''అధికారులు వస్తే పారిపోతాడు, పాతికేళ్లుగా అడవిదాటి రాలేదు''- రెడ్డయ్య కుటుంబం అరణ్యంలోనే ఎందుకు మిగిలిపోయింది?

కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఎత్తైన కొండపైనున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకే ఒక్క ఆదివాసీ కుటుంబం పాతికేళ్లుగా నివసిస్తోంది. ఈ కుటుంబ సభ్యుల సంఖ్య కేవలం మూడు.

భార్య, భర్త, కుమారుడు అంతే..

కొండపైనున్న అడవి నుంచి మూడు కిలోమీటర్లు కిందకు నడిచివస్తే కానీ మనిషి జాడ కనిపించదు. నేటి జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన ఫోను, కరెంటు సౌకర్యాలు అక్కడ కనిపించవు. అయినాా వారు అలాగే జీవిస్తున్నారు.

అసలు ఆ ముగ్గురు అక్కడే ఎందుకు ఉంటున్నారు.

వారి రోజువారీ జీవితం ఎలా ఉంటుంది?

పాతికేళ్లుగా అడవిని వీడని వీరి గురించి అధికారులు ఏం చెబుతున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి

గుబ్బలమంగమ్మ గుడి నుంచి ఇంకాపైకి వెళ్తే...

ఇటు తెలంగాణ అశ్వరావుపేట మండలం.. అటు ఆంధ్రప్రదేశ్‌ బుట్టాయగూడెం మండలం సరిహద్దులో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల ఆరాధ్యదేవత గుబ్బల మంగమ్మ గుడి ఉంటుంది.

ఆ గుడి ఆవల కొండలు, దట్టమైన అటవీ ప్రాంతమంతా తెలంగాణ పరిధి కంఠలం అటవీ పరిధిలోకి వస్తుంది.

గుబ్బల మంగమ్మ గుడి వద్ద సాయంత్రం ఆరు తర్వాత జన సంచారమే కనిపించదు. గుడి పక్క నుంచి... దాదాపు మూడు కిలోమీటర్లు పైకి వెళ్తే.., కొండపై దట్టమైన అడవిలో 40 ఆదివాసీ కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా నివసిస్తుండేవి. ఈ గూడేన్ని గోగులపూడి అనేవారు.

ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితిలో ఆ కుటుంబాలను కిందకి దించేందుకు అధికారులు 1990నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మొదట్లో కొండ దిగేందుకు, అడవి నుంచి బయటకు వచ్చేందుకు వాళ్లు నిరాకరించినా.. అడవిలో విద్యుత్, మంచినీరు, పిల్లలకు విద్య వంటి ప్రాథమిక వసతులు కల్పించలేమని, పిల్లల కోసమైనా కిందకు దిగాలని ఐటీడీఏ అధికారులు పదే పదే చేసిన యత్నాలు దాదాపు పదేళ్లకి ఫలించాయి.

ఆయా కుటుంబాలు 2000 సంవత్సరంలో ఆ కొండ దిగువున కొత్తకన్నాయి గూడెం ప్రాంతంలో కావడిగుండ్ల పంచాయతీ పరిధిలో నిర్మించిన పునరావాస కాలనీకి వచ్చాయి.

కొండపైన అడవిలో వారు ఉన్న ప్రాంతం గోగులపూడి పేరునే కొండ దిగువన నిర్మించిన కాలనీకి పెట్టారు. అయితే ఆ 40కుటుంబాల్లో 39 కుటుంబాలు వచ్చాయి కానీ.. గురుగుంట్ల రెడ్డయ్య మాత్రం కిందకి రావడానికి నిరాకరించారు. అడవి నుంచి దిగేందుకు ససేమిరా అన్నారు.

ఆయనతోపాటు భార్య లక్ష్మీ ,కుమారుడు గంగిరెడ్డి అక్కడే ఉండిపోయారు.

కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి
ఫొటో క్యాప్షన్, లక్ష్మి, రెడ్డయ్య, గంగిరెడ్డి

పాతికేళ్లుగా ఒంటరిగానే..

కాలం గడిస్తే రెడ్డయ్య మనసు మారుతుందని అధికారులు భావించారు. కిందకు దిగిన తమ బంధువులు, ఇరుగుపొరుగు వారు పొందుతున్న సౌకర్యాలు, అభివృద్ధి చూసి, లేదా తెలుసుకుని రెడ్డయ్య మారతారని అనుకున్నారు.

కానీ ఏళ్లు గడుస్తున్నా.. రెడ్డయ్యలో మార్పు రాలేదు. అడవి నుంచి కిందకు దిగేది లేదంటూ పాతికేళ్లుగా ఆ కుటుంబం అడవిలోనే ఉంటోంది.

తన భర్త ఎక్కడుంటే తానూ అక్కడేనంటూ భార్య లక్ష్మి, అమ్మానాన్నలతోనే తానూ.. అని కుమారుడు గంగిరెడ్డి.. ముగ్గురూ.. అడవిలోనే ఉంటున్నారు.

కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి

పగలు సూర్య కాంతి, రాత్రి నక్షత్రాల వెలుగు

ఈ కుటుంబంతో మాట్లాడేందుకు బీబీసీ కొండపైకి నడుచుకుంటూ వెళ్లింది. ఆ కుటుంబంలోని రెడ్డయ్య భార్య లక్ష్మీ కుమారుడు గంగిరెడ్డితో మాట్లాడింది.

‘‘కనీసం కరెంటు కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు?’’ అని లక్ష్మీని అడిగితే "పగలు సూరీడు ఉంటాడు.. రాత్రిళ్లు చంద్రుడు, నక్షత్రాల వెలుగు వస్తుంది. చలికాలంలో, ఎప్పుడైనా చిక్కటి చీకటి ఉంటే చలిమంట వేస్తాం.ఇక్కడ ఎండు పుల్లలు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి" అని వివరించారు.

కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి

‘ఏ పొద్దో తెలుసు కానీ.. ’

పగలు, రాత్రి ఈ పొద్దులు తెలుసు కానీ.. ఏ రోజంటే ఏమో తెలియదు. ఎంత సమయమైంది. అంటే కూడా చెప్పలేమని లక్ష్మీ అన్నారు.

‘‘టైం తెలుస్తుందా’’ అంటే.. "టైం తెలియదు. ఏం తెలియదు. అలా నచ్చినట్టుండమే'' అని ఆమె చెప్పారు.

‘‘రాత్రిళ్లు భయం వేయదా’’.. అని అడిగితే.. "భయం లేదు.. గియం లేదు.. మంట వేసుకుంటాం కదా.. తెల్లారిందాకా మంట ఉంటుంది.. ఏ జంతువులూ ఏమీ చేయవు.. అవి ఉంటాయి.. మేమూ ఉంటాం అంతే. పాములు ఏం చేయవు.. అవన్నీ మాకు అలవాటే" అని లక్ష్మీ, గంగిరెడ్డి చెప్పారు.

కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి

‘‘మాకు సరిపడా పండించుకుంటాం’’

కొండ చేను (పోడు వ్యవసాయం) చేస్తూ వరి, జొన్నలు, కందులతోపాటు, కూరగాయలు పండిస్తుంటామని ఆమె తెలిపారు.

''మేం తినేందుకే తిండిగింజలు పండించుకుంటాం.. మాకు సరిపోయేంతనే పండిస్తాం.. దగ్గరలోని ఏటి నీరే తెచ్చుకుంటాం.. అవి బాగుంటాయి.. ఎండాకాలం కూడా నీళ్లొస్తాయి.. వానాకాలమైతే పొంగుతాయి'' అని లక్ష్మీ తెలిపారు.

కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి

"జొరం,జబ్బు ఏమీ తెలియవు"

మొత్తం తమకు తొమ్మిది మంది పిల్లలు పుట్టగా, ఏడుగురు చిన్నపిల్లలప్పుడే చనిపోయారని ఇద్దరు మాత్రమే ఉన్నారని లక్ష్మి తెలిపారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి అని తెలిపారు.

అమ్మాయికి పెళ్లి చేసి కొండ కిందకు పంపేశామని అబ్బాయి గంగిరెడ్డి మాత్రం తమతోనే ఉన్నాడని చెప్పారు.

"జొరం, జబ్బు మాకేమీ తెలియవు.. ఒంట్లో బాగోలేదు అనుకుంటే నాటు మందులు వేసుకుంటాం" అని గంగిరెడ్డి చెప్పారు.

‘‘ఆ మందులు ఎక్కడి నుంచి వస్తాయి’’ అంటే.. "చెట్ల నుంచే.. కాయలు, ఆకులు కోసి తినేస్తాం, ఏం కాదు..’’ అని గంగిరెడ్డి అన్నారు.

"ఈమధ్య కళ్లు సరిగ్గా కనపడటం లేదు, కర్ర పట్టుకుని నడుస్తున్నా, ఏమీ కాదు" అని లక్ష్మీ అన్నారు.

కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి

ఐదు గుడిసెలు ఎందుకు..

ముగ్గురికి ఒక్కొక్కరికీ ఒక్కో గుడిసె ఉంటుందనీ, కోళ్లు, కుక్క కోసం ఒక గుడిసె, కట్టె పుల్లలు వర్షానికి తడవకుండా ఓ గుడిసె.. మొత్తం ఐదు గుడిసెలు నిర్మించుకున్నామని లక్ష్మీ తెలిపారు.

మరి వర్షం వస్తే.. ఇల్లు కురవదా. అని అడిగితే.. "లేదు.. పైన ఇది వేస్తాం" అని ఫ్లెక్సీ క్లాత్‌ను గంగిరెడ్డి చూపించారు.

కింద గుడి వద్ద పండుగల సందర్భాల్లో వేసే ఫ్లెక్సీలను తెచ్చి గుడిసెలపై కప్పుకుంటామని చెప్పారు.

" గంగిరెడ్డికి సదువు లేదు, పెళ్లి లేదు.. మేం ఈ కొండ కిందకు దిగలేదు. అందుకని చదువుకోలేదు.పెళ్లి కూడా వద్దంటున్నాడు, మాతోనే ఉంటున్నాడు" అని లక్ష్మీ చెప్పారు.

ఈ విషయమై గంగిరెడ్డి మాట్లాడుతూ 'అమ్మాయి కొండపైకి వస్తేనే పెళ్లి చేసుకుంటా, నేను దిగేది లేదు..' అన్నారు.

కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి

గుడి దాటి కిందకు రాని తండ్రీ కొడుకులు

కొండ దిగువ భాగంలో అటవీ ప్రాంతంలోనే ఉన్న గుబ్బల మంగమ్మ గుడి వరకు మాత్రమే తండ్రి రెడ్డయ్య, కుమారుడు గంగిరెడ్డి వస్తుంటారు.

ఆ గుడి దాటి జీవితంలో తాము ఎప్పుడూ కిందకి రాలేదని కుమారుడు గంగిరెడ్డి బీబీసీతో చెప్పారు.

''గుడి వరకే అంతకు మించి కిందకు దిగం.. దేనికోసమైనా కిందకు వెళ్లం'' అని ఆయన అన్నారు.

ప్రభుత్వం వీరికి ఆధార్, రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు యత్నించినా ఈ ఇద్దరు మాత్రం తీసుకోలేదని.. ఇక్కడి గిరిజనుల పునరావాస కాలనీ పరిధి కావడిగుండ్ల పంచాయతీ కార్యదర్శి మోతీలాల్‌ బీబీసీకి చెప్పారు.

''ఆ కార్డులు కావాలంటే ఫోటోలు దిగాలి, కిందకు రావాలన్నారు. మేం దిగం. మాకు ఆ కార్డులు వద్దు. అందుకే నాన్న నేను తీసుకోలేదు'' అని గంగిరెడ్డి బీబీసీకి చెప్పారు.

కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి

నాకు ఆధార్, రేషన్‌ కార్డులున్నాయి..

''నేను మాత్రం కొండ దిగి కూతురు వద్దకి వెళ్తుంటా.. అలానే కొండ కింద ఉన్న మా కాలనీ గోగులపూడికి వెళ్లి మా బంధువులను కలుస్తుంటా. నేను ఫోటోలు దిగితే, ఆ కాలనీ చిరునామాతో ఆధార్‌, రేషన్‌ కార్డులు ఇచ్చారు. ఎప్పుడైనా కొండ దిగి రేషన్‌ తెచ్చుకుంటా. కానీ కొడుకు, ఆయన.. ఇద్దరూ ఎక్కడికీ రారు. ఆ గుడి దాటి బయటకు రారు, నేను మాత్రం వెళ్లొస్తుంటా'' అని లక్ష్మీ చెప్పారు.

‘ఆయనకి ఇష్టం లేదనే కిందకి దిగలేదు..’

కొండ దిగువన గుబ్బలమంగమ్మ గుడికి ఐదు కిలోమీటర్ల దూరంలో నిర్మించిన కాలనీకి మీ కుటుంబం ఎందుకు వెళ్లలేదని అడిగితే.. ''మా ఆయనకు ఇష్టం లేదు.. నేనూ వెళ్దామని అన్నాను.. వినిపించుకోవడం లేదు. మాట వింటే దిగేవాళ్లం.. అలాగే మా అబ్బాయికీ ఇష్టం లేదు.. అందుకే ఇక్కడే ఉంటున్నాం’’ అని లక్ష్మీ బీబీసీకి తెలిపారు.

ఈ అడవిలోనే పుట్టిన తాను ఇక్కడే చనిపోతానని, కిందకి మాత్రం దిగనని తన భర్త అంటున్నారని లక్ష్మీ తెలిపారు.

బీబీసీ అటవీ ప్రాంతంలోని ఆ ఇంటి వద్దకు వెళ్లినప్పుడు రెడ్డయ్య కనిపించకుండా వెళ్లిపోయారు.

జీవితంలో ఏనాడూ కిందకు దిగని తనను ఇప్పుడు అధికారులు వచ్చి ఎక్కడ బలవంతంగా దించేస్తారేమోనని భయపడి సాయంత్రమైతే గానీ ఇంటికి రావడం లేదని ఆయన భార్య తెలిపారు.

పాతికేళ్లుగా అడవిలో ఈ కుటుంబం ఒంటరిగా ఉంటోందన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో అధికార యంత్రాంగంతో పాటు ఒకటిరెండు మీడియా చానెళ్లు కొద్దిరోజులుగా అటవీ ప్రాంతం వద్దకు వస్తున్నాయి.

తన జీవితంలో ఏనాడూ కొండ కిందకు దిగని రెడ్డయ్యను ఇప్పుడు అధికారులు కిందకు దించేస్తారన్న భయంతో పొద్దుకూగితేగానీ ఇంటికి రావడం లేదని ఆయన భార్య చెప్పారు.

''జనాలు వస్తున్నారు కదా.. జనాలను చూసి భయపడి పారిపోయాడు. రాత్రికి వస్తాడు. కిందకి తీసుకువెళ్లి ఏమైనా చేస్తారని భయపడుతున్నాడు. ఇప్పుడు అడవిలో ఎవరైనా కనిపిస్తే రాళ్లేసి కొడతాడు'' అని లక్ష్మీ బీబీసీతో అన్నారు.

కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి

‘కనీసం రేకులషెడ్డయినా వేసివ్వండి’

రెడ్డయ్యను బలవంతంగా కిందకి దించినా ప్రశాంతంగా ఉండలేడని ఇక్కడే ఆయన ఇంటికి సోలార్‌ పవర్, ఇంటి చుట్టూ కంచె ఏర్పాటు చేస్తే బాగుంటుందని గోగులపూడి యువకులు కోరుతున్నారు.

‘‘మా తాతముత్తాల నుంచి ఇక్కడే ఈ అడవిలోనే ఉన్నాం.. 2000లో ఐటీడీఏ వాళ్లు మమ్మల్ని కిందకి దించారు. రెడ్డయ్యకి ఎంత చెప్పినా.. ఇప్పుడు బలవంతంగా దించినా అక్కడ ప్రశాంతంగా ఉండలేరు.. ప్రభుత్వాలు వాళ్లకి ఇక్కడే ఏదైనా సదుపాయం చేసి.. సోలార్‌ పవర్‌తో పాటు పూరి గుడిసె చుట్టూ కంచె ఏర్పాటు చేస్తే ప్రొటెక్షన్‌గా ఉంటుంది'' అని గోగులపూడి యువకులు మంగిరెడ్డి బీబీసీతో అన్నారు.

తాను ఏడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఈ అడవి నుంచి కిందకి వెళ్లి డిగ్రీవరకు చదువుకున్నానని, రెడ్డయ్య ఫ్యామిలీ కూడా కిందకి దిగితే బాగుంటుందని గోగులపూడి వాసి గురుగుంట్ల బాబురెడ్డి అభిప్రాయపడ్డారు.

‘మా ప్రయత్నం మేం చేస్తున్నాం’

రెడ్డయ్య కుటుంబాన్ని కిందకి తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని గోగులపూడి హ్యాబిటేషన్‌ పరిధి కావడిగుండ్ల పంచాయతీ సర్పంచ్‌ లక్ష్మణరావు, కార్యదర్శి మోతీలాల్‌ బీబీసీకి తెలిపారు.

''వాళ్లకు ఏ సౌకర్యం అయినా కల్పించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్లు స్వీకరించే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా రెడ్డయ్య, ఆయన కొడుకు జనంలోకి రావడానికి ఇష్ట పడటం లేదు..మేం వస్తే అడవిలోపలికి వెళ్లి దొరక్కుండా దాక్కుంటున్నారు. అయినాసరే మా ప్రయత్నం మేం చేస్తాం'' అని వారు చెప్పారు.

కొత్తకన్నాయిగూడెం, కావడిగుండ్ల పంచాయతీ, ఆదివాసీ కుటుంబాలు, గిరిజనులు, ఆధార్, రేషన్ కార్డ్, అడవి
ఫొటో క్యాప్షన్, గంగిరెడ్డి

‘అడవుల్లో జీవించే హక్కు వారికుంది..’

కాగా, ఆదివాసీ తెగ కొండరెడ్లకు చెందిన రెడ్డయ్య కుటుంబం అడవిలో ఒంటరిగా ఉంటుందన్న విషయం తెలుసని అధికారులు చెబుతున్నారు.

‘‘వాళ్లకు ఇష్టం లేకుండా అడవి నుంచి కిందకి దింపలేం’’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ అధికారి కిష్టా గౌడ్‌ బీబీసీతో అన్నారు. అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు అనేది ఐటీడీఏ వాళ్ల బాధ్యతని ఆయన చెప్పారు.

దీనిపై మాట్లాడేందుకు ఐటీడీఏ పీవో రాహుల్‌తో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. గతంలో ఈ ప్రాంత పునరావాస సమయంలో పనిచేసి ప్రస్తుతం ఐటీడీఏ భద్రాచలంలో ట్రైబల్‌ మ్యూజియం ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న వీరాస్వామి బీబీసీతో మాట్లాడారు.

‘‘మా జిల్లా పరిధిలోని అడవుల్లో అక్కడక్కడా విసిరేసినట్లు ఇళ్లు ఉన్నా.. కనుచూపుమేరలో మనుషులు కనిపించే పరిస్థితి ఉంటుంది. కనీసంగా 15, 20 కుటుంబాలు కలిసి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ రెడ్డయ్య కుటుంబమే ఒక్కటే ఉంటుంది. మేం ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదు.. అలాగని బలవంతంగా దింపలేం.. రేకుల షెడ్‌ వేసే అవకాశం ఉందేమో పరిశీలించాలి’’ అని వీరాస్వామి వ్యాఖ్యానించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)