క్రికెట్ వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ఇంగ్లాండ్‌నే ఎందుకు ఎంచుకుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినాయక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేను ట్రెంట్ బిడ్జ్ స్టేడియం గేటు వద్ద ఉన్నప్పుడు ఇండియా.. ఇండియా.. అనే నినాదాలు విన్నాను. అప్పటికింకా మ్యాచ్ మొదలవలేదు. పిచ్ పరిశీలన వల్ల ఆలస్యమైంది. నిజం చెప్పాలంటే స్టేడియం లోపలికి వెళ్లాలని చాలా ఆతృతగా ఎదురు చూశాను. కానీ, ఇండియా- న్యూజీలాండ్ మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో నా ఉత్సాహం పూర్తిగా నీరుగారింది. స్టేడియం గేట్లు తెరిచినప్పుడు నేను లోపల లేను. కానీ, లోపల ఉన్న భారత అభిమానులు తీవ్ర నిరాశతో బయటకు రావడం కనిపించింది.
మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. ఈ వరల్డ్ కప్‌లో వర్షం కారణంగా నాలుగు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.
నేను లండన్‌లో అడుగుపెట్టేనాటికే వరల్డ్ కప్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనేది ప్రతీ అభిమాని కల అని నేను భావిస్తాను. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అమెరికా నుంచి వచ్చిన అభిమానుల్లో ఇదే ఉత్సాహం కనిపించింది. కానీ, వారి అంచనాలను అందుకోవడంలో ఇంగ్లాండ్ ఒక విధంగా విఫలమైంది. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఊహించని వాతావరణ పరిస్థితులు, రెండోది సరైన ప్రచారం లేకపోవడం.

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లాండే ఎందుకు? ఇది సరైన సమయమేనా?
క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్‌లోనే. వరల్డ్ కప్ కవరేజ్ కోసం నేను లండన్ వెళ్లడానికి ప్రణాళికలు వేసుకుంటున్న తరుణంలో అక్కడున్న నా సహచరులు ''మరేం బాధపడకు. ఇక్కడి వాళ్లు వేసవి కాలాన్ని ఆస్వాదించడానికి వెళుతున్నారు'' అని చెప్పారు. కానీ, నాలాగే చాలామంది క్రికెట్ అభిమానులు మ్యాచ్‌లు ప్రతక్ష్యంగా చూడటానికి వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు.
ఇంగ్లాండ్‌లోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు వర్షం పడుతోంది. ఈ పరిస్థితి ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ సమయంలో చాలా మంది ప్రశ్నిస్తున్నది 'రిజర్వ్ డే' గురించి. కానీ, ఈసారి వరల్డ్ కప్‌లో ఐసీసీ ఏ మ్యాచ్‌కు రిజర్వ్ డే ప్రకటించలేదు. దీనివల్ల జట్లు పాయింట్ల రూపంలో మూల్యం చెల్లించుకుంటున్నాయి. ట్రెంట్ బ్రిడ్జ్ అవతల ఉన్న దుబాయికి చెందిన అభిమానులను నేను కలిశాను. అందులో ఒకరు కుమార్. క్రికెట్ అంటే పడి చచ్చే ఆయన తన కుమారులను కూడా ఈ మెగా ఈవెంట్ చూడటానికి తీసుకొచ్చారు. ఆయన నాతో మాట్లాడుతూ, ''వాతావరణం ఊహించని విధంగా ఉంటుందని ఐసీసీకి తెలిసినప్పుడు ఎందుకు ఇంగ్లాండ్‌ను వేదికగా ఎంచుకున్నారు? ఈ సమయం సరైనదేనా? ఇక్కడ కాకుండా వేరే దేశంలో వరల్డ్ కప్ జరిగి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్లం'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్ని జట్లపై ప్రభావం
మ్యాచ్‌లు వర్షార్పణం అవడం వల్ల అన్ని జట్లపై ప్రభావం పడుతుంది. అభిమానులే కాదు ఆటగాళ్లు కూడా ఆందోళన చెందే అంశం ఇది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఒక పాయింట్ పోతుంది. దీని వల్ల పాయింట్ల పట్టికలో పైకి వెళ్లే అవకాశాలు సంక్షిష్టం అవుతాయి. సెమీఫైనల్‌కు వెళ్లేది నాలుగు జట్లు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ''చివరకు వస్తే ఇదంతా నంబర్ల గురించే. ఏ జట్టు బలంగా ఉన్నదనే అంశం ఇక్కడ అనవసరం. పాయింట్లు లేకుంటే టోర్నీ నుంచి నిష్క్రమించడమే'' అని లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేసే కనికా లంబా అన్నారు.
ఆమె నాతో మాట్లాడుతూ, ''మా నాన్న క్రికెట్ అభిమాని. మేం ఇద్దరం సోదరీమణులం. క్రికెట్ ఎలా ఆడాలి.. ఆటను ఎలా ప్రేమించాలో ఆయన మాకు చెప్పేవారు. ఇండియా ఆడే మ్యాచ్‌లను చూసి ఎంజాయ్ చేయాలనుకున్నాం. కానీ, ఈసారి నా కోరిక నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రచారలోపం
వరల్డ్ కప్ నేపథ్యంలో లండన్‌లో పెళ్లిలాంటి సందడి కనిపిస్తుందని విమానంలో వెళుతున్నప్పుడు ఊహించుకున్నా. కానీ, అక్కడ దిగగానే నా అంచనాలు తప్పాయని అనిపించింది.
2011 వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సందర్భం నాకు గుర్తొచ్చింది. దేశంలో అప్పుడు అన్నిచోట్లా క్రికెట్ ఫీవర్ ఉండేది. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో వాతావరణం చల్లగా ఉంది. లండన్, నాటింగ్‌హమ్‌లను చూడాలనే ఇష్టం లేకుండా పోయింది. మ్యాచ్‌లు జరుగుతున్న ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంను చూస్తే ఈ ప్రాంతం వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నట్లు కనిపించలేదు.
హిత్రూ నుంచి నాటింగ్‌హమ్ వెళ్లడానికి ఈరోజు ఉదయం నేను టాక్సీ మాట్లాడుకున్నా. డ్రైవర్ తాహీర్ ఇమ్రాన్ నన్ను 173 కిలోమీటర్లు తీసుకెళ్లారు. ఆయన వయసు 40 వరకు ఉంటుంది. పాకిస్తాన్‌లోని వజిరాబాద్ ఆయన స్వస్థలం. మా ప్రయాణంలో క్రికెట్, ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌ల గురించే మాట్లాడుకున్నాం. 20 ఏళ్ల నుంచి తాహీర్ ఇక్కడే పనిచేస్తున్నారు. ఆయన నాతో మాట్లాడుతూ,''క్రికెట్ ఇక్కడే పుట్టింది. కానీ, ఇక్కడి వాళ్లు ఇప్పుడు క్రికెట్‌ను అంతగా ఆస్వాదించడం లేదు'' అని చెప్పారు. ఇక్కడి యువకులు క్రికెట్ కంటే ఫుట్‌బాల్‌నే ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని అన్నారు.
''జూన్ 3న ఇంగ్లాండ్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇక్కడివారిలో ఎక్కువ మంది అదే రోజు జరిగిన లివర్‌పూల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌నే చూశారు. క్రికెట్‌లో నంబర్ 1 ర్యాంకులో ఉన్న టీంను పాక్ ఓడించింది. కానీ, ఇక్కడి వారు దాన్ని లెక్కే చేయలేదు'' అని చెప్పారు.
మధ్యాహ్నం వేళ ఇక్కడ ఉష్ణోగ్రత 13 నుంచి 11 సెంటీగ్రేడ్‌లకు పడిపోతుంది. వాతావరణం చల్లగా మారుతోంది. కానీ, వరల్డ్‌కప్ చర్చలు మాత్రం కచ్చితంగా వేడెక్కిస్తాయి.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- స్పీకర్ల జిల్లా శ్రీకాకుళం: ఆంధ్ర రాష్ట్రం నుంచి నవ్యాంధ్ర వరకు ఎవరెవరంటే...
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- దళితుడి హోటల్లో టీ తాగిన శివాజీ వారసుడు సాహూ మహరాజ్
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








