ఇండియా-చైనా ఉద్రిక్తతలు: భారత్‌కు ఆయుధాల సరఫరాను రష్యా నిలిపివేస్తుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాడికి ఆదేశాలు జారీచేసినప్పుడు మీడియాలో భారత్ వైఖరిపై చాలా చర్చ జరిగింది.
యుక్రెయిన్ సంక్షోభం వల్ల రష్యా, చైనా మరింత దగ్గర అవుతాయని, ఇది భారత్‌కు మంచిదికాదని కొందరు విదేశీ వ్యవహారాల నిపుణులు వ్యాఖ్యానించారు.
యుక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం మొదలై 300 రోజులకుపైనే గడిచాయి.
ఈ మధ్య కాలంలో రష్యా-చైనా సంబంధాలు మరింత బలపడ్డాయని మరికొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
యుక్రెయిన్ సంక్షోభంతో చైనాకు రష్యా మరింత చేరువ అవుతుందనే భయం భారత్‌ను మొదటి నుంచి వెంటాడుతోందని దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని ‘సెంటర్ ఫర్ రష్యా అండ్ సెంట్రల్ ఏసియా స్టడీస్’ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ పాండే చెప్పారు.
ఆ భయం నేడు నిజమవుతోందని పాండే అభిప్రాయపడ్డారు.
‘‘రష్యాపై చైనా ఆధారపడటం ఎక్కువైంది. మరోవైపు రష్యాలో చైనా పెట్టుబడులు కూడా చాలా పెరిగాయి. ఇవి భారత్‌కు మంచిది కాదు’’అని ఆయన వివరించారు.
డిసెంబరు 21న యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ అమెరికాకు వెళ్లారు.
అమెరికా అధ్యక్షుడి జో బైడెన్‌తో భేటీ కావడంతోపాటు అక్కడి కాంగ్రెస్‌ను ఉద్దేశించి జెలియెన్‌స్కీ ప్రసంగించారు.
అదే రోజు రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సెల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వేదేవ్ చైనా పర్యటకు వెళ్లారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఆయన కలిశారు. పుతిన్ రాయబారిగా మెద్వేదేవ్ చైనాకు వెళ్లారు. పుతిన్ సంతకం చేసిన ఓ లేఖను కూడా జిన్‌పింగ్‌కు ఆయన అందించినట్లు చైనా ఒక ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు యుక్రెయిన్ సంక్షోభంలో రష్యాకు వ్యతిరేకంగా చైనా ఒక్కసారి కూడా స్పందించలేదు. మొదట్నుంచీ రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కారించేందుకు ప్రయత్నించాలని చైనా సూచించింది. ఇక్కడ రష్యా భద్రతా ఆందోళనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చైనా చెబుతూ వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇది భారత్‌కు కూడా సంక్షోభం లాంటిదే..
ఇప్పటివరకు యుక్రెయిన్ సంక్షోభంలో పరిస్థితుల్లో ఎలాంటి మార్పులకు తావివ్వకుండా షీ జిన్‌పింగ్ ఆచితూచి మాట్లాడారని గ్లోబల్ థింక్ ట్యాంక్ కార్నెగీ ఎండోమెంట్‌లో సీనియర్ పరిశోధకుడు అలెగ్జాండర్ గైబుయెవ్ వ్యాఖ్యానించారు.
‘‘ఆకాశం నీలంగా ఉంది, గడ్డి పచ్చగా ఉంది, అణ్వాయుధాలు ఉపయోగించకూడదు.. ఇలాంటి వ్యాఖ్యలనే ఆయన చేశారు’’అని అలెగ్జాండర్ అన్నారు.
‘‘రష్యా విషయంలో చైనా ఎప్పటినుంచో ఒక గిరి గీసుకుంది. యుక్రెయిన్ లాంటి సున్నితమైన అంశాల్లో రష్యాను ఆపడం కష్టమని చైనాకు కూడా తెలుసు. పుతిన్ విదేశాంగ విధానాలను ఒక తుపానుగా చైనా దౌత్యవేత్తలు చూస్తున్నారు. ఈ తుపానును అడ్డుకోవడం తేలికకాదని వారు భావిస్తున్నారు. అయితే, ఇక్కడ ప్రమాదాన్ని అడ్డుకోకపోయినా ఫర్వాలేదు.. కానీ, దాన్ని అవకాశంగా తీసుకోకూడదు’’అని ఆయన వివరించారు.
చైనా పర్యటనపై ఒక వీడియోను తన టెలిగ్రామ్ చానెల్‌లో మెద్వెదేవ్ పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక అంశాలపై చర్చలు జరిగాయని, పారిశ్రామిక సహాకారం గురించి కూడా మాట్లాడినట్లు దీనిలో వివరించారు.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని చూస్తుంటే.. రెండు దేశాలు మరో మెట్టు పైకి వెళ్లినట్లు తెలుస్తోంది. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2022 మొదటి 11 నెలల్లో ద్వాపాక్షిక వాణిజ్యం 172.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే, దీనిలో 32 శాతం పెరుగుదల కనిపించింది.
చైనాకు రష్యా ఎగుమతులు 105.07 బిలియన్ డాలర్లు. ఇక్కడ 47.5 శాతం పెరుగుదల కనిపించింది. మరోవైపు రష్యాకు చైనా ఎగుమతులు 67.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనిలోనూ 13.4 శాతం పెరుగుదల నమోదైంది.
2021లో చైనా, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 146.89 బిలియన్ డాలర్లు. 2014లో ఇది 95.3 బిలియన్ డాలర్లు మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా-చైనా బలోపేతం
చైనాకు రష్యా ఎగుమతుల్లో సగం వాటా చమురుదే. మరోవైపు ఎలక్ట్రానిక్స్, బ్రాడ్‌కాస్టింగ్ పరికరాలు, కంప్యూటర్ల విషయంలో చైనాపై రష్యా ఆధారపడుతోంది. రష్యా ఆర్కిటిక్ ప్రాంతంలో సహజ వాయువు, చమురు ప్రాజెక్టుల్లో చైనా కలిసి పనిచేస్తోంది.
యుక్రెయిన్‌లో భాగమైన క్రైమియాను రష్యా తన నియంత్రణలోకి తీసుకోవడంతో అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్కిటిక్‌లోని రష్యా గ్యాస్ ప్రాజెక్టులను మళ్లీ గాడినపెట్టేందుకు చైనా ప్రభుత్వం కంపెనీలు ఇక్కడ పనిచేస్తున్నాయి. చైనా భూభాగం అవతల యువాన్‌తో వాణిజ్యం చేసే మూడో అతిపెద్ద దేశంగా నేడు రష్యా మారింది.
రానున్న రోజుల్లో రష్యా నుంచి చైనాకు ఎగుమతయ్యే సహజ వాయువు, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు మరింత పెరగొచ్చని అమెరికా వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఒక వార్త ప్రచురించింది. ‘‘ఆర్కిటిక్‌లో రెండు దేశాల మధ్య ఎనర్జీ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. రష్యా మౌలిక సదుపాయాల్లో చైనా పెట్టుబడులు కూడా మరింత పెరుగుతాయి’’అని దానిలో పేర్కొన్నారు.
మరోవైపు రష్యా రైల్వేలు, పోర్టుల్లో చైనా పెట్టుబడులు కూడా పెరగబోతున్నాయి. రెండు దేశాలు యువాన్, రూబుల్‌లో వాణిజ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యాకు ఇది తోడ్పడుతుంది. మరోవైపు చైనా కరెన్సీలో వాణిజ్యానికి ఇది అవకాశం కల్పిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు ముప్పుగా పరిగణించాలా?
రష్యా, చైనాల మధ్య బలోపేతం అవుతున్న సంబంధాలను భారత్‌కు ముప్పుగా పరిగణించాలా? ఈ ప్రశ్నపై అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వంలో రష్యా రాయబారిగా పనిచేసిన కన్వల్ సిబల్ మాట్లాడుతూ.. ‘‘ఆ రెండు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని భారత్‌కు వ్యతిరేకంగా చూడకూడదు. నిజానికి ఇది అమెరికాకు వ్యతిరేకమైనది’’అని అన్నారు.
‘‘ఇక్కడ భారత్ ఆందోళన పడాల్సినదేమీ లేదు. ఇటు చైనా, అటు రష్యా రెండు దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా ఆదేశాల ప్రకారం, అన్నీ జరగాలనే వాదనను వ్యతిరేకిస్తున్నాయి’’అని ఆయన అన్నారు.
‘‘రష్యాపై అమెరికా పరోక్ష యుద్ధమే చేస్తోంది. మరోవైపు అమెరికా ఆధిపత్యాన్ని చైనా వ్యతిరేకించడం ఎక్కువైంది. అలాంటి పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా చైనా, రష్యా కలవడం అనేది సహజం’’అని కన్వల్ అన్నారు.
‘‘వస్తువులను ఎగుమతి చేసే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. భవిష్యత్‌లో అమెరికాను వెనక్కి నెట్టి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరిస్తుంది. అప్పుడు చైనా ఇంధన అవసరాలు కూడా భారీగా పెరుగుతాయి. రష్యా మాత్రమే వీటిని తీర్చగలదు’’అని ఆయన విశ్లేషించారు.
‘‘ఇక్కడ చైనాతో సాన్నిహిత్యం ఉన్నంత మాత్రాన భారత్‌కు వ్యతిరేకంగా రష్యా చర్యలు తీసుకుంటుందని మనం భావించకూడదు. అయితే, రానున్న కాలంలో భారత్ కొన్ని కఠిన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు’’అని ఆయన చెప్పారు.
రష్యా-చైనాల మధ్య సాన్నిహిత్యం విషయంలో భారత్ భయపడాల్సిన అవసరంలేదని కన్వల్ సిబల్ చెబుతున్నప్పటికీ.. భారత్‌కు ఇది తలనొప్పి వ్యవహారమేనని చాలా మంది విదేశాంగ నిపుణులు చెబుతున్నారు.
చైనాపై రష్యా అతిగా ఆధారపడటంతో భారత్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని వాషింగ్టన్‌కు చెందిన బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇండియా విభాగం డైరెక్టర్ తన్వీ మదన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఎందుకంటే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. మరోవైపు సైనిక పరికరాల కోసం రష్యాపై భారత్ ఆధారపడుతోంది. ఇది మరింత క్లిష్టంగా మారుతోంది’’అని తన్వీ అన్నారు.
ఈ ఏడాది జనవరిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తన్వీ మదన్ ఒక కథనం రాశారు. ‘‘చైనాపై రష్యా ఆధారపడటం పెరిగినప్పుడు, సంక్షోభ సమయంలో భారత్‌కు ఆయుధాల సరఫరాను తగ్గించాలని రష్యాకు చైనా సూచించొచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది?’’అని ఆమె ప్రశ్నించారు. 1962 భారత్-చైనా యుద్ధంలో సోవియట్ యూనియన్ వైఖరిని ఆమె గుర్తు చేశారు.
ఈ ఏడాది మార్చిలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో యుక్రెయిన్‌పై దాడి విషయంలో రష్యాపై ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత్‌కు చెందిన జస్టిస్ బల్‌బీర్ భండారీ ఓటు వేశారు. యుక్రెయిన్ సంక్షోభం అనేది భారత్‌కు చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. రష్యా వ్యతిరేకంగా తమతో కలవాలని పశ్చిమ దేశాలు భారత్‌పై ఒత్తిడి చేస్తున్నాయి. అదే సమయంలో రష్యా నుంచి భారత్ దూరంగా జరగడం అంత తేలిక కాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ కూడా..
మరోవైపు పాకిస్తాన్‌తో రష్యా సంబంధాలు కూడా భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో పశ్చిమ దేశాలకు భారత్ చేరువ కావడంపై రష్యా కూడా అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల క్వాడ్ కూటమిలో భారత్ చేరడంపై రష్యా మొదట్నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.
చైనా వ్యతిరేక వ్యూహంలోని భారత్‌ను పశ్చిమ దేశాలు లాగుతున్నాయని క్వాడ్‌ను ఉద్దేశించి రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. అయితే, ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ, భారత్-రష్యా సంబంధాలు గాడితప్పకుండా రెండు దేశాలు జాగ్రత్త వహిస్తున్నాయి.
చైనా సూచనలపై భారత్‌కు సైనిక సామగ్రి విక్రయాలను రష్యా ఆపేయడం అనేది జరగబోదని కన్వల్ సిబల్ చెప్పారు. మరోవైపు కార్నెగీ మాస్కో థింక్ ట్యాంక్ డైరెక్టర్ దిమిత్రి ట్రెనిన్ కూడా అలానే స్పందించారు.
‘‘భారత్‌కు రష్యా సైనిక సామగ్రి సరఫరా విషయంలో చైనా అసంతృప్తితో ఉండటం సహజమే. కానీ, ఈ విషయంలో రష్యాపై చైనా ఒత్తిడి చేయదు. ఎందుకంటే ఇలాంటి ఒత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుందని చైనాకు తెలుసు’’అని దిమిత్రి చెప్పారు.
ఎలా చూడాలి?
భారత్‌కు సైనిక సామగ్రి సరఫరా విషయంలో రష్యా వైఖరి ఎప్పటికీ మారబోదని మనం భావించకూడదు. అయితే, భారత్-చైనా సంబంధాల్లో ఒడిదొడుకులు ఈ విషయంలో ప్రభావం చూపించకపోవచ్చని విదేశాంగ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ భారత్, రష్యా తమ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తాయని వివరిస్తున్నారు.
ఇక్కడ రష్యా ఎగుమతులకు భారత్ పెద్ద మార్కెట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 2017 నుంచి 2021 మధ్య రష్యా ఎగుమతుల్లో ఇక్కడ 27.9 శాతం పెరుగుదల కనిపించింది.
ఇప్పటికీ రష్యా ఎగుమతులకు భారత్ ప్రధాన కేంద్రం. మరోవైపు గల్ఫ్ దేశాల నుంచి చమురు ఉత్పత్తులను తగ్గించి తమ నుంచి కొనుగోలు చేయాలని రష్యా భావిస్తోంది. యుక్రెయిన్ సంక్షోభం తర్వాత ఈ విషయంలో రష్యా పట్టుబడుతోంది.
అయితే, భారత్ విషయంలో రష్యా ఎంతవరకు సాయం చేస్తుందనే ప్రశ్నకు భిన్న స్పందనలు వస్తున్నాయి. నిజానికి 1962 భారత్-చైనా యుద్ధంలో సోవియట్ యూనియన్ వైఖరిని చూస్తే దీనికి కొంతవరకు మనకు సమాధానం దొరకొచ్చు.
ఆనాడు భారత్‌పై దాడిచేసే కంటే, ఒప్పందం కుదుర్చుకోవాలని చైనాకు సోవియట్ సోనియన్ నాయకుడు నికిత ఖ్రుస్చేవ్ సూచించారని, కానీ, అదే సమయంలో క్యూబా క్షిపణుల సంక్షోభం వల్ల అతడి దృష్టి అటువైపు మళ్లిందని ఇప్పటికీ చాలా మంది విదేశాంగ నిపుణులు చెబుతున్నారు.
‘‘కశ్మీర్ విషయంలో నికిత వైఖరి స్పష్టంగా ఉండేది. ఇది భారత్‌లో అంతర్భాగమని ఆయన బహిరంగంగా నొక్కిచెప్పారు. కానీ, చైనా విషయంలో ఆయన ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు’’అని జేఎన్‌యూలోని సెంటర్ ఫర్ సెంట్రల్ ఆసియా అండ్ రష్యన్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ రాజన్ కుమార్ చెప్పారు.
నిజానికి అప్పట్లో క్యూబా క్షిపణులు సంక్షోభం లేకపోయుంటే, పరిస్థితులు భిన్నంగా ఉండేవని రాజన్ వ్యాఖ్యానించారు.
‘‘చైనా సూచనలపై భారత్‌కు ఆయుధాల విక్రయాన్ని రష్యా ఎలా నిలిపివేయదో.. అలానే భారత్ సూచనలపై చైనాకు వ్యతిరేకంగా రష్యా ఎలాంటి చర్యలూ తీసుకోదు’’అని విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















