కరోనావైరస్: చైనా బయట ఫిలిప్పీన్స్‌లో మొదటి మృతి ధ్రువీకరణ

ఫొటో సోర్స్, EPA
కరోనావైరస్‌తో ఫిలిప్పీన్స్‌లో ఒక వ్యక్తి మృతిచెందాడు. చైనా బయట ఈ వైరస్ వల్ల సంభవించిన మొట్టమొదటి వైరస్ మరణంగా దీనిని ధ్రువీకరించారు.
మృతుడు వైరస్ మొదట వ్యాపించిన హుబే ప్రావిన్స్‌లోని వుహాన్‌కు చెందిన 44 ఏళ్ల చైనీయుడుగా గుర్తించారు.
"ఫిలిప్పీన్స్ రాకముందే అతడికి వైరస్ సోకినట్లు కనిపించింది" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
ఇప్పటివరకూ, ఈ వైరస్ సోకి 300 మందికి పైగా మృతిచెందారు. వీరిలో ఎక్కువమంది హుబే ప్రావిన్స్ వారే. 14 వేలమందికి పైగా వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు.
అమెరికా, ఆస్ట్రేలియా సహా చాలా దేశాలు చైనా నుంచి విదేశీయుల రాకను నిషేధించాయి. అక్కడి నుంచి వచ్చే తమ పౌరులు క్వారంటైన్‌కు వెళ్లాలని అభ్యర్థించాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య, సార్స్ మహమ్మారి కేసులను మించిపోయింది. 2003లో వచ్చిన సార్స్ 20 దేశాలకు పైగా వ్యాపించింది.
కానీ కరోనావైరస్ వల్ల మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇది అంత ప్రాణాంతకం కాదని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ మరణం గురించి ఏం తెలుసు?
"మృతుడు 38 ఏళ్ల చైనా మహిళతో కలిసి వుహాన్ నుంచి హాంకాంగ్ మీదుగా ఫిలిప్పీన్స్ వెళ్లాడు. గత వారం పరీక్షల్లో ఆ మహిళకు కూడా పాజిటివ్ అని తేలింది" అని ఫిలిప్పీన్స్ ఆరోగ్య విభాగం చెప్పింది.
"రాజధాని మనీలాలోని ఒక ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. తర్వాత ఆయనకు న్యుమోనియా వచ్చింది" అని అధికారులు చెప్పారు.
దేశ ప్రజలు ఆందోళనకు గురికావద్దన్న ఫిలిప్పీన్స్ డబ్ల్యుహెచ్ఓ ప్రతినిధి రబీంద్ర అభయసింఘె.. "ఇది చైనా బయట నమోదైన మొదటి మృతి. అయినా, మేం దీనిని స్థానిక కేసుగా భావించడం లేదు. మృతుడు వైరస్ వ్యాపించిన ప్రాంతం నుంచి వచ్చాడు" అన్నారు.


"రోగి కోలుకుంటున్నట్లు కనిపించింది, కానీ 24 గంటల్లో అతడి పరిస్థితి అంతకంతకూ క్షీణించింది" అని ఫిలిప్పీన్స్ ఆరోగ్య మంత్రి చెప్పినట్లు స్థానిక వార్తా పత్రిక రాప్లర్ రాసింది.
మృతుడు వచ్చిన అదే విమానంలో ఉన్న మిగతా ప్రయాణికుల వివరాలను ఆరోగ్య శాఖ సేకరిస్తోంది. వారిని వేరుగా ఉంచాలని భావిస్తోంది. ఆయన బస చేసిన హోటల్ ఉద్యోగులకు అది సోకి ఉంటుందని అనుకుంటున్నారు.
చైనా నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులను తక్షణం ఆపేస్తున్నామని ఫిలిప్పీన్స్ ప్రకటించిన కాసేపటికే దేశంలో వైరస్ మృతి విషయాన్ని ధ్రువీకరించారు.
ఫిలిప్పీన్స్ అంతకు ముందు ఈ వైరస్ వ్యాపించిన హుబే నుంచి వచ్చేవారిని మాత్రమే నిషేధించింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో ప్రస్తుతం ఎలా ఉంది?
శనివారం హుబే ప్రావిన్సులో మరో 45 మంది మృతిచెందారని అధికారులు చెప్పారు. దీంతో చైనాలో కరోనావైరస్‌తో మృతిచెందినవారి సంఖ్య 304కు చేరింది.
"దేశవ్యాప్తంగా కొత్తగా 2590 మంది ఈ ఇన్ఫెక్షన్‌కు గురైనట్లు ధ్రువీకరించారు. చైనాలో ఇప్పుడు వైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 14,380కి చేరింది" అని నేషనల్ హెల్త్ కమిషన్ చెప్పినట్లు జాతీయ టీవీ చానల్ చెప్పింది.
మొత్తం కరోనా కేసుల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఇంకా ఎక్కువే ఉండవచ్చని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అంచనా వేసింది.
వైరస్ మొదట వ్యాపించిన వుహాన్ నగరంలో 75 వేల మందికి పైగా ఇన్ఫెక్షన్‌కు గురయ్యారని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Press association
చైనాలో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి
వుహాన్ సహా మిగతా ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ ఉంది. దేశవ్యాప్తంగా ప్రాధాన్యం లేని వ్యాపారాలను మూసివేశారు.
రాబోవు రోజుల్లో కరోనా కేసులు పెరగవచ్చని 60 లక్షల మంది నివసించే హ్యుయాంగంగ్ మేయర్ హెచ్చరించినట్లు దేశ మీడియా చెప్పింది.
వుహాన్ నుంచి బయటికెళ్లడాన్ని నిషేధించక ముందు ఆ నగరం నుంచి 7 లక్షల మంది హ్యుయాంగంగ్ నగరానికి తిరిగి వచ్చారు.
దీంతో నగరంలో దారుణమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆహారం, ఇతర సరుకులు కొనుక్కోడానికి రెండు రోజులకు ఒకసారి బయటికివెళ్లడానికి కుటుంబంలో ఒకరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.
హుబే అధికారులు జనాలు గుమిగూడకుండా వివాహాల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
చైనాతో తమ సరిహద్దు పూర్తిగా మూసేయాలని, లేదంటే సోమవారం నుంచి సమ్మెకు దిగుతామని హాంకాంగ్‌లోని ఆస్పత్రి ఉద్యోగులు హెచ్చరించారు.
ప్రయాణాలపై నిషేధం పనిచేస్తుందా?
ప్రయాణాలపై ఉన్న నిషేధం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.
"ప్రయాణాలపై నిషేధం వల్ల అది సమాచారం పంచుకోవడాన్ని, మందుల సరఫరాను అడ్డుకుని మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెస్తుంది" అని డబ్ల్యుహెచ్ఓ హెడ్ శుక్రవారం అన్నారు.
అధికారిక సరిహద్దుల్లో స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని డబ్ల్యుహెచ్ఓ సూచించింది. సరిహద్దులను మూసేయడం వల్ల ప్రయాణికులు అనధికారికంగా దేశాల్లోకి ప్రవేశిస్తే, వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని హెచ్చరించింది.
ప్రయాణాలపై నిషేధం విధించడాన్ని చైనా విమర్శించింది. విదేశీ ప్రభుత్వాలు అధికారిక సలహాలను పట్టించుకోవడం లేదని ఆరోపించింది.
అంతర్జాతీయంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు
భారత్ వుహాన్ నుంచి 300 మంది పౌరులను స్వదేశానికి చేర్చింది.
100 మంది జర్మన్లు తిరిగి దేశానికి చేరుకున్నారు.
రష్యా, థాయ్‌లాండ్ త్వరలో వుహాన్ నుంచి తమ పౌరులను ఖాళీచేయించే ప్రయత్నాల్లో ఉంది.
సభ్య దేశాల నుంచి మరిన్ని మందులు సరఫరా చేయాలని చైనా యూరోపియన్ యూనియన్‌ను కోరింది.
చైనా, హాంకాంగ్, తైవాన్ వెళ్లే అన్ని విమాన సేవలను వియత్నాం రద్దు చేసింది.
క్వాంటాస్, ఎయిర్ న్యూజీలాండ్, ఎయిర్ కెనడా, బ్రిటిష్ ఎయిర్‌వేస్ కూడా తమ విమానాలను రద్దు చేసి వెనక్కు రప్పించాయి.
ఆపిల్ చైనాలోని తమ దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
వైరస్ పాజిటివ్ రావడంతో ఇద్దరు చైనీయులను విడిగా ఉంచినట్లు రష్యా చెప్పింది.
యూరప్‌లో మరిన్ని కేసులు ధ్రువీకరించారని జర్మనీ, ఇటలీ, స్వీడన్ చెప్పాయి.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో బయటపడిన తొలి కేసు.. చైనా నుంచి వచ్చిన విద్యార్థికి ఇన్ఫెక్షన్
- 'ప్రపంచం మౌనంగా ఉంది... నిశ్శబ్దం భయంకరంగా ఉంది'
- ఎన్నడూ కనిపించనంత స్పష్టంగా సూర్యుడు... ఇక్కడ చూడండి
- India Vs New Zealand: ఐదో టీ20లో విజయంతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్
- ఆండ్రాయిడ్ 10తో మొబైల్ ఫోన్ అప్డేట్ చేసుకోవాల్సిందే... లేకపోతే ఏం జరుగుతుందంటే?
- కరోనావైరస్ను అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యుహెచ్ఓ
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
- ఈయూ నుంచి నిష్క్రమించిన బ్రిటన్... స్వతంత్ర దేశంగా ఈయూకు తిరిగి వస్తామన్న స్కాట్లాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











