షహీన్‌బాగ్: ‘దిల్లీ కాలుష్యంలో ఆశల గాలి పీల్చాలంటే ఇక్కడకు రావాల్సిందే’ - అభిప్రాయం

ఫొటో సోర్స్, AFREEN FATIMA
- రచయిత, చింకీ సిన్హా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఓ శీతాకాలం రాత్రి షహీన్‌బాగ్‌ను వెతుక్కుంటూ మేం బయల్దేరాం. కెఫేలు, ఆర్ట్ గ్యాలరీలు, షాపింగ్ మాల్స్‌తో నిండిన మాకు తెలిసిన దిల్లీలో దాని జాడ దొరకడం కష్టమైంది.
రాత్రిపగలూ అక్కడే కూర్చొని మహిళలు నిరసన గళం వినిపిస్తున్నారు. విప్లవ గీతాలే కాదు, తమ పసిపిల్లలకు లాలిపాటలు కూడా పాడుతున్నారు. వారంతా పేదలు. ఇంట్లో పిల్లల్ని విడిచిపెట్టే వస్తే చూసుకునేందుకు ఆయాలు ఉండరు.
పిల్లల్ని ప్రమాదంలోకి నెడుతున్నారన్న ఆరోపణకు.. తామేమీ తమ పిల్లల అభిప్రాయాలకు అడ్డుపడటం లేదని, అలా అని వారిని ప్రపంచానికి దూరం చేయట్లేదని ఆ మహిళలు సమాధానం ఇస్తున్నారు.


రాజ్యాంగం పరిరక్షణ కోసం రహదారిపై వాళ్లు నిరసన చేస్తున్నారు.
ఇవి అనిశ్చితి ఉన్న రోజులు. ఎవరైనా 'మాయమవ్వొచ్చు'. ఆ విషయం వాళ్లకూ తెలుసు. కానీ, ఆ రహదారిని వాళ్లు విడిచివెళ్లడం లేదు.
క్రిస్మస్ సమయంలో మొదటిసారి షషీన్‌బాగ్‌కు వెళ్లాను.
మరోసారి తాము నిరాశ్రయులం కామని ప్రభుత్వం హామీ ఇచ్చేదాకా ఇళ్లకు వెళ్లబోమన్న పట్టు అక్కడ కూర్చున్న మహిళల్లో కనిపించింది. పాలస్తీనా కవి మహమూద్ డార్విష్ రాసిన ఓ వాక్యం నాకు గుర్తుకు వచ్చింది - 'నా జన్మభూమి సూట్‌కేస్ కాదు. నేను యాత్రికుడినీ కాదు'.

'షహీన్‌బాగ్ లేకుండా చేసేందుకు' ఓట్లు వేయాలని జనవరి 25న దిల్లీలో అమిత్ షా ప్రజల్ని కోరారు.
షహీన్‌బాగ్‌లో కలిసిన ఓ మహిళ నుంచి ఏ సందేశం వచ్చిందా అని రోజూ నేను ఫోన్‌లో వెతుకుతుంటా. ఎప్పుడూ ఒకటే సందేశం కనిపిస్తుంది-''ఇంకా మేం ఇక్కడే ఉన్నాం'' అని.
నా జీవితమంతా నిరసన ఉద్యమాలు చూస్తూనే ఉన్నా. 1980ల్లో, 90ల్లో బిహార్‌లో నేను పెరిగా. 'చక్క జామ్'లు జరిగేవి. రాజకీయ, సామాజిక నిరసనను తెలిపేందుకు రోడ్లను అడ్డగిస్తారు.
బిహార్‌లో ఎల్‌కే అడ్వాణీ అరెస్టైనప్పుడు మొదటి సారి కర్ఫ్యూ చూశా.
రాజ్యాంగ పీఠికను మేం బట్టీపట్టేవాళ్లం. పరీక్షల్లో ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల గురించి పరీక్షల్లో రాసేవాళ్లం. నేను కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో నాకు సీనియర్ అయిన శిల్పి జైన్‌ను క్రూరంగా అత్యాచారం చేసి, చంపేశారు. ఆమె గురించి మొదటిసారి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నాను. ఆ కేసు ఇప్పటికీ అపరష్కృతంగానే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కు వ్యతిరేకంగా సుదీర్ఘంగా జరుగుతున్న నిరసనకు షహీన్‌బాగ్ వేదిక. దేశమంతా ఈ నిరసనలు వ్యాపించాయి. అంతటా తమను తాము షహీన్‌బాగ్ అని పిలుచుకుంటున్నారు.
ఓ రోజు రాత్రి అక్కడి నుంచి నేను ఒక చిన్నరాయిని గుర్తుగా తెచ్చుకుని, నా బుక్ షెల్ఫ్‌లో పెట్టుకున్నా.
అన్యాయమని అనిపించిన ప్రతి విషయంపై ఈ ప్రపంచం పాటలు, పద్యాలు, నినాదాలు, శాంతితో పోరాడుతోంది.
వాళ్లను వాళ్లు పక్షులుగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు అవి రెక్కలు విచ్చుకున్న పక్షులు.
ఓ రోజు రాత్రి ఒంటి గంట తర్వాత నేను అక్కడే ఉన్నా. నాకు కాఫీ తెచ్చిచ్చారు. ఇక్కడ జరుగుతుంది చూడటానికి, అర్థం చేసుకోవడానికి, ఆశలతో నిండిన గాలిని పీల్చుకోవడానికి ఇక్కడికి రావాల్సిందే. దిల్లీలో ఎప్పుడూ 'కలుషితమైన' గాలి ఉంటుందిగా.
కూర్చుంటాం. తిరుగుతాం. పెన్ను, పేపర్ పట్టుకొని టీ స్టాళ్ల వద్ద నిలబడతాం. మాట్లాడతాం. ఎక్కువగా వింటాం.
తలనొప్పి, చలిలాంటి సమస్యలు, తటస్థంగా ఉండాలన్న నిబంధనల మధ్య ఇక్కడకు రావాలి. నేను రిపోర్టర్‌ను, వాస్తవాలే చెప్పాలి. కానీ, నేనో కథకురాలిని కూడా.
ఈ దారుల్లో ఎన్నోసార్లు నడిచాం. 75 ఏళ్ల మహిళ ముందుండి దారి చూపిస్తూ, ఎందుకు నిరసన చేస్తున్నామో చెబుతుంది.
అక్కడివాళ్లు మనం కనపడగానే నవ్వుతారు. తినడానికి ఏదైనా పెడతారు. వాళ్ల కథలూ చెబుతారు. ఏదిచ్చినా తీసుకోవాల్సిందే. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నురూన్నిసా చాలా ఏళ్ల క్రితం షహీన్‌బాగ్‌కు వచ్చారు. ఆమె చూడ్డానికి బలహీనంగానే కనిపిస్తారు. చలి మాత్రం ఆమెను ఏమీ చేయలేదు.
అమ్మ ఎక్కడున్నావ్ అని అడుగుతూ ఉంటుంది. ఇలా వీధుల్లో ఉన్నా అని చెబుతుంటా. ఇంటికి వచ్చేయమనైతే ఆమె చెప్పదు.
నెలకుపైనే గడిచింది. షహీన్‌బాగ్ రీతిలోనే పట్నా, ప్రయాగ్‌రాజ్, ఇంకా చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. మొదటికి, ఇప్పటికీ షహీన్‌బాగ్‌లో జనాలు పెరిగారు.

అమెరికాలో ప్రభుత్వం చూపుతున్న అసమానతలను వ్యతిరేకంగా 2011లో ఆక్యుపై ఉద్యమం జరిగింది. చాలా మంది దాన్ని కొట్టిపారేశారు.
ఆక్యుపై ఓక్లాండ్‌లొ జరిగిన నిరసన ప్రాంతానికి వచ్చే దారిలో రెండు నినాదాలు కనిపించేవి. ఒకటి 'మీరు ఇల్లు విడిచివచ్చారు'.. ఇంకొకటి 'జీవితానికి స్వాగతం'.
2012లో ఫిలడెల్ఫియాలో ఈ ఉద్యమంలో జరిగిన ఆక్యుపై హుడ్‌ను డెట్రాయిట్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు మొదలుపెట్టారు. ఆ సమావేశాలకు నేను వెళ్లా.
ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమంలో చాలా మంది తెల్లజాతివాళ్లే. మరోవైపు కొందరు నల్ల జాతి రాడికల్ కార్యకర్తలు పేద, వర్కింగ్ క్లాస్ ప్రజల ఉద్యమాల నాయకత్వంలో తెల్లజాతీయులు ఉండకూడదని అనేవారు.
ఆక్యుపై ఉద్యమంలో క్రమంగా వైవిధ్యం పెరిగింది. నల్లజాతీయులు ప్రధాన స్రవంతిలో ఎందుకు లేరా అన్నది తెలుసుకునేందుకు మేం ఆక్యుపై ద హుడ్ సమావేశాలకు వెళ్లేవాళ్లం. ఇన్నర్‌సిటీలో డ్రగ్స్, హింస ఉండటమే అందకు కారణమని కొందరు వాదించేవాళ్లు. కానీ, అది వాస్తవాలను విస్మరించడమే.

ఫొటో సోర్స్, Getty Images
ముంబయిలో జరిగిన ఆక్యుపై గేట్‌వేతో ఓ విధంగా ఆ ఉద్యమం మళ్లీ వచ్చింది. నిరసనలో ఒక విశ్వాసాన్ని ఇచ్చింది.
వివిధ దేశాల్లో, నగరాల్లో జరిగిన నిరసనలకు నేను సాక్షిగా ఉన్నా.
రిపోర్టర్‌కి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. వాటిలోకి వెళ్లొచ్చు. అక్కడేం జరుగుతుందో చూడొచ్చు. ప్రశ్నించొచ్చు.
ఫిలడెల్ఫియాలో రెండు నగరాలున్నాయి. ఎత్తైన భవనాలు, లగ్జరీ నివాసాలతో ఒకటి. మూతపడ్డ ఫ్యాక్టరీలతో మరొకటి. పేదలకు ఉద్యోగాలున్న మునపటి కాలపు అవశేషం అది. ఒకప్పటి పరిస్థితికి అద్దం. ఇప్పుడు ప్రపంచమంతా ఇలాగే తయారైంది. నగరాలు, దేశాలు.. వేరుపడిపోయాయి. అయితే, వీటిలోనే మనకు బతుకు, పోరాటం గురించి చెప్పే కథలు దొరుకుతాయి.
ఆక్యుపై ఉద్యమంలాగే సీఏఏ వల్ల వచ్చిన ఉద్యమం భారతీయ రాజకీయాలు, సంస్కృతిపై ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని సృష్టికి కారణమవుతుంది.
ఆక్యుపై ఉద్యమంలాగే, ఇది కూడా చాలా తలలుండే హైడ్రా. వ్యతిరేక శక్తులు ఒక తలను నరికితే, ఇంకో తల దాని స్థానం తీసుకుంటుంది.
దీనికి ఓ నాయకత్వ ముఖం లేదు. అధికార ప్రతినిధులు లేరు. కార్పొరేట్ మీడియాతోపాటు చాలా మందికి చికాకు పుట్టించే విషయం ఇదే. ఇలాంటి నిరసనల స్వరూపాన్ని వాళ్లు అర్థం చేసుకోలేరు.

ఇవి కూడా చదవండి.
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- 2019లో దేశ రాజకీయాలు, సమాజంపై లోతైన ప్రభావం చూపిన ప్రధాన ఘటనలు
- కరోనావైరస్ కన్నా వేగంగా వ్యాపిస్తున్న వదంతులు... వాటిలో నిజమెంత?
- పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనలు: యూపీ ముస్లింలలో భయాందోళనలకు కారణాలేమిటి
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- CAA-NRC: ‘మేము 'బై చాన్స్' ఇండియన్స్ కాదు, 'బై చాయిస్’ ఇండియన్స్’ - మౌలానా మహమూద్ మదనీ
- కరోనావైరస్: చైనా బయట మొదటి మృతి ధ్రువీకరణ
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









