మ్యాట్రిమోనీ సైట్లలో ఆందోళనకర ధోరణి!

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సింధువాసిని
- హోదా, బీబీసీ ప్రతినిథి
మీరు వంట చేయగలరా ? ఎలాంటి బట్టలు వేసుకుంటారు? ఆధునిక దుస్తులా, సంప్రదాయ దుస్తులా ? పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తారా ? ఈ ప్రశ్నలు ఏ అబ్బాయి వారూ నన్ను అడగలేదు. కానీ.. మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తప్పకుండా మీకు సరైన జీవిత భాగస్వామిని వెతికిపెడతామని గ్యారంటీ ఇచ్చే వివాహ వెబ్‌సైట్లు అడుగుతున్నాయి.
గత కొన్ని రోజులుగా నా కుటుంబ సభ్యులు ఇలాంటి వివాహ వెబ్‌సైట్లలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అంటున్నారు.
వీటన్నిటి నుంచి తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశా. చివరికి విసుగొచ్చి ఒప్పుకున్నా.
ఈ సాహసం కూడా ఓ సారి చేసి చూద్దామని అనుకున్నా.
నేను వెళ్లిన మొట్టమొదటి వెబ్‌సైటులో చిరునవ్వుతో కొన్ని జంటల ఫోటోలు కనిపించాయి. 'ప్రేమ మీకోసం వెతుకుతుంది..' అని పెద్ద పెద్ద అక్షరాల్లో రాసి ఉంది.
కానీ ఆ ప్రేమకు నేను కనబడాలంటే నా మతం, జాతి, కులం, వయస్సు, శరీరాకృతులు, విద్య, ఉద్యోగానికి సంబంధించి సమాచారం అందించాలంట.

ఫొటో సోర్స్, JEEVANSATHI.COM
ప్రశ్నల వర్షం
మీరు మాంసాహారులా, శాకాహారులా?
సిగరెట్, మందు వంటివి తాగే అలవాటుందా? లేదా ?
ఆధునిక దుస్తులు వేసుకుంటారా? లేక సంప్రదాయ దుస్తులా ? ఇలాంటి ప్రశ్నలన్నీ అక్కడున్నాయి.
మళ్ళీ ఓ ప్రశ్నడిగారు. వంట చేయడం వచ్చా? రాదా ? నేను రాదని టిక్ చేసి ముందుకు సాగాను.
మళ్ళీ ఓ ప్రశ్న, పెళ్ళి తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అని వచ్చింది.
ఇలాంటి ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పిన తర్వాత నేనెలాంటి అమ్మాయో చెప్పమని చెబుతూ కొన్ని ప్రశ్నలెదురయ్యాయి. అందులో మీ లక్ష్యమేమిటి ? అనే ప్రశ్న కూడా ఉంది.

ఫొటో సోర్స్, JEEVANSATHI.COM
నా అభిరుచుల గురించి వివరిస్తూ లింగ అసమానతలు వంటి అంశాల్లో ఆసక్తి ఉందని నేను చెప్పాను.
సమాధానాలు చెబుతున్నప్పుడు ఏదో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నట్లు అనిపించింది. ఎలాగోలా సమాధానమిస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించాను.
అబ్బాయిలను ఈ ప్రశ్నలు అడగలేదు
అమ్మాయిల సంగతి సరే. మరి అబ్బాయిలను ఎలాంటి ప్రశ్నలడుగుతారో తెలుసుకునేందుకు ఓ ప్రయత్నం కూడా చేశాను. అబ్బాయిలకు ఎలాంటి ప్రశ్నలడుగుతున్నారో చూస్తే కాస్త విచిత్రంగా అనిపించింది.
వంట గురించి వారిని ఎటువంటి ప్రశ్నలు అడగలేదు.
పెళ్లి తర్వాత పనిచేస్తారా, ఇంట్లో ఉంటారా, ఎలాంటి బట్టలు వేసుకుంటారో వంటి ప్రశ్నలు లేవు.

ఫొటో సోర్స్, SHAADI.COM
ఇంకాస్త ముందుకెళ్లి చూస్తే అబ్బాయిలను ఇలాంటి ప్రశ్నలు అడగరని తెలిసింది.
కాలానికనుగుణంగా సమాజంలో మార్పు గురించి మార్పుల గురించి మాట్లాడే ఇలాంటి వెబ్‌సైట్లు పురుషులను, మహిళలను భిన్న కోణాల్లో చూస్తున్నాయనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది.
ఆ తర్వాత మరో నాలుగు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో వెళ్లాను. ఈ అన్ని వెబ్‌సైట్లలో దాదాపు ఒకేరకమైన ప్రశ్నలున్నాయి. వీటన్నిటిలో ఒకరినే ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగారు.
ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైటులో అమ్మాయిని వెతికితే అమ్మాయి సగటు వయసు 20-25, అబ్బాయిని వెతికితే వారి సగటు వయసు 24-29 ఉంది.
అంటే అమ్మాయి వయసు అబ్బాయికంటే తక్కువ ఉండాలనే ధోరణి మనకు తెలియకుండానే మన ఆలోచనల్లో దృఢంగా నాటుకుపోయేలా చేస్తున్నారు.

ఫొటో సోర్స్, SHAADI.COM
మరో వెబ్‌సైటులో మీ అకౌంట్ ని మీరే రిజిస్టర్ చేస్తే మిమ్మల్ని తక్కువ మంది సంప్రదిస్తారని ఉంది. దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ కనిపించింది.
అంటే ఇప్పుడు కూడా ఎవరైనా తమ కోసం జీవిత భాగస్వామిని వెతికితే వారిని ఒక రకమైన అనుమానంతో చూస్తున్నారు.
ఎవరికైనా జీవిత భాగస్వామి కావాలంటే తల్లిదండ్రులో, అన్నా, చెల్లెళ్ళో ఎవరో ఒకరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది..
ఈ అసమానతలు కేవలం ఇక్కడివరకే కాదు ఇలాంటి వెబ్‌సైట్లలో అప్లోడ్ చేసే ఫోటోల్లోనూ స్పష్టంగా కనిపించాయి.

ఫొటో సోర్స్, JEEVANSATHI.COM
ఒకవైపు అబ్బాయిలు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో తమ సెల్ఫీలు,స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫోటోలు పెడితే అమ్మాయిలు మాత్రం సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
వార్తాపత్రికలలో అందమైన, తెల్లటి రంగున్న, నాజూకు, సంప్రదాయబద్ధంగా ఉండే వధువు కావాలనే ప్రకటనలు చూస్తుంటాం.
కానీ నేడు ఈ ఇంటర్నెట్ యుగంలో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో ఈ ధోరణి కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వేల కోట్ల వ్యాపారం
ఇప్పుడీ మార్కెట్ వేల కోట్లరూపాయలకు చేరింది.
గత ఐదేళ్ళలో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల వ్యాపారం వృద్ధి చెందిందని, ఇప్పుడీ మార్కెట్ రూ.15,000కోట్లకు చేరిందని అసోచామ్ గణాంకాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అబ్బాయిలకు, అమ్మాయిలకు అడిగే ప్రశ్నల విషయంలో ఈ తేడా ఎందుకుందో తెలుసుకునేందుకు నేను వివిధ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ప్రతినిధులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించాను.
ఎన్నో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ప్రతినిధులు తాము బిజీగా ఉన్నామని సమాధానాన్ని దాటవేశారు. నేను పంపించిన ఈమెయిళ్లకు కూడా ఎటువంటి జవాబు ఇవ్వలేదు.
చివరికి ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ప్రతినిథి ఆలోక్ నాతో మాట్లాడారు. "జనాల అవసరానికి అనుగుణంగా ప్రశ్నలు తయారుచేస్తాం. ఉద్యోగంతోబాటు ఇంటిని కూడా నడపగలిగే అమ్మాయి కోసం దాదాపు అందరూ వెతుకుతుంటారు." అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లి చూపుల్లో నా స్నేహితురాలి ఎత్తు తెలుసుకునేందుకు చెప్పులు తీసి నిలబడమని అన్నారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల తీరు కూడా దాదాపు ఇలాగే ఉందని నాకు అనిపించింది.
సాధారణంగా మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో విదేశాల్లో చదువుకున్న, ఉన్నత పదవుల్లో ఉద్యోగులుగా ఉన్న అబ్బాయిలు రిజిస్టర్ చేసుకుంటారు. ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు జీవిత భాగస్వామి వెతికేందుకు ఇక్కడికి వస్తారు.
ఈ పరిస్థితిల్లో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల తీరును ప్రశ్నించకపోవడం ఆందోళనకర అంశమే.
మా ఇతర కథనాలు:
- 'పురోహితులకు ప్రభుత్వం కట్నమిస్తోందా!'
- జితేంద్ర, హేమమాలిని... మధ్యలో ధర్మేంద్ర
- ఇండోనేషియా యువరాణి పెళ్లి ఇలా జరిగింది..
- ‘మగాళ్లు చేస్తే ఒప్పు ఆడవాళ్లు చేస్తే తప్పా?’
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- పేరు మారింది. వివాదం మిగిలింది!
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- పెళ్లి గురించి రాహుల్ ఏమన్నారు?
- సౌదీ మహిళలు ఇక స్టేడియానికి వెళ్లొచ్చు!
- సంపన్నులు తప్పించుకుంటే సామాన్యులకే దెబ్బ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








