చలికాలంలో పాదాల పగుళ్లకు కారణమేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

శీతాకాలం, చలిగాలులు, కాలి మడమలలో పగుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాదాల పగుళ్ల సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శీతాకాలంలో చలిగాలులకు దగ్గు, జలుబు, జ్వరంతోపాటు పిల్లల్లో పెదాలు పొడిబారి పగిలిపోవడం, పెద్దల్లో పాదాల పగుళ్ల వంటి సమస్యలు తరచుగా కనిపిస్తుంటాయి.

ఈ కాలి మడమల్లో పగుళ్లు సాధారణ సమస్యే అయినా, నివారణ చర్యలు తీసుకోకపోతే ఇబ్బంది పెడుతుంది.

మడమలో పగిలిపోయిన భాగానికి చలి గాలి తగిలినప్పుడు, మరింత బాధిస్తుంది.

పాదాల పగుళ్ల సమస్య చలికాలంలోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? అందుకు కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శీతాకాలం, చలిగాలులు, కాలి మడమలలో పగుళ్లు

ఫొటో సోర్స్, Dr. Shahina Shafeeq

ఫొటో క్యాప్షన్, చలికాలంలో వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్ షాహినా షఫీక్ చెప్పారు.

చలికాలంలో ఎందుకు వస్తుంది?

చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య గురించి డెర్మటాలజిస్ట్, కాస్మొటాలజిస్ట్ డాక్టర్ షాహినా షఫీక్‌తో బీబీసీ మాట్లాడింది.

ఆమె మాట్లాడుతూ, "పాదాల చర్మంలో నూనె గ్రంథులు తక్కువగా ఉంటాయి. దీని వలన ఇది సహజంగా పొడిగా మారుతుంది. శీతాకాలంలో ఈ నూనె గ్రంథులు ఇంకా తక్కువగా మారతాయి. దీని వలన మడమల పగుళ్లు ఏర్పడతాయి" అని చెప్పారు.

"వయసు పెరిగే కొద్దీ చర్మం దాని స్థితిస్థాపకతను కోల్పోతుంది. సహజ నూనెల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల చర్మం పొడిబారి, పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరం బరువు పాదాలు, చీలమండపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో కాలి మడమల్లో పగుళ్లు ఏర్పడతాయి."

సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, తామర వంటి చర్మ సమస్యలు, డయాబెటిస్, థైరాయిడ్ వ్యాధుల వల్ల కూడా కాలి మడమల్లో పగుళ్లు ఏర్పడవచ్చని డెర్మటాలజిస్ట్ డాక్టర్ అయనం సత్యనారాయణ వివరించారు.

వాతావరణం చల్లగా ఉండటం వల్ల నీరు తాగడం తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో తేమ లోపిస్తుంది. ఇది కూడా మడమల పగుళ్లకు దారి తీయవచ్చని ఆయన అన్నారు.

"స్నానం చేసేటప్పుడు మడమలను సరిగ్గా శుభ్రం చేయకపోయినా, స్నానం చేసిన తర్వాత సరిగ్గా తుడుచుకోకున్నా, అది పగుళ్లకు కారణమవుతుంది."

శీతాకాలం, చలిగాలులు, కాలి మడమలలో పగుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

పగుళ్లతో ఇబ్బందులు..

మడమలు పగిలిన ప్రాంతంలో చర్మం పొక్కులు పొక్కులుగా లేచి వస్తుంది. రాత్రి పూట పడుకున్నప్పుడు బెడ్ షీట్ తగిలినా కూడా ఈ ప్రాంతంలో నొప్పి పెడుతుంది.

ఈ సమస్యతో బాధపడే వారు, ముఖ్యంగా మహిళలు నలుగురిలోకి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఫీలవుతుంటారు.

"మట్టిలో ఎక్కువగా తిరిగే వారిని ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారు.. చలికాలంలో మరింత ఇబ్బంది పడతారు. చలికాలంలో మడమల పగుళ్ల వల్ల మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఈ పగుళ్లు పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ దీనివల్ల పాదాల్లో విపరీతంగా నొప్పి పుడుతుంది" అని డాక్టర్ సత్యనారాయణ అన్నారు.

చలి కారణంగా వేడినీటితో స్నానం చేయడం వల్ల చర్మంలో సహజంగా ఉండే తేమ పోతుంది. దీంతో చర్మంపై పగుళ్లు ఏర్పడుతాయి.

శీతాకాలం, చలిగాలులు, కాలి మడమలలో పగుళ్లు

ఫొటో సోర్స్, Dr. SatyaNarayana

ఫొటో క్యాప్షన్, చలికాలంలో నీరు ఎక్కువగా తాగాలని డాక్టర్ సత్యనారాయణ సూచించారు.

"వాతావరణంలోని చల్లని గాలి శరీరంలో ఉన్న తేమను పీల్చుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. చర్మం బలహీనంగా మారడానికి కారణమవుతుంది. శరీరంలో విటమిన్‌ ఎ,సి,డి లోపం వల్ల కూడా చర్మం చిట్లినట్లు మారుతుంది.

చర్మం పొడి బారడం వల్ల దురద, దద్దుర్లు మొదలవుతాయి. దురద వల్ల గోకినప్పుడు చర్మం పైపొర లేచిపోయి గాయాలవుతాయి. చలి గాలి తగిలినప్పుడల్లా అవి మంట పుడతాయి. అందుకే చలి కాలంలో చర్మ సంరక్షణపై శ్రద్ద పెట్టాలి" అని డాక్టర్ సత్యనారాయణ సూచిస్తున్నారు.

శీతాకాలం, చలిగాలులు, కాలి మడమలలో పగుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పగిలిన కాళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య తీవ్రం అవుతుందని డాక్టర్లు చెప్పారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పగిలిన మడమల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చని డాక్టర్ షాహినా షఫీక్ చెప్పారు.

శీతాకాలంలో పాదాల రక్షణకు ఆమె కొన్ని సూచనలు చేశారు.

రోజూ పాదాలను గోరువెచ్చటి నీటిలో ఉంచి శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత లోషన్, క్రీమ్ లేదా కొబ్బరి నూనెను పాదాలకు రాసుకోవాలి. దీని వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది.

శీతాకాలంలో పుష్కలంగా నీరు తాగడం మంచిది. దీని వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.

రోజుకు రెండుసార్లు మీ పాదాలకు మంచి నాణ్యత గల మాయిశ్చరైజర్ రాయండి.

వృద్ధులు, మధుమేహం ఉన్న వారు రాత్రిపూట సాక్స్ ధరించడం వల్ల మడమలకు చలి గాలుల నుంచి రక్షణ ఉంటుంది.

చన్నీటి స్నానం లేదా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని, ఆహారంలో ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే విత్తనాలు, గింజలు, విటమిన్ సి ఉండే పండ్లు తీసుకోవాలని డాక్టర్ సత్యనారాయణ చెప్పారు.

అయితే, పగుళ్ల నుంచి రక్తం వస్తున్నా, చీము కారుతున్నా తక్షణం వైద్యుడిని సంప్రదించాలని ఆయన సూచించారు.

(గమనిక: ఈ కథనం స్థూలమైన అవగాహన కోసం మాత్రమే. సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)