భర్తను హత్య చేసిన భార్య: ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి.. భర్తగా చూపించాలనుకుంది. కానీ, ఆధార్ పట్టించింది

- రచయిత, విజయభాస్కర్
- హోదా, బీబీసీ తెలుగు కోసం
ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి భర్తగా సమాజానికి పరిచయం చేయాలనుకుంది. పథకం ప్రకారం భర్తను అడ్డు తప్పించింది. ప్రియుడి కోసం ప్లాస్టిక్ సర్జరీకి ప్లాన్ చేసింది. కానీ చిన్న అనుమానం ఆమెను పోలీసులకు పట్టించింది.
నాగర్ కర్నూల్ జిల్లా ఏఎస్పీ చెన్నయ్య చెప్పిన కథనం, పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం..
పైన ఫొటోలో కనిపిస్తున్నది నాగర్ కర్నూల్ జిల్లా బండపల్లికి చెందిన సుధాకర్‍రెడ్డి, ఆయన భార్య స్వాతి. వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం వరకు సంసారంలో ఎలాంటి గొడవలూ లేవు. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సుధాకర్‌రెడ్డి ఇటీవల వ్యాపారంలో బిజీ అయిపోయాడు. భార్యతో గడిపే సమయం తగ్గిపోయింది. ఇది స్వాతికి నచ్చలేదు. భర్తపై విసుగొచ్చింది.
భర్త సరిగా పట్టించుకోవడం లేదన్న కారణంతో భార్య అడ్డదారి తొక్కింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలదన్నేలా స్కెచ్ వేసి అమలు చేసింది.

భార్య- భర్త మధ్యలో ప్రియుడు!
భర్త తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి స్వాతిలో రోజురోజుకు పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆమెకు రాజేశ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.
నడుం నొప్పికి చికిత్స చేయించుకునేందుకు స్వాతి నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ రాజేశ్ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
స్వాతి-రాజేశ్‌ల మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త లేని సమయంలో స్వాతి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజేశ్ ఇంటికి వచ్చే వాడు.
ప్రియుడి కోసం భర్త హత్య!
రెండేళ్లుగా స్వాతి-రాజేశ్‌ల మధ్య సంబంధం కొనసాగుతోంది. ఈ బంధాన్ని శాశ్వతం చేసుకునేందుకు అడ్డుగా ఉన్న భర్తను పక్కకు తప్పించాలని అనుకుంది.
రాజేశ్ కూడా స్వాతిని రెచ్చగొట్టాడు. సుధాకర్‌రెడ్డిని చంపేస్తే, నీతోనే ఉండి, పిల్లల్ని మంచిగా చూసుకుంటానని ఆమెకు చెప్పాడు.
రాజేశ్ మాటలు నమ్మిన స్వాతి పక్కా స్కెచ్ వేసింది. సమయం చూసుకుని రాజేశ్‌తో కలిసి ప్లాన్‌ను అమలు చేసింది.
మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. నోరు నొక్కేసి హత్య!
నవంబర్ 26న మంచం పైనుంచి కింద పడటంతో సుధాకర్‌రెడ్డి తలకు గాయమైంది. వరుసకు సోదరుడైన అరవింద్‌కు ఫోన్ చేసి సుధాకర్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని స్వాతి కోరింది.
అప్పటికే బాగా రాత్రి కావడంతో ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్దామని అనుకున్నారు.
ఇదే అదనుగా భావించిన స్వాతి రాజేశ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది.
అరవింద్ ఉంటే హత్య చేయడం కష్టమని భావించి, తెల్లవారుజామున స్వాతి అతన్ని ఇంటికి పంపేసింది.
ఆ తర్వాత సుధాకర్‌రెడ్డి నిద్రలో ఉండగా, రాజేశ్ అతని మెడపై మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు.
సుధాకర్‌రెడ్డి అరుపులు బయటికి వినపడకుండా పక్కనే ఉన్న భార్య స్వాతి అతని నోరు నొక్కి పట్టుకుంది.
రాజేశ్ తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో సుధాకర్ తలపై గట్టిగా కొట్టి చంపేశాడు.

ప్రియుడే భర్త అని నమ్మించే యత్నం
భర్తను చంపేసిన తర్వాత ఆ స్థానంలో ప్రియుడిని రప్పించాలని ప్లాన్ చేసింది..స్వాతి. ఐతే భర్తను అందరు చూశారు కాబట్టి.. ప్రియుడి ముఖం గుర్తుపట్టకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు.
అందుకు ఇద్దరూ కలిసి సినిమా తరహాలో ఒక కట్టు కథ అల్లారు.
ముందుగా ఇద్దరూ కలిసి సుధాకర్‌రెడ్డి శవాన్ని మాయం చేశారు. భర్త కారులోనే శవాన్ని తీసుకెళ్లి నవాబుపేట మండల పరిధిలోని ఫతేపూర్ మైసమ్మ అడవిలో కాల్చివేశారు.

భర్తపై యాసిడ్ దాడిగా ప్రచారం!
ముందుగా అనుకున్న పథకం ప్రకారం హత్య జరిగిన మరుసటి రోజు నాటకానికి తెరలేపారు. స్వాతి ఇంట్లోనే ప్రియుడు రాజేశ్ స్వయంగా ముఖంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
అతని ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. స్వాతి ఎవరికీ చెప్పకుండా అతన్ని ఆస్పత్రికి తరలించింది. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రాజేశ్‌ను తన భర్త అని నమ్మించాలనుకుంది.
భర్త తరుపు బంధువులకు సుధాకర్‌రెడ్డిపై యాసిడ్ దాడి జరిగిందని చెప్పింది. దీంతో సుధాకర్ రెడ్డి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా ఎస్పీ వారి ఇంటికొచ్చి విచారణ చేశారు.
అయితే, పోలీసులు రాకముందే ప్రియుడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్వాతి జాయిన్ చేసింది.
ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తి తమ వాడేనని సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు నమ్మారు.
రాజేశ్ చికిత్సకు అయిన రూ.5లక్షల బిల్లును భర్త తల్లిదండ్రులతోనే కట్టించింది స్వాతి.

నకిలీ సుధాకర్‌రెడ్డి బాగోతం ఇలా బయటపడింది?
ఈ నెల 9న సుధాకర్‌రెడ్డిని పరామర్శించేందుకు సోదరుడు సురేందర్‌రెడ్డి ఆస్పత్రికి వచ్చాడు. అయితే, ఐసీయూలో ఉన్నది సుధాకర్ రెడ్డి కాదని ఆయన గుర్తించారు.
దీంతో అదే రోజు సురేందర్‌రెడ్డి మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చికిత్స పొందుతున్న ప్రియుడి వేలిముద్రలను పోలీసులు ఆధార్ స్కానర్ ద్వారా పరీక్షించారు. దాంతో అసలు గుట్టు బయటపడింది.
చికిత్స పొందుతున్నది సుధాకర్ రెడ్డి కాదు.. అతని ముసుగులో ఉన్న స్వాతి ప్రియుడు రాజేశ్ అని పోలీసులు నిర్ధరించారు.
ఇద్దరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించే సరికి సుధాకర్‍రెడ్డిని హత్య చేసిన విషయాన్ని అంగీకరించారు. మృతదేహాన్ని పారేసిన ప్రాంతాన్ని పోలీసులకు చూపించారు.
స్వాతిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ప్రియుడు రాజేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తమ సర్వీస్‌లో ఇలాంటి నేరాన్ని ఇప్పటి వరకు చూడలేదని జిల్లా పోలీసులు చెబుతున్నారు.
మా ఇతర కథనాలు:
- పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
- ఆమె ప్రిన్స్‌ని పెళ్లి చేసుకున్నా.. యువరాణి కాలేదు
- ఇక్కడ హెచ్ఐవీ బాధితులకు పెళ్లి సంబంధాలు చూడబడును
- 'పురోహితులకు ప్రభుత్వం కట్నమిస్తోందా!'
- ప్రేమ - శృంగారం - వైకల్యం
- అమ్మా..నాన్నా.. వింటున్నారా?
- ఆ ప్రశ్నలు అమ్మాయిలకే ఎందుకు?
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల్ని బయటపెట్టిన 'పాఠశాల బాలిక'
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











