భూతశుద్ది వివాహం: పెళ్లి తర్వాత సమంత మెడలో మంగళసూత్రం స్థానంలో ఉన్న లాకెట్ ఏంటి?

సమంత రుత్ ప్రభు, రాజ్ నిడిమోరు, భూతశుద్ధి వివాహం

ఫొటో సోర్స్, Insta/Samantha

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నటి సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లుగా ఈశా ఫౌండేషన్ వెల్లడించింది.

ఈమేరకు సమంత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

ఈ ఫోటోల్లో పూజ క్రతువు, లింగ భైరవి దేవి సమక్షంలో ఆమె వేలికి రాజ్ నిడిమోరు ఉంగరం తొడుగుతున్నట్లుగా కనిపిస్తుంది.

అలాగే ఆమె మెడలో మంగళసూత్రానికి బదులుగా దేవి పెండెంట్ ఉన్నట్లుగా ఫోటోల్లో కనిపిస్తుంది.

చేతికి తొడిగిన ప్రత్యేక ఉంగరం, ఆమె మెడలో నల్ల పూసలతో కూర్చిన దేవి పెండెంట్ కనిపించేలా ఒక ఫోటోను సమంత షేర్ చేశారు.

ఈ వివాహం కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవి ఆలయంలో జరిగింది.

సమంత ఎరుపు రంగు చీరలో, బంగారు ఆభరణాలతో అలంకరించుకొని కనిపిస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురు కామెంట్ చేశారు.

లింగ భైరవి సన్నిధిలో సన్నిహితుల సమక్షంలో ఈ జంట భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లుగా ఈశా సెంటర్ ప్రకటించింది.

‘దేవి అనుగ్రహం వారిద్దరికీ ఉండాలి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ఈశా యోగా సెంటర్ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భూత శుద్ధి వివాహం అంటే...

భక్తితో పాటు అందులో కొన్ని ప్రత్యేక పద్ధతులపై విశ్వాసం ఉన్నవారు ఎంచుకునే వివాహ ప్రక్రియగా దీనిని భావించవచ్చు.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ పద్ధతి ప్రాచుర్యంలో ఉందని హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన పురోహితుడు శర్మ చెప్పారు.

ఈశా సద్గురు ఫౌండేషన్ వెబ్‌సైట్ ప్రకారం, భూత శుద్ధి వివాహం అనేది పెళ్లికి సంబంధించిన ఒక ప్రాచీన యోగిక్ ప్రాసెస్. లింగ భైరవి అంటే పార్వతి దేవి రూపమని పురోహితుడు శర్మ చెప్పారు.

హిందూ మత విశ్వాసాలలో, ఆధ్మాత్మిక సాహిత్యంలో పంచభూతాలుగా పేర్కొనే ‘భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశాన్ని ప్రసన్నం చేసుకునే ప్రక్రియే భూతశుద్ధి’ అని ఈశా వెబ్‌సైట్ పేర్కొంది.

భూత శుద్ధి వివాహం గురించి సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక వీడియోలో వివరిస్తూ.. 'ఈ వివాహం, భూతశుద్ధి ఆధారంగానే జరుగుతుంది. ఆలోచనలు, కంపానియన్‌షిప్, భావోద్వేగాలు, శరీరం, భౌతిక ప్రపంచానికి అతీతంగా జంట మధ్య దృఢమైన బంధం ఏర్పరచడమే ఈ పెళ్లి లక్ష్యం. పంచభూతాలను ఏ స్థాయి వరకు మనం ప్రసన్నం చేసుకుంటామనే దానిపైనే మన జీవన నాణ్యత, స్వభావం, పరిధి నిర్ణయమవుతుంది. ఆ దిశగా చేసే ప్రయత్నంలో ఈ వివాహం కూడా ఒకటి' అని వివరించారు.

అయితే.. ‘భూత శుద్ధి అంటే పంచ భూతాల నుంచి తీసుకున్నది’ అని చెప్పారు శృంగేరి పీఠం తెలంగాణ ఇన్చార్జి బంగారయ్య శర్మ.

"పెళ్ళి అనే క్రతువుకు అష్ట ప్రక్రియలున్నాయి. ఈ భూత శుద్ధి వాటి పరిధిలోకి రాదు " అని చెప్పారు.

సమంత

ఫొటో సోర్స్, insta/Samantha

పెళ్లయిన వాళ్లు కూడా భూత శుద్ధి వివాహం చేసుకోవచ్చా?

ఆ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం, ఇప్పటివరకు పెళ్లి కాని వారితో పాటు ఇప్పటికే పెళ్లయిన జంటలు కూడా భూతశుద్ధి వివాహం చేసుకోవచ్చు. యోగా వ్యవస్థలో ఈ వివాహ మూలాలున్నాయని పేర్కొంది.

స్త్రీ గర్భవతి అయితే ఈ క్రతువు చేయకూడదని సూచించింది.

ఈ పెళ్లి ఎవరు చేస్తారు?

ఈశా వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. భూతశుద్ధి వివాహంలో 'సుమంగళ'గా పిలిచే ప్రత్యేకంగా శిక్షణ పొందిన వలంటీర్లు వివాహం జరిపిస్తారు. వీరు పసుపు రంగు చీర ధరిస్తారు.

సమంత షేర్ చేసిన ఫోటోల్లో కూడా పసుపు రంగు చీర ధరించిన ఒక మహిళ క్రతువు నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ యోగా సెంటర్

ఈ పెళ్లిలో మంగళసూత్రం తప్పనిసరి కాదా?

భూతశుద్ధి వివాహ ప్రక్రియలో దేవి పెండెంట్ ధారణ తప్పనిసరి అని ఈశా వెబ్‌సైట్ పేర్కొంది.

దానితో పాటు దంపతుల ఇష్టం ప్రకారం, సంప్రదాయ మంగళసూత్రాన్ని కూడా వధువు మెడలో కట్టవచ్చు.

ఈ వివాహ ప్రక్రియకు ముందే మ్యారేజ్ లైసెన్స్ తీసుకోవాలని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ఈశా యోగా కేంద్రంలోని లింగ భైరవి దేవిని సద్గురు ప్రతిష్ఠించారు.

కాగా.. సమంత భూత శుద్ధి ప్రక్రియలో వివాహం చేసుకున్నారన్న అంశంపై ‘ఎక్స్’లో చాలామంది స్పందించారు.

తాము కూడా గతంలో ఇలాంటి ప్రక్రియలో పాల్గొన్నట్లు కొందరు పేర్కొనగా ... మరికొందరు మాత్రం ప్రాచీన యోగలో భూత శుద్ధి ప్రక్రియ ఉన్నప్పటికీ దానికి, వివాహానికి సంబంధం లేదని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)