ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే

ఫొటో సోర్స్, WEIMIN CHU
పశ్చిమ గ్రీన్‌ల్యాండ్‌లోని ఒక దీవిలో గల ఉపర్నావిక్ అనే మత్య్సకార గ్రామం ఫొటో ఈ సంవత్సరం నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ ఫొటో పోటీల్లో ప్రధమ బహుమతి గెలచుకుంది.
ఫొటోగ్రాఫర్ వీమిన్ చు ఈ ఫొటో తీశారు. ''ఈ గ్రామం అందం నా ఊహకు అందనిది. అద్భుతంగా అనిపించింది'' అని తెలిపారు.
''నేను అక్కడికి విమానంలో వెళుతున్నప్పుడు దారి మొత్తం మొత్తం మంచుతో కప్పేసి ఉన్న తెల్లటి భూమి మాత్రమే కనిపించింది. కానీ అకస్మాత్తుగా చాలా దూరంలో ఒక పెద్ద, వేడి చుక్క కనిపించింది. అది ఉపెర్నావిక్'' అని ఆయన చెప్పారు.
ఈ గ్రామ జనాభా సుమారు వేయి మంది. మొత్తం దేశంలో 13వ అతి పెద్ద గ్రామం. ఈ గ్రామంలో ఆరు రోజుల పాటు ఫొటోలు తీస్తూ గడిపారు వీమిన్ చు. అలా వీధి దీపాల వెలుగులో నడుస్తున్న ఓ కుటుంబం ఫొటో తీశారు. అది బహుమతి తెచ్చిపెట్టింది.

నగరం - రెండో బహుమతి: వైమానిక శకంలో - జాసెన్ తోదొరోవ్

ఫొటో సోర్స్, JASSEN TODOROV
''శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నాలుగు రన్‌వేలు ఉన్నాయి. ఇక్కడి విమాన కదలికలను డాక్యుమెంట్ చేయాలన్నది నా స్వప్నం. అందుకోసం అనుమతులు సంపాదించాను.
ఆ రోజు ఇక్కడ గాలులు బలంగా ఉన్నాయి. గంటకు 35, 45 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి. అంటే విమానయానంలో కుదుపులు ఉంటాయి. ఇక ఒకవైపు ఫొటోలు తీస్తూ విమానాన్ని నియంత్రించటం చాలా కష్టం'' అని జాసెన్ తొదొరోవ్ వివరించారు.

నగరం - మూడో స్థానం: ఢాకా వీధులు - సందీపని చటోపాధ్యాయ్

ఫొటో సోర్స్, SANDIPANI CHATTOPADHYAY
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఇజ్తమా సమయంలో ప్రజలు వీధిలో ప్రార్థన చేస్తున్నారు. ముఖ్యమైన ఇస్లామ్ పండుగల్లో బిష్వా ఇజ్తమా ఒకటి. ఢాకాలో ఏటా జరిగే ఈ పండుగకు లక్షలాది మంది ముస్లింలు హాజరవుతారు.
ఇంత భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ప్రార్థనా మైదానాలు సరిపోవు. దీంతో చాలా మంది జనం ఢాకా మెయిన్ రోడ్‌కు వస్తారు. ఆ సమయంలో భూమి మీద రవాణా వ్యవస్థలన్నిటినీ నిలిపివేస్తారు'' అని సందీపని చటోపాధ్యాయ్ తెలిపారు.

మనుషులు - మొదటి బహుమతి : హౌఫెంగ్ లీ

ఫొటో సోర్స్, HUAIFENG LI
''చైనాలోని లీచెంగ్ కౌంటీలో సాయంత్రం ఒపెరా ప్రదర్శనకు కళాకారులు సిద్ధమవుతున్నారు. మేకప్ వేసుకునే దగ్గరి నుంచి స్టేజ్ మీద ప్రదర్శన ఇచ్చే వరకూ రోజంతా వీరితోనే ఉన్నాను.
చైనాలోని లోస్ మైదానంలో స్థానికులు లోస్ పొరలో గుంతలు తవ్వి గుహల వంటి గదులు ఏర్పాటు చేసుకుంటారు. వీటిని యోడాంగ్లు అంటారు. ఇందులో వేడిని కాపాడే గుణాలు శీతాకాలంలో జనం తీవ్ర చలిని తట్టుకోవటానికి ఉపయోగపడతాయి'' అని హౌఫెంగ్ లీ పేర్కొన్నారు.

మనుషులు - రెండో బహుమతి: నిత్యకృత్యం - యోషికి ఫుజివారా

ఫొటో సోర్స్, YOSHIKI FUJIWARA
''హాంగ్ కాంగ్‌లోని చోయ్ హుంగ్ హౌస్ దగ్గర ఉన్న ఓ పబ్లిక్ పార్క్‌లో ఈ ఫొటో తీశాను. మధ్యాహ్నం వేళ నేను అక్కడికి వెళ్లినపుడు అది రద్దీగా ఉంది. చాలా మంది యువకులు బాస్కెట్‌బాల్ ఆడుతున్నారు. ఫొటోలు తీసుకుంటున్నారు.
కానీ.. సూర్యోదయం సమయంలో వెళ్లినపుడు అది చాలా ఖాళీగా, నిశబ్దంగా వేరే ప్రదేశంలా కనిపించింది. ఈ ప్రాంతాన్ని ఉదయం వేళలో పొరుగున నివసించే వారికి కేటాయించారు. సూర్యోదయంలో ఒక వృద్ధుడు తాయ్ చీ చేస్తున్నపుడు అదో మార్మిక ఘట్టంగా అనిపించింది'' అని చెప్పారు యోషికి ఫుజివారా.

మనుషులు - మూడో బహుమతి: గుర్రాలు - జోస్ ఆంటోనియో జమోరా

ఫొటో సోర్స్, JOSE ANTONIO ZAMORA
''స్పెయిన్‌లో ప్రతి ఏటా సెయింట్ ఆంటొనీ ఫీస్ట్ రోజున లాస్ ల్యూమినరియాస్ అని పిలిచే జంతువుల శుద్ధి పండుగ జరుగుతుంది.
పద్దెనిమిదో శతాబ్దం నుంచీ జరిగే ఈ క్రతువులో అవీలా ప్రావిన్స్‌లో గుర్రాలు, రౌతులు మండల మీదుగా దూకుతారు. జంతువులకు ఎలాంటి హానీ జరగదు'' అని జోస్ ఆంటోనియో జమోరా తెలిపారు.

మనుషులు - గౌరవ బహుమతి: మూడ్ - నవీన్ వాస్తా

ఫొటో సోర్స్, NAVIN VATSA
''ఇండియాలోని దిల్లీలో యమునా నది ఒడ్డున సూర్యోదయం సమయంలో మౌనంగా ఆలోచిస్తున్న ఈ బాలుడి ఫొటో తీశాను.
వేలాదిగా సీగల్స్ మంద్రస్థాయిలో లయబద్ధంగా చేస్తున్న శబ్దాన్ని సందర్శకులు ఆస్వాదిస్తున్నారు. తూర్పు దిక్కు నుంచి ఉదయపు బంగారు వర్ణపు వెలుగు - పశ్చిమ దిక్కు నీలి కాంతితో కలిసి ఒక అలౌకిక వాతావరణాన్ని సృష్టిస్తోంది'' అని నవీన్ వాస్తా వివరించారు.

ప్రకృతి - మొదటి బహుమతి: లేలేత కళ్లు - తమారా బ్లాక్వెజ్ హేక్

ఫొటో సోర్స్, TAMARA BLAZQUEZ HAIK
''స్పెయిన్‌లోని మాన్‌ఫ్రేగ్ నేషనల్ పార్క్‌లో ఆకాశంలో దూసుకుపోతున్న అందమైన గ్రిఫాన్ రాబందు.
మృత పదార్థాలను రీసైకిల్ చేసే పనిని చూసుకునే రాబందులు పర్యావరణంలో చాలా ముఖ్యమైన సభ్యులు'' అంటారు తమారా బ్లాక్వెజ్ హేక్.

ప్రకృతి - రెండో బహుమతి: డ్రీమ్‌కాచర్ - డానీ సెపెకోవ్‌స్కీ

ఫొటో సోర్స్, DANNY SEPKOWSKI
''అల విరిగేముందు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్న మీదే గత ఏడాది కాలంగా పనిచేశాను. ఆ రోజున హవాయిలోని ఓహు తూర్పు వైపు సూర్యాస్తమయం ఫొటో తీయాలని నిర్ణయించుకున్నాను.
''ఈ అల విరుగుతుండగా నా కెమెరా వ్యూఫైండర్‌లోకి చూడాల్సి వచ్చింది. ఒక అల మన మీద విరుచుకుపడుతుండగా ఆ పని చేయటం ఈజీ కాదు'' అని డానీ సెపెకోవ్‌స్కీ తెలిపారు.

ప్రకృతి - మూడో స్థానం: డస్కీ - స్కాట్ పోర్టెలి

ఫొటో సోర్స్, SCOTT PORTELLI
''న్యూజిలాండ్‌లోని కైకోరా అగాథాల్లో డస్కీ డాల్ఫిన్లు ఆహారాన్వేషణలో తరచుగా పెద్ద సంఖ్యలో కలిసి ప్రయాణిస్తుంటాయి.
సముద్రంలో సునాయాసంగా జారిపోతుంటాయి. శ్వాస తీసుకోవటం కోసం మాత్రమే పైకి వస్తాయి. ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. వేగంగా వెళ్లే బోటుతో సమానంగా ఈదుతాయి. నేను బోటులో వేచివుండి ఈ డస్కీ డాల్ఫిన్ నీటి ఉపరితలాన్ని ఛేదించబోయే ముందు ఫొటో తీశాను'' అని స్కాట్ పోర్టెలి చెప్పారు.

ప్రకృతి - గౌరవ బహుమతి: ఆల్ప్స్ రారాజు - జోనాస్ స్కాఫర్

ఫొటో సోర్స్, JONAS SCHAFER
''స్విట్జర్లాండ్‌లోని బెర్నీస్ ఓబెర్లాండ్‌లో లేక్ బ్రీన్జ్ మీద పర్వతశ్రేణిని ఐబెక్స్‌లు దాటుతుంటాయి. ఈ ఆల్ప్స్ రారాజులు ఎలా ఉంటాయనేది వాటి శక్తివంతమైన కొమ్ములు చాటుతున్నాయి.
''కళ్లుతిరిగేంత ఎత్తులో నివసించటానికి ఐబెక్స్‌లు అలవాటుపడి ఉంటాయి. సుదీర్ఘమైన పర్వతశ్రేణి పథం, దాని మంచు పొర.. ఈ జీవుల సహయ ఆవాసాన్ని చూపుతున్నాయి'' అని జోనాస్ స్కాఫర్ పేర్కొన్నారు.
ఫొటో కర్టసీ: నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ ఫొటో కంటెస్ట్ 2019

- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: పాకిస్తాన్‌తో ఆడిన 6 మ్యాచుల్లో భారత్ ఎలా గెలిచింది...
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: 'పాకిస్తాన్ బౌలింగ్, భారత్ బ్యాటింగ్ మధ్యే పోటీ' -ఇంజమామ్ ఉల్ హక్
- వరల్డ్ కప్‌లో 10 జట్లే ఉండటానికి బీసీసీఐ అత్యాశే కారణమా
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- క్రికెట్ వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ఇంగ్లాండ్‌నే ఎందుకు ఎంచుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








