#గ్రౌండ్ రిపోర్ట్: తెలంగాణ గూడేల్లో కోటా కోసం గోండులు, లంబాడాల కొట్లాట!

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ తెలుగు ప్రతినిధి
తెలంగాణలోని ఏజెన్సీలో ఇప్పుడు అలజడి రేగుతోంది. లంబాడాలు, గోండుల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. లంబాడాలు(లంబాడీలు) మహారాష్ట్రలో బీసీలు. తెలంగాణలో ఎస్టీలు. రిజర్వేషన్లలో ఎక్కువభాగం వారే కొట్టేస్తున్నారన్నది గోండుల ఆరోపణ. జనాభా పరంగా అది తమ హక్కు అంటారు లంబాడాలు. ఈ వివాదమే ఇప్పుడు ఏజెన్సీలో ఘర్షణ వాతావరణం సృష్టించింది.
తెలంగాణలోని గూడేలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఉట్నూరు ఏజెన్సీ పరిధిలోని పల్లెల్లో 144 సెక్షన్ అమలవుతోంది.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గోండుల నాయకత్వంలో మిగిలిన ఆదివాసీ జాతులు ఆందోళన చేస్తున్నాయి.
రిజర్వేషన్లను వర్గీకరించాలని మరి కొందరు వాదిస్తున్నారు.
ఆదిలాబాద్, ఏటూరునాగారం, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వివాదం ఉన్నప్పటికీ, పాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఇది ముదురుతోంది.
ఈ నేపథ్యంలో ఆదివాసీ గూడేల్లో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. బీబీసీ తెలుగు ప్రతినిధి బళ్ల సతీశ్ క్షేత్రస్థాయికి వెళ్లి ఇరువర్గాల ప్రజలతో మాట్లాడారు.

మహారాష్ట్రలో బీసీలు..తెలంగాణలో ఎస్టీలు!
1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంగళ్‌రావు హయాంలో లంబాడాలను మొదటిసారిగా ఎస్టీ జాబితాలో చేర్చారు.
లంబాడాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరో 33 జాతులు ఈ ఎస్టీ జాబితాలో ఉన్నాయి.
గోండు, ప్రధాన్, కోలి, తోటి, నాయక్పోడ్, ఆంధ్ వంటి అనేక జాతులు లంబాడాల కంటే ముందు నుంచి ఎస్టీ జాబితాలో ఉన్నాయి.
వీరిని అన్ని రాష్ర్టాల్లోనూ ఎస్టీలుగానే పరిగణిస్తారు.
లంబాడాలు మాత్రం మహారాష్ట్రలో బీసీలు. కానీ తెలంగాణలో ఎస్టీలు.

మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వలస
వెంగళ్‌రావు హయాంలో లంబాడాలకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీ హోదా ఇవ్వడంతో మహారాష్ట్రలో బీసీలుగా ఉన్న లంబాడాలు తెలంగాణకు వలస రావడం పెరిగింది.
దాదాపు పదేళ్లలో వీరి జనాభా దాదాపు రెట్టింపు అయింది.
సాంస్కృతికంగా, భాషాపరంగా, కట్టుబొట్టు, రూపురేఖల పరంగా మిగిలిన ఆదివాసీలకు లంబాడాలకు తేడా ఉంటుంది.
లంబాడాలు ప్రధానంగా మైదాన ప్రాంతాలకు కొండ ప్రాంతాలకు నడుమ నివసిస్తారు. అంటే మైదాన ప్రాంతానికి సమీపంలో ఉంటారు.
ఇతర ఎస్టీ తెగలు ప్రధానంగా కొండప్రాంతాల్లో మైదాన ప్రాంతాలకు దూరంగా ఉంటారు.
దాంతో విద్య, ఉపాధిలో అవకాశాలను ఒడిసి పట్టుకోవడంలో ఆదివాసీల కంటే లంబాడాలు మెరుగ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ.
దీనికే ఎవరికి తగ్గట్టుగా వారు భాష్యం చెపుతూ తమకు తోచిన పరిష్కారం సూచిస్తున్నారు.

వివాదానికి కారణం ఇదే!
ఏజెన్సీలో రగులుతున్న ప్రస్తుత వివాదానికి ఇదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
మహారాష్ట్రలో బీసీలుగా ఉన్న లంబాడాలు తెలంగాణకు వలస వచ్చి తమ అవకాశాలను కొల్లగొడుతున్నారని ఇతర ఎస్టీ తెగల వారు ఆరోపిస్తున్నారు.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎక్కడి నుంచో వచ్చి తమ అవకాశాలకు లంబాడాలు గండికొడుతున్నారని గోండులు గొడవ పెడుతున్నారు.
అయితే, జనాభా పరంగా అది తమ హక్కు అంటున్నారు లంబాడాలు.

'లంబాడాలు గిరిజనులే కాదు'- వెద్మ బొజ్జ
'అసలు లంబాడాలు గిరిజనులే కాదన్నారు.. ఆదివాసి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వెద్మ బొజ్జ.
1976 ఎమెర్జెన్సీ సమయంలో పార్లమెంటులో చట్టం చేయకుండా, ఏ కమిషన్ వేయకుండా కేవలం 195 నంబర్ జీవో ఆధారంగా ఇచ్చిన ఆ ఆదేశం చెల్లదని చెబుతున్నారు.
ఆ జీవో ప్రకారం 1950 కంటే ముందు నుంచి ఇక్కడ ఉన్న లంబాడాలకు మాత్రమే ఎస్టీ హోదా ఇవ్వాలి.. కానీ పెద్ద సంఖ్యలో మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడాలు తమకు రావల్సిన అవకాశాలను తీసేసుకుంటున్నారని వెద్మ బొజ్జ ఆరోపించారు.
'మాలో మాకు గొడవలు లేవు.. రాజకీయ నాయకులే కుట్ర చేస్తున్నారు': రమణనాయక్
లంబాడాల వాదన మరోలా ఉంది. తమ కంటే 20 ఏళ్ళ ముందు నుంచి తెలంగాణలో ఎస్టీలుగా ఉన్న ఆదివాసీ కులాల వారు ఇప్పటికే 90 శాతం అభివృద్ధి చెందారని లంబాడా హక్కుల పోరాట సమితికి చెందిన జాదవ్ రమణా నాయక్ అన్నారు.
తమను రాజ్యాంగబద్ధంగానే ఎస్టీ జాబితాలో చేర్చారని స్పష్టం చేశారు.
'ఐటీడీఏ రుణాల్లో 70శాతంపైగా గోండులు తీసుకున్నారు. 23 వేల జనాభా ఉన్న ప్రధాన్ కులస్తుల్లో 19వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు' అని ఆయన అన్నారు.
'తెలంగాణలో మా జనాభా 23.6 లక్షలు. మిగిలిన అన్ని ఆదివాసీ కులాల జనాభా కలిపినా 10 లక్షలు దాటదు. జనాభా ప్రకారం చూసినా మా వాటా మాకు రావడం లేదు'. అని రమణా నాయక్ చెప్పారు.
తమలో తమకు తగాదాలు లేవని, రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే ఈ సమస్య పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

వివాదం మొదలైంది ఇలా!
ఇరు వర్గాల మధ్య కోటా కొట్లాట రోజు రోజుకు తీవ్రం అవుతోంది.
అక్టోబర్ 5న జోడేఘాట్ గ్రామంలో కుమ్రం భీం స్మారకంలోని లంబాడా వేషధారణలో ఉన్న ఒక మహిళ బొమ్మను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు.
ఎస్టీ తెగల మధ్య వివాదానికి ఇది ఆజ్యం పోసింది.
లంబాడా సంఘాలు ఆందోళన చేశాయి. పోలీసులు కేసులు పెట్టారు.
పోలీసు కేసులకు వ్యతిరేకంగా మళ్లీ లంబాడాలు రోడ్డెక్కారు.
ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఆదివాసీలు.
గొడవ ఇలా రోజుకో మలుపు తీసుకుంటూ విషయం పాఠశాలలవైపు మళ్ళింది.
తమ పిల్లలు చదువుకునే బళ్లలో చదువు చెప్పడానికి లంబాడా ఉపాధ్యాయులు రాకూడదంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు.
దీంతో ఉట్నూరు ప్రాంతంలోని ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ లంబాడా టీచర్లు విధులకు హాజరు కావడం లేదు.
జోడేఘాట్ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడితో పాటూ మొత్తం ఆరుగురు ఉపాధ్యాయులండగా, అందులో ముగ్గురు లంబాడాలు.
115 మంది విద్యార్థుల్లో మాత్రం ఒక్కరు కూడా లంబాడా లేరు. దాదాపు నెల రోజులుగా ఆ ముగ్గురు లంబాడా ఉపాధ్యాయులు లేకుండానే ఈ బడి నడుస్తోంది.
గోండు వర్గానికి చెందిన ఒక పర్మినెంట్ టీచర్, ఇద్దరు పార్ట్ టైమ్ టీచర్లు ఇక్కడ పాఠాలు చెబుతున్నారు.

'లంబాడా టీచర్లు మా పిల్లలకు చదువు సరిగా చెప్పరు'
'లంబాడా టీచర్లు మా పిల్లలకు చదువు సరిగా చెప్పరు. పరీక్షల్లో కూడా మా వాళ్లని కావాలని ఫెయిల్ చేస్తారు. లంబాడా పిల్లలు ఎలా రాసినా పాస్ చేస్తారు' అని ఆరోపించారు కుమ్రం సోనే రావు.
ఈయన ఆదివాసీల హక్కుల కోసం నిజాం దళాలపై పోరాడిన కుమ్రం భీం మనవడు.
ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలన్న డిమాండ్‌కి ఆయన మద్దతిస్తున్నారు.
'ఇంతకాలం లేనిది కొత్తగా ఈ ఆరోపణ ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. పీసా చట్టం పేరుతో లంబాడా టీచర్లను రానీయడం లేదు. దానివల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటోంది. ఇన్ని రోజుల నుంచి రాని ఆరోపణ ఇప్పుడు చేయడంలో అవాస్తవాలను పరిశీలించాలి.
ఆవేశంగా ఆరోపణలు చేస్తున్నారు తప్ప అందులో 90శాతం వాస్తవం లేదు. ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి సమస్య పరిష్కరించాలి' అంటున్నారు లంబాడా వర్గానికి చెందిన టీచర్ బానోత్ రామారావు.

అగ్గి రాజేసిన వాట్సప్ పోస్ట్!
విగ్రహం కాల్చడంతో మొదలైన గొడవ, సోషల్ మీడియాకెక్కింది.
ఒక జాతిని కించపరుస్తూ మరో జాతి వారు వాట్సప్ పోస్ట్ పెట్టడం కలకలంగా మారింది.
దానికి తోడు టీచర్ల వ్యవహారం అగ్గి రాజేసింది.
సమ్మక్క ఆలయ కమిటీలో లంబాడాలు వద్దంటూ, ఆలయ కమిటి ప్రమాణ స్వీకారం రోజు జరిగిన ఆందోళన చిన్నపాటి ఘర్షణకు దారితీసింది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఎస్టీల్లో స్పష్టమైన చీలిక వచ్చేసింది.
లంబాడాలు ఒక వైపు, మిగిలిన అన్ని జాతులు ఒక వైపు విడిపోయారు.
ఉద్యోగులు ఎవరూ ఈ వ్యవహారం గురించి మాట్లాడడం లేదు.
విషయం నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎస్టీ ఉద్యోగులు, టీచర్లు, ఉద్యమకారులు, కుల నాయకులు తమ వర్గం వాదనల విషయంలో చాలా బలంగా ఉన్నారు.
రెండు వర్గాలూ పోటాపోటీగా హైదరాబాద్‌లో బహిరంగ సభలను నిర్వహించాయి.
తాజాగా ఉట్నూరు ప్రాంతంలో జరిగిన కొన్ని అనుమానాస్పద మరణాలు ఈ జాతుల మధ్య గొడవకు సంబంధించిన హత్యలే అన్న వార్తలు మరింత ఉద్రిక్తతను పెంచాయి.
ప్రస్తుతానికి విద్యార్థులు ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్థానిక అధికారులు నిర్ణయించారు.
ఉట్నూరు ప్రాంతంలో 144వ సెక్షన్ విధించడం మినహా ప్రభుత్వం ప్రత్యేకించి తీసుకున్న చర్యలంటూ ఏమీ లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








