భారత రూపాయి బలహీనపడితే నేపాల్ భారీ నష్టాలను ఎందుకు ఎదుర్కొంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సంజయ్ ధకాల్
- హోదా, బీబీసీ న్యూస్ నేపాలీ
ఒక అమెరికన్ డాలర్ విలువ బుధవారం నాడు 145.95 నేపాలీ రూపాయలకు చేరుకుందని నేపాల్ రాష్ట్ర బ్యాంకు (కేంద్ర బ్యాంకు) తెలిపింది.
భారత రూపాయి బలహీనపడటంతో పాటు నేపాలీ రూపాయి విలువ కూడా పడిపోయింది. దీనికి ప్రధాన కారణం భారత కరెన్సీతో నేపాలీ కరెన్సీకి ఉన్న స్థిర మారకపు రేటు విధానం (ఫిక్స్‌డ్ ఎక్స్ఛేంజ్ రేట్ సిస్టమ్).
డాలర్ బలోపేతం కావడం వల్ల నేపాల్‌లోని అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం, మరికొన్ని రంగాలపై సానుకూల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, దీనివల్ల కలిగే అతిపెద్ద నష్టం నేపాల్‌పై విదేశీ రుణ భారం మరింతగా పెరగడం.


ఫొటో సోర్స్, Reuters
"44 బిలియన్ల నేపాలీ రూపాయల నష్టం"
నేపాల్ ప్రజా రుణ నిర్వహణ కార్యాలయం ప్రకారం, నేపాల్ అప్పు మొత్తం 2 లక్షల 72వేల 9వందల కోట్ల నేపాలీ రూపాయలకు చేరుకుంది.
ఇందులో విదేశీ అప్పుల వాటా 1,45,300 కోట్ల నేపాలీ రూపాయలు. ఈ విదేశీ రుణంలో ఎక్కువ భాగం అమెరికన్ డాలర్లలో ఉంది.
పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్ సమాచారం మేరకు, మొత్తం విదేశీ అప్పులో 20 శాతం నేరుగా అమెరికన్ డాలర్లలో ఉండగా, సుమారు 72 శాతం 'స్పెషల్ డ్రాయింగ్ రైట్స్' (ఎస్‌డీఆర్) రూపంలో ఉంది.
ఈ ఎస్‌డీఆర్ అనేది అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సృష్టించిన ఓ విధమైన అంతర్జాతీయ కరెన్సీ. ఇది అమెరికన్ డాలర్, యూరో, చైనా యువాన్, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్‌ల విలువపై ఆధారపడి ఉంటుంది.
ఈ కరెన్సీలన్నీ నేపాలీ రూపాయితో పోలిస్తే బలపడుతున్నాయి. అందుకే నేపాల్ విదేశీ రుణాలపై అదనపు భారం పడుతోంది.
నేపాల్ పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్ హెడ్ గోపీకృష్ణ కోయిరాల బీబీసీ న్యూస్ నేపాలీతో మాట్లాడుతూ, "మనం ఈరోజే (డిసెంబర్ 16న) మన విదేశీ అప్పులన్నింటినీ తిరిగి చెల్లించాల్సి వస్తే, మారకం రేటు కారణంగా మనం 44.22 బిలియన్ల నేపాలీ రూపాయల అదనపు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు మారకం రేటు మెరుగుపడితే, ఈ నష్టం తగ్గే అవకాశం ఉంది" అని చెప్పారు.
"డాలర్ నిరంతరం బలపడుతుండటం వల్ల మన విదేశీ అప్పు కచ్చితంగా పెరుగుతోంది. విదేశీ రుణాలు తీసుకున్నప్పుడు, వాటి చెల్లింపు నిబంధనలు మారకం రేటుపై ఆధారపడి ఉంటాయి. ఇవి మార్కెట్ విలువలను బట్టి మారుతూ ఉంటాయి" అని గోపీకృష్ణ కోయిరాల చెప్పారు.
కిందటేడాది నవంబర్‌లో ఒక అమెరికన్ డాలర్ విలువ 134 రూపాయలు. కేవలం ఏడాదిలోనే 7 శాతం పెరిగింది. ఐదేళ్ల కిందట డాలర్ విలువ 118 రూపాయిలు ఉండేది. గత నెల రోజుల్లోనే డాలర్ విలువ సుమారు 4 రూపాయలు పెరగడంతో, అంచనా వేసిన 44 బిలియన్ల నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
రుణ చెల్లింపు వివరాలు...
నేపాల్ ఈ ఏడాది విదేశీ అప్పులు తీర్చడానికి కేటాయించిన 67 బిలియన్ల రూపాయలలో, 15.5 బిలియన్ల రూపాయలు కేవలం వడ్డీ కోసమే కేటాయించారు. ఇందులో 19.25 బిలియన్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది.
ప్రస్తుతం నేపాల్ మొత్తం అప్పు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 45 శాతానికి చేరుకుంది.

ఫొటో సోర్స్, Reuters
నేపాలీ - భారత రూపాయిల బంధం
నేపాల్ తన కరెన్సీని భారత రూపాయితో అనుసంధానించడం ద్వారా ఒక స్థిర మారకపు రేటు విధానాన్ని అవలంబించింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే నేపాలీ రూపాయి విలువ, భారత రూపాయి హెచ్చుతగ్గులపై ఆధారపడి నిర్ణయమవుతుంది.
నేపాల్ 1960 నుంచి తన కరెన్సీని భారత రూపాయితో ఈ స్థిర మారకపు రేటు విధానం కొనసాగిస్తోంది. 65 ఏళ్ల మునుపుకూడా, 100 భారత రూపాయలకు 160 నేపాలీ రూపాయల రేటును ఖరారు చేశారు.
కాలక్రమేణా, ఈ మార్పిడి రేటు 101, ఆ తర్వాత 135, 142, 170 లేదా 168 వరకు పెరిగింది. కానీ చాలా కాలంగా ఈ రేటు 160 వద్దే స్థిరంగా కొనసాగుతోంది.
అందుకే, నేపాలీ కరెన్సీ బలహీనపడటం అనేది పూర్తిగా భారత రూపాయి స్థితిగతులపైనే ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
డాలర్ పతనమైనా..
ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ డాలర్ విలువ 2025 ప్రారంభం నుంచి క్షీణిస్తోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో డాలర్ విలువ 11 శాతం తగ్గింది. ఇది గత 50 ఏళ్లలో నమోదైన అతిపెద్ద పతనం. అయినా భారత రూపాయి కంటే డాలర్ బలంగానే ఉంది.
విదేశీ పెట్టుబడిదారులు భారతదేశం నుంచి తమ పెట్టుబడుల (డాలర్ల)ను వెనక్కి తీసుకోవడం. భారతదేశ అధిక వాణిజ్య లోటు.పెరుగుతున్న ముడి చమురు ధరలు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో అనిశ్చితి రూపాయి విలువ పడిపోవడానికి కారణాలని భారతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేకాకుండా, ట్రంప్ ప్రభుత్వం భారతదేశంపై విధించిన అధిక సుంకాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో జరుగుతున్న ఆలస్యం కారణంగా డాలర్ పతనం భారత్ విషయంలో ఆగిపోయిందని వారు చెబుతున్నారు.
నేపాల్ రాష్ట్ర బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుణాకర్ భట్ మాట్లాడుతూ, నేపాల్ తన స్వదేశీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా భారత రూపాయితో ఉన్న ''ఫిక్స్‌డ్ ఎక్స్ఛేంజ్ రేట్''ను వదులుకునే స్థితిలో లేదని స్పష్టం చేశారు.
"మనం స్వదేశీ ఉత్పత్తిని పెంచనంత వరకు, ఎగుమతులను పెంచుకోనంత వరకు, మన సొంత పరిశ్రమలను అభివృద్ధి చేసుకోనంత వరకు, ఇంధనం కోసం భారీగా ఖర్చు చేస్తున్నంత వరకు మన కరెన్సీ బలహీనంగానే ఉంటుంది" అని చెప్పారు.
ఈ పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే మార్పిడి రేటు మార్పుపై చర్చించవచ్చని, ప్రస్తుతానికి నేపాల్ కరెన్సీ బలోపేతం అయ్యే సూచనలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.
లాభనష్టాలేంటి..?
అమెరికన్ డాలర్ ప్రభావం నేపాల్ ఆర్థిక వ్యవస్థపై అనేక రకాలుగా ఉంటుంది. డాలర్ ప్రియం కావడం వల్ల నేపాల్ దిగుమతి వ్యయంపై మొట్టమొదటి ప్రభావం కనిపిస్తుంది.
జూలైలో ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే దిగుమతులు 609 బిలియన్ల రూపాయలకు చేరుకున్నాయి.
డాలర్ విలువ పెరగడం వల్ల దిగుమతుల కోసం వెచ్చించే మొత్తం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది, దీని ఫలితంగా స్థానిక మార్కెట్లో వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి.
దీనివల్ల విదేశాలకు వెళ్లే నేపాలీ విద్యార్థులు, విదేశీ ప్రయాణాలు చేసే నేపాలీ పౌరులు ఇద్దరిపై ఖర్చుల భారం పెరుగుతుంది.
అదే సమయంలో, దీనివల్ల నేపాల్ ఎగుమతులకు కొంత ప్రయోజనం చేకూరవచ్చు. ఎందుకంటే డాలర్ విలువ పెరిగినప్పుడు, అంతర్జాతీయ మార్కెట్లో నేపాలీ వస్తువులు, సేవల ధరలు చౌకగా కనిపిస్తాయి.
మరో ప్రయోజనం ఏమిటంటే, విదేశాల్లో నివసించే నేపాలీలు తమ ఆదాయాన్ని స్వదేశానికి పంపేటప్పుడు ఎక్కువ మొత్తం లభిస్తుంది. అంతేకాకుండా, డాలర్ బలోపేతం కావడం వల్ల విదేశీ పర్యటకులకు నేపాల్ పర్యటన మరింత ఆకర్షణీయంగానూ మారుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














