ఫిఫా మహిళల వరల్డ్ కప్: స్త్రీ - పురుష క్రీడాకారుల మధ్య వేతన వ్యత్యాసం ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
మహిళల ఫుట్‌బాల్‌కి పాపులారిటీ వేగంగా పెరుగుతోంది. మహిళల ప్రపంచ కప్ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా వీక్షించే వారి సంఖ్య 100 కోట్లకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు.
కానీ.. పురుష ఫుట్‌బాల్ క్రీడాకారులతో పోలిస్తే.. తమకు అందే ఆదాయం, నగదు బహుమతుల (ప్రైజ్ మనీ) స్థాయిని ప్రశ్నిస్తున్న మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
పురుషుల, మహిళల నగదు బహుమతుల మధ్య వ్యత్యాసం.. ఫుట్‌బాల్ నిర్వహణ సంస్థ ఫిఫాలో ''పాతుకుపోయిన పురుషాధిక్యత''ను చాటుతోందని అమెరికా ప్రపంచ కప్ విజేత హోప్ సోలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో క్రీడాకారులకు వాస్తవంగా అందే మొత్తం ఎంత? ఆ సంఖ్యలు ఏమిటి? పరిశీలిద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
నగదు బహుమతిని ఎలా కేటాయిస్తారు?
ఫ్రాన్స్‌లో విజేతలకు 40 లక్షల డాలర్లు లభిస్తాయి. ఈ మొత్తం 2015 టోర్నమెంట్ కన్నా రెట్టింపు.
మిగతా టీమ్‌లకు ఇచ్చే నగదు బహుమతి.. ఆ జట్లు ఎంత వరకూ వెళ్లాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభ గ్రూప్ దశలో పాల్గొన్నందుకు 7.5 లక్షల డాలర్లు అందిస్తారు. ముందుకు పురోగమించే కొద్దీ ఆ మొత్తం పెరుగుతుంది.
మహిళా టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లకు మొత్తంగా మూడు కోట్ల డాలర్లు ఫిఫా అందిస్తుంది.
గత ఏడాది పురుషుల వరల్డ్ కప్‌లో ఇచ్చిన మొత్తం నగదు బహుమతులు 40 కోట్ల డాలర్లు. ఇది మహిళా ఫుట్‌బాల్ టోర్నమెంటు జట్లకు ఇస్తున్న మొత్తం మీద పది రెట్ల కన్నా ఎక్కువ.
ప్రైజ్ మనీకి అదనంగా ప్రతి మహిళా జట్టుకు సన్నాహక ఖర్చులు, క్లబ్ వ్యయం కింద సుమారు ఎనిమిది లక్షల డాలర్లు అందించారు. అదే సమయంలో గత ఏడాది ఒక్కో పురుష జట్టుకు 15 లక్షల డాలర్లు అందించారు.
ఈ వ్యత్యాసానికి కారణం.. పురుషుల, మహిళల టోర్నమెంట్ల ద్వారా వచ్చే ఆదాయాల్లో తేడాలేనని తరచుగా చెప్తుంటారు.
అయితే.. మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ ద్వారా లభించే వాణిజ్య ఆదాయాలను.. ఇతర ఫిపా పోటీల ద్వారా వచ్చే ఆదాయాల నుంచి వేరు చేయలేమని ఫిఫా చెప్తోంది. ఎందుకంటే ఫిఫా నిర్వహించే పోటీల హక్కులు మొత్తాన్ని ఒక ప్యాకేజీగా విక్రయిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రైజీ మనీ మొత్తం క్రీడాకారులకే అందుతుందా?
ఫిఫా అందించే ప్రైజ్ మనీని జట్టు సభ్యులకు ఇవ్వదు. ఆయా దేశాల జాతీయ సమాఖ్యలకు అందిస్తుంది. ఆ సమాఖ్యలు తమ జట్టు క్రీడాకారులకు ఎంత ఇవ్వాలి? క్రీడకు సంబంధించిన ఇతర రంగాలపై ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది నిర్ణయించుకుంటాయి.
దీనికి సంబంధించి క్రీడాకారుల సంఘాలతో ఒప్పందాలు ఉంటాయి. ఆ వివరాలను బహిరంగంగా వెల్లడించరు.
ఆస్ట్రేలియా మహిళా జట్టు తమ జట్టుకు వచ్చే ప్రైజ్ మనీలో 30 శాతం కటాఫ్ చెల్లించేలా బేరమాడి ఒప్పించామని పేర్కొంది.
అయితే.. ఇతర ఫుట్‌బాల్ అసోసియేషన్లు ఈ నిర్దిష్ట ఆర్థిక వ్యవహారాల విషయంపై చర్చించటానికి సుముఖంగా లేవు.
''చివరికి వచ్చేసరికి పురుషులతో పోలిస్తే మహిళలకు లభించే ప్రైజ్ మనీ చాలా స్వల్పంగా ఉంటుంది. అందువల్లే క్రీడాకారిణులు అధికంగా స్పాన్సర్‌షిప్‌లు, క్లబ్ జీతాలు, సమాఖ్య వేతనాల మీద ఆధారపడటం కనిపిస్తుంది'' అని కేట్లిన్ ముర్రే చెప్పారు. అమెరికా మహిళా జట్టు చరిత్ర మీద ఆమె ఒక పుస్తకం రాశారు.
మహిళల వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంత?
మిలియన్ డాలర్లలో


ఆధారం: ఫిఫా
పశ్చిమ యూరప్‌లో ఫుట్‌బాల్ క్రీడాకారిణులకు వారి క్లబ్‌ల నుంచి నెలకు 1,000 - 2,000 యూరోల వరకూ వేతనం, జాతీయ జట్టులో విధుల్లో ఉన్నపుడు జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య నుంచి రోజుకు 50 - 100 యూరోల భత్యం లభిస్తుండవచ్చునని ప్రపంచ క్రీడాకారుల సంఘం ఫిఫ్‌ప్రో చెప్తోంది. జట్టులో అగ్రస్థాయి క్రీడాకారిణిలకు ఇంకా ఎక్కువ జీతభత్యాలు లభిస్తాయని పేర్కొంది.
పేద దేశాల్లో క్రీడాకారిణులకు తమ తమ జాతీయ ఫుట్‌బాల్ సంఘాల నుంచి అతి తక్కువ వేతనాలే లభిస్తాయి.
నిజానికి పురుషులు, మహిళల టోర్నమెంట్ల ప్రైజ్ మనీ మధ్య వ్యత్యాసం పెరిగిందని ముర్రే చెప్పారు. అయితే.. ఈ ఏడాది మహిళల టోర్నమెంట్ ప్రైజ్ మనీని రెట్టింపు చేయటం ఆ వ్యత్యాసాన్ని తగ్గించే దిశలో పెద్ద అడుగు అని ఆమె పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. మహిళల క్రీడను ప్రోత్సహించటంలో తమ సంస్థ గణనీయమైన పురోగతి సాధిస్తోందని ఫిఫా వాదిస్తోంది.
''ప్రపంచమంతటా మహిళల ఫుట్‌బాల్‌ను అభివృద్ధి చేయటానికి ఫిఫా పెడుతున్న పెట్టుబడుల్లో ప్రైజ్ మనీ ఒక చిన్న భాగం మాత్రమే'' అని చీఫ్ ఉమెన్స్ ఫుట్‌బాల్ ఆఫీసర్ సారాయ్ బారెమెన్ పేర్కొన్నారు.
వచ్చే మూడేళ్లలో మహిళల ఫుట్‌బాల్ క్రీడలో నేరుగా 40 - 50 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలన్నది ఫిఫా ప్రణాళిక.
మహిళల ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించటానికి ఫిఫా గత ఏడాది 2.8 కోట్ల డాలర్లు వ్యయం చేసినట్లు సంస్థ ఆర్థిక నివేదిక చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మరింత న్యాయమైన వాటా కోసం డిమాండ్
అమెరికాలో సమాన వేతనాల అంశాలపై మహిళల జట్టు జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ మీద న్యాయస్థానానికి వెళ్లింది.
పురుష, మహిళా క్రీడాకారులకు సమానంగా వేతనాలు చెల్లించాలని ఆస్ట్రేలియా క్రీడాకారుల సంఘం ఫిఫాకు పిలుపునిచ్చింది.
నైజీరియా జట్టు 2016లో విమెన్స్ ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ గెలిచిన తర్వాత.. వేతనాల బకాయిలు చెల్లించాలని కోరుతూ ఒక హోటల్ వద్ద ధర్నా చేసింది.
2018లో పురుషులు, మహిళల జట్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేటపుడు సమాన వేతనాలు, సమాన ప్రైజ్ మనీ పొందేలా చర్యలు చేపట్టింది.
అలాగే నార్వేలో సైతం దేశానికి ప్రాతినిధ్యం వహించేటపుడు పురుషులు, మహిళా క్రీడాకారులకు సమాన వేతనం లభించేలా 2017లో చర్యలు ప్రారంభించింది.
మహిళా క్రీడాకారులకు వాణిజ్య పరిహారం పెంచేలా, 2021 - 2023 మధ్యకల్లా పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు లభించేలా చర్యలు చేపడతామని నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఒప్పందం చేసుకుంది.

ఇవి కూడా చదవండి:
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- శ్రీలంక ముస్లింల అసాధారణ చర్య.. హింసాత్మక అతివాదులను దూరం పెట్టేందుకు మసీదు కూల్చివేత
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నియామకం ఎందుకంత వైరల్ అయింది
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఇరాన్‌పై ఎందుకు దాడి చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








