పీఎం అయినా సీఎం అయినా ఆ కులం నుంచే.. బ్రాహ్మణులు, క్షత్రియులదే ఆధిపత్యం, కమ్యూనిస్ట్ పార్టీలోనూ వారే

నేపాల్‌

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేపాల్‌లోని పోఖారాలో కకాకో చులో అనే ఒక రెస్టారెంట్ ఉంది. దాని బయట మెనూ బోర్డ్ పెట్టారు. అందులో ఉన్న ఆహార పదార్థాల పేర్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

మెనూలోని మొదటిది 'పండిట్ భోజనం', రెండోది 'లౌకిక భోజనం', మూడోది 'గణతంత్ర భోజనం', నాలుగోది 'ఏకాభిప్రాయ భోజనం'.

బోర్డును చూపిస్తూ ఒక నేపాలీ మిత్రుడు, ‘అందరికన్నా పైన పండిట్ ఉంది. ప్రజాస్వామ్యం, గణతంత్రం కింద ఉన్నాయి’ అన్నారు.

రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చినా, బ్రాహ్మణుల కంటే పైకి ఎదగలేకపోయిందని చెప్పడం ఆయన ఉద్దేశం.

నేపాల్ ప్రభుత్వం, అక్కడి వ్యవస్థను పరిశీలిస్తే బ్రాహ్మణులదే అన్ని రంగాలలో ఆధిపత్యం. నేపాల్‌లో బ్రాహ్మణులను బాహున్ అంటారు.

అయితే, నేపాల్‌లో బ్రాహ్మణుల జనాభా కేవలం 12.2 శాతమే. వీరు నేపాల్‌లోని కొండ ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణులు. అక్కడ ప్రతి రంగంలోనూ వారి ఆధిపత్యం ఉంది.

నేపాల్‌లో ఎక్కువ జనాభా కలిగిన కులం ఛెత్రి. భారతదేశంలో క్షత్రియులు లేదా రాజ్‌పుత్ అంటారు. వీళ్లు 16.6 శాతం ఉన్నారు.

బ్రాహ్మణులను, ఛెత్రిలను కలిపి ఖాస్ ఆర్య అని పిలుస్తారు. నేపాల్‌లోని ఖాస్ ఆర్య మొత్తం జనాభా దాదాపు 29 శాతం.

నేపాల్‌
ఫొటో క్యాప్షన్, కకాకో చులో మెనూ

పార్లమెంటులో బ్రాహ్మణ-ఛెత్రి ఆధిపత్యం

నేపాల్ ప్రభుత్వంలో ఉన్నత పదవులన్నీ బ్రాహ్మణుల చేతిలోనే ఉన్నాయి.

నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ బ్రాహ్మణుడు.

నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ ప్రభురామ్ శర్మ, పార్లమెంట్ స్పీకర్ దేవరాజ్ ఘిమిరే కూడా బ్రాహ్మణులే.

నేపాల్ సుప్రీంకోర్టులో ప్రస్తుతం జస్టిస్ హరికృష్ణ కర్కి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఛెత్రి.

నేపాల్ పోలీసు చీఫ్ బసంత్ బహదూర్ కున్వర్ కూడా ఛెత్రి కులానికి చెందినవారే.

ప్రచండ కేబినెట్లో ముఖ్యమైన శాఖలన్నీ ఖస్ ఆర్యుల వద్దే ఉన్నాయి.

నేపాల్ పార్లమెంటులో పూర్తిగా ఖస్ ఆర్యదే ఆధిపత్యం. పార్లమెంటులో 164 మంది సభ్యులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు.

వీరిలో 95 మంది సభ్యులు ఖస్ ఆర్యులు. అంటే 57 శాతం బ్రాహ్మణులు, ఛెత్రీలే ఉన్నారు.

నేపాల్‌లో నాలుగు శాతం ముస్లింలు ఉన్నారు. అయితే, ఎన్నికల ద్వారా ముస్లింలెవరూ పార్లమెంటుకు చేరుకోలేదు.

ఒక్క షెర్పా కూడా నేరుగా ఎన్నికై పార్లమెంటుకు వెళ్లలేదు.

నేపాల్‌లో 13 శాతం దళితులలో ఒకరు మాత్రమే ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు వెళ్లారు.

గిరిజన వర్గాల నుంచి ఎన్నికైన వారు 41 మంది (25 శాతం) ఉన్నారు. నేపాల్‌లో వీరి మొత్తం జనాభా 35 శాతం.

నేపాల్‌

ఫొటో సోర్స్, Getty Images

నేపాల్‌లో మొత్తం ఏడు రాష్ట్రాలు ఉన్నాయి. కోసి, మధేస్, బాగమతి, గండకి, లుంబిని, కర్నాలి, సుదూర్‌పశ్చిమ్. ఈ ఏడు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బ్రాహ్మణులే.

బాగమతి ముఖ్యమంత్రి శాలిక్‌రామ్ జమ్కట్టెల్, కర్నాలి ముఖ్యమంత్రి రాజ్‌కుమార్ శర్మ, గండకి ముఖ్యమంత్రి సురేంద్రరాజ్ పాండే అందరూ బ్రాహ్మణులే. సుదూర్‌పశ్చిమ్ ముఖ్యమంత్రి కమల్ బహదూర్ షా ఛెత్రి.

మధేస్ ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ కులానికి చెందిన వ్యక్తి. కోసి ముఖ్యమంత్రి హిక్మత్ కుమార్ కర్కి ఛెత్రి, లుంబినీ ముఖ్యమంత్రి డిల్లీబహదూర్ చౌదరి థారు కులానికి చెందినవారు.

కోసి, కర్నాలి, బాగమతిలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. వీటి ముఖ్యమంత్రులందరూ ఖస్ ఆర్యులే.

నేపాల్‌లో 239 ఏళ్ల పాటు రాచరిక వ్యవస్థ మనుగడలో ఉంది. 2008లో రాచరికం అంతమై ప్రజాస్వామ్యం వచ్చింది.

తరువాత ఈ 15 ఏళ్లలో తొమ్మిది మంది ప్రధానమంత్రులు వచ్చారు. వీరిలో ఎనిమిది మంది బ్రాహ్మణులు, ఒకరు ఛెత్రి.

బ్రాహ్మణ ప్రధానులు.. గిరిజాప్రసాద్ కొయిరాలా, ప్రచండ (మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు), మాధవ్ కుమార్ నేపాల్, జల్నాథ్ ఖనాల్, బాబూరామ్ భట్టరాయ్, ఖిల్రాజ్ రెగ్మీ, సుశీల్ కొయిరాలా, కేపీ శర్మ ఓలి.

ఛెత్రి ప్రధాని.. షేర్ బహదూర్ దేవా .

నేపాల్‌లో ప్రజాస్వామ్యం రాకముందు పంచాయతీ వ్యవస్థలోనూ బ్రాహ్మణులే ప్రధానమంత్రులుగా ఉన్నారు.

నేపాల్‌లోని మధేస్ ప్రాంతంలో కూడా బ్రాహ్మణులు ఉన్నారు. కానీ వారికి కొండ ప్రాంతపు బ్రాహ్మణులంత ఆధిపత్యం లేదు.

"మధేస్ ప్రాంతంలో బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు కూడా ఉన్నారు. కానీ, ప్రభుత్వంలో కొండ బ్రాహ్మణులు, క్షత్రియులే ఆధిపత్యంలో ఉన్నారు. కొండ బ్రాహ్మణులు యాదవులను, దళితులను ఎలా చూస్తారో, అలాగే మధేస్ బ్రాహ్మణులనూ చూస్తారు. కొండ బ్రాహ్మణులకు, మధేస్ బ్రాహ్మణులకు మధ్య పెళ్లిళ్లు జరగవు. ఒకవేళ జరిగితే దాన్ని కులాంతర వివాహంగా పరిగణిస్తారు" అని నేపాల్ కాంగ్రెస్ నేత కంచన్ ఝా చెప్పారు.

"నేపాల్‌లో, 71 శాతం ఇతర కులాల జనాభాపై 29 శాతం బ్రాహ్మణులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. రాచరికం ఉన్నప్పుడు, ప్రజస్వామ్యంలో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. ఇప్పుడు మధేసీ, గిరిజనులు, దళితులపై వివక్ష నేరంగా పరిగణిస్తున్నారు. నేపాలీ భాష ఖస్ ఆర్యకు చెందినది. రాచరికంలోనూ, ప్రజాస్వామ్యంలోనూ ఈ భాషే ఆధిపత్యంలో ఉంది.

హిమాలయ తెగలకు వారి సొంత భాష ఉంది. మధేసీలకూ సొంత భాష ఉంది. కానీ అధికారిక భాష నేపాలీ. 30 శాతం మాట్లాడే భాషను 70 శాతం మందిపై రుద్దుతున్నారు. అందుకే, ప్రభుత్వ శాఖల్లో నేపాలీ భాషలో నైపుణ్యం లేనివారు, ఖాస్ ఆర్యులు కానివారు వెనుకబడి ఉన్నారు" అని కంచన్ ఝా అన్నారు.

నేపాల్‌లో రాచరికం ముగిసినప్పటి నుంచి కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నేపాలీ కాంగ్రెస్‌ కూడా కమ్యూనిస్టుల మద్దతుతోనే అధికారంలోకి వచ్చింది.

నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ పగ్గాలు బ్రాహ్మణుల చేతిలోనే ఉన్నాయి. అది ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) అయినా లేదా కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) అయినా సరే.

నేపాలీ కాంగ్రెస్‌లో కూడా పెత్తనం బ్రాహ్మణులదే. ప్రస్తుతం షేర్ బహదూర్ దేవా చేతిలో పగ్గాలు ఉన్నాయి. ఆయన ఛెత్రి.. ఖస్ ఆర్య సమూహానికి చెందినవారు.

నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్, మాజీ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ బ్రాహ్మణులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్, మాజీ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ బ్రాహ్మణులు

నేపాల్‌లో కమ్యూనిస్టు పాలనా లేక బ్రాహ్మణుల పాలనా?

కమ్యూనిస్ట్ పార్టీలలో, నేపాలీ కాంగ్రెస్‌లో ఖస్ ఆర్య ఆధిపత్యం అంతం కానంత వరకు నేపాల్‌లో లౌకిక ప్రభుత్వం రాదని విశ్లేషకులు అంటున్నారు.

ఇదంతా చూస్తే నేపాల్‌లో కమ్యూనిస్టు పాలన ఉందా లేక బ్రాహ్మణ పాలన ఉందా అనే అనుమానం కలుగుతుంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు అన్నీ బ్రాహ్మణుల పార్టీలేనా? అన్న ప్రశ్న వస్తుంది.

“నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం నా తప్పు కాదు. నేను కులాన్ని వదిలేశాను. కులాంతర వివాహం చేసుకున్నాను. ఉన్నత కులంలో పుట్టిన వారికే విద్యావకాశాలు ఎక్కువగా ఉంటాయి. చదువుల వలన వాళ్లకు శాస్త్రీయ దృక్పథం అబ్బుతుంది. అందుకే ఏ విప్లవ ఉద్యమానికైనా వాళ్లే నాయకత్వం వహిస్తారు. ప్రపంచంలో ఏ మూల చూసినా కమ్యూనిస్ట్, జాతీయవాద ఉద్యమాలకు అగ్రవర్ణాల వారే నాయకత్వం వహించారు. మార్క్స్ నుంచి గాంధీ, నెహ్రూ వరకు ఇదే జరిగింది. రాజ్యాంగంలో అణగారిన కులాల కోసం ఎన్నో ఏర్పాట్లు చేశాం. నేపాల్ బ్రాహ్మణులకు ప్రగతిశీల ఆలోచన ఉంది. నేపాల్ రాజకీయాలు మరింతగా అందరినీ కలుపుకుపోవాలనేది నిజమే. కానీ, దానికి సమయం పడుతుంది" అని మాజీ ప్రధానమంత్రి బాబూరామ్ భట్టారాయ్ అభిప్రాయపడ్డారు.

“నేపాల్‌లో రాజకీయ పార్టీలు వ్యక్తి కేంద్రంగా మారాయి. ప్రత్యేకించి ఇక్కడి కమ్యూనిస్టు పార్టీల్లో ఒకరి హవానే నడుస్తుంది. అందుకే అందరినీ కలుపుకుపోయేట్టు నిర్ణయాలు ఉండవు. గత 30 ఏళ్లుగా ప్రచండ తన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఓలి, దేవా కూడా అదే చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు పాత సంప్రదాయాలను దాటలేకపోతున్నాయి" అని ఆయన అన్నారు.

నేపాల్

ఫొటో సోర్స్, Getty Images

భారత కమ్యూనిస్టులు vs నేపాల్ కమ్యూనిస్టులు

భారతదేశంలో కన్నా నేపాల్‌లో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రగతిశీల దృక్పథంతో ఉన్నాయని భట్టారాయ్ అభిప్రాయపడ్డారు.

కానీ, డెన్మార్క్‌లో నేపాల్ రాయబారిగా వ్యవహరించిన విజయకాంత్ కర్ణ దీనికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తంచేశారు.

"భారతదేశంలోని కమ్యూనిస్ట్ పార్టీలు.. దళితులు, ముస్లింలు, వెనుకబడిన కులాలు గురించి గళం విప్పాయి. కానీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలు ధనిక బ్రాహ్మణుల చేతుల్లోనే మగ్గుతున్నాయి. అధికారంలో ఉండడమే వారి లక్ష్యం" అని కర్ణ అన్నారు.

1990లలో నేపాల్‌లో మావోయిస్ట్ ప్రజాయుద్ధం జరుగుతున్నప్పుడు, ఈ నేతలంతా దళితులు, మధేసీలు, మహిళలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారని, అధికారం చేతికి వచ్చాక అవన్నీ పక్కనపెట్టారని కర్ణ అన్నారు.

"ఇప్పటివరకూ గిరిజనులెవరూ ఎందుకు ప్రధానమంత్రి కాలేదు? ప్రచండ లేదా భట్టారాయ్ మాత్రమే ఎందుకు ప్రధానులయ్యారు?" అని ఆయన ప్రశ్నించారు.

"ప్రచండ క్యాబినెట్‌లో ఇప్పుడు మహేంద్ర రాయ్ అనే మధేసీ మంత్రి ఉన్నారు. కానీ, ఆయన ముఖ్యమైన శాఖలోలేరు. మధేసీ ఉద్యమానికి ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా మద్దతు ఇవ్వలేదు. పేదల హక్కుల కోసం జరిగిన ఉద్యమానికి కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు దూరంగా ఉన్నాయి? భారత కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా చేస్తాయా? భారత్‌లో కూడా కమ్యూనిస్టు పార్టీలో పగ్గాలు చాలావరకు బ్రాహ్మణుల చేతిలోనే ఉన్నాయి. కానీ, వారు దళితులు, మైనారిటీలు, మహిళల గురించి పోరాడారు" అని కర్ణ అన్నారు.

కానీ, నేపాల్ సమాజం భారత సమాజం కంటే భిన్నమైనదని, అక్కడి నుంచి వచ్చిన వారసత్వమే అయినా నేపాల్‌లో బ్రాహ్మణులు భారత్‌లో బ్రాహ్మణుల లాగ అంటరానితనం పాటించరని కర్ణ అభిప్రాయపడ్డారు.

నేపాల్

ఫొటో సోర్స్, Getty Images

‘రాచరికం అంతానికి పోరాడింది ఒకరు.. అధికారం మరొకరిది’

ఆహుతి నేపాల్‌కు చెందిన ప్రసిద్ధ కవి, దళిత ఆలోచనాపరుడు. సైంటిఫిక్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత.

బ్రాహ్మణులకు నాయకత్వం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, అభ్యుదయ భావజాలం ఉన్న బ్రాహ్మణులు లేకపోవడమే సమస్య అని ఆయన అన్నారు.

"రాచరికాన్ని అంతమొందించేందుకు పోరాడిన వారంతా వెనుకబడిన కులాలవారు. ప్రాణాలు కోల్పోయింది కూడా వాళ్లే. కానీ, ప్రజాస్వామ్యం వచ్చేటప్పటికి అధికారం బ్రాహ్మణుల చేతిలోనే ఉంది. నేపాల్‌లో కుల ఆధిపత్యం మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. రాచరికాన్ని అంతం చేసేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసినవారికి ఏమీ దక్కలేదు" అని ఆహుతి అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)