అవినీతి ప్రధానాంశమైన వేళ, నేపాల్ 'నెపో కిడ్స్' ఏమైపోయారు?

నేపాల్, ఎన్నికలు, నెపోకిడ్స్, నిరసనలు, అవినీతి, రాజకీయపార్టీలు, జెన్ జడ్
    • రచయిత, ఫణీంద్ర దహల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, నేపాల్
  • చదివే సమయం: 6 నిమిషాలు

నేపాల్‌లో రాజకీయ నాయకుల పిల్లలపై వెల్లువెత్తిన ఆగ్రహం గత వేసవిలో నిరసనలకు కారణమైంది.

అక్కడి నేతల సంతానం సోషల్ మీడియాలో చూపించిన ఆడంబరాలు, విలాసాల కథలే జెన్ జడ్ ఉద్యమానికి ఆజ్యం పోశాయి.

డిజైనర్ లేబుల్స్‌తో ఉన్న ఖరీదైన బహుమతులు క్రిస్మస్ చెట్టు లాగా పేర్చారు. ప్రపంచంలోని ఫైవ్-స్టార్ రిసార్ట్స్‌కి ఖరీదైన ప్రయాణాలు చేశారు. రోడ్లు మీద ట్రాఫిక్ ఆగిపోయేలా ఘనమైన పెళ్లి వేడుకలు కూడా జరిగాయి.

ఇవన్నీ ధనిక, పేదల మధ్య వ్యత్యాసం చూపించేలా మొబైల్ ఫోన్లలో చక్కర్లు కొట్టాయి. ఇది చాలామందికి అసహనంగా మారింది.

నేపాల్‌ యువతలో నిరుద్యోగం 20.6% ఉండగా, ముప్పై లక్షల మంది విదేశాల్లో పని చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"బడా రాజకీయ నాయకుల పిల్లలు ప్రత్యేక సందర్భాలను థాయ్‌లాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు’’ అని నేపాల్‌కు చెందిన 25 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ సతీశ్ కుమార్ యాదవ్ చెప్పారు.

"కానీ సాధారణ పౌరుల పిల్లలు ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి వస్తోంది" అని ఆయన అన్నారు.

'నెపో కిడ్స్'పై నేపాల్ యువత సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అసలు సోషల్ మీడియాపైనే నిషేధం విధించారు. ఆ చర్య తీసుకున్న 2025,సెప్టెంబర్‌ 8న వేల మంది వీధుల్లోకి వచ్చారు. రెండు రోజుల్లోనే 77 మంది మరణించారు. వీరిలో చాలామంది పోలీసుల కాల్పుల్లో మరణించిన నిరసనకారులు. చివరికి అధ్యక్షుడు రాజీనామా చేయాల్సివచ్చింది.

నేపాల్‌లో మార్చి 5న ఎన్నికలకు జరగనున్నాయి. ప్రజల ఆగ్రహం తగ్గలేదన్న విషయాన్ని గమనించిన రాజకీయ నాయకులు వారిని శాంతింపజేయడానికి వ్యవస్థలో పెద్ద ఎత్తున తీసుకొస్తామని వాగ్దానం చేశారు.

లగ్జరీ లైఫ్‌స్టైల్‌ని చూపిస్తూ సాగిన చాలా సోషల్ మీడియా అకౌంట్లు ఇప్పుడు సైలైంటయ్యాయి.

నేపాల్, ఎన్నికలు, నెపోకిడ్స్, నిరసనలు, అవినీతి, రాజకీయపార్టీలు, జెన్ జడ్

ఫొటో సోర్స్, Shrinkhala Khatiwada/YouTube

ఫొటో క్యాప్షన్, తాను 'నెపో కిడ్' కాదని శృంఖలా ఖతివాడా సమర్ధించుకున్నారు.

మాజీ మిస్ నేపాల్, మాజీ ఆరోగ్య మంత్రి కుమార్తె అయిన శృంఖలా ఖతివాడాకు ఒక దశలో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. కానీ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను ఆమె డిలీట్ చేశారు.

చివరిగా 34నిమిషాల నిడివిగల వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 'నెపో కిడ్' అనే ముద్ర తనకు వర్తించదని ఆ వీడియో ఆమె పేర్కొన్నారు. ఆ వీడియో కొన్ని నెలల క్రితమే అప్‌లోడ్ చేశారు.

మూడుసార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తికి మనవరాలు, మాజీ మావోయిస్టు గెరిల్లా నాయకురాలు స్మితా దహాల్ కూడా ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ కలెక్షన్‌ను ప్రదర్శించారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఆమె ప్రైవేట్‌లోకి మార్చుకున్నారు. ఆమె ఫేస్‌బుక్ పేజీ ఆగస్టు చివరి నుంచి అప్‌డేట్ కాలేదు.

గత వేసవిలో వైరల్ అయిన ఫోటోల్లో ఒకటి, మాజీ మంత్రి కుమారుడు సౌగత్ థాపా, లూయీ విట్టన్, కార్టియర్, గూచీ బాక్సులను క్రిస్మస్ ట్రీలా పేర్చిన దగ్గర నిలబడి ఉన్న ఫోటో.

తనకు ఉన్న 14,000 మంది ఫాలోవర్లతో షేర్ చేసుకున్న తాజా పోస్టుల్లో ఆ వ్యాపారవేత్త అంతర్జాతీయ జీవనశైలిని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తారు. ఖరీదైన దుస్తులు వేసుకుని, హాంకాంగ్, లండన్, ఇస్తాంబుల్, మరకెష్ వంటి గ్లామరస్ నగరాలను ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే సందర్శించినట్టు కనిపిస్తోంది.

తనను 'నెపో కిడ్' అనడం అన్యాయమని, తన తండ్రి ప్రజాసేవలో ఉండగా సంపాదించిన ప్రతి రూపాయిని సమాజానికి తిరిగి ఇచ్చారని సౌగత్ థాపా ముందుగానే చెప్పి తనను తాను సమర్థించుకున్నారు. బీబీసీ ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించింది.

నేపాల్, ఎన్నికలు, నెపోకిడ్స్, నిరసనలు, అవినీతి, రాజకీయపార్టీలు, జెన్ జడ్

ఫొటో సోర్స్, Saugat Thapa/Instagram

ఫొటో క్యాప్షన్, డిజైనర్ బాక్స్‌లతో క్రిస్మస్ ట్రీ చేసినందుకు విమర్శలు ఎదుర్కొన్న సౌగత్ థాపా.

అయితే ఇలాంటి పోస్టులు ఇప్పుడు జెన్ జడ్‌ని అంతగా కదిలించడం లేదు.

"'నెపో బేబీస్' ట్రెండ్‌ని చాలా మంది మర్చిపోయారు అనిపిస్తోంది" అని సెప్టెంబర్ 8న నిరసనల్లో 'ఇకపై నెపోటిజం వద్దు' అని బోర్డు పట్టుకుని పాల్గొన్న దీపికా అన్నారు. చెప్పారు.

"ఆ ట్రెండ్‌ అయిపోయింది, ఇప్పుడు ఫోకస్‌ మారింది. ఈ రోజుల్లో మనం ఎక్కువసేపు దేనిమీదా దృష్టి పెట్టం" అని సారు చెప్పారు.

సోషల్ మీడియా పోస్టులపై ఫోకస్‌ లేకపోయినా, నెపోటిజం మీద ఉన్న అభిప్రాయం, అవినీతి మీద ఉన్న భావన మాత్రం ఇంకా అలాగే ఉంది.

నేపాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేపాల్‌లో జెన్ జెడ్ ఆందోళన (ఫైల్ ఫోటో )

"మోసపోతూనే ఉన్నాం"

ప్రభుత్వ అవినీతి ఒక పెద్ద సమస్యగా 84% మంది నేపాలీలు గట్టిగా నమ్ముతున్నారని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తాజా డేటా ద్వారా తెలుస్తోంది.

ఇటు అత్యున్నత స్థాయిలో అవినీతి జరుగుతోందన్నఆరోపణలు విస్తృతంగా ఉన్నాయి.

డిసెంబర్‌లో కొత్త విమానాశ్రయ నిర్మాణ ఖర్చులను అక్రమంగా 74 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 614 కోట్లు) మేర పెంచిన కేసులో 55 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. అందులో ఐదుగురు మాజీ మంత్రులు కూడా ఉన్నారు.

మరోవైపు నేపాల్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు రోజుకు 2 డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తున్నారు అని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

ఇటీవలి కాలంలో అవినీతి కేసుల్లో ఇరుక్కున్న మంత్రులు వీరు మాత్రమే కాదు. అమెరికాలో భూటానీయ శరణార్థులుగా ప్రవేశించేందుకు నేపాలీలు నకిలీ పత్రాలు కొనుగోలు చేసిన స్కామ్‌లో, ఇద్దరు మాజీ కేబినెట్ మంత్రులపై కూడా అభియోగాలు నమోదయ్యాయని అల్ జజీరా వార్తా సంస్థ పేర్కొంది.

గత సెప్టెంబర్‌లో అప్పటి ప్రధాన మంత్రి కె.పి. ఓలి రాజీనామాకు దారితీసిన, అశాంతికి ప్రధాన కారణంగా నిలిచిన ప్రధానాంశం అవినీతే.

"మేం పాత రాజకీయ నాయకులకు చాలా అవకాశాలు ఇచ్చాం. కానీ ప్రతిసారీ మోసపోతూనే ఉన్నాం" అని ల్యాబ్ టెక్నీషియన్ యాదవ్ అన్నారు.

"చాలాచోట్ల సరైన రోడ్లు లేవు. విద్యా ప్రమాణాలు బలహీనంగా ఉన్నాయి. మంచి ఆసుపత్రులు లేవు. ఈ పరిస్థితి మారాలి" అని ఆయన అన్నారు.

నేపాల్, ఎన్నికలు, నెపోకిడ్స్, నిరసనలు, అవినీతి, రాజకీయపార్టీలు, జెన్ జడ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యువత ఓటును గౌరవిస్తున్నామని నిరూపించుకోవడానికి రాజకీయ పార్టీలు పలు హామీలిచ్చాయి.

వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామమని, అవినీతిపై దర్యాప్తు చేస్తామని, జెన్ జడ్ గార్డియన్స్‌లా పనిచేస్తామని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో ప్రకటించాయి.

కొన్నేళ్ల కిందటే స్థాపించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) రాజ్యాంగబద్ధ సంస్థలను మరింత జవాబుదారీగా మారుస్తామని హామీ ఇచ్చింది. నిరసనల సమయంలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) రాజకీయ మార్పు, దేశాభివృద్ధిలో యువతకు భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

1991నుంచి అధికారంలో ఉన్నవారి ఆస్తులపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలని నేపాలీ కాంగ్రెస్ ప్రతిపాదించింది.

ఐదుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన షేర్ బహదూర్ దేవ్‌బాను తమ అధ్యక్ష పదవి నుంచి కూడా అది తప్పించింది.

గాయని శివానా శ్రేష్ఠతో దేవ్‌బా కుమారుడు జైవీర్ సింగ్ దేవ్‌బా వివాహం అత్యంత ఆడంబరంగా జరిగింది. పెళ్లి సమయంలో వారు ధరించిన డిజైనర్ దుస్తులు, విదేశీ విహారయాత్రల ఫోటోలు ''నెపో కిడ్స్'' ట్రెండ్‌కు స్పష్టమైన ఉదాహరణగా తరచూ ప్రస్తావనకొచ్చాయి. ఇప్పుడు ఆ జంట సోషల్ మీడియా అకౌంట్లు కూడా కొంతకాలంగా కనిపించడంలేదు.

మార్పుకు పార్టీ సిద్ధంగా ఉందనడానికి ఇవి చిన్న ఉదాహరణలని ప్రముఖ జెన్ జడ్ నాయకుల్లో ఒకరైన రక్ష్యా బామ్ చెప్పారు.

''వాళ్లు పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి పెంచి సంస్కరణలు తీసుకొచ్చారు. ఎవరైనా ప్రధాని లేదా పార్టీ అధ్యక్షునిగా ఉండడానికి గడువు నిర్ధరించారు. ఓ వ్యక్తి ఎన్నిసార్లు మంత్రి కావొచ్చనేదానికి కూడా పరిమితి విధించారు. ఇది చాలా మంచి విషయం అనుకుంటున్నా. విధానపరమైన అవినీతిని అడ్డుకోవడానికి ఇది సాయపడుతుంది'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

కానీ కావాల్సిన స్థాయిలో అవినీతి తొలిగిలిపోలేదని ఆమె అన్నారు. బీబీసీతో మాట్లాడిన యువత కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.

''కొత్త వాళ్లు వస్తే, మార్పులొస్తాయన్న నమ్మకముంది. పాత రాజకీయపార్టీలే అధికారంలో కొనసాగితే పెద్దగా మార్పు ఉండదు'' అని యాదవ్ చెప్పారు.

"కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నందున, నిజమైన మార్పు సాధించడం కష్టమవుతుంది. ఇది ఒక నిర్మాణాత్మక సమస్య కాబట్టి, త్వరగా లేదా సులభంగా పరిష్కారం కాదు" అని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌లోని ఒక గ్రూప్ తెలిపింది.

నిరసనకారిణి దీపికా గురువారం జరిగే సాధారణ ఎన్నికల్లో తన మొదటి ఓటు వేయడానికి 16 గంటల ప్రయాణం చేసి ఇంటికి వెళ్తున్నారు. సెప్టెంబర్‌లో ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో గుర్తుంచుకోవడం, ప్రాణాలు కోల్పోయిన వారిని గౌరవించడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు.

"ఈ తిరుగుబాటు ఒక బాధకి ఫలితం. ప్రజలు ఓటు వేస్తున్నప్పుడు దాన్ని గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నా. ప్రజలు అవినీతిపై కఠినమైన దర్యాప్తు కావాలని కోరుకుంటున్నారు. సాధారణ ప్రజలకు అన్యాయమే జరుగుతోంది, అందుకే న్యాయం జరగాలి" అని ఆమె స్పష్టం చేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)