కరోనావైరస్: కోవిడ్-19 విషయంలో కొందరు నైజీరియన్లు తెగ సంబరపడుతున్నారు.. కారణం తెలుసా

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్‌కు పేద, ధనిక వర్గాల తేడా లేదన్న హెచ్చరికలు ఉన్నప్పటికీ నైజీరియాలో ప్రధానంగా ఉన్నత వర్గాలు, రాజకీయనాయకుల్లోనే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించడంపై మెజార్టీ ప్రజలు తెగ ఆనందపడుతున్నారు.
ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇప్పటి వరకు సుమారు 600 కోవిడ్-19 కేసులు నమోదైనట్టు నైజిరియాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది. వారిలో చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చినవారు ఉన్నారు. అలా వెళ్లి వచ్చిన వారి కారణంగా మరి కొంత మందికి కూడా వ్యాధి సోకింది.
కరోనావైరస్ సోకి మరణించిన వారిలో అధ్యక్షుడు మహమ్మదు బుహారీ ముఖ్య అధికారి ఉన్నారు. ఇక ఈ వైరస్‌తో బాధపడుతున్న వారిలో, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, మాజీ దౌత్య వేత్తలు, వారి సహచరులు, బంధువులు ఉన్నారు.
వీళ్లంతా సాధారణంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రిటన్, జర్మనీ, అమెరికా తదితర దేశాలు వెళ్లి రాగలరు. కానీ అలాంటి వాళ్లందరికీ ప్రస్తుతం నైజీరియాలో ఉన్న అంతంత మాత్రం వైద్య సదుపాయాలు తలనొప్పిగా మారాయి.
2020 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్లో కేవలం 4.5% నిధుల్ని మాత్రమే ఆరోగ్యం కోసం కేటాయించింది నైజీరియా ప్రభుత్వం. నిజానికి 2001లోనే ఆఫ్రికన్ యూనియన్ ప్రతి దేశం తమ బడ్జెట్లో కనీసం 15% నిధుల్ని వైద్య, ఆరోగ్యం కోసం కేటాయించాలని నిర్దేశించింది.
వైద్యులకు నెలల తరబడి జీతాల చెల్లింపులు ఆగిపోతుండటం వాటి కోసం వారు సమ్మెలు చెయ్యడం అక్కడ సర్వ సాధారణం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అపహాస్యం పాలవుతున్న నేతలు
విదేశాల్లో పని చేసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా చాలా మంది వదులుకునేందుకు ఇష్టబడరు. బ్రిటన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నైజీరియాకు చెందిన సుమారు 2 వేల మంది క్వాలిఫైడ్ డాక్టర్లు పని చేస్తున్నారని గత ఏడాది యూకే పార్లమెంట్‌కు సమర్పించిన ఓ నివేదిక వెల్లడించింది.
2013లోనే నైజీరియన్లు చికిత్స కోసం విదేశీ ఆస్పత్రులలో సుమారు 6వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారని అంచనా.
2015లో అధికారంలోకి రాగానే ఈ మెడికల్ టూరిజానికి చెక్ పెడతానని అధ్యక్షుడు బుహారీ హామీ ఇచ్చారు. కానీ 2017లో ఆయనే స్వయంగా అనారోగ్య కారణాలతో లండన్‌లో నాలుగు నెలలపాటు చికిత్స తీసుకొని వచ్చారు. అలాగే చికిత్స పేరిట ఇప్పటికీ ఎప్పటికప్పుడు లండన్‌కి వెళ్లి వస్తూనే ఉంటారు.
కానీ ఇప్పుడు కోవిడ్-19 బారి నుంచి తప్పించుకునేందుకు అన్ని దేశాలు తమ తమ సరిహద్దుల్ని మూసివేశాయి. దీంతో నైజీరియాలోని ఈ తరహా పెద్దలంతా మరో దారి లేక దేశీయ ఆస్పత్రుల్లోనే చికిత్స చేయించుకుంటున్నారు.
ఇదే అదనుగా కొందరు ఇన్నేళ్లూ వారు దేశంలోని వైద్య సౌకర్యాల విషయంలో వారు చూపించిన నిర్లక్ష్యంపై శాపనార్ధాలు పెడుతుండగా మరి కొందరు వారి పరిస్థితిపై జోకులేసుకుంటున్నారు.
“దేశంలోని వైద్య సౌకర్యాల గురించి పట్టించుకోనందుకు మీకు పడ్డ శిక్ష ఇది.” అని కొందరు...
“బహుశా మన ఆస్పత్రులు మీకు అంత మంచివి కావేమో.” అని మరి కొందరు హేళన చేస్తున్నారు.
“ఎవరికి రావాలో.. వాళ్లకే వచ్చింది.” ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెచ్చేందుకు బహుశా దేవుడు ఎంచుకొని మరీ ఈ పని చేసి ఉంటాడు అని మరి కొందరు అనుకుంటున్నారు.
అక్కడితో అగిపోలేదు. 72 ఏళ్ల అధ్యక్షుడు బుహారీకి కూడా అతని ముఖ్య అధికారి నుంచి వైరస్ సోకిందని, ఆయన తీవ్రంగా జబ్బుపడి వెంటిలేటర్‌పై ఉన్నారన్న వదంతులు కూడా దేశమంతా వేగంగా వ్యాపించాయి.
“దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది.” ఆ సమయంలో అందరినోట ఇదే మాట వినిపించింది.
కోలుకున్న అధ్యక్షుడు-వదంతులకు ఫుల్ స్టాప్
తమ అధినేత కొందరు ఇలా ఆగ్రహాన్ని ప్రదర్శించడంపై “కొందరు ఎప్పుడు చెడు జరగాలనే ఎందుకు కోరుకుంటూ ఉంటారు? 2017లో అధ్యక్షుడు అనారోగ్యం పాలైనప్పుడు కూడా ఇలాగే పిచ్చి ప్రేలాపనలు చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.” అంటూ ఆయన అధికార ప్రతినిధి ఫెమి అడెసినా ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే చివరకు కోలుకున్న అధ్యక్షుడు వైద్య, ఆరోగ్య శాఖాకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశమైన వీడియో బయటకు రావడంతో ఆయనపై వచ్చిన వదంతులకు ఫుల్ స్టాప్ పడింది.
ఆపై ఒక రోజు తర్వాత అంటే మార్చి 29న టీవీలో మాట్లాడిన అధ్యక్షుడు నైజీరియాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రం లాగోస్ సహా పక్కనే ఉన్న ఓగన్, అభుజ నగరాల్లో 14 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. సుమారు 3 కోట్ల మంది ప్రజల్ని 24 గంటల వ్యవధిలో ఇంటికే పరిమితం కావాలని ఆదేశించారు.
ఆ తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా కావడంతో మరో 2 వారాల పాటు లాక్ డౌన్ పొడిగించారు. అయితే కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే కోవిడ్-19 పరిమితమయ్యిందన్న ఆనందం ఎంతో కాలం మిగల లేదు.
కోవిడ్-19 చాలా తక్కువ వ్యవధిలోనే ఉన్నత వర్గాలను దాటి వారి వద్ద పని చేసే నౌకర్లు, డ్రైవర్లు, వంట వాళ్లు, సెక్యూరిటీ గార్డులు ఇలా అందరికీ సోకే ప్రమాదం ఉంది. ఆ పై వారి కుటుంబాలకు, ఇరుగు పొరుగున ఉన్న వారికి, ప్రధాన నగరాల్లోని ప్రతి మురికివాడకు వ్యాపించే ముప్పు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కేవలం ధనవంతులకి మాత్రమే కాదు
నైజీరియాలోని మురికివాడల్లో సామాజిక దూరం, వ్యక్తిగత నిర్బంధం చాలా కష్టమైన పని.
కొన్ని చోట్ల ఒక్కో భవనంలో 30 కుటుంబాలు కలిసి ఒకే బాత్ రూంని, టాయిలెట్‌ని వాడుకోవాల్సిన పరిస్థితి. అక్కడ ఈ విపత్తు పర్యవసానాలను ఊహించడం కూడా కష్టం.
మార్చి 30 ఒగన్ రాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్ ప్రారంభోత్సవ సమయంలో ధనవంతులు లేదా ఉన్నత వర్గాలకు మాత్రమే ఈ వైరస్ వల్ల ప్రమాదం ఉందని భావించవద్దు. ప్రతి ఒక్కరూ ప్రమాదం అంచుల్లో ఉన్నారని హెచ్చరించారు ఆ రాష్ట్ర గవర్నర్.
లాక్ డౌన్ కారణంగా మెజార్టీ నైజీరియన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పేదవారి పరిస్థితి మరీ ఘోరం.ఇది సమాజంలో తీవ్రమైన వ్యత్యాసాలకు దారి తీసేందుకు సాయపడుతోంది. అయితే ఇది ఓ రకంగా వైరస్ ఉన్నత వర్గాల నుంచి నిమ్న వర్గాలకు సోకకుండా కూడా కాపాడుతోంది కూడా.
నిజానికి నైజీరియాలో అసమానత్వంపై పదే పదే విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అది వాస్తవం కూడా. అయితే ఒకే ఒక్క కోవిడ్-19 విషయంలో మాత్రం దేశం సమానత్వం కోసం దేశం ఎలాంటి కృషి చెయ్యాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
- మా ఇళ్లకు వెళ్లేదెప్పుడు? వలస కార్మికుల ప్రశ్న
- ‘కరోనావైరస్తో ఐసొలేషన్ వార్డులో నేను ఎలా పోరాడానంటే...’ - తెలంగాణలో పేషెంట్ 16 స్వీయ అనుభవం
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- రాష్ట్రపతులతో ప్రమాణ స్వీకారం చేయించే పదవి నుంచి రిటైరయ్యాక రాజ్యసభ ఎంపీగా..
- వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు 93,000 కోట్లు చెల్లించడంలో విఫలమైతే ఏమవుతుంది?
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ
- బ్రిటన్‌లో ఎన్హెచ్ఎస్ కోసం రూ.180 కోట్ల విరాళాలను సేకరించిన 99 ఏళ్ల మాజీ సైనికుడు
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో రోడ్లపైకి వచ్చిన సింహాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








