేయచ్చు.

ఫొటో సోర్స్, Jess Kelly/BBC
బీబీసీని నన్ను సంప్రదించడానికి ముందే, నేను కొన్ని నెలల నుంచీ ఖల్వాస్‌లలో రహస్యంగా చిత్రీకరిస్తూ గడిపాను. నేను వెళ్లిన మొదటి ఖల్వా పేరు 'హజ్ ఎల్-దలీ'. అక్కడ పిల్లలను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నా ఫోన్‌తో రహస్యంగా చిత్రీకరించడానికి, అందరితో కలిసి మధ్యాహ్నం ప్రార్థనలకు నేను ఆ పాఠశాలలోని మసీదులోకి వెళ్లేవాడిని.
లోపల నేను మోకాళ్లపై వంగినపుడు, ఖంగుమని శబ్దం వచ్చింది. నా గుండె ఆగిపోయింది. తలపైకెత్తి చూస్తే, పిల్లలు కనిపించారు. వాళ్ల కాళ్లకు జంతువులకు వేసినట్లు గొలుసులు ఉన్నాయి.
ప్రార్థనలు ముగిశాక పిల్లలు కదిలారు. కానీ, నేను వెళ్లబోతుండగా, గట్టిగా అరుపులు, గుండెలు పిండేసే ఏడుపులు వినిపించాయి.
ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోందో చూద్దామని వెళ్లాను. అవి నన్ను దగ్గరే ఉన్న పిల్లలు చదువుకునే ఒక గదిలోకి తీసుకెళ్లాయి. అక్కడ ఒక పిల్లాడు ఏడుస్తున్నాడు. తన రెండు కాళ్లూ కలిపి గొలుసులు వేశారు. కనిపిస్తున్న దానిని నేను రహస్యంగా షూట్ చేస్తున్నాను. ఆ పిల్లాడి పేరు అహ్మద్. తనకు ఇంటికి వెళ్లాలనుందని నాకు చెప్పాడు. నేను తనకు భరోసా ఇవ్వాలనుకున్నా, కానీ షేక్స్ వస్తున్న చప్పుడు వినిపించడంతో నా చిత్రీకరణ ఆపేసి, ఖల్వాస్ నుంచి బయటికొచ్చేశాను.

కానీ, అక్కడ అసలు ఏం జరుగుతోందో మరింత తెలుసుకోడానికి తర్వాత రోజు నేను మళ్లీ అక్కడికి వెళ్లాను. పిల్లలతో మాట్లాడుతూ, నా ఫోన్లో వారిని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటే.. ఒక పెద్ద పిల్లాడు నన్నే చూస్తుండడం కనిపించింది. తను హఠాత్తుగా లేచి వెళ్లి, కాసేపటికి ఆ స్కూల్ ఇంఛార్జిగా ఉన్న షేక్‌ను అక్కడికి తీసుకొచ్చాడు. ఆయన రాగానే నాపై అరవడం మొదలెట్టాడు. విద్యార్థులను ఎందుకు చిత్రీకరిస్తున్నావని అడిగాడు. నేను వెంటనే అక్కడ నుంచి బయటికొచ్చేశాను.
తర్వాత ఆ స్కూలుకు కొత్త షేక్‌ను నియమించామని, పిల్లలను కొట్టడం, గొలుసులు వేయడం ఆగిపోయిందని హజ్ ఎల్- దలీ నిర్వాహకులు బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Jess Kelly/BBC
నా ఖల్వా జ్ఞాపకాలు
నాకు జరిగిందంతా షాక్‌లా ఉంది. అక్కడ ఆ షేక్‌తో గొడవ పెద్దదయ్యుంటే, నేను ఏమయ్యేవాడినో ఎవరికీ తెలిసేది కాదు. కానీ, అక్కడ కనిపించిన దృశ్యాలు కూడా నన్ను కదిలించాయి. అవి ఖల్వాలో స్వయంగా నా అనుభవాలను గుర్తు చేశాయి. నేను వెళ్లిన పాఠశాలలో కొట్టడం అనేది మామూలే. అయితే, అక్కడ ఎవరికీ సంకెళ్లు వేసేవారు కాదు.
14 ఏళ్ల వయసులో మొదటిసారి ఖల్వాకు వెళ్లే రోజు కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. సంప్రదాయ జలబియా దుస్తులు వేసుకోడానికి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఆత్రుతతో ఉన్నా. కానీ తర్వాత నాకెందుకో ఏదో సరిగా లేదనిపించింది. మిగతా పిల్లలు షేక్స్, టీచర్లను చూసి భయపడుతున్నట్లు నాకు అనిపించేది. సాయంత్రం పూట తిట్టడం, కొట్టడం మొదలయ్యేవి. మేం తూగినా, కళ్లు మూసినా షేక్ మమ్మల్ని కొట్టేవాడు. దాంతో మేం మెలకువగా ఉండేవాళ్లం. నేను ఖల్వాలో దాదాపు నెలపాటు ఉన్నాను. ఎన్నోసార్లు దెబ్బలు సహించాను. తిరిగి ఇంటికి వచ్చాక ఎన్ని బాధలు పడ్డానో అమ్మనాన్నలకు చెప్పాను. నేను చదువు మధ్యలో ఆపేయడం వాళ్లకు సంతోషం ఇవ్వదు. కానీ, మళ్లీ అక్కడికి వెళ్లమని వాళ్లు నన్ను బలవంతం చేయలేదు.
హజ్ ఎల్-దలీ ఇంచార్జి షేకుతో గొడవ జరిగిన తర్వాత మళ్లీ ఖల్వాస్‌లోకి వెళ్లి చిత్రీకరించాలంటే నాకు ధైర్యం చాల్లేదు. నా దగ్గరున్న ఆధారాలను నేను పరిశోధనాత్మక జర్నలిజంలో ఉన్న అరబ్ రిపోర్టర్ల(ఏఆర్ఐజే) సంస్థ దగ్గరకు తీసుకెళ్లాను. బీబీసీ న్యూస్ అరబిక్‌తో టచ్‌లో ఉండేలా నాకు సాయం చేశారు. ఆ క్షణం నుంచి అంతా మారిపోయింది.

ఫొటో సోర్స్, Jess Kelly/BBC
లండన్‌లో ఉన్న మా ఎడిటర్ నాకు మమ్దో అక్బిక్ అనే ప్రొడ్యూసర్‌ను కేటాయించారు. ఆయన సిరియన్. నేను సూడానీ. మేమిద్దరం అరబిక్‌లో మాట్లాడుకుంటున్నా, మా మాండలికాలు చాలా భిన్నంగా ఉండేవి. కానీ, మేం కలిసి పనిచేయడానికి అవి అడ్డు కాలేదు.
మేం వెళ్లాల్సిన ఖల్వాస్‌లను గుర్తించాం. తగిన సాక్ష్యాలు సేకరించాం. ఎలాంటి భద్రత వ్యూహాలు అనుసరించాలో మాట్లాడుకున్నాం. కానీ, రహస్యంగా ఆడియో రికార్డ్ చేసే ఒక పరికరం అందగానే, నాకు కొండంత బలం వచ్చింది. నా పనిని ధైర్యంగా కొనసాగించేలా అది నాలో విశ్వాసం నింపింది.
సూడాన్ విశాలంగా ఉంటుంది. దేశంలో పర్వతాలు, ఎడారి మైదానాలు, ఒకవైపు ఎర్ర సముద్రం ఉంటాయి. నా పరిశోధనలో భాగంగా నేను దేశంలో దాదాపు 3 వేల మైళ్లు కవర్ చేసుంటాను. ఎక్కువగా బస్సుల్లోనే వెళ్లేవాడిని. దారుణంగా వేధింపులకు గురైన చిన్నారుల కుటుంబాలను నేను కలిశాను. కొన్ని కేసుల్లో పిల్లలు ఆ పాఠశాల్లోనే చనిపోయారు. కానీ, వారి మృతికి కారణం ఏంటనేది బయటపెట్టడం చాలా కష్టం.
ఖల్వాస్‌లు నడిపే షేకులకు తమ సమాజాల్లో చాలా బలం, ప్రభావం ఉంటుంది. పిల్లల కుటుంబాలు చాలా అరుదుగా వారిపై ఆరోపణలు చేస్తారు. ఈ కేసులు కోర్టుల వరకూ వెళ్లినా, కొంతకాలం తర్వాత చాలా మంది వాటిని వెనక్కు తీసుకుంటారు. లేదంటే పరిహారం కోసం రాజీ చేసుకుంటారు.

ఫొటో సోర్స్, Jess Kelly/BBC
మా చిత్రీకరణలో షేకులకు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబాలు కూడా దీనికి అతీతంగా ఏం చెప్పలేదు. తమ విద్యార్థులకు ఏది ఉత్తమం అనేది షేకులకు బాగా తెలుసని చాలా కుటుంబాలు నమ్ముతున్నాయి. ఏవైనా 'తప్పులు' జరిగుంటే, అదంతా ఆ 'దేవుడి లీల' అంటున్నాయి.
నా కుటుంబం కూడా అలాగే అనుకుంది. కానీ, వారికి తెలీకుండా నేను రహస్యంగా నా పరిశోధన కొనసాగించాను. నేను మా స్వస్థలం ఉత్తర దర్ఫుర్‌లో ఉన్న ఖల్వాకు వెళ్లినపుడు, ఇప్పటికీ అక్కడే ఉన్న మా బంధువులను చూసి నాకు చాలా బాధేసింది.
మేం చిత్రీకరించన దృశ్యాలు ప్రసారం చేశాక నన్ను మా కుటుంబం వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారు. వాళ్లు కనీసం నన్ను ప్రశ్నిస్తారని లేదంటే నన్ను నిలదీస్తారని నేను అనుకున్నా. కానీ, వాళ్లు నన్ను ఎవరో తెలీని మనిషిలా చూస్తున్నారు. కానీ, మా అమ్మనాన్న నాకు ఫోన్ చేశారు. నా భద్రత గురించి వారికి చాలా ఆందోళనగా ఉన్నప్పటికీ, మేం నీకు అండగా ఉన్నామని చెప్పారు. నా కుటుంబం అర్థం చేసుకున్నందుకు నాకు ఉపశమనం అనిపించింది.

ఫొటో సోర్స్, Jess Kelly/BBC
రహస్య చిత్రీకరణకు స్పందన
మా డాక్యుమెంటరీ సూడాన్‌లో చాలా ప్రభావం చూపించింది. మా పరిశోధనకు కేంద్రంగా నిలిచిన కుటుంబాలకు వారి స్థానిక సమాజాల నుంచి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్థికంగా, న్యాయపరంగా, భావేద్వేగపరంగా మద్దతు వెల్లువెత్తింది. సోషల్ మీడియాలో ఆగ్రహించిన చాలా మంది ఖల్వాస్‌లు మూసేయాలని పిలుపునిచ్చారు. కొందరు మాత్రం మా డాక్యుమెంటరీని ఇస్లాంపై దాడిగా వర్ణించారు. బీబీసీ ఇస్లాం వ్యతిరేక ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
కానీ, సూడాన్ కొత్త ప్రభుత్వం మాత్రం దీనిపై చాలా నెమ్మదిగా స్పందించింది. ఖల్వాస్‌లో సంస్కరణల గురించి అది గత ఏడాది నుంచీ మాట్లాడుతోంది.
"ఖల్వాస్‌లో విద్యార్థులను కొట్టడం, వేధించడం, మానవ హక్కులు లేదా బాలల హక్కులను ఉల్లంఘించడం ఇక జరగదని" మా డాక్యుమెంటరీలో మాట్లాడిన దేశ మతపరమైన వ్యవహారాల మంత్రి నసీరుద్దీన్ ముఫ్రెహ్ చెప్పారు. కానీ నిజంగానే ఏదైనా మార్పు వస్తుందా అనేది మనం వేచి చూడాలి.
డాక్యుమెంటరీ ప్రసారమైన తర్వాత బీబీసీ తన కథనంలో చూపించిన అన్ని స్కూళ్లలో విచారణ జరుపుతామని సూడాన్ ప్రభుత్వం చెప్పింది. విద్యా సంస్థల్లో పిల్లలను కొట్టడాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని కూడా తెచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలో ఖల్వాస్‌లకు నిధులు అందించడం కూడా ఆపేసింది.
ఇటీవల కాలంలో ఎదురైన దారుణమైన అనుభవాల నుంచి బయటపడ్డానికి సూడాన్ ప్రయత్నిస్తోందనడానికి ఇవన్నీ సంకేతాలు. కానీ, ఖల్వాస్‌లో కాళ్లకు గొలుసులతో, వేధింపులకు గురవుతున్న వేలాది చిన్నారుల దయనీయ స్థితి దేశాన్ని వెంటాడుతూనే ఉంది. సూడాన్‌లో శక్తివంతమైన మతసంస్థలను సవాలు చేయడం ప్రభుత్వ సంకల్పానికి పరీక్షగా నిలవనుంది.
(కొన్ని పేర్లు మార్చాం)
ఇవి కూడా చదవండి:
- ఎవరెస్టు శిఖరం ఎత్తు సుమారు ఒక మీటరు పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- రైతుల నిరసనలు: మోదీ మంచి వక్త... కానీ, రైతులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ’నా భర్త నా కిడ్నీ దొంగిలించాడు’
- నల్లగా ఉన్నావంటూ భర్త చేసే వేధింపులకు తట్టుకోలేక భార్య ఆత్మహత్య
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- లాక్డౌన్ ఎఫెక్ట్: విపరీతంగా పెరిగిన రివెంజ్ పోర్న్ కేసులు
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- లవ్ జిహాద్: హిందు-ముస్లింల మధ్య పెళ్లిళ్లు అడ్డుకొనేందుకు చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు?
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








