రష్మిక - విజయ్ పెళ్లి: కొడవ సంప్రదాయ వివాహం అంటే ఏంటి, ఎలా జరుగుతుంది?

ఫొటో సోర్స్, insta/rashmika_mandanna
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్నారు.
పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రష్మిక, విజయ్ దేవరకొండ తమ అభిమానులతో పంచుకున్నారు.
అయితే, వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ నడుస్తోంది.
కేవలం ఇద్దరు సెలబ్రిటీల మధ్య జరిగిన పెళ్లిలానే కాకుండా పెళ్లి జరిగిన సంప్రదాయంపై ఈ చర్చ సాగుతోంది.
అదే కొడవ సంప్రదాయం.


ఫొటో సోర్స్, insta/rashmika_mandanna
కొడవ సంప్రదాయంలో పెళ్లిపై వార్తలు
రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. కొడగునే కూర్గ్ అని కూడా పిలుస్తారు. ఆమె కూర్గ్‌లోనే చదువుకున్నారు.
వీరి వివాహ వేడుక సాధారణ హిందూ సంప్రదాయం ప్రకారమే కాకుండా కొడవ సంప్రదాయం ప్రకారం కూడా జరిగిందంటూ మీడియాలోకథనాలు వచ్చాయి.
ఇప్పుడు ఈ కొడవ పెళ్లి వేడుకపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.
అయితే, విజయ్ గానీ రష్మిక గానీ తమ పెళ్లి ఏ సంప్రదాయం ప్రకారం జరిగిందో ఎక్కడా వెల్లడించలేదు.
సాధారణంగా కర్ణాటకలోని కొడగు (కూర్గ్) ప్రాంతంలో కొడవ సంప్రదాయ పద్ధతిలో పెళ్లిళ్లు జరుగుతుంటాయి.
కొడగు ప్రాంతానికి చెందినవారిని కొడవలుగా పిలుస్తుంటారు.
రష్మికది కర్ణాటకలోని కొడగు ప్రాంతం కావడంతో అక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, insta/rashmika_mandanna
కొడవ వివాహం అంటే ఏంటి?
సాధారణ హిందూ సంప్రదాయాలకు భిన్నంగా కొడవ వివాహం జరుగుతుంది.
హిందూ వివాహాల్లో పండితుల మంత్రోచ్ఛారణ మధ్య పూజలు, తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం ఉంటుంది. కానీ, కొడవ సంప్రదాయంలో పురోహితులు కనిపించరు.
ఇంట్లోని పెద్దలే పెళ్లితంతును జరిపిస్తారు. పెళ్లి మండపంలో ఒక దీపం వెలిగించి పూర్వీకులను పూజిస్తారు.
కొడవ సంప్రదాయ పెళ్లికి, హిందూ సంప్రదాయ పెళ్లికి చాలా వ్యత్యాసాలు కనిపిస్తాయని మైసూరుకు చెందిన తెలుగు పండితులు రఘు శర్మ బీబీసీకి చెప్పారు.
కొడవ సంప్రదాయ పెళ్లిళ్లు జరిపేందుకు పండితులు చాలా తక్కువగా హాజరవుతుంటారని రఘుశర్మ చెప్పారు.
తాను కూడా నాలుగైదు కొడవ సంప్రదాయ పెళ్లిళ్లు జరిపించినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, insta/rashmika_mandanna
రెండు రోజులపాటు వివాహ తంతు
కొడవ సంప్రదాయంలో పెళ్లి రెండు రోజులపాటు జరుగుతుందని కొడవక్లాన్.కామ్ చెబుతోంది.
కొడవక్లాన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..
మొదటి రోజు పెళ్లి వధూవరుల కుటుంబాలు పెళ్లి జరిగే ప్రదేశానికి చేరుకుంటాయి.
పెళ్లి పందిరి (చాప్పర) వేస్తారు. దీన్ని మామిడి ఆకులు, అరటి ఆకులు, పనస కొమ్మలతో అలంకరిస్తారు.
''తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అది. పెళ్లి పందిరి కూడా పాలు కారే చెట్ల కర్రలను తీసుకువచ్చి వేస్తారు. అది కూడా వారి సంప్రదాయంలో భాగంగా కనిపిస్తుంటుంది'' అని రఘుశర్మ బీబీసీతో అన్నారు.
అలాగే పందిని, కూరగాయలను కోస్తారు. మొత్తం క్రతువులో కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు పాల్గొంటారు. ఈ తంతును 'ఊర్ కొడువో' లేదా 'పందాల పని' లేదా 'తేరనేబెప్పో' అని పిలుస్తారు.
కొడవ సంప్రదాయంలో పెళ్లి వేడుకల్లో పంది మాంసం వడ్డించడం ఆనవాయితీ.
''పెళ్లిలో నాన్ వెజ్ తప్పకుండా ఉంటుంది. పంది మాంసం తప్పకుండా వడ్డిస్తారు. అది వారి పెళ్లిలో భాగంగా కనిపిస్తుంది'' అన్నారు రఘుశర్మ.
సాయంత్రం అందరూ కలిసి వేడుకలు చేసుకుంటారు.

ఫొటో సోర్స్, insta/rashmika_mandanna
రెండో రోజు ఏం జరుగుతుందంటే..
రెండో రోజు 'మంగళ'గా పిలుస్తారు.
ఉదయాన్నే వరుడి ముఖానికి పాలు రాసి షేవింగ్ చేస్తారు. తర్వాత మంగళస్నానం చేయిస్తారు. ఇందులో వరుడి తల్లి, పెళ్లైన ఇద్దరు మహిళలు పాల్గొంటారు.
తర్వాత సంప్రదాయ కుప్యా దుస్తులు వేసుకుని, నడుముకు కత్తి ధరిస్తారు.
అయితే, విజయ్-రష్మిక పెళ్లి వేడుక సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫొటోల్లో విజయ్ ఈ తరహా కొడవ వస్త్రధారణలో కనిపించలేదు.
కింద తెల్లటి పంచె, నడుముకు బంగారు వడ్డాణం, ఎర్రటి పైపంచె ధరించి విజయ్ కనిపించారు.
అదే సమయంలో వధువు మంగళస్నానాలు పూర్తయ్యాక గాజులు వేసుకునే వేడుక జరుగుతుంది.
పెళ్లి కోసం వధువు ఎరుపు రంగు, బంగారు వర్ణపు అంచు ఉన్న చీరతో ముస్తాబు అవుతుంది.
పెళ్లి క్రతువులో 'బాలె బిరుద్' ప్రముఖంగా కనిపిస్తుంది. అంటే పెళ్లి మండపానికి వచ్చే దారిలో అరటి చెట్ల కాండాలు, పూలతో అలంకరించి వరుసగా ఉంచుతారు.
వధువు లేదా వరుడి మేనమామ ఒడికత్తి సాయంతో ఒకే వేటులో ఈ అరటి కాండాలను నరకాల్సి ఉంటుంది.
అయితే,"అరటి కాండాలు నరికే సంస్కృతి ఒక్కోచోట ఒక్కో తీరుగా కనిపిస్తుంటుంది" అని రఘు శర్మ బీబీసీతో చెప్పారు.
''అరటి కాండాలు నరికే విధానం కొన్నిచోట్ల వరుడు కూడా చేస్తాడు. కొన్నిచోట్ల మేనమామలు చేస్తారు'' అని చెప్పారాయన.
వధువుపై సర్వహక్కులకు ప్రతీకగా 12 రాళ్లు..
అరటి కాండం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, పూలను ముట్టుకుని.. తర్వాత వీరత్వానికి గుర్తుగా అరటి కాండాన్ని నరుకుతారు.
తర్వాత పెళ్లి పీటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తూర్పు ముఖంగా కూర్చుంటారు.
ఆ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. ముందుగా తల్లి, తర్వాత తండ్రి ఇతర పెద్దలు ఆశీర్వచనాలు అందిస్తారు.
తర్వాత వధువు అక్కడికి చేరుకుని వరుడికి పాలు, బహుమతులు, బంగారం, వెండి, రాగి నాణాలతో కూడిన సంచిని వరుడికి అందిస్తుంది.
మల్లెపూల దండలు మార్చుకుంటారు. ఆ తర్వాత పవిత్ర దీపం ఎదురుగా నిలబడి వధువు బాధ్యత వరుడికి అప్పగిస్తున్నామని పెద్దలు చెబుతారు.
వధువు తరఫు పెద్దలు 12 గులకరాళ్లు వరుడి పెద్దలకు ఇచ్చి వధువుపై సర్వ హక్కులు ఇస్తున్నామని చెబుతారు. వరుడి వైపు పెద్దలు 11 రాళ్లు తీసుకుని ఒకటి తీసుకోకుండా వదిలేస్తారు. అవసరమైన సందర్భంలో వధువుపై వారికి హక్కు ఉందనే అర్థంలో ఇలా చేస్తారు.
ఆ తర్వాత వధువును వరుడు తీసుకెళ్లడంతో క్రతువు ముగుస్తుంది. అయితే, ఈ పెళ్లిలో మాంగళ్యం చాలా చిన్నదిగా ఉంటుందని రఘుశర్మ తెలిపారు.
అలాగే, విందులో ముందుగా మహిళలకు వడ్డించడం సహజంగా కనిపిస్తుంది.
సాయంత్రం వధువు గంగ పూజ చేస్తారు. కాళ్లకు మెట్టెల ధారణ అప్పుడు జరుగుతుంది.
బావి వద్దకు వెళ్లి తమలపాకులు, వక్క, అక్షింతలు, కొబ్బరి చెక్కలు కలిపి నీటిలో వేసి.. ఆ తర్వాత ఆ నీటిని వధువుతో తోడించి కుండలో పోయిస్తారు.
నీటి కుండను తీసుకువచ్చి పవిత్ర దీపం ఎదురుగా పెట్టిస్తారు. అక్కడి నుంచి అత్తవారింట్లో వధువు (కోడలి) పాత్ర మొదలైందని అర్థంగా భావిస్తారు.
'కొంబారెక్ కొతువావో'తో పెళ్లి క్రతువు ముగుస్తుంది. ఇందులో భాగంగా వరుడు తన గదిలోకి వధువును ఆహ్వానించి ఆమె ముఖానికి వేసుకున్న ముసుగు తీస్తారు. ఆ తర్వాత గోల్డ్ వెడ్డింగ్ బ్యాండ్ బహుమతిగా ఇస్తారు.
దీనితో పెళ్లి క్రతువు పూర్తవుతుంది.

ఫొటో సోర్స్, insta/rashmika_mandanna
విజయ్, రష్మికల సినీ ప్రయాణం
రష్మిక మందన్నా 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 2018లో ఛలో సినిమాతో తెలుగులో పరిచయం అయ్యారు.
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన విజయ్ దేవరకొండ 2011లో వచ్చిన నువ్విలా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు.
2016లో పెళ్లి చూపులు సినిమాలో లీడ్ రోల్ చేశారు. తర్వాత ఏడాది వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో నటుడిగా స్థిరపడ్డారు.
విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో రష్మిక నటించారు.
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి రణబాలి అనే సినిమాలో నటిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












