ఈ చాయ్‌వాలా సాక్ష్యాలు చెప్పడంలో దిట్ట

ఫొటో సోర్స్, Alok Putul
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని తెలిబాంధా ప్రాంతంలో ఓ చిన్న కొట్టు నడుపుకునే మనోహర్ వల్యానీ ఎన్నో కోర్టు కేసుల్లో ప్రధాన సాక్షి. తాను ఎన్ని వందల కేసుల్లో సాక్ష్యాలు చెప్పాడో తనకే సరిగా గుర్తులేదని అతను అంటున్నాడు.
పోలీసు అధికారుల లెక్కల ప్రకారం రాయ్‌పూర్‌లోని కోర్టుల్లో దాదాపు 231 కేసుల్లో మనోహర్ సాక్ష్యాలు చెప్పాడు. మద్యం తాగి గొడవ చేయడం, రోడ్డు ప్రమాదాలు మొదలు హత్యా యత్నాలు, హత్యల దాకా ఎన్నో రకాల కేసుల్లో మనోహరే ప్రత్యక్ష సాక్షి.
గత నెలలో తెలిబాంధా పోలీసులు రాయ్‌పూర్‌లో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితుల్ని పట్టుకొని గంజాయిని జప్తు చేసే ప్రక్రియంతా మనోహర్ కళ్లముందే జరిగింది.

ఫొటో సోర్స్, Alok Putul
అన్ని కేసుల్లోనూ ఒక్కరే సాక్షిఎందుకలా?
గత నెలలోనే రాయ్‌పూర్‌లోని వీఐపీ చౌక్ ప్రాంతంలో ఒక కుర్రాడి నుంచి పిస్టోల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకొని అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో కూడా పోలీసులు మనోహర్‌నే సాక్షిగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తెలీబాంధా పోలీస్ స్టేషన్‌కి వెనకే మనోహర్ పదేళ్లుగా టీకొట్టుని నడిపిస్తున్నాడు. స్టేషన్‌కి టీ సమోసాలు కూడా అతడే సరఫరా చేస్తాడు.
‘ఈ రొడ్డు ఎప్పుడూ చాలా రద్దీగా ఉంటుంది. నిత్యం ఏవో దుర్ఘటనలూ, ప్రమాదాలూ జరుగుతూనే ఉంటాయి. రోజంతా నేనిక్కడే ఉంటాను కాబట్టి పోలీసులు నన్ను ఆ కేసులకు సాక్షిగా నమోదు చేస్తారు. కళ్ల ముందు ఏదైనా గొడవ జరిగినప్పుడు నేను చూసీచూడనట్టు మౌనంగా ఉండలేను కదా. అందుకే సాక్ష్యం చెప్పడానికి ముందుకొస్తాను’ అంటాడు మనోహర్.

ఫొటో సోర్స్, Alok putul
చట్టం ఏం చెబుతోంది?
మనోహర్ సాక్షిగా ఉన్న ఏదో ఒక కేసు నిత్యం కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంటుంది. దాంతో నెలలో చాలా రోజుల పాటు అతడు కోర్టు చూట్టూ తిరగాల్సి వస్తోంది.
‘మనోహర్ ఎన్ని కేసుల్లో సాక్షిగా ఉన్నాడో చెప్పడం కష్టం. కానీ అనేక కేసుల్లో సాక్ష్యం కోసం మేం నమ్మకమైన వారిపైనే ఆధార పడాల్సి వస్తుంది. మనోహర్ అలాంటి వ్యక్తే. ఓ వ్యక్తి అనేక కేసుల్లో సాక్షిగా ఉండటం చట్ట ప్రకారం కూడా తప్పేం కాదు’ అంటారు తెలిబాంధా పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జ్ లక్ష్మణ్ ఖుంటే.
చాలామంది సామాన్యులు కోర్టుల చుట్టూ తిరగడానికి ఇష్టపడరనీ, అందుకే మనోహర్ లాంటి వాళ్లపైన తాము ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని లక్ష్మణ్ చెబుతారు.
కానీ మనోహర్ లాంటి వ్యక్తులని తరచూ సాక్ష్యులుగా వాడుకోవడమంటే చట్టాన్ని అపహాస్యం చేయడమేనని హైకోర్టు న్యాయవాది సతీష్ చంద్ర వర్మ అంటారు.

ఫొటో సోర్స్, Satish Verma Facebook
న్యాయ వ్యవస్థకే సవాల్
మనోహర్ లాంటి చాలామంది వ్యక్తులు ప్రొఫెషనల్ సాక్షులుగా పనిచేస్తున్నారనీ, ఇలాంటి వాళ్ల వల్ల ఒక్కోసారి నిర్దోషులకూ శిక్షపడుతుందనీ, ఇంకొన్ని సందర్భాల్లో అపరాధులు సులువుగా తప్పించుకుంటారనీ సతీష్ చంద్ర చెబుతారు.
మనోహర్ లాంటి వాళ్లు సాక్ష్యం చెప్పిన ఎన్ని కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్న లెక్కల్ని బయటకు తీస్తే, అతడి సాక్ష్యం ఎంత బలమైందో తేలిపోతుందని ఆయన సూచించారు.
ఒకవేళ పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షుల తప్పిదం వల్ల నిందితులు తప్పించుకున్నట్లు తేలితే, పోలీసులతో పాటు సాక్షులపైనా కేసులు పెట్టే హక్కుని చట్టం కల్పిస్తోందని సతీష్ చెబుతారు.
‘పోలీసులు ప్రవేశ పెడుతున్న ఇలాంటి సాక్షుల వల్ల మొత్తం న్యాయ వ్యవస్థే అభాసుపాలవుతోంది.
ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని లోతుగా విచారణ జరిపించాలి’ అన్నది సతీష్ చెప్పే మాట.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








