మత మార్పిడి కేసులో సుప్రీంకోర్టుకు హాజరవనున్న హదియా

హదియా, షాఫిన్‌ జహాన్‌

ఫొటో సోర్స్, Hindustan Times

మత మార్పిడితో హిందూ నుంచి ముస్లింగా మారిన హదియా కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. హదియా ఇవాళ తన వాంగ్మూలం ఇవ్వనున్నారు.

అఖిల హిందువు. 2016 జనవరి 23న మత మార్పిడి చేసుకుని ముస్లింగా మారింది. పేరు హదియాగా మార్చుకుంది. ఆ తర్వాత ముస్లిం యువకుడు షాఫిన్‌ జహాన్‌‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఏడాది మేలో కేరళ హైకోర్టు ఈ పెళ్లిని రద్దు చేసింది.

తాను ముస్లిం మహిళ అని, ఇష్టపూర్వకంగానే తాను ముస్లింగా మారానని హదియా మీడియాకు చెప్పినట్లు పీటీఐ వార్త ఏజెన్సీ తెలిపింది.

మా ఇతర కథనాలు:

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఇందులో ఏ కుట్ర లేదు

తానూ ఇష్టపూర్వకంగానే ఇస్లాం స్వీకరించానని తనకు న్యాయం కావాలని హదియా తెలిపారు. అయితే, హిందూ అమ్మాయి ఇస్లాం మతంలోకి మారడాన్ని కొన్ని సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

2016 జనవరి 23న అఖిలా అశోకన్ ఇస్లాం స్వీకరించి హదియాగా మారారు. అప్పట్లో ఆమె తమిళనాడులోని ఓ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఇద్దరు తోటి విద్యార్థినిలతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు.

హదియా తండ్రి ఏమంటున్నారు?

హదియా సహవిద్యార్ధినిలు తన కూతుర్ని బలవంతంగా ఇస్లాం స్వీకరించేలా చేశారని హదియా తండ్రి అశోకన్ బీబీసీతో అన్నారు. "వాళ్ళు హదియాను సిరియా పంపించాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఓ ఫోన్ రికార్డింగ్ నా దగ్గర ఉంది. దాన్ని రికార్డ్ చేశాకే నేను ఈ కేసును ఫైల్ చేశాను" అని అశోకన్ తెలిపారు.

పెళ్లి

ఫొటో సోర్స్, EPA

హదియా ప్రస్తుత పరిస్థితి

హదియా ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. మరోవైపు తాను హదియాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా ఆమె తల్లిదండ్రులు ఇంటికి రానివ్వడంలేదని షాఫిన్‌ జహాన్‌ ఆరోపించారు. ఆమె తండ్రి అశోకన్ బీబీసీతో మాట్లాడుతూ "హదియాకు ఎవరితో మాట్లాడాల్సి ఉంది? ఎవరైనా బంధువులుంటే వారొచ్చి ఆమెను కలుసుకోవచ్చు. ఇతరులు ఆమెను ఎందుకు కలుసుకోవాలి ? అని ప్రశ్నించారు.

హదియా, షాఫిన్‌ జహాన్‌‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఈ విషయం కోర్టులో ఉందని, దానిపై మాట్లాడేందుకు వారు నిరాకరించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)