భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం

- రచయిత, ఆమిర్ పీర్జాదా, బీబీసీ ప్రతినిధి
- హోదా, రించెన్ అంగ్మొ చుమిక్ఛాన్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, లేహ్ లద్దాఖ్ నుంచి
మే 5 నుంచి భారత-చైనా సరిహద్దుల్లోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తాయి.
తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని చల్లార్చేందుకు రెండు దేశాల సైన్యం మధ్య శనివారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
గతంలో ఇరు దేశాల నాయకత్వం తీసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా ప్రస్తుతం తలెత్తిన సరిహద్దు సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు రెండు దేశాల కమాండర్లు అంగీకరించారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది.
కొద్ది రోజుల క్రితం భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సరిహద్దుకు ఆవల చైనా సైన్యం భారీ ఎత్తున నిర్మాణాలను చేపట్టిందని అన్నారు. అందుకు అనుగుణంగా భారత్ కూడా తగిన విధంగా చర్యలు చేపడుతోందని చెప్పారు.
మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి 4,350 మీటర్ల ఎత్తున హిమాలయాల ప్రాంతంలోని గాల్వన్ నది సమీపంలో భారత్-చైనా దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణల్లో ఇరు దేశాలకు చైందిన సైనికులు గాయపడ్డారన్న వార్తలు కూడా వచ్చాయి.
సరిహద్దులకు రెండు వైపులా బలగాల్ని మొహరించిన ఇరు దేశాలు ఒకరి భూభాగంలోకి మరొకరు చొచ్చుకొస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారని వివిధ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి.

ఈ పరిస్థితులు స్థానికులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి ?
సరిహద్దుల విషయానికి వచ్చేసరికి భారత్-చైనా దేశాలు రెండూ భిన్నమైన అవగాహనలతో ప్రాంతీయ వాదనల్ని అతిగా వ్యాప్తి చేస్తూ ఉంటాయి. ఈ విషయంలో రెండు దేశాల సైన్యం మధ్య సరైన అవగాహన లేకపోవడం వల్లే తరచు ఘర్షణలు జరుగుతున్నాయని, కానీ వాటిని సైనికాధికారులు చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకుంటున్నారని భారత రక్షణ శాఖ మంత్రి వ్యాఖ్యానించారు.
రెండు దేశాల మధ్య హద్దులు నిర్ణయించడంలో అంతంత మాత్రంగానే ఉన్న వాస్తవాధీన రేఖ లద్ధాక్‌లో రెండు వైపులా వేరు చేస్తుంది. నదులు, సరస్సులు, మంచుతో కప్పబడిన ఆ పర్వత ప్రాంతంలో స్థానిక పరిస్థితుల కారణంగా వాస్తవాధీన రేఖ రూపు రేఖలు తరచు మారుతూ ఉంటాయి. ఫలితంగా ఎప్పటికప్పుడు రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తే పరిస్థితులు నెలకొంటున్నాయి.
ప్రస్తుతం గాల్వన్ లోయ, అలాగే పాంగాంగ్ టీఎస్ఓ ప్రాంతాల్లోనే ఘర్షణలు తలెత్తాయని వివిధ వార్తా సంస్థలు చెబుతున్నాయి. దీంతో స్థానికులకు తమ భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది.
“ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న వారి గురించే నా భయం అంతా. ప్రస్తుతం భారత్-చైనా దేశాల మధ్య ఘర్షణలు తెలెత్తిన ప్రాంతంలోనే మా గ్రామాలు కొన్ని ఉన్నాయి” అని లద్ధాక్ అటానమస్ హిల్ డవలప్‌మెంట్ కౌన్సిల్‌లో కౌన్సిలర్‌గా పని చేస్తున్న కొంచొక్ స్టాంజిన్ వ్యాఖ్యానించారు.

గడిచిన నెల రోజులుగా ఎల్ఏసీ ప్రాంతంలో భారత బలగాల హడావుడి బాగా ఎక్కువయ్యింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల బలగాలు భారీగా మొహరించాయి.
కానీ కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణల కారణంగా తమ ప్రాంతంలో భారత ఆర్మీ కూడా మొహరించిందని స్థానికులు చెబుతున్నారు.
ఠప్రస్తుతం ఇక్కడ ఎటు చూసినా సైనిక బలగాలే కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. 1962 ఇండో-చైనా యుద్ధం తర్వాత ఎప్పుడూ ఈ స్థాయిలో బలగాలను ఈ ప్రాంతంలో ఎవ్వరూ చూసి ఎరుగరు" అని కొంచక్ స్టాంజిన్ చెప్పారు.
“ప్రస్తుతం ప్రతి రోజు మా గ్రామం మీదుగా వంద నుంచి 2 వందల వరకు సైనిక వాహనాలు వెళ్లి వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ స్థాయిలో సైనిక కార్యకలాపాలను చూస్తుంటే మాకు భయం వేస్తోంది” అని స్థానిక సర్పంచ్ సోనమ్ అంగ్‌చుక్ తమ ఆందోళన వ్యక్తం చేశారు.
“గతంలో కూడా రెండు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఒక అసాధారణమైన పరిస్థితి నెలకొని ఉంది” అని సోనమ్ తెలిపారు.
కొంత మంది కౌన్సిలర్లతో కూడిన ఒక బందం ఇటీవల లద్ధాక్ ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్ నంగ్యల్‌తో కలిసి తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో మూడు రోజుల పాటు పర్యటించింది.
ఆ బృందంలో టాంగ్సెట్ నియోజకవర్గానికి చెందిన కౌన్సిలర్ తషి యక్జే కూడా ఉన్నారు. “పాంగాంగ్ సరస్సుకు సరిగ్గా వ్యతిరేక దిశలో మన్మెర్క్ గ్రామం ఉంటుంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల పట్ల ఆ గ్రామస్థులు చాలా భయాందోళనలకు గురి అవుతున్నారు. ఆ గ్రామం సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంటుంది” అని తషీ బీబీసికి తెలిపారు.
అంతే కాదు “ రోజు వారీ కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నప్పటికీ ఓ వైపు కరోనావైరస్, మరోవైపు భారత్-చైనా దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడ సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఇది స్థానికులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మానసికంగా వాళ్లంతా ఆందోళనకు గురవుతున్నారు” అని సరిహద్దు గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితిని తషి వివరించారు.
స్థానికులు ముఖ్యంగా నొండాస్ ప్రజలు భారత్‌ను ఆనుకొని ఉన్న ఎల్ఏసీ ప్రాంతంలో నివసిస్తారు. గాల్వన్ లోయ ప్రాంతమే వారి జీవనోపాధికి ఆధారం.

సాధారణంగా లద్ధాక్ అత్యంత చల్లదనంతో కూడిన ఎడారి ప్రాంతం అక్కడ మాములు పరిస్థితుల్లో కూడా పశువులకు ఆహారం లభించడం చాలా కష్టమవుతుంది. దీంతో స్థానిక నాండోస్ ప్రజలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా మారిన పచ్చిక మైదాన ప్రాంతాలపైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు.
ప్రతి ఏటా చైనా బలగాలు ఆ ప్రాంతాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమిస్తూ వస్తూ ఉండటంతో తమ పశువుల మేతకు అనువుగా ఉన్న ప్రాంతం ఏ ఏటికాయేడు కుచించుకుపోతూ వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు.
“చాలా వరకు పచ్చికమైదానాలను చైనా ఆక్రమించుకుంటూ వస్తోంది. మిగిలిన ప్రాంతాన్ని కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ దేశం ఆక్రమించవచ్చన్న భయం స్థానికుల్లో నెలకొంది. ఒక వేళ ఆ గడ్డి మైదానాలను ఆ దేశం పూర్తిగా ఆక్రమిస్తే మాకు ఇక్కడ జీవనోపాధి కరవవుతుంది. అప్పుడు మేం ఈ ప్రాంతంలో నివసించడంలో అర్థం లేదు” అని లేహ్‌కి చెందిన లద్ధాఖ్ అటానమస్ హిల్ డవల్మెంట్ కౌన్సిల్ కౌన్సిలర్ కొంచక్ స్టాంజిన్ అభిప్రాయపడ్డారు.
“గతంలో ఆక్రమణలు అడుగుల్లో ఉండేవి. ఇప్పుడు కిలోమీటర్ల పరిధిలో ఆక్రమణలు జరుగుతున్నాయి. రోజు రోజుకీ మా పరిస్థితి కష్టంగా మారుతోంది” అని అని లేహ్‌కి చెందిన లద్ధాఖ్ అటానమస్ హిల్ డవల్మెంట్ కౌన్సిల్ కౌన్సిలర్ గుర్మిత్ దోర్జేయ్ అన్నారు.
“ఒకప్పుడు పచ్చిక బయళ్లలోకి మా జడల బర్రెలను, గుర్రాలను అలా వదిలేసేవాళ్లం. కానీ ఇప్పుడు వదిలేస్తే అవి తిరిగి రావడంలేదు. కనీసం వాటిని వెతికేందుకు కూడా మమ్మల్ని అనుమతించడం లేదు. 2014లో సుమారు 15 గుర్రాలు కనిపించకుండా పోయాయి” అంటూ చుముర్ గ్రామాధికారి పద్మ ఇషే తెలిపారు.
స్థానికుల ఆరోపణల్ని భారత రక్షణ మంత్రిత్వశాఖ దృష్టికి బీబీసీ తీసుకు వెళ్లగా ఆ ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు ఎటువంటి సరిహద్దు రేఖను ఏర్పాటు చేయలేదని అందువల్ల ఆక్రమణలకు అవకాశం లేదని పేరు చెప్పడానికి ఇష్టబడని అధికారులు తెలిపారు.
“ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న పచ్చిక బయళ్లు రోజు రోజుకీ కుచించుకుపోతున్నాయనడాన్నిమేం కొట్టి పారేయడం లేదు. అయితే బహుశా ఆ ప్రాంతంలో విపరీతంగా జనాభా పెరగడం కూడా అందుకు కారణం కావచ్చు. ఓ రకంగా ఈ జనాభా పెరుగుదలే రెండు దేశాలు తమ సరిహద్దుల విషయంలో జాగురకతతో వ్యవహరించడానికి కారణం” అని తెలిపారు.
స్తంభించిన సమాచార వ్యవస్థ
ఈ ప్రాంతంలో స్థానిక సమాచార వ్యవస్థ ఇప్పుటికీ అతుకుల బొంతలానే ఉంటుంది. కొన్ని ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ తన సేవల్ని అందిస్తున్నప్పటికీ గడిచిన వారం రోజులుగా అవి కూడా నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
“సరిహద్దుల్లో ఏ సమస్య వచ్చినా వెంటనే ఇక్కడ సమాచార వ్యవస్థను నిలిపేస్తారు. దాంతో మేం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ఆరేళ్ల క్రితం ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ మాత్రమే ఇక్కడ మాకు అందుబాటులో ఉంది” అని పాంగాంగ్ ప్రాంత సర్పంచ్ సోనమ్ అంగ్‌చుక్ తెలిపారు.
“తూర్పు లద్ధాఖ్‌లోని న్యొమ, దుర్బుక్ ప్రాంతాల్లో మే 12వ తేదీ నుంచి సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. నేను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. దాంతో వాళ్లు మే 15న పునరుద్ధరించారు. మళ్లీ జూన్ 3 నుంచి జూన్ 7 వరకు నిలిపేశారు” అని స్థానిక కౌన్సిలర్ తషి యక్జీ అన్నారు.
లద్ధాఖ్ ప్రాంతంలోని గ్రామాల్లో మొబైల్ సేవలు అంతంత మాత్రంగానే అందుబాటులో ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సెల్యులర్ సేవల్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాంతాలు మిగిలిన ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాయి.
“ఇక్కడ మాకు ఎటువంటి సమాచార వ్యవస్థ లేదు. ఇక్కడ ఏదైనా జరగరాని ఘోరం జరిగితే ఆ సమాచారాన్ని ఒకరికొకరం ఎలా అందించుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఫోన్ చేసుకోవాలనుకుంటే సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించి కర్జోక్ ప్రాంతానికి చేరుకోవాలి. ఒక్కోసారి అక్కడ సమాచార వ్యవస్థ కూడా పని చేయదు. గత ఏడాది చివరి వరకు మేం డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్స్(డీఎస్‌పీటీ)లను వినియోగించే వాళ్లం. వాటిని ఇప్పుడు నిలిపి వేశారు. శీతాకాలంలో శాటిలైట్ ఫోన్లు వాడే వాళ్లం. అవి బాగా ఖరీదైనవి కావడంతో వాటి సేవలు కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు ఎటువంటి సమాచార వ్యవస్థ లేదు” అని చుముర్ గ్రామ పెద్ద పద్మ ఇషే అక్కడ నెలకొన్న పరిస్థితిని వివరించారు.
భారతీయ బలగాలకే స్థానికుల మద్దతు
తమ ప్రాంతంలో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా తామంతా భారతీయ సైనికులకే మద్దతిస్తామని స్థానికులు చెబుతున్నారు.
“1962లో జరిగిన యుద్ధంలో భారతీయ సైన్యానికి మేం అన్ని విధాలుగా సాయం చేశాం. అవసరమైన సమయాల్లో సైనిక సామాగ్రిని మోసుకుంటూ వెళ్లాం. గాయపడ్డ సైనికుల్ని తాత్కాలిక ఆస్పత్రులకు తరలించాం. రేషన్ అందించాం” అని కొంచక్ స్టాంజిన్, సోనమ్ అంగ్‌చుక్‌లు నాటి అనుభవాలను వివరించారు.
తాజా ఘర్షణల తర్వాత కూడా స్థానికులు మళ్లీ అవసరమైతే భారత్ పక్షానే ఉంటామని చెబుతున్నారు. “మేం మా సర్పంచ్‌తో కలిసి ఆర్మీ అధికారులను కలిశాం. అన్ని విధాలా సాయమందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పాం” అని కొంచక్ స్టాంజిన్ అన్నారు.

లద్ధాఖ్ వంటి ప్రాంతాల్లో సైనిక ఆపరేషన్లు నిర్వహించడం అంత తేలికైన విషయం కాదు. సముద్ర మట్టానికి సుమారు 14వేల నుంచి 18 వేల అడుగుల ఎత్తయిన ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తుంది. చాలా చోట్లకు వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికులే సైనిక సామాగ్రిని మోసుకెళ్తూ సైన్యానికి గైడ్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఓ రకంగా ఆ సమయంలో వారికి అదే జీవనోపాధి.
కానీ ఈ సారి అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో వాళ్లు చాలా ఆందోళన చెందుతున్నారు.
“సరిహద్దుల్లో ఏం జరుగుతోందో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు తెలియడం లేదు. స్థానికులు మరింత ఆందోళనకు గురి కాకుండా అధికారులు తగిన సమాచారాన్ని అందించాలి” అని కొంచక్ స్టాంజిన్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రెండు దేశాల సైన్యం మధ్య జరుగుతున్న ఘర్షణల గురించి అటు మీడియాకు కానీ లేదా ప్రజలకు కానీ రెండు దేశాలు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు.
2017లో డొక్లాం ప్రాంతంలో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులే తలెత్తాయి. అవి కొన్ని నెలల పాటు కొనసాగాయి కూడా.
నిపుణుల ఆందోళన
“1962 యుద్ధం తర్వాత ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్ని మేం ఎన్నడూ చూడలేదు. చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండేవి. సాధారణంగా ఫలానా ప్రాంతంలో భారత్ నిర్మాణాలను చేపడుతోందని, వాటిని తక్షణం తొలగించాలని అప్పుడే మేం వెనక్కు వెళ్తామని చైనా బలగాలు చెబుతూ ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తుంటే చర్చల ద్వారా వారు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అటు భారత ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధమైనట్టే కనిపిస్తోంది” అని లెహ్ నగరానికి చెందిన ప్రముఖ రచయత, దౌత్యవేత్త ఫంచుక్ స్టొబ్డన్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు చైనా మాత్రం ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి అంతా తమ అదుపులోనే ఉందని , భారత్‌తో చర్చలు జరుగుతున్నాయని చెబుతోంది. అయితే కరోనావైరస్ విషయంలో చైనాపై వస్తున్న ఒత్తిడితో పోల్చితే ఆ దేశానికి ఇది పెద్ద సమస్య కానప్పటికీ స్థానిక ప్రజలకు మాత్రం వారి జీవనోపాధికి సంబంధించిన సమస్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బతుకు సమస్య.
ఇవి కూడా చదవండి
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- ‘పొట్టి పిచ్చుక పొట్ట నిండా ప్లాస్టిక్ ముక్కలే’
- హైస్పీడ్ ఇంటర్నెట్ కనిపెట్టిన ఆస్ట్రేలియా... ఒక్క సెకనులో వేయి సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు
- ప్రకృతి సంక్షోభం: తగ్గిపోతున్న మిడతలు, సీతాకోకచిలుకలు.. ‘కీటకాల అంతం’ ఊహించడమే కష్టం అంటున్న పరిశోధకులు
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- ఇందిరా గాంధీ పేరు చెప్పి, ఒక్క ఫోన్ కాల్‌తో అప్పట్లో రూ.60 లక్షలు కాజేశారు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








