ల్యాప్ టాప్ కీబోర్డు 8 ఏళ్ల కిందటి హత్యలో హంతకుడిని పట్టించింది, ఎలాగంటే...

ఫొటో సోర్స్, burlpros.org
- రచయిత, పారా పద్దయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
(ఈ కథనంలో కలిచివేసే అంశాలు ఉన్నాయి)
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో 2017లో తల్లీబిడ్డల హత్య కేసు నిందితుడిని ల్యాప్‌టాప్‌పై ఉన్న డీఎన్ఏ ముద్రల ఆధారంగా గుర్తించారు.
ప్రస్తుతం భారత్‌లో ఉన్న నిందితుడిని తమకు అప్పగించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. 8 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్యకేసులో అనేక మలుపులు ఉన్నాయి.
ఈ హత్య కేసుకు సంబంధించి బర్లింగ్‌టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఇందులో పేర్కొన్న వివరాల మేరకు..
న్యూజెర్సీ రాష్ట్రంలోని మేపుల్ షేడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 2017లో నర్రా శశికళ, ఆమె కుమారుడు అనీష్ సాయి హత్యకు గురయ్యారు.
ఈ కేసులో 38 ఏళ్ల భారత పౌరుడు నజీర్ హమీద్ నిందితుడని బర్లింగ్‌టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ లచియా ఎల్. బ్రాడ్‌షా, మేపుల్ షేడ్ పోలీస్ చీఫ్ క్రిస్టఫర్ జె. ఫ్లెచర్ ప్రకటించారు.
హత్యా నేరానికి సంబంధించి నజీర్ హమీద్‌పై ఈ ఏడాది ఆరంభంలో అభియోగాలు మోపారు. అందులో హత్య , చట్ట విరుద్ధ ప్రయోజనాల కోసం అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్న కేసులలో నిందితుడిగా పేర్కొన్నారు.

"ఈ రోజు మా సందేశం ఒక్కటే. మేమేదీ మర్చిపోలేదు. ఎవరినీ క్షమించేది లేదు. అమాయకుల ప్రాణాలు తీసిన వాళ్లను పట్టుకు తీరతాం" అని ప్రాసిక్యూటర్ బ్రాడ్‌షా చెప్పారు.
"కేసు దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్ల కారణంగా న్యాయం జరగడం కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. అయితే ఎప్పుడూ న్యాయమే గెలవాలి. ఈ కేసులో అది కచ్చితంగా గెలుస్తుంది" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, burlpros.org
8 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
ఈ జంట హత్యలు 2017 మార్చి 23న జరిగాయి. మేపుల్ షేడ్‌లోని ఫాక్స్ మెడో అపార్ట్‌మెంట్‌లో 38 ఏళ్ల శశికళ, ఆరేళ్ల సాయి మృతదేహాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
మెడమీద కత్తి పోట్ల కారణంగా ఇద్దరు చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్ వెల్లడించింది.
దాడి చేసిన వ్యక్తి అనీష్ గొంతు కోసినట్లు ఉందని, దాడి చేసిన వ్యక్తితో తల్లీకొడుకు పోరాడినట్లు గాయాలున్నాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిపింది.
"ఆ దృశ్యం ఊహించలేని విధంగా ఉంది. ఆ తల్లీబిడ్డ తమ చివరి క్షణాల్లో ప్రాణాల కోసం పోరాడుతూ పడిన మృత్యు వేదనను అక్కడకు వచ్చినవారు చూశారు" అని పోలీస్ చీఫ్ ఫ్లెచర్ చెప్పారు.
నిందితుడు హమీద్ కూడా శశికళ ఉండే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోనే ఉండేవారు. శశికళ భర్త హనుమంతు, హమీద్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో పని చేసేవారు.
శశికళ ఆమె బిడ్డ హత్య జరిగిన 6నెలల తర్వాత హమీద్ భారత్ వచ్చారు. ప్రస్తుతం ఆయన భారత్‌లోనే ఉన్నారు.
నర్రా శశికళ స్వగ్రామం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజు పాలెం.
తమ కుమార్తె, మనవడి హత్యకు అల్లుడే కారణమని, హనుమంతుకు అతని పని చేసే కంపెనీలోనే పని చేస్తున్న కేరళకు చెందిన మహిళతో వివాహాతేర సంబంధం ఉందని అప్పట్లో ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

ఫొటో సోర్స్, burlpros.org
డీఎన్ఏ ఇచ్చేందుకు నిరాకరణ
ఈ కేసులో మొదట హనుమంతును అరెస్ట్ చేసిన పోలీసులు, నేరస్థలంలో లభించిన రక్తపు మరకలతో అతని డీఎన్ఏ సరిపోలకపోవడంతో వదిలేశారు.
దర్యాప్తు కొనసాగించిన తర్వాత హమీద్‌కు నర్రా హనుమంతుతో గొడవలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
హత్యలో హమీద్ ప్రమేయంపై పోలీసులు అదనపు సాక్ష్యాలు సేకరించే ప్రయత్నంలో ఆలస్యం జరిగింది. దీంతో అతను భారత్ వచ్చేశారు.
నేర స్థలంలో భౌతిక ఆధారాలు సేకరించినప్పుడు అక్కడున్న రక్తపు మరకల్లో ఒకటి చనిపోయిన వారిలో ఎవరిదీ కాదని, హనుమంతుది కూడా కాదని తేలింది. అది హమీద్‌దై ఉండవచ్చని అధికారులు అనుమానించారు. అతని డీఎన్ఏ సేకరించేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే అవేవీ ఫలించలేదు.
హమీద్ తన డీఎన్ఏ ఇచ్చేందుకు నిరాకరించారని ఇండియాకు చెందిన సీబీఐ 2020 అక్టోబర్‌లో అమెరికన్ కేంద్ర దర్యాప్తు సంస్థకు తెలిపింది.
హమీద్ డీఎన్ఏ కోసం సాయం చేయాలని అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ 2023 మార్చిలో కోర్టు ద్వారా భారత ప్రభుత్వాన్ని అర్థించింది. కోర్టు అభ్యర్థన తమకు అందిందని భారత హోంశాఖ తెలిపింది. అయితే కోర్టు ఆదేశాలు అమలు కాలేదు.
ఈ కేసులు న్యూజెర్సీ పోలీసులు పట్టించుకోవడం లేదని, బాధితులు భారతీయులు కాబట్టి డిటెక్టివ్‌లు కేసు విచారణను వదిలేశారని స్థానికంగా ప్రచారం జరిగింది. అయితే దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసులు మిగతా విభాగాల సాయం తీసుకున్నారు.
"ఒక్క విషయం స్పష్టం చేయనివ్వండి. శశికళ, అనీష్‌కు న్యాయం చేసే విషయంలో మా నిబద్ధత ఎప్పుడూ పక్కకు పోలేదు. ఈ నేరాలపై మా విభాగం ఆగ్రహంతో ఉంది" అని పోలీస్ చీఫ్ ఫ్లెచర్ చెప్పారు.

ఫొటో సోర్స్, x.com/FBINewark
ల్యాప్‌టాప్ నుంచి డీఎన్ఏ సేకరణ
ఈ కేసు దర్యాప్తులో డిటెక్టివ్‌లకు మొదట ఎదురు దెబ్బలు తగిలినా, హమీద్ డీఎన్ఏ సేకరించే విషయంలో అన్ని దారులు మూసుకుపోతున్నా వెనక్కి తగ్గలేదు. హమీద్ పని చేసిన సంస్థ యాజమాన్యం సాయంతో అతని డీఎన్ఏను సంపాదించారు.
కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కాగ్నిజెంట్ హమీద్ ఉపయోగించిన ల్యాప్‌టాప్ పోలీసులకు అందించింది. న్యూజెర్సీ పోలీసులు ఆ ల్యాప్‌టాప్‌ను హామిల్టన్‌లోని డీఎన్ఏ ల్యాబ్‌కు పంపారు.
ల్యాప్‌టాప్ నుంచి ఫోరెన్సిక్ అధారాలు సేకరించేందుకు బర్లింగ్‌టన్ కౌంటీ సుపీరియర్ కోర్ట్ జడ్జ్ సెర్చ్ వారంట్ జారీ చేశారు.
నేర స్థలంలో లభించిన రక్తపు మరక డీఎన్ఏతో, ల్యాప్‌టాప్ కీ బోర్డు మీద లభించిన డీఎన్ఏ ప్రొఫైల్‌తో సరిపోయింది.
"ఈ పరిణామం మా దర్యాప్తులో ఏర్పడిన అనుమానాలను ధృవీకరించేందుకు బలమైన ఆధారాన్ని అందించింది. శశికళ ఇంటికి వెళ్లి నజీర్ హమీద్ ఆమెను, ఆమె కుమారుడిని దారుణంగా హత్య చేశారు" అని బీసీపీఓ లెఫ్టినెంట్ బ్రయాన్ కన్నింగ్‌హామ్ చెప్పారు.
హత్యకు గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధరించలేదు. న్యూజెర్సీ రాష్ట్రంలో నేరం చేసిన వాళ్లను దోషులుగా నిరూపించేందుకు ప్రాసిక్యూటర్లు నేరం వెనుక ఉన్న కారణాలను నిరూపించాల్సిన అవసరం లేదు.
హమీద్‌ను అమెరికా తీసుకు వచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
"అతను ఈ నేరం చేశారు. హత్యలకు అతనే బాధ్యుడనేందుకు ఎలాంటి సందేహం లేదు. అతన్ని అమెరికా తీసుకు వస్తారని ఆశిస్తున్నాను. ఆరేళ్ల పిల్లవాడిని తల్లి కళ్ల ముందే తల నరికి చంపిన వ్యక్తిని రక్షించాలని భారత దేశపు పాలకులు కోరుకుంటారని అనుకోవడం లేదు" అని దర్యాప్తు అధికారి పాట్రిక్ జె.థ్రాన్టన్ చెప్పారు.
అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌కు విదేశాల్లో ఉన్న నేరస్తుల్ని అప్పగించాలని కోరే అధికారం ఉంది.
"అతన్ని అప్పగించాలని అమెరికా, భారత ప్రభుత్వాలను కోరుతున్నాం. న్యాయం అందించే మార్గంలో సరిహద్దులు, దూరాలు, ఆలస్యం అడ్డుగా నిలబడకూడదు. క్రూరమైన నేరాలకు పాల్పడేవారు మహా సముద్రాలను దాటినా తప్పించుకోలేరని నిరూపించేందుకు దేశాల మధ్య సహకారాన్ని కోరుతున్నాం" అని ప్రాసిక్యూటర్ బ్రాడ్ షా అన్నారు.
2023 నవంబర్ నాటికి హమీద్ చెన్నైలోని తమ సంస్థలోనే పని చేస్తున్నారని కాగ్నిజెంట్ టెక్నాలాజికల్ సొల్యూషన్స్ చెప్పినట్లు బర్లింగ్‌టన్ అధికారులు తెలిపారని ఫిలడెల్ఫియాకు చెందిన ఎన్‌బీసీ 10 వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది.
భారత్ – అమెరికా మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం 1999 నుంచి అమల్లో ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










