'విచ్?' సర్వేలో వరుసగా ఏడోసారి ‘చెత్త’ సర్వీస్ ప్రొవైడర్‌గా ఎంపికైన వోడాఫోన్

ఫొటో సోర్స్, Getty Images
వోడాఫోన్ వరసగా ఏడో సంవత్సరం ‘అత్యంత చెత్త మొబైల్ ఫోన్ ప్రొవైడర్’గా యూకేలో గుర్తింపు పొందింది. ‘విచ్?’ అనే సంస్థ నిర్వహించిన వార్షిక వినియోగదారుల సర్వేలో ఈ విషయం తేలింది.
అక్కడి ప్రధాన నెట్‌వర్క్ ప్రొవైడర్లు ఈఈ, ఓ2, ఈ3లకు కూడా వినియోగదారుల నుంచి సరైన రేటింగ్ రాలేదు. చాలామంది వాటిని ఓ మోస్తరుగా ఉన్నాయనో, అస్సలు బాలేవనో పేర్కొన్నారు.
మరోపక్క వినియోగదారుల సంతృప్తే తమకు ప్రధానమని, దానికోసమే తాము నిత్యం శ్రమిస్తున్నామని వోడాఫోన్ చెబుతోంది.
‘మేం స్వతంత్రంగా మా వినియోగదారులతో సర్వే నిర్వహించాం. విచ్? సంస్థ సర్వే ఫలితాలకూ, వినియోగదారులు మాతో చెప్పిన విషయాలకూ పొంతన కుదరట్లేదు. నిజానికి మాకొచ్చిన ఫీడ్‌బ్యాక్ గతంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంది’ అని వోడాఫోన్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
యూకేలో వొడాఫోన్, ఈఈ లాంటి టాప్-4 నెట్‌వర్క్‌లతో పోలిస్తే తరవాతి స్థానంలో ఉన్న నాలుగు నెట్‌వర్క్ ప్రొవైడర్ల వినియోగదారులే ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు. చిన్న నెట్‌వర్క్‌లు వాడే 10మందిలో 9మంది తాము ఆ నెట్‌వర్క్‌ను తమ స్నేహితులకు సిఫార్సు చేస్తామని చెప్పారు. అదే వోడాఫోన్ విషయంలో ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే తమ స్నేహితులకు ఆ సంస్థను సిఫార్సు చేస్తామని చెప్పారు.
వాడిన దానికంటే ఎక్కువ బిల్ వచ్చిందనో, బిల్ తప్పుగా వచ్చిందనో ప్రతి ఏడుగురు వోడాఫోన్ వినియోగదారుల్లో ఒకరు తెలిపారు. ‘విచ్?’ సర్వే ప్రకారం కస్టమర్ సర్వీస్ విషయంలో వోడాఫోన్ చివరి స్థానంలో ఉంది.
‘తమ నెట్‌వర్క్ ప్రొవైడర్లతో విసిగిపోయిన వినియోగదారులు వేరే నెట్‌వర్క్‌కు వీలైనంత త్వరగా మారిపోవడమే మంచిది’ అని విచ్? సంస్థ ప్రతినిధి అలెక్స్ నీల్ సూచించారు.
టెలికామ్ రెగులేటర్ సంస్థ ఆఫ్కామ్ లెక్కల ప్రకారం 2017 చివరి క్వార్టర్‌లో వినియోగదారుల నుంచి అత్యధిక ఫిర్యాదులు వోడాఫోన్, ఈఈ సంస్థలకే అందాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








