వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు 93,000 కోట్లు చెల్లించడంలో విఫలమైతే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, నిధి రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అన్న పేరును భారత్ చాలా రోజులుగా మోస్తోంది. కానీ, విచిత్రంగా ఇక్కడి టెలికాం సంస్థలు మాత్రం పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు లైసెన్స్ ఫీజులు, వడ్డీ చెల్లింపుల కింద దాదాపు రూ.93 వేల కోట్లు చెల్లించాలని భారత సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.


టెలికాం కంపెనీలు ఆర్జించిన ఆదాయాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వ టెలికాం విభాగంతో పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) అంటున్నారు.
దీని పరిధిలోకి ఏమీ రావాలన్న అంశంపై 2005 నుంచి టెలికాం సంస్థలు, ప్రభుత్వం మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
టెలికాం ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఏజీఆర్ కింద లెక్కించాలని టెలికాం కంపెనీలు అంటూ వచ్చాయి. కానీ, దీనికి మరింత విస్తృత నిర్వచనం ఉండాలని - ఆస్తుల విక్రయం, డిపాజిట్ల మీద ఆర్జించిన వడ్డీ వంటి టెలికామేతర ఆదాయాన్ని కూడా కలపాలని - ప్రభుత్వం పట్టుపట్టింది.
చివరకు 2019 అక్టోబర్ 24న సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
ఫలితంగా ఈ సంస్థలు ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది.
ఇందుకు సుప్రీంకోర్టు మార్చి 17 వరకూ గడువు ఇచ్చింది.
గడువులోపు డబ్బు చెల్లించకుంటే, మీపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదని కోర్టు టెలీకాం కంపెనీలను ప్రశ్నించింది.
మరింత గడువు కోసం టెలికాం సంస్థలు సుప్రీం కోర్టులో ప్రయత్నిస్తున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్ద కూడా లాబీయింగ్ చేస్తున్నాయి.
అంత మొత్తం చెల్లించేందుకు తమ దగ్గర డబ్బు లేదని వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ప్రకటించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే తమ సంస్థను మూసేయాల్సి రావొచ్చని వొడాఫోన్ ఐడియా ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా వ్యాఖ్యానించారు.
టెలికాం మంత్రితో భేటీ తర్వాత తాము టెలికాం విభాగానికి గడువు లోపు బకాయిలు చెల్లిస్తామని ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ చెప్పారు. ఏజీఆర్ బకాయిలను 'అవాంఛనీయ సంక్షోభం'గా వర్ణించారు.
వొడాఫోన్‌కు దాదాపు రూ.28,300 కోట్ల మేర లైసెన్స్ ఫీజు బకాయిలు ఉన్నాయి.
ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా ఫిబ్రవరి 17 వరకు రూ.3500 కోట్లు కట్టింది.
మొత్తం బకాయిలు తీర్చడం వొడాఫోన్ ఐడియాకు చాలా కష్టమని నిపుణులు అంటున్నారు. ఇక భారత్‌లో అదనపు పెట్టుబడులు ఏమీ పెట్టమని ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది.
ఎయిర్‌టెల్‌కు రూ.21,600 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వినియోగదారులపై ప్రభావం
ఈ పరిణామాలు వొడాఫోన్ ఐడియాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి.
ఆ సంస్థకు 33.6 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
ఎయిర్‌టెల్ 32.7 కోట్ల మంది, జియో 36.9 కోట్ల మంది వినియోదారులను కలిగి ఉన్నాయి.
''ఒకవేళ సంస్థలేవైనా మూతపడితే సబ్‌స్క్రైబర్లు ఇంకో సర్వీస్‌కు పోర్ట్ అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అంత మంది వినియోగదారులకు సేవలందించాల్సిరావడం వల్ల మిగిలి ఉన్న సంస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. సేవల నాణ్యతలో తేడా రావొచ్చు'' అని కేర్ రేటింగ్స్ సంస్థ డిప్యుటీ జనరల్ మేనేజర్ గౌరవ్ దీక్షిత్ అన్నారు.
''2019 డిసెంబర్ మొదట్లో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో ప్రీపెయిడ్ టారిఫ్‌లను 14 నుంచి 33 శాతం దాకా పెంచాయి. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ పెంపులు ఉన్నాయి. సగటున ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు రూ.300 ఆదాయం పొందేలా ఈ రంగంలో త్వరగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్థిక స్థితి ఆరోగ్యకరంగా ఉంటుంది'' అని టెలికాం విశ్లేషకురాలు మీనాక్షి ఘోష్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్యోగాలపై ప్రభావం
ఈ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాలో 14 వేల మంది పనిచేస్తున్నారు. ఆ సంస్థ కోసం పరోక్షంగా పనిచేస్తున్నవారి సంఖ్య దీనికి ఆరు రెట్లు ఎక్కువ ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి.
బ్యాంకులపై ప్రభావం
టెలీకాం కంపెనీలు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి.. మొండి బకాయిల భారాన్ని మోస్తున్న బ్యాకింగ్ రంగాన్ని మరింత బాధించొచ్చు.
"ఏ టెలీకాం సంస్థ పతనమైనా ప్రభావం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మనం మూల్యం చెల్లించాల్సి ఉంటుంది" అని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఏం చేయగలదు
ప్రభుత్వం ముందు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వాటిలో డెబిట్ టర్మ్ ఒకటి.
"వడ్డీ ప్రకారం చెల్లింపులకు గడువు ఇవ్వొచ్చు. ఏజీఆర్ తుది నిర్వచనాన్ని పరిశ్రమలు, టెలీకాం శాఖ కలిసి నిర్ణయించాలి. లైసెన్సు రుసుము, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలను కూడా తగ్గించవచ్చు. అప్పుడు టెలికాం సంస్థల చేతుల్లో మరింత డబ్బు ఉంటుంది" అని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు.
దీంతో ఏకీభవిస్తూనే ప్రభుత్వం చేయగలినవి మరిన్ని ఉన్నాయని ఇంకొందరు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"ప్రభుత్వం ఈ రంగాన్ని బంగారు బాతులా భావిస్తోంది. దేశ ఆర్థికవ్యవస్థను సశక్తపరిచే కీలకమైన రంగంగా దీనిని చూడాలి" అని టెలీకాం నిపుణులు మహేశ్ ఉప్పల్ అన్నారు.
ఇక్కడ, చెల్లింపులు జరపలేని కంపెనీల లైసెన్స్ రద్దు చేసి, వారి మౌలిక సదుపాయాలను ఆ రంగంలోని మిగతావారికి పంచివేసే ప్రత్యామ్నాయం ప్రభుత్వం వద్ద ఉంది. కొందరికి ఇది విపరీత చర్యగా అనిపించవచ్చు. కానీ, కొందరి దృష్టిలో ఇది ఒప్పందాల ప్రకారం సబబే.
"టెలీకాం శాఖ స్పెక్ట్రం అందిస్తూ, వారితో ప్రదర్శన ఒప్పందాలపై సంతకాలు తీసుకుంది. ఈ ఒప్పందాలను ఏమాత్రం ఉల్లంఘించినా, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. బ్యాంకు గ్యారంటీల జప్తు, అలాంటి వేరే చర్యలు తీసుకోవచ్చు. టెలీకాం లైసెన్స్ రద్ద చేయడం టెలీకాం శాఖ దగ్గర ఉన్న చివరి అస్త్రం. ఏదైనా ప్రతిష్టంభన ఏర్పడితే, ఆ అవకాశాలను కూడా తోసిపుచ్చలేం" అని కేర్ రేటింగ్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గౌరవ్ దీక్షిత్ అన్నారు.
ఏదైనా టెలీకాం సంస్థ విఫలమైతే, భారత టెలీకాం మార్కెట్‌లో రెండు సంస్థలే మిగులుతాయి. పోటీ అనారోగ్యకరంగా మారి, చాలా సమస్యలు రావొచ్చని నిపుణులు అంటున్నారు.
"టెలీకాం భవిష్యత్తు అంతా 5జీదే. అది అత్యంత స్థితిస్థాపక నెట్‌వర్క్స్ దీనికి అవసరం. భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశంలో టెలికాం రంగంలో ఇద్దరు పోటీదార్లే ఉండటం మంచి పరిణామం కాదు" అని ట్విమ్‌బిట్ టెలీకాం విశ్లేషకులు మీనాక్షి ఘోష్ చెప్పారు.
టెలీకాం రంగం పరిస్థితి మిగతా వ్యాపార రంగాల్లోనూ ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్న కంపెనీలు, ప్రభుత్వం ఈ బకాయిల విషయంలో ఓ సర్దుబాటుకు రాకపోతే, దాని ప్రభావం దేశ ఆర్థికవ్యవస్థపై, వినియోగదారులపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:
- ప్రభుత్వానికి రూ.92000 కోట్లు బకాయి పడ్డ ఎయిర్‌టెల్, వొడాఫోన్: ఇది 5జీ ఆశలకు విఘాతమా
- జైపూర్‌లో బాసిత్ ఖాన్ హత్యకు కారణమేంటి... కశ్మీరీలపై ద్వేషంతోనే కొట్టి చంపారా?
- జింకల వేటకు పెంపుడు చిరుతలు... క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- షహీన్‌బాగ్: ‘దిల్లీ కాలుష్యంలో ఆశల గాలి పీల్చాలంటే ఇక్కడకు రావాల్సిందే’ - అభిప్రాయం
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను వదులుకుంటున్న యువకులు
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్‌తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









