చిత్తూరు జిల్లా మహిళా జంగం దేవర కథ: 'శవం అంటేనే భయమేసేది... ఇప్పుడు చితి పక్కనే కూర్చుని పూజలు చేస్తున్నా'

కాటమ్మ
    • రచయిత, చిట్టత్తూరు హరికృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"అప్పటికి నేను ముగ్గురు పిల్లల తల్లిని.. ముందెప్పుడూ శ్మశానంలోకి వెళ్లలేదు. మొదటిసారి అక్కడ అడుగుపెట్టగానే భయమేసింది. కానీ, చివరకు అదే నా జీవనోపాధిగా మారుతుందని నేను ఊహించలేదు".

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని చిట్టత్తూరులో జంగం దేవరగా పనిచేస్తున్న కాటమ్మ చెప్పిన మాట ఇది.

శైవక్షేత్రం శ్రీకాళహస్తికి ఏడు కిలోమీటర్ల దూరంలోని చిట్టత్తూరులో పూర్వీకుల నుంచి వచ్చిన జంగం దేవర వృత్తిని కాటమ్మ వారసత్వంగా స్వీకరించారు.

40 ఏళ్ల కాటమ్మ ఆ ఊరికే కాదు, చుట్టుపక్కల ఐదారు గ్రామాలకు కూడా జంగం దేవరగా పనిచేస్తుంటారు. తరచూ శ్రీకాళహస్తిలో జరిగే అంత్యక్రియలకు కూడా వెళ్తుంటారు.

వారసత్వంగా వచ్చిన రెండు కిలోల బరువున్న ఇత్తడి గంటను.. ఊరికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న శ్మశానం వరకూ ఆపకుండా వాయించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ, కాటమ్మ గత 11 ఏళ్లుగా అదే పని చేస్తున్నారు.

చాలా గ్రామాల్లోలాగే చిట్టత్తూరులో కూడా మహిళలు శ్మశానం వరకూ వెళ్లరు. కానీ, కాటమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి వారసత్వం అందుకోవాల్సి వచ్చింది.

పదో తరగతి తర్వాత కాటమ్మ చదువు ఆపేసిన అమ్మనాన్నలు ఆమెకు 16 ఏళ్లకే పెళ్లి చేసేశారు. కానీ, ఆమె వైవాహిక జీవితం సజావుగా సాగలేదు.

"ఆ వయసులో పెళ్లి చేసుకోవచ్చా, లేదా అని అప్పట్లో తెలీదు.. అమ్మనాన్నలు చేసేశారు. కానీ, తర్వాత కొన్ని రోజులకే ఆయన తాగుడు గురించి తెలిసింది. ఇద్దరు పిల్లలు పుట్టినా ఆయన తీరు మారలేదు. తాగుడు కోసం బంగారం, ఇంట్లో వస్తువులు కూడా అమ్మేసేవాడు. బిడ్డల కోసం కష్టపడదామనే ఉద్దేశమే ఉండేది కాదు. దాంతో విడిపోదామని నిర్ణయించుకున్నా. రెండు కుటుంబాలవారు, ఇంకా చాలా మంది మాకు మధ్యవర్తిత్వం చేశారు. కానీ నేను చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు.. పుట్టింటికి వచ్చేశా" అని కాటమ్మ చెప్పారు.

శ్మశానంలో కాటమ్మ

ఫొటో సోర్స్, k.Venkataiah

తల్లిదండ్రుల మరణంతో కష్టాలు

పుట్టింటివారి అండతో ముగ్గురు పిల్లలను పోషించగలనని అనుకున్న కాటమ్మ.. మూడేళ్ల వ్యవధిలో అమ్మనాన్నలను ఇద్దరినీ కోల్పోయి మరింత కష్టాల్లో పడిపోయారు.

బాధతో కన్నీళ్లు ఉబుకుతుండగా కాటమ్మ ఆనాటి పరిస్థితులను బీబీసికి వివరించారు.

"మొదట అమ్మ చనిపోయింది. మూడేళ్ల తర్వాత నాన్న కూడా చనిపోయారు. రెండు వైపులా బంధువులెవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. దాంతో, పిల్లల్ని ఎలా పోషించాలో నాకు అర్థం కాలేదు. మొదట పొలాల్లో కూలి పనులకు వెళ్లాను. తర్వాత కాళహస్తిలో కలంకారీ పనులకు వెళ్లేదాన్ని, తర్వాత అది కూడా మానేసి ఒక స్కూల్లో టీచరుగా పనిచేశాను. కానీ, వచ్చేది సరిపోయేది కాదు. దాంతో కుల వృత్తినే చేయాలని నిర్ణయించుకున్నా. ఏ ఆదరవూ లేకపోవడంతో నా బతుకు నేను బతికాను. ఇప్పటికీ అదే చేస్తున్నాను" అని కాటమ్మ గుర్తుచేసుకున్నారు.

తండ్రి మరణంతో ఊరికి జంగం దేవర లేకుండా పోవడంతో ఆయనకు ఒకే కూతురైన కాటమ్మ ఆ వృత్తిలోకి దిగాల్సి వచ్చిందని ఆమె కుటుంబానికి ఉన్న ఒకే ఒక పెద్దదిక్కు మేనత్త సుబ్బమ్మ చెప్పారు. భర్త లేని సుబ్బమ్మను కూడా కాటమ్మే చూసుకుంటున్నారు.

"మా అన్న చనిపోవడంతో ఊరికి జంగం దేవర లేకుండా పోయాడు. కొన్నాళ్లకు ఊళ్లో ఒకాయన చనిపోవడంతో ఆయన అంత్యక్రియలకు కోవనూర్లోని మా ఇంకో అన్న కొడుకును రమ్మన్నాం. కానీ, ఆయన రాలేను అన్నారు. దాంతో కాటమ్మనే ఆ పని చేయాలని ఊళ్లోవాళ్లు అడిగారు. ఆ రోజు కాటమ్మ అక్కడ శవం ముందు గంట వాయిస్తుంటే చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఆ గంట, శంఖు ఆమె చేతిలోనే ఉన్నాయి" అన్నారు సుబ్బమ్మ.

శ్మశానంలో కాటమ్మ పూజలు

ఫొటో సోర్స్, k.Venkataiah

కుల వృత్తిని స్వీకరించిన మూడో తరం

2011లో కుల వృత్తిలోకి వచ్చిన కాటమ్మ ఎవరైనా చనిపోయినపుడు శవం ముందు గంట వాయించడం, శంఖం ఊదడంతోపాటూ చితి దగ్గర పూజలు చేయిస్తుంటారు.

సంక్రాంతి సమయంలో గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి దీవించడం. ప్రతి శుక్రవారం గ్రామశక్తికి పొంగళ్లు పెట్టడానికి ఇంటింటికీ వెళ్లి బియ్యం తీసుకోవడం చేస్తారు.

కాటమ్మ జంగం వృత్తిని స్వీకరించడం గురించి అదే గ్రామానికి చెందిన పాండురంగం బీబీసీతో మాట్లాడారు. చిట్టత్తూరులో గత మూడు తరాలుగా ఒకే జంగం కుటుంబం ఈ వృత్తిలో ఉన్నారని చెప్పారు.

"ఊళ్లో మొదట గుర్రప్ప అనే జంగం దేవర ఉండేవారు. ఆయనకు నలుగురు కొడుకులు. ఇద్దరు కొడుకులు పక్క ఊళ్లకు వెళ్లి అక్కడే జంగం దేవరలుగా స్థిరపడ్డారు. శంకరయ్య మాత్రం ఈ ఊళ్లోనే దేవరగా ఉండిపోయాడు. మరో కొడుకు ఈ వృత్తికే దూరమయ్యాడు. కొడుకులు లేని శంకరయ్య చనిపోవడంతో కాటమ్మనే ఆయన వారసురాలిగా ఈ పని చేయమన్నారు. అప్పటి నుంచీ ఆమె ఊరి జంగం దేవరగా కొనసాగుతోంది" అన్నారు.

వీడియో క్యాప్షన్, భర్త మరణంతో కాటికాపరిగా మారిన మహిళ.. 40 కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు

ఒకప్పుడు శవం అంటేనే భయపడిన కాటమ్మ, ఇప్పుడు శ్మశానంలో చితి పక్కనే కూర్చొని పూజలు, ఆచారాలు కూడా చేయించగలుగుతున్నారు.

గత పదకొండేళ్లుగా ఆమె రెండు వేలకు పైగా అంత్యక్రియలు నిర్వహించారని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో రోజుకు నాలుగు, ఐదు అంత్యక్రియలు కూడా చేశానని ఆమె చెప్పారు.

"నాకు మొదట్లో శవం అంటేనే భయంగా ఉండేది. ఎక్కడైనా ఎవరైనా చనిపోయినట్లు తెలిసినా, ఆ ఇంటి వైపు వెళ్లేదాన్ని కాదు. కానీ, చివరకు ఈ వృత్తిలోకి వచ్చాక, ఇప్పుడు కాష్టం పక్కనే కూర్చుని పూజలు కూడా చేయించగలుగుతున్నా. శ్రీకాళహస్తిలో సింగ్ అనే ఆయన నాకు ఈ పూజలన్నీ ఎలా చేయాలో నేర్పించారు. అందుకే, ఇప్పుడు నేను చుట్టూ ఎంతోమంది మగవాళ్లున్నా, అందరి మధ్యా ధైర్యంగా ఈ ఆచారాలన్నీ చేయగలుగుతున్నా" అంటారు కాటమ్మ.

కాటమ్మకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు హరిప్రియ పిచ్చాటూరు గ్రామ సచివాలయంలో మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కొడుకు గణేష్ డిగ్రీ పూర్తి చేయగా, చిన్న కూతురు మంజుల డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నారు.

కూతుళ్లతో కాటమ్మ

ఫొటో సోర్స్, k.venkataiah

అమ్మను చూస్తే గర్వంగా ఉంటుంది

తల్లి ఇవన్నీ చేయడాన్ని తాము చిన్నతనంగా భావించడం లేదని ఆమె పిల్లలు చెబుతున్నారు.

"అమ్మ పదేళ్లకు పైగా ఈ పని చేసే మమ్మల్ని అందరినీ ఇంతవాళ్లను చేశారు. ఇప్పుడు మేం చదువుకున్నంత మాత్రాన, ఆమె చేస్తున్న పనిని ఎందుకు వ్యతిరేకించాలి? మాకు ఆ హక్కు లేదు. పైగా అమ్మ చేస్తున్న ఆ పని చూసి మాకు గర్వంగా ఉంటుంది. మేం ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే అమ్మ ఆ వృత్తి కొనసాగించడం వల్లే కదా" అంటారు హరిప్రియ.

హరిప్రియ తన విధుల్లో భాగంగా గృహహింస కేసులు చూస్తుంటారు, బాల్య వివాహాలు, కుటుంబాల్లో అత్తా కోడళ్ల గొడవలు లాంటివి పరిష్కరిస్తుంటారు.

కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా కాటమ్మ తన వృత్తిని కొనసాగించారు. పనిలోకి వెళ్తే తనకు, ఇంట్లో పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకుతుందని భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేవారు.

కుటుంబంతో కాటమ్మ

కరోనా సమయంలో కూడా తప్పలేదు

"కరోనా లాక్ డౌన్లో కూడా నేను పని చేశాను. మాస్కులు, గ్లౌజులు అన్నీ వేసుకునేదాన్ని. ఎక్కడ చూసినా శవాల కుప్పలుగా ఉండేవి. అయినా భయపడలేదు. దానిని నా వృత్తిగానే చూశాను. ఆ సమయంలో కొన్ని వందల మందికి అంతక్రియలు చేసుంటాను. నేనూ మహిళనే… కానీ, కఠినంగా ఉండాలి. కొత్తగా పెళ్లైన వారు భర్తలను, భార్యలను కోల్పోవడం, చిన్న వయసు వారు చనిపోవడం చూస్తుంటే బాధేస్తుంది. కానీ, అక్కడ అవన్నీ చంపుకుని పనిచేయాల్సి ఉంటుంది" అంటారు కాటమ్మ.

అమ్మే తనకు మోటివేషన్ అంటున్నారు కాటమ్మ పెద్ద కూతురు హరిప్రియ.

"మా అమ్మ ఈ పని చేయడం కూడా నాకు ఒక విధంగా మోటివేషన్‌ అయ్యింది. మా అమ్మను చూసి కొన్ని విషయాల్లో ఎంత దృఢంగా ఉండాలో నేను తెలుసుకున్నాను. చిన్నప్పుడు అమ్మ శవం ముందు గంట కొడుతూ వెళ్తుంటే, పరిగెత్తుకుని బయటకు వెళ్లి ఆసక్తిగా చూసేవాళ్లం. జంగం అనే పదానికి డెఫినిషన్ చూస్తే 'ట్రెడిషన్ ఆఫ్ బెగ్గింగ్' అని ఉండడంతో మా కొలీగ్స్ కొందరు మీది 'బెగ్గింగ్ ఫామిలీ'నా అని అడిగారు. అప్పుడు కాస్త బాధేసింది. కానీ, ఎప్పుడూ మా మా అమ్మ ఈ పని చేస్తోంది అని మేం బాధపడలేదు" అంటారామె.

జంగం వృత్తిలో కొనసాగుతూ వచ్చే సంపాదనతో తన ముగ్గురు పిల్లలనూ చదివించి, పెద్దవారిని చేసిన కాటమ్మకు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ నుంచి పథకాల లబ్ధి అందడం లేదు.

కాటమ్మ కూతుళ్లు

ప్రభుత్వ పథకాలు దూరమయ్యాయి

హరిప్రియకు సచివాలయంలో మహిళా పోలీస్ ఉద్యోగం రావడంతో అప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అందే పథకాలన్నీ ఆగిపోయాయి.

కానీ, ఇదంతా ఆటోమేటిగ్గా జరిగే సాధారణ ప్రక్రియ అని చిట్టత్తూరు గ్రామ కార్యదర్శి మురళి బీబీసికి చెప్పారు.

ఒక కుటుంబం రేషన్ కార్డు ఆధార్‌తో లింకప్ అయ్యుంటుంది కాబట్టి. వారి కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఆటోమేటిగ్గా.. ఆ కుటుంబానికి అందే ప్రభుత్వ పథకాలన్నీ నిలిచిపోతాయని ఆయన తెలిపారు.

కాటమ్మ పెద్ద కూతురికి కూడా పెళ్లైతే, వారికి కొత్త రేషన్ కార్డు వచ్చాక నిలిచిపోయిన పథకాలన్నీ మళ్లీ వర్తిస్తాయని తెలిపారు.

తల్లి జంగం పని చేస్తున్నందుకు చదువుకునే సమయంలో తోటి పిల్లలు, ఇంకా చాలా మంది ఏవేవో అంటూ ఏడిపించేవారని కానీ తాము అవేవీ పట్టించుకోలేదని కాటమ్మ పిల్లలు చెబుతున్నారు.

"మేం చాలా మంది నుంచి చాలా కామెంట్స్ ఫేస్ చేశాం. మా తమ్ముడైతే ఇప్పటికీ అలాంటివి ఎదుర్కొంటున్నాడు. వాడిని ‘మీ అమ్మ చావులకు వెళ్తుంది, గంట వాయిస్తుంది’ అని ఆటపట్టిస్తుంటారు. కానీ, మేం అవేవీ పట్టించుకోం. తమ్ముడు, అంత్యక్రియలకు అమ్మతోపాటూ వెళ్తుంటాడు. కొందరు మమ్మల్ని మీ అమ్మ ఈ పని చేయడం ఎందుకు అని అడిగారు.. ఒక్కొక్కరికి ఒక్కో వృత్తి ఉంటుంది. ఇది మా వృత్తి అని నేను చెప్పాను" అన్నారు హరిప్రియ.

కానీ, ‘మీరు చదువుకున్నారు కదా.. కాటమ్మ వారసత్వాన్ని కొనసాగిస్తారా’ అనే ప్రశ్నకు కాటమ్మ కొడుకు గణేష్ సమాధానం ఇచ్చారు.

"ఏమో.. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు కదా. కానీ, నేను దేనికైనా సిద్ధంగా ఉండాలనుకుంటున్నాను" అని చెప్పాడు.

గణేష్ అక్కయ్య హరిప్రియ మాత్రం కుటుంబ వారసత్వం కొనసాగితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

"తమ్ముడు ఇప్పుడు అమ్మతో పాటూ వెళ్తున్నాడు. తను ఉద్యోగం చేసినా, ఇది కూడా చేసుకోవాలనే నేను అనుకుంటున్నాను. రెండూ ఉండాలి. తను కోరుకునే పనితోపాటూ, మాకు జీవితం ఇచ్చిన ఈ వృత్తిని కూడా కొనసాగించాలి. కానీ, ఆ నిర్ణయం తనకే వదిలేశాం" అంటారామె.

వీడియో క్యాప్షన్, కాటికాపరి జయలక్ష్మి స్మశాన జీవితం కోసం ఏం చెబుతున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)