శ్రీరామ నవమి - రామసేతు: ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా, కాదా?

రామ్‌సేతు
    • రచయిత, గౌతమి ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేవుడు, రాముడు, రామాయణం వంటి అంశాలలో ఆస్తికులు, నాస్తికులకు మధ్య ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది.

అటువంటి అంశాలలో ఒకటి రామసేతు. ఇది స్వయంగా రాముడే నిర్మించాడని కొందరు చెబుతుంటే ... కాదు సముద్రంలో సహజసిద్ధంగానే ఏర్పడిందంటారు మరి కొందరు.

ఆ మధ్య రిలీజ్ అయిన రామ్ సేతు సినిమాతో ఈ అంశం మరోసారి చర్చలోకొచ్చింది.

రామ్‌సేతు

ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా, కాదా?

రామసేతు.. తమిళనాడులోని పంబన్ దీవికి, శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య సముద్రంలో ఉన్న ఒక నిర్మాణం.

దక్షిణాదిలో దీనిని రామసేతు అని, శ్రీలంకలో అడాంగ పాలం అని పిలుస్తారు. దీనినే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు.

దీని ఆధారంగానే ఇప్పడు రామసేతు అనే పేరుతో తెరపైకెక్కింది. అక్షయ్ కుమార్ ఇందులో హీరో. రామ సేతుకు ఉన్న ప్రాధాన్యత, దాని వెనకున్న కథలు, కథనాలు కారణంగా ఈ సినిమాకి బాగానే హైప్ వచ్చింది.

నాస్తికుడైన ఓ ఆర్కియాలజిస్ట్ రామసేతు నిర్మాణం మూలాల గురించి, ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా, కాదా అని తెలుసుకోవడమే స్టోరీ లైన్.

అసలు రామసేతు అనే అంశం ఎక్కడ ఎలా మొదలైంది. దీనిపై ఉన్న వివాదాలేంటి? హిందూ విశ్వాసాలు, పరిశోధనల సారాంశాలేంటో ఓ సారి చూద్దాం.

రామ సేతు

‘ఈ వారధి వయసు 17 లక్షల సంవత్సరాలు’

రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించిన వర్ణన ఉంటుంది.

రావణుడు సీతను అపహరించడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లే క్రమంలో తన వానర సైన్యంతో కలిసి రాళ్లతో ఈ వంతెనను నిర్మించాడనేది కొందరి విశ్వాసం.

ఈ వారధి వయసు 17 లక్షల సంవత్సరాల అయి ఉండొచ్చనేది కొందరు పురాతత్వవేత్తల అంచనా.

కొంతమేర 3 కిలోమీటర్ల వెడల్పు, 30 మైళ్ల పొడవు ఉండే ఈ వంతెన ఎలా నిర్మాణమైంది లేదా ఏర్పడింది జరిగింది అన్నది ఇప్పుటికీ అంతుచిక్కని ప్రశ్నే.

దీనికి సమాధానాలు చాలానే ఉన్నా వాటిలో దేనికీ స్పష్టమైన ఆధారాలు లేవు.

ఈ రాళ్ల వంతెన రహస్యం ఏంటి అనేదానిపై పరిశోధనలు కూడా జరిగాయి.

పగడపు, సిలికా రాళ్లు వేడెక్కినపుడు వాటిలోకి గాలి చేరి అవి తేలికగా మారి నీటిపై తేలుతాయని, అలాంటి రాళ్లతోనే ఈ వారధి సహజంగానే ఏర్పడి ఉండొచ్చనేది కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం.

ఈ వారధి ప్రాంతంలో సముద్రంలో ఆటుపోట్లు అత్యంత తీవ్ర స్థాయిలో ఉంటాయి.

2004 సునామీ సమయంలో రామసేతు నిర్మాణంలో ఉన్న కొన్ని రాళ్లు రామేశ్వరం ప్రాంతంలో కనిపించాయని చెబుతుంటారు.

ఇప్పటికీ ఆ ప్రాంతంలో నీటిపై తేలే రాళ్లు కనిపిస్తాయి. వాటిని చూడటానికి చాలా మంది రామేశ్వరం వెళతుంటారు.

నాసా కూడా ఈ నిర్మాణంపై కొన్నేళ్ల పాటు పరిశోధనలు జరిపింది.

శాటిలైట్లు తీసిన ఛాయాచిత్రాలలో 30 మైళ్ల పొడవున రాళ్లు పేర్చి ఉన్నట్లుగా కనిపిస్తుందని చెప్పింది. కానీ ఇది మానవ నిర్మితం అని మాత్రం నాసా ఎప్పుడూ ధృవీకరించలేదు.

వీడియో క్యాప్షన్, రామ్‌సేతు సినిమా ద్వారా మరోసారి చర్చకొచ్చిన రామ సేతు నిర్మాణం..

‘ఇదొక సూపర్ హ్యూమన్ అచీవ్‌మెంట్’

2017 డిసెంబర్‌లో అమెరికాకు చెందిన సైన్స్ ఛానెల్... 30 మైళ్లకు పైగా పొడవున్న రామసేతు మానవ నిర్మితమని ప్రకటించడం ద్వారా మరోసారి చర్చకు తెరలేపింది.

రామసేతు సహజసిద్ధంగా ఏర్పడినట్టు లేదని, అక్కడి ఇసుక సహజంగా ఉన్నదే అయినా దానిపై పేర్చిన రాళ్లు మాత్రం వేరే చోటు నుంచి తీసుకొచ్చి పేర్చినట్టుగా ఉన్నాయని పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ అన్నారు.

ఇసుక 4వేల ఏళ్ల నాటిదని , రాళ్లు 7 వేల ఏళ్ల నాటివని పరిశోధనలలో తేలిందని చెప్పారు.

సింపుల్‌గా చెప్పాలంటే దీనిని సూపర్ హ్యూమన్ అచీవ్‌మెంట్ అని చెప్పింది సైన్స్ ఛానెల్.

మరి వాటిని ఎవరు అక్కడికి తీసుకొచ్చి పేర్చి ఉంటారు? ఆ రాళ్ల వెనకున్న కథేంటి? అనేవి మాత్రం మిస్టరీనే.

రామ సేతు

రాజకీయ వివాదంగా రామసేతు

రామసేతు రాజకీయంగా కూడా కొన్నేళ్లు బాగా రగిలిన అంశమే.

2005లో యూపీఏ ప్రభుత్వం సేతు సముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్టులో భాగంగా 12 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలువను తవ్వేందుకు అనుమతి ఇచ్చింది.

గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను లోతుగా తవ్వి నౌకల రాకపోకలకు అనువుగా మార్చాలనేది నాటి యూపీఏ సర్కారు ఉద్దేశం.

ఈ ప్రాజెక్ట్ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రయాణించడానికి ఓ మార్గం ఏర్పరుస్తుంది.

దీంతో శ్రీలంక చట్టూ తిరిగే శ్రమ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం, ధనం ఆదా అవుతాయని భావించింది.

కానీ ఈ మార్గం ఏర్పడాలంటే రామసేతును బద్దలు కొట్టాల్సి వస్తుండటంతో దీనిపై హిందూ సంస్థలు వ్యతిరేకించాయి.

భారత్, శ్రీలంకకు చెందిన పర్యావరణ వేత్తలు కూడా సముద్ర పర్యావరణం దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రామ సేతు

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న వివాదం

ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

రామాయణంలో పేర్కొన్న విషయాలకు ఎలాంటి శాస్త్రీయమైన ప్రాతిపదిక లేదని కాంగ్రెస్ తన పిటిషన్‌లో పేర్కొనడంతో కేసు సుప్రీంకోర్టు మెట్లెక్కింది.

పురావస్తుశాఖ కూడా కాంగ్రెస్ వాదననే బలపరిచింది. అప్పటి నుంచి ఈ వివాదం సుప్రీం కోర్టులోనే ఉంది.

తర్వాత 2018లో కేంద్రం ప్రాజెక్టు కోసం రామసేతును ముట్టుకోబోమని సుప్రీం కోర్టుకు చెప్పింది.

మరోవైపు దీనిని వారసత్వ కట్టడంగా గుర్తించాలని మాజీ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

ఏదేమైనా విజ్జానానికి , విశ్వాసాలకు మధ్య జరిగే నిరంతర సంఘర్షణలో రామ సేతు ఇప్పటికీ కొరకరాని కొయ్యగానే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)