అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే

తాము ఏ మతానికీ చెందమని, మతేతరులమని చెప్పేవారి సంఖ్య అరబ్ దేశాల్లో పెరుగుతోందని పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో బీబీసీ కోసం నిర్వహించిన ఒక సమగ్రమైన భారీ సర్వేలో తేలింది.
'బీబీసీ న్యూస్ అరబిక్' కోసం అరబ్ బారోమీటర్ పరిశోధన నెట్‌వర్క్ చేపట్టిన ఈ విస్తృతమైన సర్వేలో 25 వేల మందికి పైగా ప్రజలను నిర్వాహకులు ప్రశ్నించారు.
సూడాన్, జోర్డాన్, అల్జీరియా, మొరాకో, ట్యునీసియా, యెమెన్, ఇరాక్, లెబనాన్, లిబియా, ఈజిప్ట్ దేశాలు, పాలస్తీనా భూభాగంలో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్నవారిని మతవిశ్వాసాలు, మహిళా హక్కులు, వలసలు, భద్రత, లైంగికత సహా అనేక అంశాలపై ప్రశ్నించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
2018 ద్వితీయార్ధం నుంచి 2019 మధ్య జరిగిన ఈ సర్వేలో వెల్లడైన ప్రధానాంశాలు ఇవీ:

1. మతవిశ్వాసాలు
అరబ్ ప్రాంతంలో తమని తాము మతాన్ని నమ్మనివారిగా, మతేతరులుగా చెప్పుకొనేవారి సంఖ్య 2003లో ఎనిమిది శాతం ఉంటే ఇప్పుడది 13 శాతానికి పెరిగింది.
30 ఏళ్లలోపువారిలో ఈ సంఖ్య 18 శాతంగా ఉంది.
ఈ విభాగంలో ఒక్క యెమెన్‌లో మాత్రమే తగ్గుదల నమోదైంది.

2. మహిళల సాధికారత
దేశానికి అధ్యక్షురాలు లేదా ప్రధానమంత్రి అయ్యే హక్కు మహిళకు ఉందనే మాటను అత్యధికులు సమర్థించారు.
ఒక్క అల్జీరియాలోనే 50 శాతం కన్నా తక్కువ మంది దీనికి మద్దతు పలికారు.
కుటుంబ విషయాలకు వస్తే మాత్రం ఎప్పుడూ నిర్ణయాధికారం భర్తలకే ఉండాలని అత్యధికులు చెప్పారు.
మెజారిటీ మహిళలు కూడా ఇదే మాట అన్నారు.
మొరాకోలో మాత్రం జనాభాలో సగం కన్నా తక్కువ మంది నిర్ణయాధికారం ఎప్పుడూ భర్తకే ఉండాలని అభిప్రాయపడ్డారు.

3. స్వలింగ సంపర్కం
అరబ్ ప్రాంతమంతటా స్వలింగ సంపర్కానికి ఆమోదయోగ్యత లేదు.
కొన్ని చోట్ల తక్కువగాను, మరికొన్ని చోట్ల చాలా తక్కువగాను దీనికి ప్రజల్లో ఆమోదం ఉంది.
ఇరుగుపొరుగు దేశాల కంటే సామాజికంగా ఉదారంగా ఉంటుందనే పేరున్న లెబనాన్‌లో కూడా స్వలింగ సంపర్కం పట్ల కేవలం ఆరు శాతం మందిలోనే ఆమోదం వ్యక్తమైంది.
అరబ్ దేశాల్లో స్వలింగ సంపర్కం కంటే పరువు హత్యలపై తక్కువ వ్యతిరేకత ఉంది.

4. ట్రంప్, పుతిన్, ఎర్డోగన్ విధానాలు
అమెరికా, రష్యా, టర్కీ అధ్యక్షులు డోనల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, రెసెప్ తయీప్ ఎర్డోగన్ విధానాల మధ్య పోలిక పెడితే ట్రంప్ మూడో స్థానంలో నిలవగా, ఎర్డోగన్ మొదటి స్థానం దక్కించుకున్నారు.
సర్వే చేపట్టిన మొత్తం 11 ప్రాంతాల్లో ట్రంప్ పశ్చిమాసియా విధానాలకు చివరి స్థానమే వచ్చింది.
ఎర్డోగన్ విధానాలకు ఏడు ప్రాంతాల్లో సగం లేదా అంత కంటే ఎక్కువ మంది మద్దతు లభించింది.
లెబనాన్, లిబియా, ఈజిప్ట్ దేశాల్లో ఎర్డోగన్ విధానాల కంటే పుతిన్ విధానాలను ఎక్కువ మంది సమర్థించారు.

5. భద్రత
పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో చాలా మంది ఆలోచించే అంశాల్లో భద్రత ఒకటి.
మీ దేశ సుస్థిరతకు, భద్రతకు అతిపెద్ద ముప్పు కలిగించే దేశాలేవని ప్రశ్నించగా- ఇజ్రాయెలే అన్నింటికన్నా పెద్ద ముప్పు అని అత్యధికులు చెప్పారు.
అరబ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ తర్వాత అమెరికా నుంచి అతిపెద్ద ముప్పుందని, ఆ తర్వాతి స్థానంలో ఇరాక్ ఉందని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు.

6. వలస
అరబ్ ప్రాంతంలో ప్రతీ ఐదుగురిలో ఒకరు స్వదేశం నుంచి వేరే దేశానికి వలస వెళ్లిపోవాలనుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.
సూడాన్‌లో అయితే ఏకంగా 50 శాతం మంది దేశాన్ని వీడాలనుకొంటున్నారు.
వలస వెళ్లాలనుకోవడానికి ఆర్థిక అంశాలే ప్రధాన కారణమని సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు.
వీరందరూ ఐరోపా దేశాలకే వెళ్లాలనేమీ భావించడం లేదు.
అరబ్ ప్రాంతాన్ని వీడాలనుకొనేవారి మొదటి ప్రాధాన్యం ఐరోపానే అయినప్పటికీ, ఇంతకుముందున్నంత ప్రాధాన్యం ఇప్పుడు కనిపించ లేదు.
ఉత్తర అమెరికా వెళ్లాలనుకొనేవారి సంఖ్య పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Michael Latham
సర్వే మెథడాలజీ
సర్వే చేపట్టిన అరబ్ బారోమీటర్ పరిశోధన నెట్‌వర్క్ అమెరికాలో న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఇలాంటి సర్వేలు 2006 నుంచి నిర్వహిస్తూ వస్తోంది.
సర్వేలో భాగంగా నిర్వాహకులు పది దేశాలు, పాలస్తీనా భూభాగంలో 25,407 మందిని నేరుగా కలిసి దాదాపు 45 నిమిషాలు మాట్లాడారు. ఈ సర్వే పరిధిలో ఇరాన్, ఇజ్రాయెల్ లేవు.
అరబ్ ప్రాంతంలోని అత్యధిక దేశాల్లో సర్వే జరిగింది. కానీ కొన్ని గల్ఫ్ దేశాలు సర్వే నిర్వహణకు పూర్తిస్థాయి సహకారాన్ని నిరాకరించాయి.
కువైట్ ఫలితాలు చాలా ఆలస్యంగా రావడంతో సర్వే వివరాల్లో కలపడం వీలు కాలేదు. సిరియాలో సర్వే నిర్వహణ కష్టతరం కావడంతో ఆ దేశంలో దీనిని చేపట్టలేదు.
చట్టపరమైన, సాంస్కృతికపరమైన కారణాలతో కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు కొన్ని ప్రశ్నలను తొలగించాలని నిర్దేశించాయి.
సర్వే మెథడాలజీ పూర్తి వివరాలను అరబ్ బారోమీటర్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
(కథనం: బెకీ డేల్, ఇరీన్ డెలాలా టొరె ఎరెనాస్, క్లారా గుయ్‌బౌర్గ్, టామ్ డి కాస్టెల్లా)
ఇవి కూడా చదవండి:
- ఒక్క అంతర్జాతీయ వన్డే కూడా ఆడలేదు.. కానీ, వరల్డ్‌కప్ జట్టులో చోటు.. ఎవరీ మయాంక్ అగర్వాల్
- పాకిస్తాన్ పనైపోయిందా, లేదా.. సెమీస్ అవకాశాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయంటే..
- Liberalism: ఉదారవాదానికి కాలం చెల్లిందా? పుతిన్ మాట నిజమేనా?
- తెలంగాణలో అటవీ సిబ్బందిపై టీఆర్ఎస్ నేత దాడి
- #INDvBAN బంగ్లాదేశ్‌కు చావో రేవో మ్యాచ్.. భారత్ సెమీస్ చేరుతుందా?
- హైదరాబాద్: 12 ఏళ్లకే నరకం చూపించారు
- ‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
- అసద్ పైచేయికి రసాయన ఆయుధాలే కారణమా?
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- మోదీపై ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారికి జీవితఖైదు ఎందుకు పడింది?
- అంతులేని ప్రశ్న: రోజుకు ఎన్ని జంతువులు పుడుతున్నాయి?
- ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే
- ఎందుకీ హత్యలు.. ఎవరు ఎవరిని చంపుతున్నారు
- మనిషి పాదాల పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది.. ఎందుకో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








