ప్రకృతి సంక్షోభం: తగ్గిపోతున్న మిడతలు, సీతాకోకచిలుకలు.. ‘కీటకాల అంతం’ ఊహించడమే కష్టం అంటున్న పరిశోధకులు

మిడత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిడత
    • రచయిత, మాట్ మెక్‌గ్రాత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచవ్యాప్తంగా కీటకాల జనాభా ఎంత ఆరోగ్యంగా ఉంది అనేదానిపై తాజాగా విడుదలైన గణంకాలు గతంలో శాస్త్రవేత్తల ఊహ కంటే భయం కలిగిస్తోంది.

కేవలం ఒక దశాబ్దంలో ప్రపంచంలో 25 శాతం కీటకాలు క్షీణిస్తున్నాయని గతంలో జరిగిన ఒక పరిశోధనలో ఆందోళన వ్యక్తమైంది.

అయితే, తాజా అధ్యయనం ఇప్పటివరకూ నిర్వహించిన వాటిలో అతిపెద్దది. దీనిలో ఆ సంఖ్య చాలా జటిలంగా, భిన్నంగా ఉందనే విషయం స్పష్టమైంది.

తాజా పరిశోధనల్లో “భూమిని తొలిచి నివసించే కీటకాల సంఖ్య తగ్గిపోతుంటే, మంచి నీటిలో నివసించే కీటకాల సంఖ్య పెరుగుతోందని” తేలిందని అధ్యయన వేత్తలు చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా కీటకాల సంఖ్య తగ్గిపోతుండడం అధ్యయనవేత్తల్లో తీవ్ర ఆందోళనకు కారణం అవుతోంది.

భూమిపై భారగా ఉండే వివిధ కీటకాల జాతులు.. మట్టిని సారవంతం చేయడం, పరపరాగ సంపర్కం నుంచీ, పోషకాలను రీసైక్లింగ్ చేయడం వరకూ కీలక పాత్ర పోషిస్తుంటాయి.

పశ్చిమ జర్మనీలోని ఒక సహజ అభయారణ్యంలో నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో కీటకాల సంఖ్య గణనీయంగా పడిపోతున్నట్లు తేలింది. 27 ఏళ్లలో దాదాపు 75 శాతం కీటకాలు క్షీణించాయని తెలిసింది. మరికొన్ని నివేదికల్లో కూడా అదే విషయం చెప్పారు.

సీతాకోక చిలుక

ఫొటో సోర్స్, Getty Images

కానీ, తగ్గిపోతున్న ఈ కీటకాల్లో చాలావరకూ ఒక ప్రాంతానికి చెందినవి, లేదంటే ఒకే జాతికి చెందినవి ఉన్నాయి.

తాజాగా జరిగినదానిని ఇప్పటివరకూ జరిగిన అతిపెద్ద అధ్యయనంగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కీటకాలకు అసలు ఏం జరుగుతోంది అనేది పూర్తిగా తెలుసుకోడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా 1676 ప్రాంతాల్లో సుదీర్ఘ కాలంపాటు జరిగిన 166 సర్వేల నుంచి శాస్త్రవేత్తలు గణాంకాలను సేకరించారు. ఇవి ఆయా కీటకాల ఆరోగ్య పరిస్థితి గురించి అత్యంత సూక్ష్మ చిత్రాన్ని విస్తృతంగా అందించాయి..

సీతాకోకచిలుకలు, చీమలు, మిడతలు లాంటి కీటకాలు ప్రతి ఏటా 0.92 శాతం, అంటే పదేళ్లలో 9 శాతం తగ్గిపోతున్నట్లు ఈ సంకలనం సూచించింది.

అయితే, ఇది అంతకుముందు నివేదికల కంటే అంత ఘోరంగా ఏం లేదు. కానీ, ఇది చాలా గణనీయమేనని పరిశోధకులు ఒత్తిడికి గురవుతున్నారు.

“అది చాలా తీవ్రమైనది. 30 ఏళ్లకు పైగా అంటే, పావు శాతం తక్కువ కీటకాలతో ఉన్నాం. ఇది సగటు లెక్క, అవి ఇంతకంటే ఘోరంగా ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి” అని దీనికి నేతృత్వం వహించిన జర్మన్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బయోడైవర్సిటీ రీసెర్చ్‌ డాక్టర్ రోల్ వాన్ క్లింక్ అన్నారు.

కీటకాల సంఖ్య తగ్గిపోవడాన్ని చాలా మంది సహజంగానే చూస్తున్నారు. “కారు అద్దం మీద మనకు ప్రతి రోజూ చాలా కీటకాలు చచ్చిపోయి కనిపిస్తాయి” కదా అనుకుంటున్నారు. పరిశోధకులు కూడా అది వాస్తవమే అంటున్నారు.

“చాలా కీటగాలు ఎగరగలవు. అలాంటివన్నీ కార్ల అద్దాలకు తగిలి చనిపోతున్నాయి. నిజానికి ఎగిరే కీటకాల సగటు తగ్గినట్లు మా విశ్లేషణలో కూడా తేలింది” అని జర్మన్ సెంటర్‌కు చెందిన మరో అధ్యయనవేత్త ప్రొఫెసర్ జొనాథన్ చేజ్ చెప్పారు.

“అయితే, ఎక్కువ కీటకాలు మనకు సులభంగా కనిపించవు, మట్టిలో, చెట్లపై చిటారు కొమ్మల్లో, నీళ్లలో మనకు కనిపించనంత దూరంగా జీవిస్తుంటాయి” అన్నారు.

ప్రమాదంలో కీటకాలు

ఫొటో సోర్స్, GABRIELE RADA

ముఖ్యంగా పశ్చిమ అమెరికా, మిడ్‌వెస్ట్, యూరప్, జర్మనీ లాంటి చోట కీటకాల సంఖ్య చాలా ఘోరంగా తగ్గిపోతోంది.

2005 తర్వాత వీటి సంఖ్యలో ఎప్పుడూ లేనంత క్షీణత కనిపించడంతో ఇటీవలి ఏళ్లలో యూరప్‌ నుంచి అందిన గణాంకాలు చాలా ప్రతికూలంగా ఉన్నాయి.

భూమి ఆధారంగా జీవించే కీటకాలు తగ్గుతుంటే, మంచి నీటిలో నివసించే మిడ్జెస్(దోమ లాంటిది, కానీ కుట్టదు),. మేఫ్లైస్(తూనీగలా ఉంటుంది) సంఖ్య ఏటా 1.08 శాతం పెరుగుతున్నాయి.

ఈ సానుకూల ధోరణి ఉత్తర యూరప్‌, పశ్చిమ అమెరికా, 1990ల నుంచి రష్యాలో బలంగా ఉంది.

ప్రభుత్వాలు నదులు, సరస్సులను శుభ్రం చేయడం వల్లే ఇలా జరిగి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

అయితే నీటిపై జీవించే కీటకాల సంఖ్య పెరగడం, భూమి ఆధారిత కీటకాల లోటును పూడ్చలేకపోతోంది.

“అవి భూమి ఆధారిత కీటకాల్లో ఒక చిన్న భాగం మాత్రమే. నీటిపై జీవించేవి వాటిలో పది శాతం కంటే ఎక్కువ లేవు” అని డాక్టర్ వాన్ క్లింక్ అన్నారు.

“మనకు మొత్తం భూమండలంపై ఉన్న మంచి నీటి వనరులు ఒక చిన్న శాతం మాత్రమే.. అందుకే మంచి నీళ్లపై జీవించే కీటకాల సంఖ్య, భూమి ఆధారంగా జీవించే కీటకాల లోటును ఎప్పటికీ భర్తీ చేయలేవు” అన్నారు.

కీటకాలు సంఖ్య తగ్గడానికి పొగతాగడం కారణం కాదంటున్న శాస్త్రవేత్తలు, పట్టణీకరణ వల్ల వాటి సహజ ఆవాసాలు నాశనం కావడం వల్లే అది జరిగుంటుందని భావిస్తున్నారు.

గత ఏడాది ఐపీబీఈఎస్ గ్లోబల్ అసెస్‌మెంట్ సహా జీవవైవిధ్యంపై జరిగిన ఎన్నో పరిశోధనల్లో కీటకాల నివాస ప్రాంతాలు నాశనం అవుతున్నాయనే వాదన వినిపించింది. ఈ అధ్యయనం దానిని మరింత నొక్కి చెప్పింది.

మే ఫ్లై

ఫొటో సోర్స్, Getty Images

మొత్తంగా చూస్తే ఈ పరిస్థితిని జటిలంగా ఉంది. దగ్గరగా ఉన్న భౌగోళిక ప్రాంతాల్లో కొన్ని కీటకాల సంఖ్య బాగుంటే, ఆ పక్కనే మరో ప్రాంతంలో ఉన్న అదే జాతి కీటకాలకు మనుగడ కష్టం అవుతూ ఉండచ్చు.

ఇదే అధ్యయనంలో భాగమైన ఆన్ స్వెంగెల్ కూడా 30 ఏళ్లకు పైగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో సీతాకోకచిలుకలపై అధ్యయనం చేశారు.

“వాటి సంఖ్య చాలా తగ్గిపోవడం మేం చూశాం. వాటిలో రక్షిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. కానీ పక్కనే కొన్ని ప్రాంతాల్లో సీతాకోకచిలుకలు బాగా పెరగడం కూడా మేం గమనించాం” అని ఆమె చెప్పారు.

“ఒకే ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న ఒకే జాతి కీటకాల వైఫల్యాలు, విజయాల గురించి అర్థం చేసుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుంది, చాలా డేటా కూడా అవసరం” అన్నారు.

అధ్యయనంలో తాము కనుగొన్నవి ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, కీటకాల భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

“ప్రభుత్వాలు చట్టాలు చేయడంతో మంచి నీటి కీటకాల సంఖ్య పెరిగిందని మేం భావిస్తున్నాం. అలాగే భూమి ఆధారిత కీటకాల కోసం కూడా ఏవైనా చట్టాలు చేస్తే, మనం అవి కూడా కోలుకునేలా చేయగలం” అని డాక్టర్ వాన్ క్లింక్ చెప్పారు.

“కీటకాల్లో ఉన్న మంచి విషయం ఏంటంటే, వాటిలో చాలా కీటకాల సంతానం అధికంగా ఉంటుంది. అందుకే, మనం వాటి ఆవాసాలను చక్కబెడితే చాలు, అవి చాలా త్వరగా కోలుకోవడం మనం చూడచ్చు” అంటున్నారు.

ఈ అధ్యయనాన్ని ది జర్నల్, సైన్స్ లో ప్రచురించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)