ఆంధ్రప్రదేశ్: గిరుల మీది గంగను ఊరికి తరలించిన జనులు!

ఫొటో సోర్స్, Shyam Mohan
- రచయిత, శ్యాంమోహన్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనం గొంతు తడుపుకోవాలంటే గుక్కెడు గంగ కోసం కొండ దారుల్లో మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లి ఊటనీటిని బిందెల్లో మోసుకురావాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కొండవాలుల్లోని ఊటనీరు నడూరుకు నడిచివస్తూ వారి దాహం తీరుస్తోంది. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది.

ఫొటో సోర్స్, Shyam Mohan
ఎక్కడుందీ గిరిజన ప్రాంతం?
విశాఖ నుండి అరకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుండి పాడేరు వెళ్లే దారిలో దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించాక.. రహదారి కనుమరుగవుతుంది. అడవి బాటలో మరో ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే.. కొండ ప్రాంతాల్లో గిరిజన గూడాలు కనిపిస్తాయి.
నాలుగు గూడేలు.. వాటి పేర్లు గుత్తుం, హుకుంపేట, జంగంపుట్టు, గాలిపాడు. ‘గుత్తుం’ వరకు మాత్రమే రహదారి ఉంది. మిగిలిన గ్రామాలకు కాలిబాటలో అటవీ మార్గంలో 6 కిలోమీటర్లు నడిచివెళ్లాల్సిందే.
ఈ ప్రాంతం సముద్రమట్టానికి 900 మీటర్లు ఎత్తులో ఉంటుంది. చుట్టూతా అడవిలో సిల్వర్ ఓక్ చెట్లు బలమైన కొండ గాలులకు ఊగుతూ ఉంటాయి.

ఫొటో సోర్స్, Wikipedia
సదుపాయాల సంగతేమిటి?
ఈ గూడేలకు రోడ్లు లేవు. ఎటువెళ్లాలన్నా కిలోమీటర్ల దూరం అడవి దారుల్లో నడవాల్సిందే.
ఊళ్లో విద్యుత్ లేదు. ఇళ్లలో రాత్రిపూట కిరోసిన్ గుడ్డి దీపాల వెలుగులోనే జీవిస్తున్నారు. ఒకటీ అరా విద్యుత్ స్తంభాలున్నా.. అవి అమాసకో పున్నమికో వెలుగుతాయి.
ఎందుకంటే.. కరెంట్ సరఫరా అంతంత మాత్రం ఒక కారణమైతే.. కొండ గాలులకు విద్యుత్ తీగలు తెగిపోతుండటం మరో కారణం.
తూర్పు కనుమల్లోని ఈ ఏజెన్సీ ప్రాంతంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. ఇంటర్‌నెట్ సదుపాయం సంగతి తర్వాత టీవీ సిగ్నల్స్ కూడా అందవు.
ఈ ఊర్లో ఉండేవారు సెల్‌ఫోన్ బ్యాటరీ చార్జింగ్ చేసుకోవాలన్నా ఇరవై కిలోమీటర్లు నడిచివెళ్లి.. ఐదు రూపాయలు ఖర్చు చేయాలి.

ఫొటో సోర్స్, Shyam Mohan
తాగునీటి కోసం ఎన్ని కష్టాలో!
ఇక నిత్యావసరమైన తాగునీటి సంగతి చూస్తే.. వర్షపు నీరు తప్ప వేరే నీటివసతి లేదు.
దగ్గర్లో ఉన్న బావులు అడుగంటిపోయాయి. అయితే ఐదారు కిలోమీటర్ల దూరంలో కొండ వాలులో ఊటనీటి కుంటలు ఉన్నాయి. ఆ ఊటల్లో ఏడాది పొడవునా నీరు ఊరుతూనే ఉంటుంది.
ఆ ఊట కుంటల నీరే ఈ గూడేల ప్రజలకు జీవజలం. గిరిజన మహిళలు రోజూ ఐదారు కిలోమీటర్లు నడుస్తూ ఆ కొండలెక్కి నీటిని తోడుకుని మోసుకొచ్చుకునేవారు.
మధ్యలో చిరుతపులులు, ఎలుగుబంట్లు, విషసర్పాల నుండి ప్రమాదాలు పొంచే ఉంటాయి.
నడవలేని వృద్ధులు దగ్గర్లో ఉన్న బావుల్లో అడుగున ఉన్న కలుషిత జలాలతోనే గొంతు తడుపుకునేవారు.
దానివల్ల టైఫాయిడ్, మలేరియా వంటి రోగాల పాలయ్యేవారు. పిల్లలు తరచూ బడి మానేసే వారు. పెద్దవారు నీటిని సేకరించే పనిలో కొన్నిసార్లు కూలీ పనులకు పోలేకపోయేవారు.

ఫొటో సోర్స్, Shyam Mohan
సమష్టి కృషితో కొండ దిగిన గంగ..
ఈ క్రమంలో ఈ గూడేల్లోని 800 కుటుంబాలు చేతులు కలిపాయి. సమష్టి కృషితో సమస్యను పరిష్కరించుకున్నాయి.
గిరిజనమంతా కలిసి కొండవాలులోని ఊటనీటిని పైప్ లైన్ ద్వారా గ్రామం నడిబొడ్డుకు రప్పించుకున్నారు.
ఇందుకు రామకృష్ణమిషన్ ఆర్థిక తోడ్పాటునిచ్చింది. గ్రామస్థులంతా శ్రమదానంతో ఊరి మధ్య నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ట్యాంకర్లను ఊటనీటితో నింపుతూ.. అవసరమైనన్ని నీళ్లు పట్టుకుంటున్నారు.
కొండవాలులో పుట్టిన ఊటనీరు ఊర్లలోని ట్యాంకర్లకు చేరడానికి ముందు.. ఆ నీటిని వడకట్టడానికి కొండల దగ్గర తొట్టెలు నిర్మించి, శాస్త్రీయమైన వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు.
దీనివల్ల ఊటనీరు మూడుసార్లు వడగట్టిన తరువాత కింది గ్రామాలకు చేరుతాయి.
ఇప్పుడు గిరిజన మహిళలు మైళ్ల దూరం నడుస్తూ నీటిని మోసుకురావాల్సిన అవసరం లేదు. తాగునీటి సమస్యలు తగ్గిపోయాయి.
ప్రతి కుటుంబం స్వచ్ఛమైన జలం తాగుతూ అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందారు.
గిరిజనులకు తాగునీటి కోసం పైపు లైను వేయటంతోనే ఆగిపోలేదు రామకృష్ణ మిషన్. వాటల్ ఫిల్టర్ వాడకం, పైప్‌లైన్లలో లేకేజీలు లేకుండా నిరంతరం పరిరక్షించడానికి గిరిజన యువకులకు సాంకేతిక శిక్షణ కూడా ఇచ్చారు.
రిపేర్లు వచ్చినపుడు వారే స్వయంగా బాగుచేసుకుంటునారు.

ఫొటో సోర్స్, Shyam Mohan
గ్రామస్తుల్లో ఆనందం
‘‘గతంలో మంచినీళ్ల కోసం మైళ్ల దూరం నడిచి కొండమీదకు వెళ్లి రావాల్సి వచ్చేది. వృద్ధులు, గర్భిణిలు, నీళ్లు తెచ్చుకోలేక అవస్థలు పడేవాళ్లు. ఇపుడు కొండల మీద ఉన్న నీటిని పైపుల ద్వారా మా ఇంటిముందుకు తెచ్చారు. మాకు రోగాలు రావటం కూడా తగ్గింది’’ అని గున్నమామిడి గ్రామస్తురాలు స్వాతి సంతోషం వ్యక్తం చేశారు.
‘‘పొద్దున లేచింది మొదలు నీళ్ల కోసం కొండమీదికి పోవాల్సి వచ్చేది. వానాకాలంలో కాలిబాట బురదమయమై చాలా ఇబ్బందులు పడేవాళ్లం. చంటిపిల్లలను చూసేవారు లేక వాళ్లని ఎత్తుకునే బిందెలను మోసుకుంటూ వచ్చేవాళ్లం. ఇప్పుడీ అవస్థల నుండి బయటపడ్డాం’’ అని రాధ, రత్నకుమారి, దేవుడమ్మలు ఆనందం వెలిబుచ్చారు.
‘‘తుఫాన్ల సమయంలో అందరికీ సాయం అందింది కానీ మారుమూల ఉన్న మావైపు ఎవరూ చూడలేదు. తాగునీటి కోసం మేం పడుతున్న కష్టాలు చూసి రామకృష్ణ మిషన్ వారు కొండమీది ఊటనీటిని గ్రామానికి రప్పించి ఎంతో మేలు చేశారు. పట్నంలో చదువుతున్న విద్యార్థులు సెలవుల్లో ఇళ్లకి రావాలంటే నీళ్లు లేవని భయపడేవారు. ఇప్పుడు వారు గ్రామాలకు వస్తున్నారు’’ అంటున్నారు జంగంపుట్టుకు చెందిన జన్ని రాజారావు.
పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అధికారుల దృష్టికి ఈ గ్రామాల సమస్యలను తీసుకెళ్లగా.. రహదారులు, విద్యుత్ సదుపాయాల ఏర్పాటు కోసం సర్వే జరుగుతోందని.. ఆ నివేదిక వచ్చాక పనులు చేపడతామని వారు చెప్పారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








