నేపాల్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, ప్రధాని ప్రచండ ముందున్న 5 సవాళ్ళు

ఫొటో సోర్స్, FACEBOOK/COMRADE PRACHANDA
- రచయిత, బీబీసీ నేపాలి
- హోదా, .
నేపాల్ పార్లమెంటు ఎన్నికల్లో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ అధినేత పుష్పకమల్ దాహాల్ 'ప్రచండ' ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న పార్టీని వదిలి, యూఎంఎల్ మద్దతులో మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టారు.
ఎన్నికలకు ముందు ప్రచండ పార్టీ నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. నేపాలీ కాంగ్రెస్ పార్లమెంటులో అత్యధిక స్థానాలు గెల్చుకుంది. ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని, ప్రధానిగా మాత్రం తానే ఉంటానని ప్రచండ కోరారు.
కానీ, నేపాలీ కాంగ్రెస్ నేత షేర్ బహదూర్ దేవ్‌బా అందుకు ఒప్పుకోలేదు. దాంతో, సీపీఎన్ యూఎంఎల్ అధ్యక్షుడు కేపీ ఓలితో కలిసి ప్రచండ కొత్త కూటమిని ఏర్పాటు చేశారు.
రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, ఆర్‌పీపీ, జేఎస్‌పీ, జన్మత్ పార్టీ, సివిల్ లిబర్టీస్ పార్టీ, యూఎంఎల్‌లతో పాటు కొందరు స్వతంత్ర ఎంపీల మద్దతుతో నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ప్రచండ ఎంపికయ్యారు.
అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నారో, ఆయన ప్రభుత్వం ముందు కూడా అంతే స్థాయిలో సవాళ్లున్నాయి.
ప్రధాని ప్రచండ ముందున్న ఐదు ముఖ్యమైన సవాళ్ల గురించి వివిధ రంగాలకు చెందిన నిపుణులు బీబీసీతో మాట్లాడారు.

ఫొటో సోర్స్, FACEBOOK/COMRADE PRACHANDA
1. రాజకీయ అస్థిరత
కొత్త ప్రభుత్వం ఏర్పాటు ముందు నుంచే రాజకీయ అస్థిరత వారికి ఆందోళనకరంగా మారిందని రాజకీయ నిపుణులన్నారు. ప్రభుత్వం ఏ సమయంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందన్నారు.
‘‘రాజ్యాంగం ప్రకారం మెజారిటీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కానీ, ఇప్పుడు అధికారం చేపట్టిన రాజకీయ కూటమి భాగస్వామ్య పక్షాల ఒత్తిళ్ళ మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది’’ అని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ లోక్‌రాజ్ బరాల్ అన్నారు.
‘‘నేపాల్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే సంప్రదాయమే లేదు. ఏదైనా చిన్న విషయానికి ఏ పార్టీ మధ్యలోనైనా అసంతృప్తి వ్యక్తమైతే ప్రభుత్వం పడిపోతుంది. రాజకీయ అస్థిరత నెలకొంటుంది’’ అని చెప్పారు.
అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, పొత్తులు పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం రాజకీయ విధానాలపై మిత్రపక్షాలతో కసరత్తు చేయాల్సి ఉంటుందని లోక్‌రాజ్ తెలిపారు.
అయితే, నేపాల్ రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంది. అదేమిటంటే, రెండేళ్ల వరకు ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీలు లేదు.
కూటమిలో కనుక ఏదైనా చీలికలు వస్తే, ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు.
2. సమాఖ్య విధానం ఎలా...
సమాఖ్య విధానాన్ని ఏర్పాటు చేయడం, అమలు చేయడం ప్రచండ ప్రభుత్వానికి ముందున్న అతిపెద్ద సవాలని కొందరు నిపుణులు అంటున్నారు.
పార్లమెంట్‌లో సమాఖ్య విధానానికి వ్యతిరేకించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
గత ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. అలాగే ఆర్‌పీపీ కూడా పార్లమెంట్‌లో తన బలాన్ని పెంచుకుంది.
ప్రచండ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఈ రెండు పార్టీలు కీలక పాత్ర పోషించాయి.
సమాఖ్య విధానం కోసం భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నారని యూఎంఎల్ అధ్యక్షుడు కేపీ శర్మ ఓలి విమర్శిస్తున్నారు.
ఫెడరల్ విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చట్టాలను ఆమోదించే విషయంలో కొత్త ప్రభుత్వం ఇబ్బందులు పడనుందని నిపుణులు సురేంద్ర ల్యాబ్ అన్నారు.
ఎందుకంటే సీపీఎన్-యూఎంఎల్, కేపీ శర్మ ఓలిలు ఈ కూటమిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు.

ఫొటో సోర్స్, RSS
3. ఆర్థిక సంక్షోభం
గత ఏడాది నుంచి నేపాల్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని చాలామంది ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఈ సంక్షోభం నుంచి కొంత మేర కోలుకుంటున్నట్టు సంకేతాలున్నప్పటికీ, కొన్ని ఆర్థిక రంగాలలో మాత్రం ఇంకా తీవ్ర ఇబ్బదికర పరిస్థితులున్నాయని చెప్పారు.
నేపాల్ ఆర్థిక వ్యవస్థ అంత మెరుగ్గా లేదనే సంకేతాలు చాలానే ఉన్నాయని ఆర్థికవేత్త చంద్రమణి అధికారి చెప్పారు.
వీటి కారణాలు తెలుసుకుని ఆర్థిక సంక్షోభాన్ని అదుపులోకి తేకపోతే, పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని అన్నారు. ఇదే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యంగా ఉండాలని చెప్పారు.
ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణ రేటు, అత్యధిక వడ్డీ రేటు, నిరుద్యోగం, దుబారా కార్యాలయ ఖర్చులు వంటి వాటిపై ప్రభుత్వం వెంటనే దృష్టిసారించకపోతే, ఇవన్ని కలిసి ప్రభుత్వానికి పెను భారంగా మారతాయని చంద్రమణి అధికారి అన్నారు.
నేపాలి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ సమస్యలు కొన్ని దేశీయ, అంతర్జాతీయ అంశాల కారణంగా ఏర్పడ్డాయని చెప్పారు.
‘‘పెరుగుతున్న పెట్రోలియం ధరలు, బలపడుతున్న డాలర్ వంటి అంతర్జాతీయ అంశాలు నేపాల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాయి. వీటిని తగ్గించవచ్చు. కానీ, నియంత్రించలేం. అలాగే దేశీయంగా చోటు చేసుకున్న ఇబ్బందులను మాత్రం నియంత్రించవచ్చు’’ అని చంద్రమణి అధికారి అన్నారు.
విదేశీ మారక నిల్వలకు ప్రధాన ఆదాయ వనరులైన ఎగుమతులు, పర్యాటకం, విదేశీ పెట్టుబడులు, విదేశీ సాయం వంటి వాటి ద్వారా పెరుగుతున్న ఈ ఆర్థిక అస్థిరతను, సంక్షోభాన్ని తగ్గించవచ్చని చంద్రమణి తెలిపారు. దీంతో విదేశీ నిల్వల రాకను మరింత ప్రోత్సహించవచ్చని చెప్పారు.
‘‘ఈ విషయాల్లో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచించాలి. అనవసరమైన సంస్థలను తొలగించాలి. కేంద్రం నుంచి రాష్ట్రాలు, స్థానిక ప్రాంతాల వరకు పెరుగుతున్న దుబారా ఖర్చుల భారాన్ని తగ్గించుకోవాలి’’ అని చంద్రమణి సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
4. విదేశీ విధానంలో సమతుల్యత
ఇటీవల కాలంలో నేపాల్ విదేశీ వ్యవహారాల్లో అంత క్రియాశీలకంగా లేదు. శక్తిమంతమైన దేశాల మధ్యలో వైరుధ్యానికి కేంద్రంగా నేపాల్ మారుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విదేశీ విధానంలో సమతుల్యత సాధించడమన్నది కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలని చెప్పారు. నేపాల్ ముందు ఈ సవాలు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రొఫెసర్ బరాల్ అన్నారు.
‘‘ఒకవేళ నేపాల్ విదేశీ విధానంలో పాత పద్ధతినే అనుసరించి, సమతుల్యత సాధిస్తే ఎలాంటి సమస్య ఉండదు. విదేశీ విధానంలో సమతుల్యత సాధించడం నేపాల్‌కు ఎల్లప్పుడూ ఉండే సమస్యే. కొత్త ప్రభుత్వం ముందు కూడా ఈ సవాలు ఉంటుంది’’ అని తెలిపారు.
అమెరికా సహాయ ప్రాజెక్టు విషయంలో కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల నేపాల్ విషయంలో అమెరికా, చైనాకు మధ్య వివాదం మరింత పెరగనుందని భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో, సరిహద్దు దేశాలు, ఇతర దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండేందుకు, సమతుల్యత విధానాన్ని అనుసరించడం నేపాల్ ముందున్న కర్తవ్యమని అన్నారు.

5. పార్టీతో పాటు ప్రభుత్వం పరువును కాపాడడం...
ప్రజల నమ్మకాన్ని మళ్లీ చూరగొనడం కూడా కొత్త ప్రభుత్వం ముందున్న సవాలని రాజకీయ నిపుణులంటున్నారు.
ప్రజలు తీవ్ర ఆగ్రహవేశంతో, నిరసనలతో వారి ఓట్లను స్వతంత్ర పార్టీకి వేశారని, ప్రజల్లో ఉన్న ఈ విద్వేషాన్ని పోగొట్టాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపైనే ఉందని ప్రొఫెసర్ బరాల్ అన్నారు.
అయితే, ఇది జరుగుతుందా అనే విషయంపై మాత్రం అంత సానుకూలత వ్యక్తం చేయడం లేదు.
ప్రస్తుత నాయకుల్లో ఏదైనా మార్పు వస్తుందని తాను భావించడం లేదన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రజల్లో ఆశలు బాగా పెరిగాయని, అవి కనుక నెరవేర్చకపోతే వారు వెంటనే అసంతృప్తికి గురవుతారని భావించారు.
ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరాలనుకున్న జన్మత్ పార్టీ అధ్యక్షుడు సీకే రౌత్ కూడా సోషల్ మీడియాలో అధికార మార్పిడి విషయంలో నిరాశ వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేవలం పాత పార్టీలే కాదు, కొత్త పార్టీలు కూడా ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ఎక్కువగా ప్రయత్నించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చూడండి:
- కుంచెతో కోట్లు సంపాదిస్తున్న ‘లిటిల్ పికాసో’
- ధనిక దేశంలో పేదల కోసం సూపర్ మార్కెట్లు.. ఎలా సక్సెస్ అయ్యాయంటే
- ఇండియా-చైనా ఉద్రిక్తతలు: భారత్‌కు ఆయుధాల సరఫరాను రష్యా నిలిపివేస్తుందా
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 50 లక్షలు గెలిచిన 8వ తరగతి అమ్మాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














